ఈ మధ్య వస్తున్న సినిమాలను చాలా మంది చాలా రకాలుగా విమర్శిస్తున్నా, విడుదలై వస్తున్న సినిమాల సరళి మారలేదు. అటు దర్శక నిర్మాతల, ఇటు నటీనటుల ధోరణిలో కూడా రవ్వంత మంచి మార్పు రాకపోవడం చాలా దురదృష్టకరం, విచారించదగ్గ విషయం కూడా. 50 సంవత్సరాల క్రితం ఒక సినిమా నిర్మించడానికి సంవత్సరాల వ్యవధి చాలేది కాదు. అటువంటిది, ఈనాడు రెండు, మూడు నెలల్లో తయారై సినిమాలు ప్రేక్షకుల్ని హింసిస్తున్నాయి. రాశి పెరిగింది, వాసి తరిగింది. నాసిరకం ‘‘సరుకు’’ దిగుతుంది. అనర్థమైన స్పీడు హెచ్చింది. ఆశించిన నాణ్యత లోపించింది. మూడు గంటలు కూర్చొని సినిమా చూసే ఓపిక, తీరిక, సహనం నేటి ప్రేక్షకుల్లో లేవు. ఇది గమనించే కాబోలు నేటి సినిమాలు నిడివి తగ్గి పోయింది. 2 గంటల వ్యవధిలోనే చాలా సినిమాలు ‘‘శుభం’’ పలుకుతున్నాయి. ఒక రకంగా ఇదిమాత్రం శ్రేయోదాయకమైన పరిణామమే.
మధురమైన, మనోహరమైన, ఆహ్లాదకరమైన సన్నివేశాలు మెచ్చుకుందామన్నా నేటి సినిమాల్లో మచ్చుకైనా కనిపించడం లేదు. రెండర్థాల మాటలు, పాటలు బాగా చోటుచేసుకుంటున్నాయి. సెక్స్, బూతు సమ్మిళితమై స్వైర విహారం చేస్తున్నాయి. అసభ్యత, అశ్లీలత హద్దు మీరిపోయాయి. మాంసం తింటున్నామని దుమ్ములు మెడకు కట్టుకుంటామా! ఏదైనా హద్దులో ఉంటేనే ముద్దుగా, అందంగా, మర్యాదగా ఉంటుంది. సహజమైన, స్వచ్ఛమైన ప్రజాజీవనం, తెలుగుదనం నేటి సిన్మాలలో కన్పించడం లేదు. నటీనటుల నటనలో జీవం కానరాదు. సన్నివేశాలలో సహజత్వం లోపించింది. హీరో, హీరోయిన్లు వెకిలి వేషాలతో వట్టి పోకిరీ మనుషుల్లా దర్శనమిస్తున్నారు. నేటి హీరో, హీరోయిన్ల స్టెప్సు, డ్యాన్సు చూస్తుంటే హైస్కూల్లో చదివే రోజుల్లో డ్రిల్లు మాష్టారు చెప్పే డ్రిల్లు జ్ఞాపకం వస్తుంది. యాభై, అరవైమంది విద్యార్థులు డ్రిల్లు చేస్తున్నట్టు నేటి డ్యూయట్లలో షాట్లు ఫీట్లు చేస్తున్నాయి!
హృదయానికి, మనసుకు సంబంధించిన పవిత్రమైన ప్రేమ ఈనాడు బజారునపడి చౌకబారు ‘‘సరుకు’’ అయింది. పదుగురి మధ్య పడి తన మర్యాద, తన స్థాయిని మంట కలుపుకుంటున్నది. ప్రేమ స్వరూపం మారిపోయింది. అసలు ‘‘ప్రేమ’’ అంటే అర్థం లేకుండా పోయింది! ప్రేమ కళేబరం కాలిపోయి కమిలిపోయింది. వికృతరూపం దాల్చి ప్రేక్షకులకు అసహ్యాన్ని కలిగిస్తున్నది. వయసులో ఉన్న ఏభై, అరవై మంది ఆడ, మగవాళ్ళ మధ్య సిగ్గు, లజ్జ లేకుండా, మర్యాదను చూడకుండా హీరో, హీరోయిన్లు డ్యూయెట్లు పాడుతున్నారు. ఇక వెనుకనున్న పడుచు అమ్మాయిలు తమ ‘‘అందాల్ని’’ ఆడిస్తూ గెంతుతున్నారు. సినిమాలు మారుతున్నాయి. నటీనటులు మారుతున్నారు. కానీ, పాటల్లో మాత్రం ఏమీ మార్పు కనిపించలేదు. పాటల సన్నివేశాల్లో అవే గంతులు … అవే అరుపులు … అవే సర్కస్ ఫీట్లు … అదే గోల …! పాటల బాణీల సృజనలో తేనెలొలుకు తెలుగు భాషను ఖూనీ చేస్తున్నారు. పాటల్లో విపరీతమైన స్పీడు, ప్రేక్షకుల నేత్రాల ముందు రెప్పపాటు కాలమైనా నిలబడకుండా పాడుతూ పరుగెత్తే నాయికా, నాయికుల్ని చూస్తుంటే ఇక రసస్వాదనకు అవకాశమేదీ? లాంగ్ షాట్‌లోనే సుమారుగా పాటంతా చిత్రీకరిస్తున్నారు. ఆ పాటలు వింటుంటే నేపధ్య గాయకులే పాడుతున్నట్టు ఉంటుంది కానీ, తెరమీదున్న హీరో, హీరోయిన్లు పాడుతున్నట్టు అనిపించదు.
