పొలి

కుక్కలు మొరుగుతా ఉండాయి.జీ మాను ఊగతా ఉండాది.గాలి దుమ్మును లేపక పోతా ఉండాది.మోడం పట్టి చినుకు పడేతట్లుంది.
“చిన్నాయన ఎప్పుడొస్తాడమా” కండ్లు మూస్కొనే వాళ్ళమ్మను అడిగినాడు బాలా.

“ఈ అమాసకు పదినాళ్ళు.ఎద్దులు.. ఎద్దులు.. ముండమోసిన ఎద్దులు!! ఈ నాకొడుక్కి వ్యసనమై పోయింది” వక్కాకు దంచుతా గొణుగుతా ఉంది అవ్వ.

ఎద్దులు దిక్కులు జూస్తా వుండాయి,గాడిపాట్లో మేత అయిపోయినట్లుంది.

“కిట్టక్కా! దాండ్లకు మేతెయ్యి,యాడుండావే..” కొట్టిడీలో గలాసు కిందపడి “ఠాంగ్‌ ఠాంగ్‌” మనింది.”ఆ చీకట్లో ఏంజేస్తన్నవే,మేత లేక ఎద్దులు అల్లాడతన్నయి,ఓలి తక్కవని గుడ్డిదాన్ని చేసుకొంటె దొందుకుండలన్నీ పగలగొట్టెనంట.” గదురుకుంది ..అవ్వ.”వస్తండనత్తా,ఎద్దల మీద నీ కొడుక్కే కాదు,నీకేం తక్కువ ఆపేక్ష,ఒగ నిమిషం పక్కకు బోతే తొక్కులాడతండావు.” వాకిలి కాడ ఎవురో వచ్చినట్లయింది..

“అశిత్తూ కాలబడి ఆ బీడీ గాని తాగినావా,ఎద్దలకు మాతైపోరా,అవి సచ్చిపోతన్నయి ”

“కడుపా కణేకంటి చెరువా,పొట్టుజల్ల సొప్ప కడజేసినాయి” ఎద్దులు అశిత్తును గుడ్లు గుడ్లు చూసినాయి.వాడికి సొట్టకొమ్ము ఎద్దు అంటే ప్రాణం,దాని గంగడోలు నిమిరి “ధాయ్‌” అని మేతేసినాడు.గాడిపాట్లో మేత పడతా ఉండంగనే కొమ్ములతో చెలగాటం ఆడతా వుండాయి.

“మోపు చేస్తన్నరే” అని జైతి మింద చలకోల పెట్టి “కిట్టక్కా మంచి నీళ్ళియ్యి” అని అరిసినాడు.

“వీళ్ళ చిన్నాయన ఎప్పుడొస్తాడంట అశిత్తూ,సన్నోడు కలవరిస్తన్నడు”

“నడిపెన్న తెల్లెద్దుకు కుడిగా వుండే ఎద్దు దొరికే వరకు ఆన్నే ఎద్దుల పర్సలోనే తిరుగుతా వుంటాడు.” గుటక్‌గుటక్‌మని తాగి చెంబు మెటికల మింద పెట్టినాడు.

“దప్పికగొని వచ్చినావుసన్నోడు కలవరిస్తా ఉండాడు,ఒక మారు చూడు ”

“ఏమప్పా నిద్దర పోవడంలేదంట” గడపమాను దాటి బయట వరండాలోకి వచ్చినాడు.”

“చిన్నాయన ఎప్పుడొస్తాడమా” కండ్లు మూస్కొనే మళ్ళీ అడిగినాడు బాలా.

“మీయమ్మ గాదు,నేను అశిత్తుని”
“కత జెప్పవా అశిత్తూ నిజం కత..”

బాలాను ఎత్తుకొని ఉప్పునీళ్ళ బాయికాడ పాత టైర్ల బండి మింద పండుకోబెట్టి, తను నొగల మింద కూర్చుని,బీడీ అంటించుకోవాలని చూసినాడు,గాలి కొడతా ఉంది, ఆరిపోయింది.”థూ” అని ఉత్తరానికి ఎంగిలి మూసి, మీ తాత కథ చెప్తా,నిజం కత !”

“చెప్పు చెప్పు” ఆత్రంగా అశిత్తు దిక్కు తిరిగినాడు బాలా.గాలి తగ్గి,మోడం పొయ్యి, చుక్కలు బయటపడినాయి.చంద్రుడు వచ్చినాడు.నిద్దట్లో తూలిన కోడి రెక్కలు తపతప కొట్టి కట్టెమీద మళ్ళీ వడిగింది.

2.

” మీ తాతకు,కాటమయ్యకు పార్టీ.చేను గట్ల కాడ,మంచినీళ్ళ బాయికాడ,ఎద్దల పందాల్లో యాడ పడితే ఆడ సై అంటే సై ” ” ఊఁ ” అన్నాడు బాలా.శివరాత్రికి ఎద్దల పందేలు ఎప్పుడాకట్ల జోరుగా జరగతా ఉండాయి.సరిజోడి గిత్తలు..ఒక్క గిత్తాకట్లే రెండో గిత్త ఉండాల,అమ్మడ పిల్లల తిన్న.ఆ పందెంలో మీ తాతెద్దులే గెల్సినాయి. కాటమయ్య కర్రిగిత్తలు బుసలిడుస్తా,గుడ్లు తిప్పతా ఉండాయి;ఐనా గెల్సలేక పొయినాయి.చెవులు ఒక్క రవ్వ వేరే తీరున ఉండాయి.

“కండ్లు,కొమ్ములు,మూతి ..సరిసమానంగా ఉండాయా రెండు దాండ్లకు”

“అదే కదా చెప్తా ఉండేది సన్నా,చెవల దగ్గర తేడా అని” “సరే, చెప్పు చెప్పు” తొందరిచ్చినాడు బాలా.”ఏముంది కాటమయ్య మొగం మింద జొన్నగింజ పడితే పేలగింజయి రాలుతుంది,మండుతా ఉండాడుఅసలు పందెం రానే వచ్చె!”

