నేను మాటాడుతుండగానే
నువ్వు మెల్లగా నిద్రలోకి జారుకోవడం చూడ్డం
నాకు చాలా ఇష్టం.
లాంతరు భూతంలా నిద్ర
నువ్వు తలచిందే తడవుగా
నీ ముందు చేతులు కట్టుకుని నిలబడ్డం
తమాషాగా ఉంటుంది.
పసిపిల్లవాడు తన తల్లిని చేరినంత
నిర్భయంగా, నిలకడగా,
నిన్నాశ్రయిస్తుంది నిద్ర.
ఎక్కడ్నించో హఠాత్తుగా వచ్చిన నిద్ర
నీ కళ్ళమీద రెక్క విప్పడం చూడ్డం
నాకు సరదా.
అదే నాకు నిద్రంటేనా
కోర్కెలు వేటాడాలి,
భయాలు వెంటాడాలి,
నాలోకి నేను, నానుంచి నేను
పరుగులెత్తి అలసిపోవాలి.
ఊహల పెనుగాలులకి
గడియలేని తలుపుల్లా రెప్పలు
వందలసార్లు టప టప కొట్టుకోవాలి.
చివరికెప్పుడో అర్థరాత్రికది
కల్లోలిత మనః తీరాల్ని తాకి,
కలల తుఫానుల్ని సృష్టించి,
ఏ తెల్లారి వేళకో చల్లబడాలి.
నిద్ర నాకొక మరణ యాతన.
అనాయాసంగా అది
నిన్నావహించడం చూడ్డం
నాకొక గొప్ప అనుభవం.