పాటల సన్నివేశాల్లో జుగుప్సాకరమైన పట్టువదలని బిగి కౌగిలింతలు కోకొల్లలు. పాత సినిమాల్లో హీరో గుండెమీద హీరోయిన్ వాలిపోయేది. ఇప్పుడీ సన్నివేశం తారుమారయింది. హీరోయిన్ వక్షోజాల మధ్య, మీద కూడా హీరో తల ఆన్చి పరవశించిపోతున్నాడు. హీరోయిన్ తాలూకు ప్రతీ అవయవాన్ని హీరో ముద్దుపెడతాడు. హీరోయిన్ బొడ్డు దగ్గర పొత్తి కడుపు పిసుకుతూ, ఆమె పిరుదులు చరుస్తూ, లయాత్మకంగా దరువులు వేస్తూ, తొడలను పైకెత్తుతూ ‘‘ప్రేమ’’ (శృంగారాన్ని) ఒలకబోస్తాడు. తన బొడ్డు సుడుల లోతుల్ని గూడా బిడియపడకుండా, హీరోయిన్ కెమేరా కంటికి ఆనందంగా చూపిస్తూ ‘‘పైకి’’ ఎదిగిపొతున్నానని భ్రమసి మురిసిపోతుంది. డబ్బుకు అమ్ముడుపోయి విలువైన వలువల్ని హీరోయిన్లు విడిచిపెట్టేస్తున్నారు. ఈ చౌకబారు ‘‘ప్రదర్శన’’తో ‘‘తానెంత చులకనై పొతున్నాను’’ అనేది హీరోయిన్ గ్రహించడం లేదు. ఎంత బరితెగించిన ఆడదైనా నడివీధిలో పదిమంది చూస్తుండగా తన ప్రియుడికి కన్నుకొట్టదు, సైగచెయ్యదు, ఒడిలో వచ్చి వాలిపోదు. కానీ మన తెలుగు సినిమాల్లో హీరోహీరోయిన్లు సిగ్గు, లజ్జ వదిలేసి బజారునపడి ఎలా గెంతులు వేస్తున్నారో చూస్తుంటే అసహ్యమేస్తుంది. ప్రజల ఆనందంకోసం ఎలాంటి సన్నివేశాలైనా చిత్రీకరిస్తాం – అని అంటే కుదరదు. కారణమేమంటే, సినిమా చూసేది ప్రజలు, దాని ప్రభావం ప్రజలమీద తప్పక పడుతుంది. ఇక, కొందరు హీరోలు హీరోయిన్‌ని కౌగిలించుకున్న సమయంలో ప్రేక్షకుల వైపు చూసి నవ్వుతారు, కన్ను కొడుతుంటారు. దీని అర్థం ఏమిటో ఎవ్వరికీ తెలియదు! ఈ ‘‘నటన’’ అసహ్యంగానూ, ఎబ్బెట్టుగానూ ఉంటుంది. నిజం చెప్పాలంటే ఇది చాలా అనారోగ్యకరమైన ధోరణే…! ప్రజా జీవితాన్ని సహజంగా ఉండేలా చిత్రీకరించాలి. లేనిపోని వికారాలు, వికృతాలు చూపిస్తే ప్రజలు పెడదారిని పడతారు. లక్షలు ఖర్చుపెట్టి సినిమా తీస్తున్నాం అంటే తిరిగి లక్షలు, లక్షలు సంపాదించడానికేనా? అందులో లక్ష్యం ఏదీ ఉండదా? ప్రయోజనం చూడరా? ఆశయం సిద్ధిస్తుందా – అనేది విచారించరా? ఈనాడు ఈ విషయాలేవీ ఆలోచిస్తున్నట్టు కనబడదు. కేవలం ధనార్జన తప్ప మరో ధ్యేయంలేదు ఈనాటి నటీనటులకు, దర్శక నిర్మాతలకు కూడా.