“సోగెద్దులా ” ముందుకు పడి అడిగినాడు బాలా “ఊఁ” అని తలూపి “సోగెద్దులే” అని

“మొన్న నారయ్య పెండ్లినాడు తూచేనులో టెంకాయలు గొట్టిన పెద్దరాయిఉంది చూడు,ఇరవై మంది జమాజెట్టీలు లేపినా కదలదు,ఆ పెద్ద రాయిని ఇగ్గేవి ఎద్దులు”

“అంత పెద్ద దూలమా?” “ఊఁ మళ్ళ ఏమనుకుండావు? సత్తవ, ఎద్దలకయినా,మనుసులకైనా మీ తాత ఉగాది నాడు ఆ వరండాలో యాలగట్టినారు చూడు పెద్ద దుత్త దాంట్లో సగం ఇసిక సగం నీళ్ళు పోసుకొని మంచినీళ్ళ బాయి కాడి నుంచి యాడా దించకుండా ఎత్తకచ్చి నడవలో నిలబడి మీయవ్వను ” దించుకోవే వెంకటమ్మా అంటే” “మా నాయన మొరటనాకొడుక్కిచ్చి పెండ్లి చేసినాడు,దుత్తలు మొయ్యా,చెట్లెక్కా అడివినాకొడుకు” అని తిట్లకంటుకొనేది.అంటానే చుట్టకుదురేసి “దించు” అనేది.మీ తాత జలాట్లో ఎప్పుడు నీళ్ళు పోసుకోవాల, బాయి కాన్నే,”ఒరేయ్‌అశిత్తు వీపురుద్దరా” అనేవాడు.మీ అవ్వ “ఆ ఈపు ఇసురు గొప్ప మనిషి “అని గొణుక్కుంటా “అశిత్తూ! వరిగడ్డేసి రుద్దు,శుభ్రం కావాల” అనేది .

“సోగెద్దుల గురించి చెప్పమంటేఏందో అంతా” కోపం జేసుకొన్నాడు బాలా .

“ముప్ఫై నలభై కాడెల ఎద్దులు వచ్చినాయి.అందరూ మన గిత్తలను నిలిచి చూస్తా వుండారు,ఈగ వాలితే జారిపోతుంది బాలప్ప గిత్తల మీద ” అనుకొంటా.

మొదట కాటమయ్య గిత్తలు తూచేనులో ఆ చింతమాను కాడినుంచి ఈ చింతమాను కాడికి ఇగ్గినాయి దూలాన్ని.ఆ నిరుడు మన పాత గిత్తలు చింతమానుకు పది అడుగులు దూరం ఉందనంగా ఆగిపోయినాయి.అదే పెద్ద గొప్ప అనుకొన్నారు ఆ ఏడు.కాటమయ్య పౌరుషంగా గిత్తలను దువ్వుతున్నాడు.మీ తాత గిత్తల పని అయిపోయిందే అనుకొన్నారు అందరూ.మీ నాయనా,నేనూ మన ఎద్దుల తల నిమురతా ఉండాము.మీ చిన్నాయన మేపిన గిత్తలే అవి.మీ తాతను చూసి “హూ హూ ” అని తొక్కులాడినాయి.”నడిపోడా పగ్గాలు పట్టు” అని విసిరేసినాడు మీ తాత మన ఎద్దులు సై అంటే సై అని సోగ ఇగ్గడానికి మెడలు వంచి మోరెత్తి రంకెలేసినాయి.

మీ చిన్నాయన తలకు రుమాల చుట్టి,గోచి పోసి,చలకోల భుజానేసి “రామా ,లచ్చుమా” అని ఎద్దల ఉషారు చేసినాడు.రాముడు,లచ్చుముడు తూకం చూసుకొని ఊన్చి కదిలినాయి, యెనకే రాయి కదిలింది.జనాలు “ఓ” అని అరసబట్టినారు.మీ తాత రుమాల మొలకుజుట్టి ధ్వజస్థంబం మాదిరి నిలబడుకొని చూస్తా ఉండాడు.ఎద్దల మీద బరువు తెలస్తా ఉంది గిట్టలతో దుమ్ము లేపుతూ,మోరెత్తి హుమ్మని నందికేశుల తిన్న గలగల కదిలె మనెద్దులు..

రామా!లచ్చుమా!ఊ పోవాలా అని మీ చిన్నాయన!సగం దూరం అయిపాయ.మీ తాత పంచ ఎగ గట్టి,బాయోల్ల ఎంకటరాముడితో మెరవణి బాగ చెయ్యాల అని మాట్లాడ బట్టె.బాండు మేళం పక్కూరికి పోయింది అంటే బేగి రమ్మని చెప్పనీకి మనుసులను పంపమనె.

కాటమయ్య బిర్రుగుండె.ఉన్నట్టుండి రాముడు ఆగిపోయినాడు.అప్పుడే ఎదురు గస? మామూలు ఎద్దు కాదే!? మీ చిన్నాయన ” రాముడూ “అని అదిలించె..లచ్చుమ బెదురు చూపులు చూడబట్టె . కాటమయ్య ఊపిరి ఇడసకుండా చూస్తా ఉన్నాడు.పది అడుగులు దూలం కదిలితే మనదే గెలుపు! ఏనాడు మనెద్దులు ఓడలేదు,అట్లాడిది..ఎవురి దిష్టి తగిలుంటుందబ్బా,ఎర్ర నీల్లు నిమ్మ కాయతో దిగదీసినామే.రాముడు మొండికెత్తినాడు.చలకోల తీసుకొని నాలుగు పీకినాడు నడిపెన్న. వాతలు తేలినాయి.మీ తాత బుద్ధి సూక్ష్మం.”రేయ్‌నడిపోడా,నువ్వుండు..”ఉరికి వచ్చినాడు రాతిదూలం కింద నల్ల నాగంపాము బజ్జి బజ్జి అయి తోక కనిపిస్తా ఉంది,గడ్డిలో దూరుకోని ఉందేమో,ఎవురూ చూసినోళ్ళం కాదు.నల్ల నాగంపాము జేరుకొంది రాయికింద అని సగం మంది బెదిరిపోయిరి.మీ తాత కొడవలితో నాగంపాము తలకాయను,తోకను తీసి పారేసి,”రాముడూ కదులు ” అని అరచేత్తో చరిచె. నిమ్మళంగా మన సోగెద్దులు చింతమాను కాడికి దూలాన్ని ఈడ్సి పారేశ..సాయంత్రం ఎద్దలకు మెరవణి..గుడి దగ్గర అందరికీ అన్నాలు..లేసే బంతి..కుచ్చునే బంతి..ఆ తోజు..ఆ దర్బారు..మీ తాతను బోయోళ్ళు

“గొంచిలికాడా,దిగు చేన్లలో ఐదెకరాల పంటంతా మేమే ఇడిపిచ్చుకుంటాం” అంటే

“అట్లే గానీ పోరా ఎవురుదింటే ఏముంది” అనె “బొగు శర్తౖతెన మనిషి,మాటంటే మాటే, పెద్ద జారీగాడు”

3

“అశిత్తూ! మా తాతను ఎవురు జంపినారు?”

