ఏమైతేనేం, ఒక పెద్ద పులిని వేటాడి చంపి తీరాల్సిందేనని మిసెస్ పేకిల్‌టైడ్ గట్టిగా నిర్ణయించుకుంది. ఈ రక్త పిపాస వున్నట్టుండి ఆవిడలో జన్మించిందనడానికి లేదు. పోనీ, కనీసం ఒక్క పెద్ద పులినైనా చంపేసి భారతదేశ జనాభాకి క్రూర మృగాల బెడద కొంచెమైనా తగ్గించేయాలన్న సత్సంకల్పమూ కాదు. ఈ విచిత్రమైన కోరికకు కారణం మిసెస్ లూనా బింబర్టన్, ముమ్మాటికీ! లూనా ఈ మధ్య ఒక ఆల్జీరియన్ విమానంలో పదకొండు మైళ్ళు ప్రయాణం చేసింది. ఆ తర్వాత ఆవిడ ఇక వేరే యే విషయం గురించీ మాట్లాడడం మానివేసింది, ఒక్క తన విమాన ప్రయాణం గురించి తప్ప. ఆవిడ నోరు మూయించాలంటే స్వయంగా సంపాదించిన పులి చర్మమూ, చచ్చి పడున్న పులితో తను దిగిన ఫోటోలూ తప్ప ప్రత్యామ్నాయం లేదు మరి!
మిసెస్ పేకిల్‌టైడ్ అప్పుడే లూనాని ముఖ్య అతిథిగా ఆహ్వానించి, కర్జన్ స్ట్రీట్ లోని తమ ఇంట్లో ఒక విందు భోజనం ఏర్పాటు చేసినట్టూ, తమ ఇంట్లోని హాలులో పులి చర్మంతో చేసిన రగ్గు పరచినట్టూ, అందరూ తన పులి వేట గురించి అబ్బురంగా మాట్లాడుకుంటున్నట్టూ కలల్లోకి వెళ్ళిపోయింది. అంతే కాదు, పులిగోరుతో తయారు చేసిన పతకాన్ని లూనాకి రాబోయే పుట్టిన రోజు నాడు బహూకరించాలని కూడా నిర్ణయించుకున్నది.
ప్రపంచంలో చాలా వరకు సంఘటనలకి పునాది ఆకలో, ప్రేమో అనుకుంటాం. మిసెస్ పేకిల్‌టైడ్ చర్యలన్నీ ఇందుకు మినహాయింపు. ఆవిడ చేష్టలన్నీ లూనా మీద ఆవిడకున్న అంతులేని అసహ్యం పైనే అధారపడి వుంటాయి.
ఈ పులి వేటకన్నీ కలిసొచ్చాయి. ముందస్తుగా మిసెస్ పేకిల్‌టైడ్ తనకి పులిని చూపెట్టిన వారికి వెయ్యి రూపాయిల బహుమతి ప్రకటించింది. అదృష్టవశాత్తూ పక్కనే వున్న ఒక వూళ్ళో పెద్ద పులి తిరుగుతోందనీ, చాలా మేలు జాతి పులి అనీ, కొడితే అలాటి పులినే కొట్టాలనీ వదంతులు వినొచ్చాయి. వయసులో వుండగా తమ పూర్వీకుల్లాగే క్రౌర్యానికి మారు పేరయినా, ప్రస్తుతం అది వయసుడిగి, వేటాడే ఓపిక లేక ఇళ్ళల్లో దొరికే చిన్నా చితకా జంతువులతో కడుపు నింపుకుంటోందని కూడా తెలియ వచ్చింది.
వెయ్యి రూపాయల మంత్రం బాగా పారింది. ఊరి జనం అంతా పులి కొరకే వెతక సాగేరు. రాత్రీ పగలూ పిల్లలని తల్లి తండ్రులు అడవి చుట్టూ కాపుంచారు. తినడానికి ఏమీ దొరకపోతే పులి గానీ అడివి వదిలి పోతుందేమోనన్న భయంతో ప్రజలు అప్పుడప్పుడూ తమ మేకలను అడివిలో వదిలెయ్యటం మొదలు పెట్టారు. అయితే మిసెస్ పేకిల్‌టైడ్ వేటకి బయల్దేరి వెళ్ళే లోగానే పులి ముసలితనంతో చస్తుందని భయపడ్డవాళ్ళూ లేకపోలేదు. సాయంత్రం పిల్లల్నేసుకుని అడవి బాట వెంట వచ్చే తల్లులు తమ పాటలని తగ్గించుకున్నారు, పులికి నిద్రాభంగం కలిగించడం ఇష్టం లేక.