ఇటీవల హీరోయిన్స్ పైట మాటే మరిచిపోయారు. తన స్తనములతో హీరోని ఢీకొని అతణ్ణి గుద్దే స్థాయికి ఎదిగింది నేటి హీరోయిన్. చక్కని సంప్రదాయం, గౌరవ మర్యాదలు గల సంసారిణిలా కాకుండా, బరి తెగించిపోయి నేటి హీరోయిన్ నటన (!) ప్రదర్శిస్తుంది. ఎక్స్‌పోజింగ్‌లో మంచి ఎక్స్‌పర్ట్‌లయ్యారు మన తెలుగు హీరోయిన్స్. పాటల సన్నివేశాల్లో వస్తాదుల్లా కుస్తీ పడుతూ హీరో హీరోయిన్లు నేల మీద పడి పొర్లుతూ, బురదలో పడి దొర్లుతున్నారు. నేటి హీరోయిన్స్ తాలూకు నటన (ఎక్స్‌పోజింగ్) చూస్తే జ్యోతిలక్ష్మి, జయమాలిని కూడా ముక్కుమీద వేలు వేసుకోకపోరు! అయితే, జయమాలిని, జ్యోతిలక్ష్మి లేకపోయినా ఫరవాలేదు. వారులేని ‘‘లోటు’’ తీరుస్తున్నారు నేటి హీరోయిన్స్ …! చాలా సినిమాల్లో ఇలాంటి అసందర్భమైన, అసహజమయిన సన్నివేశాలే చోటుచేసుకుంటున్నాయి. వీటిలో తెలుగు జనజీవనం మచ్చుకైనా ప్రతిబింబించడం లేదు. చెడుమార్గాన పయనించేందుకు ప్రేరణ కలిగిస్తున్న నేటి సినిమాలు, సమాజానికి ఆరోగ్యాన్ని ఎలా కలిగిస్తాయి!
ఇక ప్రేమికులు కలుసుకొనే నాటి పార్కులు, బీచ్‌లు పాతబడిపోయాయి. ఈనాడు ఎటుచూసినా సినిమాల్లో ప్రేమ దృశ్యాలే దర్శనమిస్తున్నాయి. రిక్షాలో ప్రేమ, ఆటోలో ప్రేమ, బ్రిడ్జి మీద ప్రేమ, బ్రిడ్జి కింద ప్రేమ, కాలేజీలో ప్రేమ, చివరకు కాఫీ హోటల్లోనూ ప్రేమే! ఒకే ఒక డ్యూయెట్‌లో భూగోళం అంతా తిరిగొచ్చేస్తున్నారు నేటి ప్రేమికులు! ఒక పాట చిత్రీకరణలో 10, 15 డ్రస్సులు మారుస్తారు. మరి ఈ డ్రస్సులు ఎక్కడ నుంచి వస్తాయని అడగొద్దు. ఇలా డ్రస్సులు మారుస్తుంటే అవి వాళ్ళ హుందాతనాన్ని హతమార్చి, పోకిరీతనాన్ని బయటపెడుతున్నాయి. మరో విషయం, ఒక పాటను పలు ప్రదేశాల్లో చిత్రీకరించి దాన్ని పది, పన్నెండు ముక్కలుచేసి, వాటిని ముందూ వెనుకా రెప్పపాటు కాలంలో రెండేసి ముక్కల్ని కంటిన్యువిటీ లేకుండా ప్రదర్శిస్తున్నారు. ఇదేమి టెక్నిక్? ఈ పద్ధతివల్ల ప్రేక్షకుల బుర్ర పాడవుతుంది, చికాకు కలుగుతుంది. ఇలాంటి పాటలు వినోదాన్ని అందించడం మాట అటుంచీ, ఎంతో ఇబ్బంది మాత్రం కలిగిస్తున్నాయి ప్రేక్షకులకు!
