ఉదయం

మెత్తని పరుపు. మగత నిద్ర. తునకలుగా కలలు.
కలా? నిజమా? నిద్రలో కూరుకుపోయే మెలకువ.
లే అన్న తలపు. లేవద్దన్న అలుపు. తాళం వేసుకున్న రెప్పలు.

బద్ధకంగా మబ్బులు. మత్తు వదలని చీకటి.
సడి లేని గాలి. స్తబ్దుగా మావులు. కదలని ఊడలు.
పిట్ట నోట చిన్నకూత. ప్రకృతి జోలపాట.

కటిక నేల. చెయ్యి దిండు.
సగం మూసిన కనులు. సగం తెరచిన నోరు.
ఆదమరచిన శరీరం. ఆవులిస్తూ ఆవు.
చెట్టు తొర్రలో కదలని ఉడుత.

తటిల్లుమని ఉదయం. బంగారు తీగలు. వెలుగు జలతారులు.
విడిపడిన రెప్పలు. చెదిరిన మబ్బులు. కొత్త ఉత్సాహం.
ఆవు చుట్టూ గంతులేస్తున్న ఉడుత.