చలనచిత్ర సంగీత సాహిత్య పోకడలు

[ఈ వ్యాసం విజయచిత్ర పత్రిక వింశతి వత్సర విశేష సంచిక (1986)లో మొదటిసారిగా ప్రచురించబడింది. కొద్ది నిడివిలోనే భారతీయ సినిమా సంగీత, సాహిత్య పోకడలనన్నింటినీ ప్రస్తావిస్తూ రాసిన మంచి పరిచయ వ్యాసం. మీకు కూడా నచ్చుతుందనే ఆశిస్తాను. – పరుచూరి శ్రీనివాస్.]

సంగీతం జీవనసుధాసారం. కళలలో సంగీతానిది నిరుపమాద్వితీయ స్థానం. ఆది శబ్దమైన ఓంకారం క్రమక్రమంగా విశ్రమించి, విశ్వరూపం దాల్చి నేడు అగణితవిధ సంగీతంగా రూపొందింది.

సంగీతం, గాత్ర సంగీతం (గానం) గానూ, వాద్య సంగీతం (వాదనం) గానూ రెండు ప్రత్యేకతలతో విలసిల్లుతోంది. వాద్యాలలో రాగవాద్యాలూ, తాళవాద్యాలూ రెండు రకాలు. మొదట ప్రతివాద్యం ప్రత్యేకంగా ప్రయోగింపబడి, పిదప రెండు, మూడు, నాల్గు వాద్యాలతోను, తదుపరి బహువాద్య సమ్మేళనం వలననూ ఆర్కెష్ట్రాగా పేర్కొనబడింది. వాద్య సంగీతం, గాత్ర సంగీతానికి సహాయకరంగా కూడా ప్రయోగింపబడసాగింది.

శబ్దం ఇలా విజృంభించగా వెలుతురు మరోలా విశ్వరూపం దాల్చింది. వెలుగునీడల కలయికలతో పలు రంగాలని కూడా జోడించి, మూకీగా ప్రారంభమైన చలన చిత్రయుగం ఈనాడూ టాకీగా బహుజనాదరణ పొందుతోంది. మాటలేని చిత్రాలు మాటాడి, ఆటాడి, ఈనాడు పాట పాడుతూ గొప్ప సాధనలు కావిస్తున్నాయి. ఈనాడు సినిమా, ఆహార వస్త్రాలకన్నా అధిక ప్రాముఖ్యం గడించుకున్న వైనం అత్యాశ్చర్యజనకం.

రికార్డింగు విధానాలూ, ప్లేబాక్ సింగింగ్ టెక్నిక్కులూ వైశిష్ట్యం సంపాదించుకున్న ఈ రోజుల్లో సంగీతం విభిన్న విశిష్ట పరిణామాలని సంతరించుకుంది. మొదట్లో నాటకాలలో పాడే గాయక గాయనీమణుల కంఠస్వరం థియేటర్లో కూర్చున్న ప్రతీ ప్రేక్షక శ్రోతకి వినిపించే విధాన ఖంగున మోగే ఘంటలా వుంటేనే పేరు గడించగలిగేది. కానీ, మైకులూ, లౌడ్ స్పీకర్లూ, ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంటులూ పాపులర్ అయినకొద్దీ కంఠస్వరం చాలా మెత్తగా వున్నా విజ్ఞానదత్త విలక్షణ పరికరాల సహాయంతో బహుగుణీకృతమైన శబ్ద పరిమాణాన్ని సాధించగలుగుతోంది. చీమ చిటుక్కుమన్నా, ఏనుగు ఘీంకారంలాగ, సింహ గర్జనలాగ వినిపించగల వింత పరికరాలు నేటి చలనచిత్ర సంగీతాన్ని బృహత్పరిణామాలకి గురిచేశాయి. చిత్రాలలో పాటలలాగే, సన్నివేశాలకి తగిన నేపథ్య సంగీతం కూడా ప్రాధాన్యాన్ని గడించుకుని, ప్రత్యేకంగా గుర్తింపబడి ప్రశంసించబడే స్థాయికి ఎదిగింది. మొదట్లో తక్కువ వాద్యాలతో రంజింపగలిగిన సంగీతం ఇప్పట్లో వందల వాద్యాల సంరంభంతో ప్రబలమై అందర్నీ దిగ్భ్రాంతుల్ని కావిస్తోంది.