అశిత్తు వెనుకా ముందు జూసినాడు.కుక్కలు మొరగతా వుండాయి.”తిత్తీ తిత్తీ” అని తీతవ అరస్తా ఉంది.నారాయణి వాళ్ళ కళ్ళంలో దారిదప్పి అడివావు గాని దూరిందా? నిఘాగ విని “యాడన్న శాయనీలే” అని తీతువు ని చూసి ఎంగిలి మూసి

“సన్నా నువ్వు ఇంగా పుట్టలేదు,మీ అమ్మ కడుపుతో ఉంది.కాటమయ్య ఎద్దల పందాల్లో ఓడిపోయినాక ఇంగా కచ్చ పట్టినాడు.మన పెద్ద వాముకు అగ్గి పెట్టినాడు.గూడిమిద్ది రంగమ్మ చూడకపోతే అందరి వాములు కాలిపోవు.ఎద్దలకు మేత లేక పోవు.కళ్ళంలో ధనియాల కట్టె కాల్పిచ్చినాడు.మీ తాత ధర్మరాజు.ఓపిక పట్టినాడు.కడాకు మన రాముడు తాగే నీళ్ళలో మందు పెట్టిచ్చినాడు.రాముడు నీళ్ళుతాగి కండ్లు తేలేసె. మీ తాత కురువోళ్ళ రామప్ప తో విరుగుడు చేపిచ్చి రాముణ్ణి బతికించుకొని,దాని పగ్గంతోనే కాటమయ్యను చెట్టుకు కట్టేసి..పంగలకట్టెతో నున్నగ పై పగలగొట్టె. దాంతో కాటమయ్య కచ్చ ఇంగా పెరిగిపాయ.నల్ల నాగంపాము మాదిరి సూపెట్టుకోని వుండాడు.మీ తాత కమ్మారాయని చేనుకాడికి పొయ్యొస్తావుంటే,ఎవురూ లేంది చూసి, దారి కాసి కలబడినారు కాటమయ్య మనుసులు.మీ తాత ఒంటిగాడయిపాయ,చేతిలో చలకోల గూడ లేదు,ఉత్త చేతులతోనే ఇద్దర్ని ఇసిరేసినాడు.కాటమయ్య తమ్ముళ్ళని కుడి చేతితో గుద్ది పడగొట్టినాడు.”బాలప్ప చంపుతాడురా ” అని యెనక నుంచి కమ్మి ఈటెలతో తల పగలగొట్టినారు.ఈ లోపల సంత ముగిచ్చుకొని మీ చిన్నాయన నేను ఎద్దులకు మువ్వలు,గంటలు,పట్టీలు,అద్దాలు అన్నీ ఏసకస్తున్నాము.యానాది నరసప్ప గసబోసుకంట వచ్చి చెప్పినాడు,మీ తాత మింద ఏటు పడిందని.నేను, మీ చిన్నాయన ఈటెలతో పోయినాము.మీ నాయన యాటకొడవలి పట్టుకొని దూరినాడు “యెవుడు యెదీ మా నాయన మీద యేటేసే మొగోడు” అని.మీ దాయాదులు పుల్లన్న,పాపయ్య వాళ్ళ అన్నదమ్ములు అందరూ కత్తులతో వచ్చినారు.

అంతా అయిపోయె,రక్తం పోయె.తాత ” నీళ్ళు నీళ్ళు ” అని ఆక్రోశించె.నేను ఉరికి చిటికెలో నీళ్ళు తెచ్చినా,” శభాష్‌ అశిత్తు,జింకపిల్ల ” అని నగి నీళ్ళుతాగి అందరినీ ఎగాదిగా చూసినాడు.చుట్టూ దాయాదులు.ఎడమచేతిలో మూడు ఈటె పోట్లు డొక్కలో కత్తిపోటు..ముక్కు తెగి గడ్డం మీదికి నెత్తురు కారతావుంది.
దాయాది పుల్లన్నకండ్ల నీళ్ళు పెట్టుకొనె.. ఎడమ కాలితో ఎగిచ్చి దొమ్మలమీదతన్ని ” పుల్లిగా నీ మొగం చూపీయద్దురా..ఏడుపు ఏడు తరాల్లో లేదురా” అని మీ చిన్నాయన్ని పిలిచి ” నడిపోడా ఎద్దలు జాగ్రత్త ” అనె.రాముడు తొక్కలాడతంటే నేనే పగ్గం వదులు చేసి,వదిలేస్తి దాని మెడ పట్టుకొనె కుడిచేత్తో..అడిమేత పెట్టినచేయి.. అది నాక బట్టె..దాని కండ్లలేకి చూస్తానే పాణం బాయె..ఇంగెక్కడి బాలప్ప సింహం చచ్చిపాయా.మీరు నామధార్లు కదా దాసప్ప వచ్చి అందరికి నామాలు పెట్టి,” భక్తే గాని శక్తి లేదు ” అని అనిపిచ్చి దాసంగం చేసె.దాసప్ప నాయన తాగి మోడోల్లది పెద్ద దర్బారు, మా నాందారి బాలప్పను మించినోడు పుట్టడు అని శానా మోపుజేసె .దినాల రోజే మీ నాయన కాటమయ్య మనుషులను చంపి జైలుకు పాయె.మీ చిన్నాయన పెండ్లి చేసుకోనని కళ్ళంలో ఎద్దులు మేపుకొంటా,గడ్డం పెంచుకొని ఉండబట్టె.

బాలా ఊఁ కొట్టడం లేదు.”ఎప్పుడో నిద్దర బోయినాడు,బాలప్పను తలుచుకొంటే ఒళ్ళు సోధీనంలో ఉండదు అనుకొంటా..బాలాను జోపానంగా ఎత్తుకొచ్చి వెంకటమ్మవ్వ పక్కన పండేసి అశిత్తు అరుగుమీద నిద్ర బోయినాడు…

4.

ధనియాల చేను పచ్చగా కళకళలాడతా కనిపించింది,

ఎర్రని పావడాలో..ప్రమీల ” బాలా! కొత్తిమీర కావాలంట” అని అడుగుతావుంది,కాలి గజ్జెలు ఘల్లు ఘల్లు మనిపిస్తూ..

దూరంగా కోడికూసిన బాయి మంచినీళ్ళు తెచ్చుకొంటున్నారు..

