లోతు

లోతులేకపోవటం

క్రమక్రమంగా అలవాటైపోతుంది.

తడిసీ తడవని పాదాలతో

నడక సాగిపోతుంది.

నాలుగో పరిమాణం దాకా సాగిన

ఒకప్పటి ఆలోచన

రెండో పరిమాణం దగ్గరే ఆగిపోతుంది.

కన్నీటికి బరువుంటుందేమోగాని,

పల్చటి నవ్వుకేముంటుంది?

పరిచితమైన ఒక చిరునవ్వుని బ్యాడ్జిలాగా

తగిలించుకోవటం అలవాటైపోతుంది.

పారిజాతంలా రాత్రంతా

కురిసిముంచెత్తటం యిక ఉండదు.

ఏ మునిమాపువేళకో

ఈ మాటల మల్లిచెట్టు

తగుమాత్రంగా పూస్తుంది.

ప్రశ్నలు పాతవే అయినా

ప్రమాదం లేదు.

పాత జవాబులతో సమాధాన పడటంతోనే

పతనం ప్రారంభమౌతుంది.

శీతువులా ఆవరించే

ఈ లోతులేనితనం

అప్పుడప్పుడు సన్నగా కోతపెడుతుంది.