ఈనాటికే సప్తస్వర సంగీతంలో కోట్ల రచనలు రేడియో, టి.వి. కార్యక్రమంలోను, సినిమాలలోనూ ప్రచారం పొందాయి. పాతరాగాలలో కొత్త పోకడలెన్నో వచ్చాయి. వస్తున్నాయి. వస్తూనే వుంటాయి. కానీ, సంగీతానికి ముఖ్య ప్రాణం అయిన మాధుర్యం అనేకతః తగ్గిందనే అనాలి. పలుమార్లు మోనోటనీ అనిపించడం కూడా కద్దు.

అంగాలొకేలాటివైనా అంతులేని భిన్న వర్ణచ్చాయభేదాలు మానవ శరీరంలో వున్నట్లే, గాత్ర (Voice) వాద్య శరీరాలలో కూడా లెక్కకందని విభిన్న వైశిష్ట్యాలు సమకూరుతూనే వున్నాయి. కాని మానవ మానసిక శారీరక బలానికి ఎప్పుడో ఒకప్పుడూ, ఎక్కడో ఒకక్కడ హద్దు ఉండడంవల్ల, ఎన్నెన్నో రిపిటీషన్లు కూడా అనివార్యాలౌతున్నాయి ఆలోచితంగానూ, అనాలోచితంగానూ మూకీ చిత్ర యుగం ముగిసి, టాకీ చిత్రయుగం ప్రారంభమైన ప్రధమ దశలో చలన చిత్రాలలో శాస్త్రీయ సంగీత రచనలు పుష్కలంగా లభించేవి.

అప్పట్లో బాగా పాడగలవారే నాయికా నాయకులుగా పేరుపొంది నిలిచి వెలుగొందేవారు. కానీ, ప్లేబాకు పద్ధతి వచ్చిన పిమ్మట పాడలేని నటీనటులకి, నటన అధికంగా చేతకాకున్నా గాయనీ గాయకుల గాత్ర ఋణం లభించడం మొదలవడవల్ల చాలా మార్పులు కలిగాయి. చిత్ర సంగీతంలో అప్పటికీ మొదట్లో సైగల్, కె.సి.డే, పంకజ్ మల్లిక్ వంటి గాయకులు కొందరు నటిస్తూ పాడేవారు. హిందీ చిత్రాలలో సైగల్ మేజిక్ వాయిస్ ద్వారా ఇటీవల బహుళ ప్రచారం గడించుకున్న గజల్సు ఆనాడే చాలా పాప్యులర్ హిట్స్ అయినాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాలలో కూడా గాయనీ గాయకులైన విద్వన్మణులు నటీనటులుగా అభ్యున్నతి పొందేవారు. నాగయ్య, భానుమతి, ఎస్. వరలక్ష్మి, రఘురామయ్య, ఎం.ఎల్. వసంతకుమారి, ఎం.ఎస్. సుబ్బలక్ష్మి, డి.కె. పట్టమ్మాళ్, ఎం.కె. త్యాగరాజ భాగవతార్, టి.ఆర్. మహాలింగం, పి.యు. చిన్నప్ప భాగవతార్, హొన్నప్ప భాగవతార్, జి.ఎన్. బాలసుబ్రహ్మణ్యం మొదలైన పలు విద్వాంసులు, సహజ గానపారీణులు, శాస్త్రీయ, లలిత శాస్త్రీయ పద్ధతులలో తమ సుమధుర గానంతో చిత్ర ప్రేక్షక శ్రోతల్ని రంజింపజేసేవారు. అప్పట్లో ముఖ్యంగా మొదటి రాత్రి సన్నివేశంలో కూడా తమిళ చిత్రాలలో కర్ణాటక సంగీత బాణీలనే ప్రవేశపెట్టేవారు.