“నాకొడకా కండ్లలో దుమ్ము పడతందిరా”

“మా పాప జడేసుకుంటందిరా,మట్టిపెల్లలు పడతన్నయి” బాయి తవ్వతా ఉంటే పాతాళంలో అరుపులు వినిపిచ్చినాయి. బండపగిలింది.కోడికూసింది.కోడిగూసిన బాయి తయారు..

“పొలి పొలి” అప్పయ్య వరి అన్నం రక్తం కలిపి జల్లుతున్నాడు. చింత చెట్టు మింద పంత గద్ద “క్రీ” అని బారు రెక్కలు చాపుకొని ఎగిరిపోయింది..కొంచెం దూరం కాకులు దాని వెంట పడినాయి..

“అవ్వా సుగాలి దయ్యం ఏమంటుందే..””మన అనమక్కను దొందుకొని, జొన్నల్లో హశ్శ సజ్జల్లో హశ్శ కొర్రల్లో హశ్శ అని తెల్లార్లూ పాడి పాడి దాని బండబడా ఊరబ్బలు నారబ్బలు చేసి అల్లాడిచ్చిందనుకో ”

“అశిత్తూ కొరివి దయ్యాలు నిజంగా ఉండాయా..”

“మీ తాతకు కనిపిచ్చేవంట సన్నా,దీనాలి దీనెక్క హోయ్‌అంటే తలుక్‌తలుక్‌మని పారిపోయే వంట..”

కొరివి దయ్యాలు గాలిలో ఊగుతున్నాయి..చేతుల్లో నల్లని తుపాకులు దగ్గరికి దగ్గరికి వస్తున్నాయి..భట్రాజుల అయ్యవారు విరాట పర్వం చదువుతున్నాడు.పూజారయ్య హారతి ఇస్తున్నాడు..ప్రమీలకు జ్వరం గాని వచ్చిందా..ధనియాల చేను..కొరివి దయ్యాలు నల్లని తుపాకులు మైనస్‌పది డిగ్రీల చలిలో చెమట పట్టింది బాలాకు,గుడ్‌చనా కొంచెం నమిలి, మంచునీరు తాగాడు. ” ఏమిటి తలా తోక లేని కలలు ??” అప్రయత్నంగా చేతులు ఆయుధాలను తడిమాయి..చెక్కు చెదరలేదు..హమ్మయ్య అని ఊపిరిపీల్చుకొన్నాడు.

5

శత్రువు తాము అనుకొన్నంత బలహీనంగా లేడని బాలాకు బాగా అర్థమయింది.

చనిపోతున్న సైనికుల సంఖ్య పెరుగుతూ ఉంటే శిబిరాల్లో ఆందోళన హెచ్చింది.

ఒక్క అంగుళం కూడా ముందుకు వెళ్ళలేక పోతున్నారు.మూడు రోజుల నుండి ఎడతెగని ఆర్టిలరీ,మోర్టార్‌ఫైరింగ్‌శత్రువు స్థావరాలు భద్రంగా ఉన్న విషయం రోజు రోజుకూ భరించలేనిదిగా తయారవుతోంది.ఏదో ఒకటి చేసి శత్రువు బంకర్లను నేలమట్టం చేస్తే గాని point 4590,point 5140 పట్టుకోలేము,అంతేగాక శ్రీనగర్‌కార్గిల్‌లేహ్‌సప్లై రోడ్‌శత్రువు కనుసన్నల్లో ఉంటుంది.ఆలోచనామాత్రంగానే వళ్ళు జలదరించింది బాలాకు.ప్రాణాంతకమైనా సరే రాత్రికి తేల్చివేయాలి అన్న పట్టుదల ప్రవేశించింది ప్లాటూన్‌లో.మంచుకొండల్లో ఊపిరి తీయడమే కష్టమైపోతోంది. అర్ధరాత్రి గడిచాక రెండుగంటలకు ..కొండపైకి ఎగబాకడం మొదలు పెట్టారు.

చిమ్మ చీకటి.. ఏమీ కనిపించడం లేదు,అదీ ఒకందుకు మంచిదే,ఏ కొంచెం గుడ్డివెలుతురు సోకినా శత్రువు తమజాడ ఏ క్షణంలోనైనా పసిగట్టవచ్చు.ఒక్క పది అడుగులు పాకితే చాలు చరియ మీదికి చేరినట్టే.ఎడా పెడా కాల్పులు మొదలైనాయి.ఇద్దరు సిపాయిలు ఒక కమాండర్‌రాలి పోయారు.బాలా ,థాపా,నోన్‌గ్రుమ్‌లు ఉడుముల్లా అతుక్కుపోయారు.

ఇంక ఎంతోసేపు తాము నిలవలేమని బాలాకు బాగా అర్థమై పోయింది.భుజం మీద నాటుకొన్న బుల్లెట్‌బుస బుసా రక్తాన్ని పొంగిస్తూ..ఒక్క సారి ఊరు గుర్తుకొచ్చింది.ప్రమీల కూడా..తను చూడకపోయినా తాత కూడా,ఎద్దులతోటే లోకంగా బ్రతికే చిన్నాయన.. అందరూ కదిలారు కళ్ళముందు ఒక్క క్షణం..చరియమీదకు ఎగబాకి కవరింగ్‌తీసుకొని శత్రువుని దెబ్బ తీయక పోతే థాపా,నోన్‌గ్రుమ్‌లు దక్కరు.పట్టు దొరికించుకొని చరియ చాటు చేసుకొని..బుల్లెట్లు వెదజల్లుతున్న బంకర్‌మీదికి రాకెట్‌లాంచ్‌చేసి పేల్చేశాడు.

