దీవి సుబ్బారావు “మాటన్నది జ్యోతిర్లింగం”

అనువాదం ప్రాముఖ్యం  తెలియని జాతికి విమోచన లేదు. దీవి సుబ్బారావు శ్రమకోర్చి, బసవ, అక్క మహాదేవి, అల్లమప్రభు, తదితర కన్నడ వచన కవులను(12 వ శతాబ్ది) అనువదించడం గొప్పగా ఉంది. వీరశైవానికి భావ వినిమయ కేంద్రం శ్రీ శైల క్షేత్రం కావడం, తదాదిగా పాల్కురికి బసవ పురాణ రచన చేపట్టడం విజ్ఞులైన పాఠకులు తెలుసుకోవలసినదే. చక్కటి అనువాదాలు. “తాళ్ళపాక వారిది కొంత ఆపై తన పైత్యం కొంత ” అన్నట్టు కాకుండా సరళంగా ,ఎక్కడా భావాన్ని సడలనీయక నిగ్రహంగా సాగిన రచన.

పోతే పుస్తకం పేరు విషయం కొంచెం ఆలోచించవలసింది రచయిత. “మాటన్నది జ్యోతిర్లింగం” అనగానే  ఇదేదో భక్తి పుస్తకమని పొరబడే అవకాశం ఉంది. ఇందులో భక్తి లేదని కాదు, అది కవిత్వమవడం మనకు కావలసినది. క్లుప్తంగా “కన్నడ వచనాలు” అంటే సరిపోయేదేమో.

కవి స్థల చరిత్రాది  వివరాలతో విపులపీఠిక సంతరించి పెట్టారు రచయిత.ఈ గ్రంథం అవశ్యం పఠనీయం.
స్థాలీపులాకన్యాయంగా ఒక వచనం.. అక్కమహాదేవి రాసినది.(రాయలసీమలో ఈమెను కొలుస్తారు!!)

కాయదింపిన తర్వాత
చెట్టు ఆకులు ఎవరు దులిపితే ఏమిటి?

నీకు అక్కరలేని స్త్రీ
ఎవరితో ఉంటే ఏమిటి ?

నీవు వదిలేసిన పొలం
ఎవరు దున్నితే  ఏమిటి ?

దేవుడు తెలిశాక
దేహం కుక్క తింటే ఏమిటి
నీళ్ళలో ఊరితే ఏమిటి?

(ప్రతులకు. దీవి సుబ్బారావు,ప్లాట్‌ నం. 143, వాసవీ కాలనీ, దిల్‌ సుఖ్‌ నగర్‌, హైదరాబాద్‌ 35)


రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...