జి. రామనాధ్, ఆర్. సుదర్శన్, జ్ణానమణి, ఈమని శంకరశాస్త్రి మున్నగు సంగీత దర్శకులు ఎక్కువగా కర్ణాటక శాస్త్రీయ సంగీతం పైనే ఆధారపడి మట్లు కట్టేవారు. ఆ కాలంలో బాణీలు బహుళ ప్రచారంలో వుంటూ వుండేవి. హిందీలో నౌషాద్, తెలుగు, తమిళాలలో సి.ఆర్. సుబ్బరామన్, ఎం.ఎస్. విశ్వనాధన్, రామ్మూర్తి, రాజేశ్వరరావు, గాలిపెంచల, పెండ్యాల, సుసర్ల, ఆదినారాయణరావు, అశ్వత్థామ, చలపతిరావు, మొదలైనవారి రాక చలన చిత్ర సంగీత గీత పద్ధతిలో పలు మార్పులు తీసుకువచ్చింది. శంకర్ జైకిషన్, సి. రామచంద్ర, ఎస్.డి. బర్మన్, మదన్ మోహన్, రోషన్ హిందీలో తమ బాణీలలో నౌషాద్ బాణీకి మరికొన్ని విలక్షణ పద్ధతులు జోడించి, పంజాబీ, ఢోలక్, జాజ్, ట్విస్ట్ వగైరా విధానాలవలంబించి కొన్ని కొత్తదనాలు తీసుకొచ్చారు. ఓ.పి. నయ్యర్ కొన్ని ఏళ్ళు తనదైన బాణీలో చిత్ర సంగీతాన్ని మలచేవారు. హేమంత్ కుమార్‌ది గాయనశైలి.

నౌషాద్ ముందు యుగంలో ఖేంచంద్ ప్రకాశ్, అనిల్ బిశ్వాస్, పండిట్ కృష్ణారావు, వసంతదేశాయ్ వంటివారు తమదైన ఒక బాణీని ప్రత్యేకించుకున్నారు. శాస్త్రీయ సంగీతానికే అధిక ప్రాధాన్యతనిస్తూ నౌషాద్ పంజాబీ డోల్‌కీ, అరబిక్ పర్షియన్ బాణీలకీ, అవసరమైనప్పుడల్లా పాశ్చాత్య సంగీతానికీ కొంచెం కొంచెంగా చోటిస్తూ భారతీయ చిత్ర సంగీతానికి మరో ప్రత్యేకత కలిగించారు. దానికి మరి కొన్ని మెరుగులు దిద్దినవారు సి. రామచంద్ర, శంకర్ జైకిషన్, ఎస్.డి. బర్మన్‌లు. రోషన్ భజన్ గీతాలకి పేరు గడిస్తే మదన్‌మోహన్ గజల్ శైలికి ప్రాముఖ్యత నిచ్చేవారు. సౌత్‌లో చంద్రలేఖతో అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన డ్రమ్ డాన్స్ వగైరా బాణీలు ప్రవేశపెట్టి పాప్యులారిటీ గడించినవారు రాజేశ్వరరావు. క్రమేపీ పలువురు ప్రముఖ సంగీత దర్శకులు చిత్రరంగానికి సేవజేశారు.

మొదట స్లోటెంపోలో సాగిన సంగీతం ఫాస్టై మధ్యలో, ఈనాడు సూపర్ ఫాస్టై గంతులూ, చిందులూ వేస్తోంది. ఎంతటి ఫాస్టు స్పీడైనా చివరికి స్లో కాకతప్పదు. హెచ్చు తగ్గులు, తగ్గు హెచ్చులై పరిణామం పొంది తీరతాయి. ఓర్పుతో తిలకిస్తుంటే మార్పు తూర్పున ఉదయిస్తూనే వుంటుంది. దేశకాలపరిస్థితుల ప్రభావం సంస్కృతిపైనా తద్వారా కళలపైనా అనివార్యం.