లుంగీలు పైకి ఎత్తికట్టి, లోనున్న డ్రాయర్లు కనిపిస్తుండగా డ్యూయెట్స్ పాడే హీరోలు, ఇద్దరు హీరోయిన్స్ మీద ఎక్కి కూర్చొని తైతక్కలాడే యువ హీరోలు కూడా నేడు మనకు కనిపిస్తున్నారు. ఓ సినిమాలో గోచీతో ఓ నటుడు ప్రత్యక్షమవుతాడు. మరో సినిమాలో ఓ నటుడు దిగంబరుడుగా దర్శనమిస్తుంటే, ఓ హాస్యనటుడు ఆయన్ని చూసి ఎగతాళి చేస్తాడు. మరో సినిమాలో ఓ యువనటుడు ప్రక్కనే ప్రియురాలు ఉంటుండగా మూత్ర విసర్జన చేస్తాడు. ఇదెంత అశ్లీలంగా ఉందో గమనించే వారేరీ? ఇలా చెప్పుకుంటూ పోతే సమయమే చాలదు! ఈ చౌకబారు సన్నివేశాలు సినిమాలో అవసరమా? ఇదే హాస్యమా? హాస్యం అంటే ఏమిటో నేటి హాస్యనటులకు తెలుసునా? హాస్యం గురించి చెప్తూ శ్రీ కె.ఎన్.టి.శాస్త్రిగారు ‘‘అలనాటి చలనచిత్రం’’ గ్రంథంలో (111 పేజీ) ‘‘చక్రపాణి’’ వంటి చిత్రాలను గుర్తు చేసుకున్నప్పుడల్లా ఆ చిత్రాలలో హాస్యం ఎటువంటి అశ్లీలతకూ తావీయక హాస్యరసాన్ని అపహాస్యం పాలుచేయక జాగ్రత్త వహించాయన్నది స్పష్టమవుతుంది. నేటి చిత్రాలలోని హాస్యం గురించి వేరే చెప్పనవసరం లేదు. అశ్లీలత, వెకిలి చేష్టలే నేటి హాస్యంగా చలామణీ అవుతున్నాయి. హాస్యరచన చేయడంలో ఆ రెంటినీ రచయితలు ఎన్నుకుంటున్నారు. వారొక్కసారి ‘‘చక్రపాణి’’, ‘‘వరుడు కావాలి’’ చిత్రాలను చూడగలిగితే హాస్యమంటే ఏమిటో తెలుసుకోవచ్చును అని తెలియజేశారు.
అర్థంలేని వెర్రి అరుపులు, పిచ్చికేకలు, బూతు పదాలతో ‘‘రయ్ … రయ్’’మంటూ యమస్పీడుతో, రసాస్వాదనకు అవకాశం లేకుండా పాటలు పాడుతుంటే, హౌస్‌ఫుల్లయిన హాల్లో ఈలల గోలలు హోరెత్తిస్తున్నాయి. ఇక పాటలు వింటుంటే ఇవి ‘‘తెలుగు పాటలేనా…!’’, ‘‘తెలుగు భాషేనా…!’’ అంటూ ఆశ్చర్యపోవలసిందే! భావం ఎలాగూ ఉండదు, భాషకూడా అర్థం కావడం లేదు. డ్రస్ విషయానికి వస్తే, ముఖ్యంగా హీరోయిన్లు ధరిస్తున్న దుస్తులు చాలా అభ్యంతరకరంగా ఉంటున్నాయి. జాకెట్‌కు బదులు ఓ చిన్న గుడ్డను గుండెమీద తాళ్ళతో కట్టుకుంటున్నారు! దేశం నిండా బట్టల షాపులకు కొదువలేదు. మరి హీరోయిన్స్‌కే బట్టలకొరత ఎందుకు వస్తుందో …?! పిల్లల నుంచీ పెద్దవాళ్ళ వరకూ చెప్పే డైలాగులు చాలా ఎబ్బెట్టుగా, అసభ్యంగా ఉంటున్నాయి.
