(“ఆకురాలు కాలం” కవయిత్రిగా ప్రపంచ వ్యాప్తమైన అభిమాన పాఠక బృందాన్ని సంపాదించుకున్న సుప్రసిద్ధ రచయిత్రి మహె జబీన్. ఈమధ్య వీరి కవిత్వం మరో మలుపు తిరిగినట్టు అనిపిస్తోంది. కొత్త భావాలు, ఆలోచనలు, ప్రతీకలు కన్పిస్తున్నాయి. ఈమార్గంలోదే ఈ కవిత కూడా.)
మనసు పరివాహకప్రాంతం మీద
అజమాయిషీ నీదే
ఆనకట్ట కట్టి మనస్తాపం కలిగించకు
మనసు లోయలలో దాగిన
జావళిపాటతో గొంతు కలుపు
ఇప్పుడు హృదయం ఇచ్చినందుకు
రేపు స్మృతిగీతం రాయకు
ఇప్పటికిప్పుడు ఒక ప్రేమ కవిత చెప్పు
సమాధి మీద పుష్పగుచ్ఛం వద్దులే
చీరకొంగులో కాసిని పొగడపూలు వేయి
తాజ్‌మహల్‌ప్రేమకానుక వద్దులే
బ్రతుకు బాటలో తోడుగావుండు
అరుంధతి నక్షత్రం సరిగా కనిపించడం లేదు
అబద్ధం చెప్పమని బలవంతం చేయకు
ఏడేడు అడుగులు
జన్మ జన్మల బంధాలు
అందాక ఆగలేను
కాస్త దగ్గరికి జరుగు
ఊహల గవాక్షం దగ్గర గొడవవుతుంది
విస్తరించని నీహారిక
జీవితం సేదతీరుతుంది
ప్రేమ యవనిక కప్పు
దేహం సప్తస్వరాల మోహగీతం
కలిసి శ్రుతి తప్పని రాగమొకటి ఆలపిద్దాం