ఈ లోపు థాపా,నోన్‌గ్రుమ్‌లు పొజిషన్‌తీసుకొని ఎదురు కాల్పులు మొదలు పెట్టారు.శత్రువు తాలూకు మూడు బంకర్లు ఒకదాన్ని ఒకటి సపోర్ట్‌చేసుకోంటున్నాయి.మూడు వైపులనుండి కందిరీగల్లా బుల్లెట్లు వచ్చి పడుతున్నాయి.ఇలాగయితే మూడు రాత్రులు,మూడు పగళ్ళు పోరాడినా లాభం లేదనిపించింది బాలాకు.ప్రత్యక్షంగా ఒక బంకర్‌మీదికి దూకి అందిన వారిని అందినట్టు మట్టుపెట్టాలని బాలా ప్లాను.మందుగుండు ఎక్కువ సేపు వచ్చేలా లేదు.థాపా,నోన్‌గ్రుమ్‌లు పొజిషన్లు మార్చి ఫైరింగ్‌తీవ్రతరం చేశారు…శత్రువు కు తమ ఉద్దేశం అర్థం కాకుండా ఉండటానికి.అంగుళమంగుళం పాక్కుంటూ చరియకు ఆవైపు దిగాడు.ప్రమాదాన్ని వారు పసికట్టేలోగా ఒక గ్రనేడ్‌విసిరి దగ్గరి బంకర్‌ను తుత్తునియలు చేశాడు.తృటికాలం పల్లె గుర్తొచ్చింది..అప్పయ్య గంపలో రక్తం కలిపిన వరి అన్నం చల్లుతూ “పొలి పొలి” అని అరవడం గుర్తుకొచ్చింది..మళ్ళీ కాల్పులు సపోర్టింగ్‌ బంకర్‌నుండి.బంకర్లను closing-in చేయడానికి ఎవడో మొండిఘటం దూకాడని అందరికీ అర్థమై పోయింది.థాపా,నోన్‌గ్రుమ్‌ఎడమ వైపు బంకర్‌ని engageచేశారు పూర్తిగా ammunition అయిపోయింది.ఒక్క గ్రనేడ్‌మిగిలింది..

నల్లని పొగల మధ్య అందులో జొరబడి “పొలి పొలి” అని బొబ్బరిస్తూ బాలా వారు ఆశ్చర్యం నుండి తేరుకొనేలోగా పిడిబాకుతో పొడిచి మట్టుబెట్టాడు.ఒక్కసారి ఆగిన కాల్పుల మధ్య పెడబొబ్బలు కొండసానువుల్లో గట్టిగా వినిపించాయి. థాపా,నోన్‌గ్రుమ్‌లకు బాలా ఇక తమకు దక్కడని అర్థం అయిపోయింది.అప్పటికే బుల్లెట్లు బాగా దిగబడ్డాయి.చని పోతున్న సైనికుడు చాలా ప్రమాద కారి.ఎంతకైనా తెగిస్తాడు.బాలా ఎదురు బంకర్లను దెబ్బతీస్తూ చివరి గ్రనేడ్‌విసిరాడు.పెద్ద పేలుడు..పొగ చుట్టుకొంది.థాపా ,నోన్‌గ్రుమ్‌లు వచ్చి పడ్డారు బాలాకు దన్నుగా. evacuation అన్నారిద్దరూ ఆకాశం వైపు చేయి చూపి.. ఛీకొట్టాడు బాలా..బంకర్లో చేజిక్కించుకొన్న మెషీన్‌గన్‌తో పొజీషన్‌తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు.థాపా,నొన్‌గ్రుమ్‌లకు అర్థమై పోయింది.బాలా అంతరంగం..CLOSING IN అన్ని బంకర్లు నాశనం చేయాలి లేదా చావాలి.తన ప్రాణాల మీద ఎలాంటి ఖాతరీ లేదు బాలాకు.అతి కష్టం మీద వాలుతలం మీద ఏర్పాటు చేసుకొన్న బంకర్‌మీదికి పొగల మధ్య దూకారు.బాలా కళ్ళముందు ఏవో తెరలు..ఊపిరి సరిగా అందడం లేదు..

చిన్నాయన చిన్నప్పుడు ఒక్క సారి వీపు మీద వాతలు తేలేలా కొట్టాడు.దారి దొంగలు మీద పడితే తను నలుగురితో పాటు పారిపోయి వచ్చాడు.చిన్నాయన గద్దిస్తుంటే..” కత్తులు ఉన్నాయి వాళ్ళ దగ్గర” అన్నాడు భయంగా.చలకోలతో ఇంకోసారి బలంగా మోది ” కలబడు,కత్తులుంటేనేం పారి వస్తావా?నీ మొగం చూడను” అశిత్తు ” పిల్లోడు,పిల్ల చేష్టలు..” అని ఏదో సర్ది చెప్పబోతుంటే “ఇవన్నీ చెప్పద్దు,వానికి మొలతాడు ఉందా లేదా” అని చలకోల నేలకు కొట్టి ఎద్దుల దగ్గరికి పోయినాడు.అతి కష్టం మీద లేచి నిలబడ్డాడు బాలా..థాపా నోన్‌గ్రుమ్‌లు పెడబొబ్బలు పెడుతున్నారు.

శత్రువు దగ్గర మందుగుండు అయిపోయినట్లే ఉంది.తొడలో దిగబడిన బుల్లెట్‌నడిస్తే సలుపుతోంది..

“మూడు ఈటెలను ఎడం చేత్తో ఆపి,కుడిచేత్తో ముగ్గుర్ని గుద్ది చంపినా,నా మనవడు అంతేనా,అప్పుడే చచ్చిపోతాడా,చోద్యం చూడరా అశిత్తూ” గుబురు మీసాల చాటున తాత ఎగతాళి నవ్వులు.వంకీ కత్తి ఊడ లాగి..బరిలోకి దూకాడు.థాపా, నొన్‌గ్రుమ్‌లు గాయాలతో ఏ క్షణం లోనైనా కూలిపోయేలా ఉన్నారు..తనలాగే వళ్ళంతా కత్తిపోట్లు..బుల్లెట్‌గాయాలు ..థాపాకు బాలాలో పరశురాముడు కనిపించాడు.ఒళ్ళంతా రక్తం.. నొన్‌గ్రుమ్‌కు చండ అశోకుడు కనిపించాడు.

“మారో మారో” “పొలి పొలి” లేవబోతున్న ఇద్దరు సైనికులను ఒక్క ఉదుటున హతమార్చాడు.

6

కొంచెం గర్వం..కొంచెం సంతృప్తి..రేపో మాపో..ఎగువ బంకర్లను గ్రనేడియర్స్‌, రైఫిల్‌మెన్‌ కొండలు దద్దరిల్లిపోయేలా ఫిరంగులు పేలుస్తూ స్వాధీనం చేసుకొంటారు. శ్రీనగర్‌కార్గిల్‌ లేహ్‌ రోడ్‌మీద శత్రువు నీడ పడదు.మరుక్షణం ఒంట్లో ఓపిక లేనట్లు నిస్త్రాణగా కూలిపోయాడు..

” బాలా సాబ్‌ ” థాపా,నోన్‌ గ్రుమ్‌ కళ్ళల్లో నీళ్ళు!!