అనుకున్న రోజు, చీకటి పడి రాత్రవనే అయింది. ఆకాశంలో చందమామ, మేఘాల అడ్డమేమీ లేకుండా హాయిగా సంచరిస్తున్నాడు. ‘మేమ్ సాహెబ్’ పులి వేట కోసం ఎత్తయిన మంచె కట్టారు. దాని మీద నక్కి కూర్చున్నారు మిసెస్ పేకిల్‌టైడ్, ఆమె అనుచరి లూయిసా మెబ్బిన్. ‘మే, మే’ అని దీనంగా అరవడంలో ఎక్కువ నైపుణ్యం గల ఒక మేకని అక్కడే కట్టేసి ఉంచారు. దాని అరుపులు మామూలు పులులకేం ఖర్మ, చెవిటి పులులక్కూడా వినబడతాయి!
“మనకేదైనా ప్రమాదం వుంటుందంటారా?” అడిగింది లూయిసా. ఆవిడకి పెద్ద పులిని గురించిన భయం కంటే, తన రోజువారీ విధులకంటే ఒక్క చిల్లు కానీ వంతు పని చేయటం మీద అయిష్టత మెండు.
“ఎంత మాత్రమూ లేదు!” అన్నది మిసెస్ పేకిల్‌టైడ్. “అది చాలా ముసలి పులి. ఎగిరి గంతేసినా ఈ మంచె పైకెక్కలేదు.”
“అంత ముసలి పులికి మరి తమరు వెయ్యి రూపాయి లెందుక్కర్చు చేసినట్టో! కొంచెం తక్కువ డబ్బుకి బేరం చేసి వుండవలిసింది.”
లూయిసాకి డబ్బుని చూస్తే అదొకరకమైన ప్రేమ. యే దేశానికి చెందినదైనా డబ్బుని ఆవిడ తన స్వంత చెల్లెల్ని కాపాడినట్టు కాపాడుతుంది. తన సమయస్ఫూర్తితో ఆవిడ చాలా సన్నివేశాలలో చిల్లర డబ్బులు ఆదా చేసింది. పెద్దపులి వయసు పెరగడంతో పాటు దాని ధర తగ్గుతుందనే ఆర్ధిక సూత్రం గురించి ఆవిడ చెప్తూ ఉండగనే – వాళ్ళకి అక్కడ పెద్ద పులి కనిపించింది. అక్కడ కట్టేసి వున్న మేకని చూడగానే, అది ముందుగా నేల మీద అడ్డంగా పడుకుండి పోయింది కొంచెం సేపు. మేక మీద మెరుపు దాడి చేయటానికో, లేక దాడి చేసే ముందు కొంచెం విశ్రాంతి తీసుకోవటానికో మరి!
“దానికి ఒంట్లో బాలేదనిపిస్తోంది,” అంది లూయిసా, పెద్దగా, హిందీలో, అక్కడే నిలబడి వున్న ఆ వూరి పెద్దాయన కోసం.
“హుష్! మెల్లిగా!” అంది మిసెస్ పేకిల్‌టైడ్. అదే క్షణంలో పెద్ద పులి లేచి వాళ్ళున్న వైపు నడవటం మొదలు పెట్టింది.
“కానివ్వండి, కానివ్వండి! అది మేకని ముట్టుకోకముందే మనం దాన్ని చంపేస్తే, మేక ధర ఇవ్వక్కర్లేదు,” మెబ్బిన్ తొందర పెట్టింది. (మేకకి ఇచ్చే ధర వేరే!)
“ఢాం” అని రైఫిల్ పేలింది. పెద్ద పులి ఒక్క గెంతు గెంతి, పక్కకి తిరిగి విరుచుకొని పడిపోయింది. ఒక్క క్షణం తర్వాత ప్రాణం పోయినట్టు దాన్లో ఏ కదలికా లేదు.
ఊరి ప్రజలంతా జయ జయ ధ్వానాలు చేస్తూ పెద్ద పులిని చుట్టు ముట్టారు. అంతటా డప్పులూ, తప్పెట్లూ కోలాహలం. మిసెస్ పేకిల్‌టైడ్ విజయగర్వంతో చిరునవ్వులు చిందుస్తున్నారు. ఆవిడకి తమ ఇంట్లో విందు భోజనం అప్పుడే మొదలైపోయినట్టనిపించింది.
ఉన్నట్టుండి లూయిసా మేక వైపు చూపెట్టింది. అది బుల్లెట్ దెబ్బ తగిలి కొన వూపిరితో గిలగిల లాడుతోంది. పెద్ద పులి శరీరం మీద ఎక్కడా గాయం లేదు. నిస్సందేహంగా బుల్లెట్ గురి తప్పింది. మరి పెద్ద పులి ఎందుకు చచ్చిపోయినట్టు? అప్పుడర్ధమైంది అందరికీ. మేక బుల్లెట్‌తో చచ్చిపోతే, పెద్ద పులి బుల్లెట్ శబ్దానికి గుండె ఆగిపోయి చచ్చిపోయింది.
