విలపించే ఖైదీ

ౖజెలుగోడలు

జలదరింపగ

గూబలన్నీ కలిసి కూయగ

తాచుపాములు

తలలు తిప్పగ

పెద్దగా విలపించె ఖైదీ

తెరలు తెరలుగ

వేడి ఊపిరి

కాలి గొలుసులు ఒరుసుకొనగా

రక్తమంతా

పొంగిరాగా

పెద్దగా విలపించె ఖైదీ

నడక తెలియని

నౌక మునిగెను.

ఇసుక నేలను తాకు నురగలు

పగటి ఎండకు

పగలు గవ్వలు

మిగిలి పోయెను ఆలుచిప్పలు

ఎగిరినవ్వెను

బావి చేపలు

అస్థి శకలం మట్టిగుహలో

మేత దొరకని

మృగము అరిచెను

బయటి వెన్నెల బరువు దుఃఖము

రావి ఆకులు

రాలి తడిచెను

దిశల చీకటి ఇనుప కౌగిలి

కల్లు తాగిన

ఎలుగు బెదరగ

గట్టిగా విలపించె ఖైదీ


రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...