చాలా పొడి మాటల్లో చెప్పాడు ” ఏడు తరాలుగా ఏడుపు లేదు;ఇష్టం లేదు నాకు”

అలాగే అన్నట్టు తలలూపారు..ఊపిరిని కోస్తూ చల్లగాలి కొడుతోంది…

“evacuation కు ఎంత time పడుతుందో! AirOpపైలట్లు ఎప్పుడు వస్తారో..”

మంచు కొండలు మరింత చల్ల బడుతున్నాయి.”అంతవరకు మిగులుతామా?”

బాలా ఇద్దరి భుజాలు తట్టి నవ్వాడు..కొంచెం తేరుకొని ఒకేసారి ఉత్తరాలు బయటికి తీశారు.. ఐనా ఎవరు బతుకుతారు? అంతలోనే ఇద్దరి కళ్ళల్లో నిరాశ..కొంత ఉత్సాహం కూడా ..ఇతను నిమ్మకు నీరెత్తినట్టు ఇంత నిబ్బరంగా ఎలా ఉండగలుగుతున్నాడు? వారి ఆలోచనలు చదివిన వాడల్లే..రక్తమోడుతున్న చేతులతో ఖుర్కీ కత్తి ని సర్రున దూసి క్షణం గుండెకు ఆన్చి ఎత్తిపట్టుకొన్నాడు…ఛాతీ ఉప్పొంగుతుంటే, థాపా,నోన్‌గ్రుమ్‌లు ఖుర్కీలు సర్రున దూసి జత కలిపారు..అప్పుడు గాని అర్థం కాలేదు బాలా అంతరంగం.. గుండెల మీద దరువేస్తూ, సోగెద్దులు రంకె వేసినట్టుగా ఒక్కసారి గొంతెత్తారు ముగ్గురూ… “వీర భోగ్య వసుంధరా.. వీర భోగ్య వసుంధరా..” వారి రణనినాదం అదే!!

సైనికుల విగతాత్మలు తమతో శ్రుతి కలిపాయా అనిపించింది ముగ్గురికీ ఆ క్షణాన గాలి,నిప్పు,నీరు,మంచు,లోయలు..శిఖరాలు..చెవి వొగ్గి వింటున్నాయా అన్నంత నిశ్శబ్దం ఒక లిప్త పాటు..”వీరభోగ్య వసుంధరా ” పర్వత సానువులన్నీ ప్రతిధ్వనించాయి.తాము ఒంటరి కాదు అనిపించింది ముగ్గురికి.రక్తం వడివడిగా ప్రవహించడం మొదలు పెట్టింది. జేవురించిన మొహాల మీద పగటి కాంతి పడి వింతగా మెరుస్తోంది.హాయి గొలిపే గాలి తెమ్మెర ఒకటి వీచింది..ఇంటి వైపు మళ్ళాయి అందరి ఆలోచనలు..నోన్‌గ్రుమ్‌సన్యాసి గా మారదామని సైన్యం లో చేరాడు.నాన్న లామా గుర్తుకొచ్చాడు తమ బోథి భాషలో తను ఎప్పుడూ చెప్పే మాట “ఖి ఖి శొ శొ ళార్గైలో(దేవతలదే జయం)” బాగా జ్ఞాపకమే. తండ్రి శిష్యులతో పాఠాలు వల్లె వేయిస్తుంటాడు.థాపాకు నేపాల్‌ ఇండియా సరిహద్దులోని కుగ్రామంలో, తన తల్లి దగ్గర పెరుగుతున్న కూతురు గుర్తుకొచ్చింది.తను బయలు దేరి వస్తుంటే “సర్దీ మే నానీ క్యా కహతీ హై ” అని ముద్దుముద్దుగా హిందీ కవిత భట్టీ వేస్తోంది..

బాలాకు ఇంకో లోకంలో ఉన్నట్టు ఉంది..లీలగా ఏవో మాటలు..అలవాటైన ఎద్దులు, చిన్నప్పటి ఆటలు.. కొత్తిమీర చేను ఘుమాళింపు మధ్య లీలగా సన్నని సన్నని స్వరం గుండెను చుట్టుకొని మరి వదల్లేదు!! “మల్లె పూవు మల్లె పూవు మెల్లగొచ్చి గిల్లిపో”..

7.

“మల్లె పూవు మల్లె పూవు మెల్లగొచ్చి గిల్లిపో”

బాలా కళ్ళకు గంతలు కట్టి “ఇల్లా ముట్టి ఇల్లా ముట్టి వీళ్ళెవరు” అని ఆట మొదలు పెట్టగానే నేనే వెళ్ళి ముక్కు గిల్లే దాన్ని.అదేం చిత్రమో ఎప్పుడూ నన్ను గుర్తు పట్టే వాడు.నేను కళ్ళకు గంతలు కట్టుకోవలసి వచ్చేది.దాగుడుమూతలు ఆడటం మగవారికి బాగా చేతవును,అందునా బాలాకి ఈ విద్య బాగా అబ్బింది.

జొన్న చేను కోతకొచ్చింది.పాలకంకులకోసం వాలిన పిట్టలు, చప్పుళ్ళకు రెక్కలు తప తప కొట్టి ఎగిరిపోతున్నాయి.దగ్గరి కళ్ళంలో ధనియాలు నూరుస్తున్న వాసన ఘుమ్మని కొడతా వుంది.కొత్తిమీర కోసం ధనియాల చేనుకు పోతే “ప్రమీలా,నీవు ఎప్పుడు ముక్కు గిల్లినా నేను ఎలా కనుక్కునే వాడినో చెప్పు అన్నాడు””ఊఁహూ నాకు తెలియదు ” అన్నా.

నేను అప్పుడప్పుడే పైటలు వేసుకొంటున్నాను.పైట చెంగు లాగి..ఎడమ చెవి మీద ముద్దు పెట్టుకొని ” నీ వళ్ళంతా కొత్తిమీర వాసన ” అన్నాడు.గాలికి మిరప చేను గల గల ఊగినట్లయింది లోన..బాలాను తోసి గుడి దగ్గరికి పరిగెత్తుకు వచ్చేశాను.. నాన్న ఎప్పుడూ వత్తులు చేసుకొంటూనో,పశువులు పోయిన వాళ్ళకి శాస్త్రం చెబుతూనో ఉంటాడు.నన్ను పెద్దగా పట్టించుకోడు.రేపు గురించి చింత కాదు కదా ధ్యాసే లేదు.తాతల కాలం నుండి పూజారి ఇంటికి కావలసినవన్నీ బాలా వాళ్ళ కుటుంబాల నుండే వస్తున్నాయి.విష్ణు సహస్రనామాలు వినిపిస్తాయి..ఇవన్నీ తనకు అలవాటైనవే..అమ్మ చనిపోయే నాటికి నాకు మూడేళ్ళు.బాలా వాళ్ళమ్మ నాగమ్మతో మంచి స్నేహంగా ఉండేదట.పెళ్ళిళ్ళు,పేరంటాలలో అమ్మ పాడేది,నాకు చూచాయగా గుర్తుంది.