మిసెస్ పేకిల్‌టైడ్ ఈ విషయాన్ని వినగానే చాలా చిరాకు పడిపోయింది. ఎలాగైతేనేం ఆవిడ ఒక మరణించిన పెద్ద పులి శరీరానికీ, చర్మానికీ హక్కుదారు. వెయ్యి రూపాయల కృతఙ్ఞతతో ఊరి వాళ్ళు ఈ విషయాన్ని ఎక్కడా చెప్పకుండా ఉండేటట్టు ఒప్పందమైంది. లూయిసా మెబ్బిన్ దేముంది, జీతానికి పని చేసే మనిషి.
అందువల్ల మిసెస్ పేకిల్‌టైడ్ ఏమాత్రమూ జంకకుండా ప్రెస్ ఫోటోగ్రాఫర్లకి చచ్చిన పులితో సహా బోలెడు పోజులిచ్చారు. ఆ ఫోటోలు ఇంగ్లండు దాకా చేరుకున్నాయి కూడా. ఆ పులివేట ఇచ్చిన ఉత్సాహంతో మిసెస్ పేకిల్‌టైడ్ ఫాన్సీ డ్రెస్ పార్టీలో వేటగాళ్ళ అధిదేవత డయానా వేషం వేసింది. అయితే “ఎవరు చంపిన జంతువు చర్మం వాళ్ళు ధరిస్తే బాగుంటుందన్న” మిస్టర్ క్లోవిస్ సూచనని మాత్రం మృదువుగా తిరస్కరించింది.
“నిజానికొస్తే, ఆ నియమంతో నాకే ఎక్కువ ఇబ్బంది! నేను చిన్న కుందేలు పిల్ల చర్మంతో నాట్యం చేయాల్సి వొస్తుంది మరి” అన్నాడు క్లోవిస్, ఆయన వేటలో చంపేసిన కుందేటి పిల్లని తల్చుకుంటూ. “అయినా సరే, నాకేం పరవాలేదు. నేను చూడడానికి బానే వుంటానుగా ,” అన్నాడాయన మళ్ళీ, అదో రకమైన కొంటె నవ్వుతో.
ఆ ఫాన్సీ డ్రస్సు విందు తరవాత ఒక రోజు మాటల్లో, మెబ్బిన్ మిసెస్ పేకిల్‌టైడ్ తో, “అసలు చచ్చిన పులిని గురించిన నిజం తెలిస్తే అందరూ ఏమంటారో,” అంది సాలోచనగా.
“అంటే?” చురుకుగా అడిగింది మిసెస్ పేకిల్‌టైడ్.
“అంటే, ఏముంది? మీ తుపాకీ గుండుతో చచ్చిపోయింది పులి కాదు మేక అనీ, ముసలి పులి గుండె ఆగి చచ్చిపోయిందనీ తెలిస్తే అందరూ మీ గురించి ఏమంటారా అని ఆలోచిస్తున్నాను,” చిరాకెత్తించే చిరునవ్వుతో అన్నది మెబ్బిన్.
మిసెస్ పేకిల్‌టైడ్ ముఖం రంగులు మారింది. “ఎవ్వరూ ఆ మాట నమ్మరు,” అంది బింకంగా.
“లూనా బింబర్టన్ నమ్మొచ్చునేమో,” తాపీగా అన్నది మెబ్బిన్. ఎన్నో రంగులు మారిన మిసెస్ పేకిల్‌టైడ్ ముఖం ఆఖరికి ఒక విధమైన పాలిపోయిన ఆకుపచ్చ రంగు దగ్గర ఆగిపోయింది. “నువ్వు ఆమె దగ్గర అదంతా చెప్పవు కదా!”
నిర్లక్ష్యంగా భుజాలెగరేసింది మెబ్బిన్. “అన్నట్టు, డార్కింగ్ దగ్గర ఒక చిన్న ఇల్లు చూసాను. ఎంత ముద్దుగా వున్నదో! కొనుక్కుంటే బాగుండనిపిస్తుంది నాకు. ఎక్కువ ధర కూడా కాదు, ఆరువందల ఎనభై పౌండ్లు. అయితేనేం, ఇప్పుడు నా దగ్గరంత డబ్బు లేదు.”
లూయిసా మెబ్బిన్ తరవాత కొన్న చిన్న ఇల్లు భలే బాగుంది. చిన్న తోటా, చుట్టూ స్థలం అంతా చూసి ఆమె స్నేహితులు తెగ మెచ్చుకున్నారు. “లూయిసా ఎలా చేస్తుందో కానీ, అన్నీ సాధిస్తుంది,” స్నేహితులంతా ఏకగ్రీవంగా అంగీకరించారు.
మిసెస్ పేకిల్‌టైడ్ ఆ మీదట క్రూరజంతువులని వేటాడటం నుంచి విరమించుకున్నారు. “అబ్బ! అదంతా చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమోయ్,” అని సన్నిహితుల దగ్గర వాపోయారని విన్నవారు చెప్తారు.
(ఆంగ్ల మూలం: Mrs. Packletide’s Tiger)