తెలుగు చిత్రాల సంగీతంపైనా సాహిత్యంపైనా ఆది నుండి అనేక విధాల ప్రభావాల కారణంగా, ఎన్నెన్నో బృహత్ పరిణామాలు సంభవించాయి. కొత్తలో తెలుగు పాటల వరసలు ఎక్కువగా మరాఠీ బాణీలని అనుసరించేవి. అభంగులూ, లావణీలూ, భక్తిగీత పద్ధతులూ మరాఠీ సంగీతంలో ప్రాముఖ్యత వహించినవి. ఒక ప్రత్యేకమైన సంగతిని గాని, బిరకాని గాని, వినగానే అది మరాఠీ బాణీ అని సుళువుగా చెప్పేటంత వ్యక్తిత్వం గలవి ఆ మరాఠీ బాణీలు. కాలక్రమేణా తెలుగు బాణీలపై బెంగాలీ పద్ధతుల ప్రభావం కూడా పడింది. కె.సి. డే, పంకజ్ మల్లిక్, సైగల్, అనిల్ బిశ్వాస్ మున్నగువారి సంగీత రచనలలోనూ, గానంలోనూ, అలా అలా పంజాబీ, గుజరాతీ బాణీలూ, పర్షియన్ అరబిక్ పద్ధతులూ కూడా చోటు చేసుకున్నాయి. వెరైటీ కోసం మానవుడికి గల సహజ కాంక్షవలన మొత్తం మీద దక్షిణ భరత చలన చిత్ర సంగీతానిపై ఉత్తర భారత సంగీత పద్ధతుల ప్రభావం కొద్దో గొప్పో పడుతూనే వుండేది. సన్నివేశాలని అనుసరించి చలన చిత్రాలలో ఖవాలీ పాటలూ, గజల్ వరసలూ ప్రాబల్యం గడించున్నాయి. దేవులపల్లి, దాశరధి, నారాయణ రెడ్డి, ఆరుద్ర మున్నగు వారు తమ రచనలలో ఉరుదూ ఫణితులని అవసరాన్ని బట్టి ప్రయోగించేవారు. సీనియర్ సముద్రాల అంజలీ పిక్చర్స్‌వారి అనార్కలీ చిత్రానికై పాటలు రాస్తున్న సందర్భాన ఒక కాగితంపైన ప్యార్, బేజార్, కైజార్ లాంటి కాఫియా (ప్రాస) పదాలని ముందుగా ఎన్నుకుని, వాటిని తమ రచనలో చక్కగా పొందికగా సముచితంగా పొదిగేవారు.

బ్రిటీష్ సామ్రాజ్యపాలన సమయాన ఎన్నో ఆంగ్లపదాలు ఆయా ప్రాంతీయ భాషల పదాలలో యధాతథంగా చోటుచేసుకుని ఆయా భాషలకి చెందిన పదాలలాగే ఈనాటికి చెలామణి అవుతూ వుండడం రసజ్ఞులు గమనిస్తూనే వున్నారు. ఓ డియర్, వై ఫియర్ కం నియర్‌ లాంటి రైమ్స్ అన్ని భారతీయ భాషా చిత్రాల గీతికలోనూ వాడబడడం పరిపాటి అయిపోయింది. సంగీతంలో కూడా జాజ్, రాకన్‌రోల్, ట్విస్ట్ వంటి స్టైల్సు బలం పుంజుకుని ఆబాలగోపాలాన్ని ఊపి ఊపి వదిలాయి. ప్రస్తుతం వాటన్నిటినీ మించి వూపుతున్న స్టైలు ‘డిస్కో.’ ఇలా, ఏదో చిన్న చిన్న భిన్న పరిణామాలతో చలనచిత్ర సంగీతం సాహిత్యం తమ రూపరేఖా లావణ్యాలకి మెరుగులు దిద్దుకుంటున్నాయి. కాని ఈనాడు చిత్రగీతాలు, బాణీలలో వాద్య సంగీతానికి ప్రాధాన్య అధికమైన కారణాన ట్యూన్లు బిట్లు బిట్లుగా సమకూర్చబడడం వలన చిన్న చిన్న విడి విడి పదాలకి మాత్రమే చోటుండడం వలన భావాలని అధికంగా చిత్రించేందుకు వీలు చిక్కడం లేదు. మామూలుగా మాటాడుకునే మాటలే పాటలుగా ప్రయోగించడం తప్పనిసరి అవుతోంది. దానికి తోడు హాలు దద్దరిల్లే సౌండ్ సిస్టమ్స్ ప్రబలమయ్యేసరికి పాటలో వున్న నాలుగయిదు పదాలు కూడా శబ్ద ఘోషలో మునిగిపోతున్నాయి. అత్యధిక శబ్దాడంబరం వలన గుండెలు దడదడలాడి భయాక్రాంతులౌతున్న వైనం ఆశ్చర్యకరం. కాలచక్రభ్రమణంలో మళ్ళీ మాధుర్య ప్రధాన సంగీతయుగం రావడం ఇప్పుడెంతయినా అవసరం.