అమ్మ అందం నాకొచ్చిందో లేదో గాని..గాత్రం మాత్రం తనదే..గుడిలో ఎప్పుడు పాడినా “అచ్చం మా కమలమ్మ మాదిరే పాడినావు” అని జనాలు మెచ్చుకొంటూనే వుంటారు.ఒక్క నాన్న తప్ప.. నాయనకు ఏమీ కాబట్టవు..అమ్మ చనిపోక ముందు కూడా తనది ఇదే ధోరణి అని నాగమ్మత్త చెప్పింది.జడవేస్తూ “నల్లగా ఏం జుట్టే..గడుసు..” అని మెటికలు విరిచి బుగ్గలు పుణికేది నాగమ్మత్త.”నిన్ను చూసుకోకుండా కమలమ్మను ఎత్తక పాయె పాడు దేవుడు ” అని ఎవరైనా నా మీద జాలి పడితే అస్సలు ఊరుకొనేది కాదు.”నేను లేనా మా బంగారు తల్లికి” అని ఆరోజంతా ముద్దు చేసేది..ఎంత గోము నేర్పింది..నాకెప్పుడూ అర్థం కానిదదే..

తనకెందుకు నా మీద ఇంత అపేక్ష..నా పేరంటానికి పట్టులంగా కుట్టించి,వంకీ, రాళ్ళ గాజులు,బంగారు దండ చేయించింది.నేనెప్పుడూ “అమ్మలేదే” అని బాధ పడలేదు అంత గారాబం.పక్క ఊరి బ్రాహ్మల పిల్లలు..చాలా సార్లు నన్ను “కమ్మ వాళ్ళ పిల్ల” అని వెక్కిరించే వారు.నాయన విసనకర్ర అటు ఇటు ఊపుకొంటూ నవ్వి ఊరుకొనేవాడు. ఏమీ అనేవాడు కాదు.ఒక రోజు గుడిలో దీపారాధన చేసి వచ్చి,నాయన ఆదిత్య హృదయం శ్రావ్యంగా చదువుకొంటున్నాడు.భయ భయంగా నాన్న పుస్తకాల గదిలోకి అడుగుపెట్టాను..తల తిప్పి చూశాడు.నాకా చూపంటే ఎందుకో భయం..నాగమ్మత్త దగ్గరికి పారి పోవాలనిపిస్తుంది..తలవంచుకొని నేల చూపులు చూస్తున్నా..

“చిట్టి తల్లీ! చెప్పమ్మా” నాకలా పిలిస్తే ఎంతో బావుంటుంది.గొంతు పెగల్చుకొని “నాగమ్మత్త నాకేమవుతుంది” ప్రశ్న పూర్తికాలేదు,ఇంకా అన్నట్టు చూసి,ఉత్తరీయంతో కనుబొమలమీద చెమట ఒత్తుకొన్నాడు.” వాళ్ళు మన కులం కాదు కదా” ప్రశ్న నోట్లోనే ఉంది ఇంకా..నాయన మొహంలో లీలగా అసహనం..తర్వాతా కొంచెం కోపం..అంతలో చిరునవ్వు..దగ్గరికి రా అన్నట్టు చేతులు చాచాడు.మొగలిరేకుల జడ వేసింది నాగమ్మత్త.మల్లె పూవులు వేలాడదీసింది చెంపల దాకా..సువాసన ఆఘ్రాణించి నుదుట లలితంగా చుంబించి “అజ్ఞానం తల్లీ,అదే బాధ..అదే మాయ”.

శంకరాచార్యుల సౌందర్యలహరి పారవశ్యంతో గానం చేశారు.అందులో సంగీతం మనసును ఆకట్టుకొంది.అద్వైతం తలకెక్కలేదు.”వెళ్ళు ఆవు దూడలతో ఆడుకో”

నేను లేడిలా పరిగెత్తుకొస్తుంటే..ఆయన పాడుతున్న శ్లోకం లో ఒక ముక్క “పరసే బ్రహ్మణి కోపినసక్తః” చెవిలో పడి గింగురుమంది.

8

బాలా తన ఈడు ఆడపిల్లలతో ఆడుకొంటూ ఉంటే నాకు ఉడుకుమోత్తనంగా ఉండేది.

“ప్రమీ! నాతో ఆడవా ?” అంటే ” ఊఁహూఁ నీ జతగాళ్ళు వేరుపో ” అనేది.”నీ కోసం ఏం తెచ్చానో చూడుగవ్వలు,శంఖులు,పూసలు,రంగు దారాలు అన్నీ నీకే..”ప్రేమగా ఇవ్వడంలో తల్లీ,కొడుకూ ఒకరికొకరు తీసిపోరు..పోటీ పడుతుంటారు.నేను మురిసిపోతుంటే  “పద మా చిన్నాయన దగ్గరకు పోదాం,కొత్త ఎద్దులు వచ్చినాయంట” నా చేయి వదిలే వాడు కాదు..ఎప్పుడూ..

నడిపెన్న మామది ఎద్దులతోనే లోకం.వాటినే అదిలిస్తూ ,సవరిస్తూ ఉంటాడు. కళ్ళం గేటు తీసుకొని లోన అడుగుపెడితే “ఎవరదీ..” అంటాడు.”బాలా కొత్త ఎద్దు పగ్గాలు పట్టుకో, ఎదవడద్దు” “రావే..రావే..నా బంగారు..” అని రెండు చేతులా మురిపెంగా ఎత్తుకొని..తలమీద ముద్దులు పెట్టుకొనే వాడు.” జూకాలు తీసుకు రావాల లక్ష్మీదేవి కళ మా చిట్టితల్లిది..” నేల మీద అడుగుపెట్టనిచ్చే వాడు కాదు;నేను గొడవ చేస్తే..” దూడ పలుగు విప్పి నీ ఈడుదే ఆడుకోమ్మా “..అని అప్ప జెప్పేవాడు.. దాని మెడను కౌగలించుకొంటే అది మోరెత్తి గరకు నాలికతో నాకాలని చూసేది..