‘‘ఆడవాళ్ళ బొడ్డుమీద అడ్డమైన వస్తువులు విసరడం ఆంధ్రదేశపు సంస్కృతిగా తేల్చేశారు సినిమా నిర్మాతలు’’. (ఏప్రిల్ 1977 ‘‘ఆహ్వానం’’ – 89 పేజీ) ఈ వికృత పోకడలతో, విపరీత ధోరణులతో గబ్బు కంపుకడుతున్న తెలుగు సినిమా గమ్యం అగమ్యమయింది. అగోచరమయింది. సినీరంగ ప్రముఖులకు ఇప్పుడీ విషయం బుర్రకు ఎక్కడం లేదు. ఈ విషయాలేవీ వాళ్ళు ఆలోచించడం లేదు. మితిమీరిన సెక్స్, హింస, హత్యలు, రక్తపాతాలతో ప్రేక్షకులు హడలిపోతున్నారు. విసిగిపోతున్నారు. కొందరయితే హింస, రక్తపాతం చూసి గుండెదడకు గురవుతున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని సంఘ విద్రోహచర్యలు జరుపుతూ, రౌడీలుగా, గూండాలుగా బ్రతుకు సాగించే వారిని హీరోలుగా చిత్రిస్తున్నారు. ఎవరు ఎన్ని ఎక్కువ ఘోరాలు, నేరాలు చేస్తే అంత పేరు ప్రఖ్యాతులు వస్తాయనే అభిప్రాయం ప్రజలకు కలుగజేస్తున్నాయి నేటి సినిమాలు. ఈ సినిమాల వల్ల సామాజిక ప్రయోజనమేమీ కలుగటంలేదు. అంతేకాకుండా, ప్రజల్లో ఏమాత్రం చైతన్యం ఇవి తీసుకురావడం లేదు. ఎందుచేతనంటే, ఇవి సహజత్వాన్ని కోల్పోయి, పటుత్వం లేనివై, గుల్లగా తయారై రోడ్డు మీదికొస్తున్నాయి.
కథా బలంలేని నేటి సినిమాల్లో సూపర్ స్థాయిలో ‘‘సెక్స్’’ని జొప్పించి డబ్బులు చేసుకుంటున్నారు. ప్రజల నుంచి దండీగా డబ్బులు దండుకంటున్నారే తప్ప, ప్రజలకు చక్కని సందేశాన్ని తాము తీస్తున్న సినిమాలద్వారా అందివ్వ లేకపోతున్నారు. తాము నిర్మించే సినిమాలు ఎంతవరకు జీవిస్తాయి? వాటి ప్రయోజనమేమిటి? మొదలైన విషయాలు దర్శక, నిర్మాతలు ఆలోచించడం లేదా? తమ బాధ్యతల్ని విస్మరించిన దర్శక నిర్మాతలను, నటీనటుల్ని, సినీకవుల్ని, రచయితల్ని రాబోయే తరాల ప్రజలెలా క్షమిస్తారో అర్థం కావడంలేదు. ఔచిత్యం లేని పేర్లతో, కథాబలం లేని సామాజిక ప్రయోజనం లేని సినిమాలు విడుదలై ప్రజల్ని హింసిస్తున్నాయంటే అతిశయోక్తి కాదేమో! చివరకు ‘‘సి’’ – ‘‘నీ’’ – ‘‘మా’’ అంటే ‘‘సిగ్గు’’, ‘‘నీతి’’, ‘‘మానం’’ – లేనిదని భావించవలసి వస్తోంది.
ప్రజలాదరిస్తున్నారు కాబట్టే ఇలాంటి సినిమాలు తీస్తున్నామని చాలా మంది దర్శకులు, నిర్మాతలు సున్నితంగా సూక్తులు వల్లిస్తున్నారు. చెత్త సినిమాలు వస్తే, ప్రజలే వాటిని ప్రతిఘటించాలని కొందరు ప్రముఖ నటులు శ్రీరంగనీతులు చెప్తున్నారు. సెన్సారుచేసి ప్రభుత్వం వాటికి అనుమతిచ్చి రిలీజ్‌కు దారిచూపిస్తుంది. ‘‘మనకెందుకులే’’ అని ప్రజలు ఈ విషయంలో ఉపేక్ష వహిస్తున్నారు. అనవసర విషయమని శ్రద్ధ చూపడం లేదు. అయితే, చెత్త సినిమాలను ప్రజలు బహిష్కరించవచ్చు. ముఖ్యంగా విద్యావంతులైన యువతీ యువకులు ఆదర్శంగా నిలిచి ఈ మార్గంలో ముందంజ వేయాలి. ఏ ఇంటి కా ఇల్లు చెత్త సినిమాలను బహిష్కరిస్తే కొంతమేరకు పరిష్కారం కాగలదని నా విశ్వాసం. నిర్మాతలకు కూడా కనువిప్పు కలుగుతుంది. ‘‘చెత్త సినిమాల్లో మేము నటించం’’ అని నటీనటులు దృఢమైన నిర్ణయం తీసుకోవాలి. అభిమాన సంఘాల వారు కూడా తమ అభిమాన నటీనటులకు చెత్త సినిమాల్లో నటించవద్దని గట్టిగా చెప్పాలి. బూతుమాటలు, బూతుపాటలు రాసే రచయితల్ని, కవుల్ని సినీరంగం నుంచి బహిష్కరించాలి. గాయనీ, గాయకులు కూడా బూతు పాటలు పాడడం మానివేయాలి.