చేవ్రాలు చేయలేను!

ఎవరైన ద్వారము ఇవాళ తెరువరా?

నివారించలేను,

సవారి గుర్రముసకిలించె నురగతో!!

ఏ వాలు కెరటమో;తెరచాప కదిలెను.

చేవ్రాలు చేయలేను!

ఎవరైన ద్వారము ఇవాళ తెరువరా?

నివారించలేను,

చివాలున లేచెనుచిరకాల శత్రువు!!

ఏ వేడి కిరణమో;ఏకాకి పక్షి అరిచెను.

చేవ్రాలు చేయలేను!

దివాంధమా!దివాంధమా!

నీవైన దీవించవే,

ఏ వాయు తెమ్మెరో;జేగంట మ్రోగెను.

వివాదమా వినోదమా?!

శవాన్ని కాను నేను!!

ఎవరైన ద్వారము ఇవాళ తెరువరా?

నివారించలేను,

ఈ వరద వేగము;సుడులతో రేగెను!!

ఏ వాడి ముల్లులో;వికసించె మొగ్గలు.

చేవ్రాలు చేయలేను!


రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...