నడిపెన్న మామ నందికేశ్వరుని అవతారమా అనిపించేది..నాకు..ఎప్పుడూ ఎద్దుల మధ్యే..మనుషుల్లోకి అసలు వచ్చే వాడు కాదు.ఆయన్ను ఒకసారి అడిగాను “మామా నేను మీకేమవుతా?” ఆయన దూడను ,నన్ను ఒకే రకంగా చూస్తాడు,అదే చిక్కు.

మళ్ళీ రెట్టించాను..”ఒకే కులం కాదు కదా మీరు మేము” .నన్ను ఎంతో అపురూపంగా ఎత్తుకొని చెప్పాడు “అజ్ఞానం తల్లీ..అదే బాధ..అదే మాయ” ఒకటే జవాబు..నాకు నిజంగా జవాబు దొరికినట్టే అనిపించింది.. బాలాకు అప్పటికి ఇవన్నీ తెలుసో,లేదో నాకు తెలియదు..కానీ ఆ బుర్రలో అన్ని తెలివితేటలు ఎక్కడివి??

బాలా సైన్యంలో చేరాడు అంటే నా గుండెలవిసిపోయినాయి.తర్వాత ఎప్పుడొస్తాడా ? అని ఎదురు చూపులు..పెద్ద జుట్టు స్థానంలో నీటు క్రాఫు..పొడవు కాదు పొట్టి కాదు..నలుపూ కాదు తెలుపూ కాదు..నిలకడైన ఆకారం..వచ్చీ రావడం తోటే నేరుగా ఇంట్లోకి ప్రవేశించాడు.. నాకోసమే నని తృళ్ళిపడ్డాను.హడావిడిలో ఒక జడకు రిబ్బను కట్టుకోవడం మరచిపోయాను..ఓంప్రథమంగా నాన్నను పరామర్శించి ఆశీర్వాదం తీసుకొన్నాడు..

అయ్యో నావైపు చూడనన్నా చూడలేదు..ఎంత కఠినాత్ముడు..నా గుండె కొట్టుకోవడం ఆగిపోయేలా ఉంది..వీరు నాకు ఏమీ కారు అంతా అజ్ఞానం,బాధా..మాయా..గంజి వారుస్తున్నా..
“ప్రమీ రిబ్బను ఏ మయింది?” చేతిలో అన్నం పాత్ర వణికింది..
కుట్టు మిషన్‌మీదున్న రిబ్బను తీసుకొని జాగ్రత్తగా జడ కట్టాడు.”సైన్యం లో ఇదే నేర్పుతారు కాబోలు” అన్నాను ఎగసి వస్తున్న ఆనందాన్ని అణుచుకోవాలని వృధా ప్రయత్నం.ఆవిరి ఇమరనీ అని మళ్ళీ పొయ్యిమీద పెట్టాను..
“అక్కడ వంట వాళ్ళు ఉంటారు ప్రమీ”
“నేను చెప్పేది రిబ్బను విషయం ” చిరుకోపంగా అన్నాను..

దగ్గరగా జరిగి “నీ వళ్ళంతా కొత్తిమీర వాసన ” అని చెవి మీద ముద్దు పెట్టుకొన్నాడు. అవే అల్లరి పెదాలు. సాయంత్రం నాగమ్మత్త ఇంటికి వెళితే..గాని నాకు అర్థం కాలేదు నేనంటే ఎంత ప్రేమో..ఎన్ని చీరలు..ఎన్ని కానుకలు..

9

పక్క ఊరిలో జాతర జరుగుతా వుంది..అందరూ వెళ్ళిపోయారు..గుడిగంట చప్పుడు..

బాలా! చేయిపట్టుకొన్నాడు.నాకు వదిలించుకోవాలని లేదు.చీకటి పడుతోంది..బాలా ట్రాక్టర్‌తోలుతుంటే పక్కనే కూచోవడం గమ్మత్తుగా వుంది..ధనియాల చేను ఘుమాలిస్తా ఉంది బాగా పూత పూసి.”.నీవే నా ధనియాల చేను నా మల్లెపూవు”

ఆవుదూడలా ఒదిగిపోయాను..అద్వైతానికి అర్థం తెలిసింది..”మల్లెపూవు మల్లెపూవు మెల్లగొచ్చి గిల్లిపో” అని ముక్కు మీద గోముగా గిల్లితే..నా చూపుడువేలును ముని పంటితో కొరికి వదిలేశాడు.పైరంతా ఊగిపోయింది..
దూరంగా జాతర చప్పుడు మా చెవుల్లో ఇంకిపోయింది.

మా పెళ్ళి మామూలుగా జరిగింది..ఎవరు ఎవరికి ఏమవుతారో నాకే తెలియలేదు..నా చుట్టూ ఉన్న అందరికీ తెలుసు. నేను నిజంగా పిచ్చిదాన్నే..లేదంటే యుద్ధానికి పంపుతానా నా బాలాను..ఎవ్వరూ దీని గురించి మాట్లాడరు. చెట్టుకు గట్టిన వరికంకుల మీద పిచ్చుకలు అరిచినా,ఆవుదూడా అంబా అన్నా..బాలా వచ్చాడేమోనని ఆత్రపడతాను..రోజూ రేడియో వినడం అంతే..

ఏవో వార్తలువస్తున్నాయి..

” రాజ్‌పుతానా రైఫిల్స్‌దళానికి చెందిన మేజర్‌బాలా,నీల్‌థాపా,నోన్‌గ్రుమ్‌ టోలోలింగ్‌కొండల్లో భీకర యుద్ధంలో 17 మందిని చంపి కొన ఊపిరితో ఉంటే పుణే మిలిటరీ ఆస్పత్రికి తరలించారు.ప్రాణాపాయం లేదు……………”

గిత్తలు చెవులు రిక్కించి బాలా పేరు విని సోగ కళ్ళు తిప్పి బుసలు కొట్టాయి. అశిత్తు “నాయనా తండ్రీ యాడుండావు రా “అన్నాడు.దేవరకు వదిలిన ఎద్దు గిట్టలతో నేలను రాచి,పచ్చ ఆకును పెదవులతో అప్పళించి, కొమ్ములెగర వేసి రంకె వేసింది..మోడం పట్టి నాలుగు పుల్ల చినుకులు పడ్డాయి..వాడు మొహం పట్టిన కొత్తిమీర జీవం పుంజుకొని కళకళలాడింది.

నాగమ్మ తనను అల్లుకుపోయిన కోడలిని ముద్దాడి “చీకటి పడతా ఉంది, దీపారాధన చేయమ్మా” అని చెప్పింది.

రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...