విచిత్రాశ్వికుడు

అన్నీ మింగిన సముద్రం

అలల చేతులతో

పొట్ట సవరించుకొంటే

ఒడ్డున ఒంటరి కుక్క

ఎవరిని పిలుస్తుంది?

హోరున కురిసే తుఫాను వర్షం

పొగ చిమ్ముతు

వంతెనపై పరిగెత్తే రైలు

నదిలో జాలరి పడవ

ఎవరిని ఆకర్షిస్తుంది?

తెరచాటున థేమ్సు నది

మెరిసే తన

శరీర కాంతులను

కెరటాలుగ

ఎవరికి అర్పిస్తుంది?

చంద్రుని కాటేసే ఉప్పెన

అందరిలో భయోద్వేగం

గ్లాసులలో వంపి

నీ ముందుకు

ఎవరు తెస్తారు?

సుడిగాలీ,అవలాంచీ

తెరచాపా,పొగమంచూ

నీలాకాశం,ఓడస్తంభం

కేకలతో క్రేళ్ళురికే నీళ్ళు

ఎవరిని తలచుకొంటాయి?

రంగుల కళ్ళెం గుప్పెట్లో

భయానక సౌంద

ర్యా న్నారాధించే టర్నర్‌

సముద్ర హృద

యా న్నెరిగిన విచిత్రాశ్వికుడు!


రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...