తప్పక వస్తాను

ఒక్కరోజా పూవును చేతబట్టుకొని

తప్పకవస్తాను నీ చెంతకు

విచారించకు నేస్తం

ఊపిరిని ఏ ఉమ్మెత్తపూవుల వాసనలో కలిపేసి

నీ ఇంటిముందు..ఏ నీపతరుచ్ఛాయలోనో

నిశ్చలంగా నిదురిస్తున్న నీ చెంతకు

ఒక్కరోజా పూవును చేతబట్టుకొని

తప్పకవస్తాను నీ చెంతకు

తలదగ్గరి తలపులదీపం ఆరిపోకముందే

నివాళి పుష్పగుచ్ఛాలు..గుబాళిస్తుండగానే

బలవంతంగానైనా హృదయంలో

అగరొత్తులు వెలిగించుకొని

నీపల్లకీ లేచిపోకముందే..నీహారిక లెత్తేందుకు

మెరుస్తున్న గాజుహృదయపు కుప్పెలో

విషాదం లాంటి..విచారంలాంటి

ఒక్కనవ్వును మోగించుకొంటూ

ఒక్కరోజా పూవును చేతబట్టుకొని

తప్పకవస్తాను నీ చెంతకు

విచారించకు నేస్తం.


రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...