పేరు తెలిసిన చేపను
నే పట్టలేను
ఆకొన్న జాలరులు
ఆ చేపలపై
వలలు పన్నుతారు
తిమిరాలు కప్పుకొన్న
తిమింగలాలు బరువు
నే మోయలేను.
ఈదేటి తాబేలు
వేటాడ లేను.
చీకటి ఇంకిన లోతుల్లో
బందీలుగా చిక్కిన
శిథిల నౌకలు..
చిరునామాలతో పనిలేదు
చిత్ర ప్రశ్నలు వేయవద్దు.
గొంతెత్తి అరచి సముద్రం
అలల చేతులతో కదిలినా
అంత తేలికగా ఒడ్డుచేరడం
నే ఇష్టపడను.
ఏ లోతులోనో మునిగి
ఏ లంకలోనో నిలిచి
మౌనఘోషను ఆలకిస్తాను
మూగభాషను అనువదిస్తాను.