నేటి సినిమాలలో వికృత పోకడలు – విపరీత ధోరణులు

ఈ మధ్య వస్తున్న సినిమాలను చాలా మంది చాలా రకాలుగా విమర్శిస్తున్నా, విడుదలై వస్తున్న సినిమాల సరళి మారలేదు. అటు దర్శక నిర్మాతల, ఇటు నటీనటుల ధోరణిలో కూడా రవ్వంత మంచి మార్పు రాకపోవడం చాలా దురదృష్టకరం, విచారించదగ్గ విషయం కూడా. 50 సంవత్సరాల క్రితం ఒక సినిమా నిర్మించడానికి సంవత్సరాల వ్యవధి చాలేది కాదు. అటువంటిది, ఈనాడు రెండు, మూడు నెలల్లో తయారై సినిమాలు ప్రేక్షకుల్ని హింసిస్తున్నాయి. రాశి పెరిగింది, వాసి తరిగింది. నాసిరకం ‘‘సరుకు’’ దిగుతుంది. అనర్థమైన స్పీడు హెచ్చింది. ఆశించిన నాణ్యత లోపించింది. మూడు గంటలు కూర్చొని సినిమా చూసే ఓపిక, తీరిక, సహనం నేటి ప్రేక్షకుల్లో లేవు. ఇది గమనించే కాబోలు నేటి సినిమాలు నిడివి తగ్గి పోయింది. 2 గంటల వ్యవధిలోనే చాలా సినిమాలు ‘‘శుభం’’ పలుకుతున్నాయి. ఒక రకంగా ఇదిమాత్రం శ్రేయోదాయకమైన పరిణామమే.

మధురమైన, మనోహరమైన, ఆహ్లాదకరమైన సన్నివేశాలు మెచ్చుకుందామన్నా నేటి సినిమాల్లో మచ్చుకైనా కనిపించడం లేదు. రెండర్థాల మాటలు, పాటలు బాగా చోటుచేసుకుంటున్నాయి. సెక్స్‌, బూతు సమ్మిళితమై స్వైర విహారం చేస్తున్నాయి. అసభ్యత, అశ్లీలత హద్దు మీరిపోయాయి. మాంసం తింటున్నామని దుమ్ములు మెడకు కట్టుకుంటామా! ఏదైనా హద్దులో ఉంటేనే ముద్దుగా, అందంగా, మర్యాదగా ఉంటుంది. సహజమైన, స్వచ్ఛమైన ప్రజాజీవనం, తెలుగుదనం నేటి సిన్మాలలో కన్పించడం లేదు. నటీనటుల నటనలో జీవం కానరాదు. సన్నివేశాలలో సహజత్వం లోపించింది. హీరో, హీరోయిన్లు వెకిలి వేషాలతో వట్టి పోకిరీ మనుషుల్లా దర్శనమిస్తున్నారు. నేటి హీరో, హీరోయిన్ల స్టెప్సు, డ్యాన్సు చూస్తుంటే హైస్కూల్లో చదివే రోజుల్లో డ్రిల్లు మాష్టారు చెప్పే డ్రిల్లు జ్ఞాపకం వస్తుంది. యాభై, అరవైమంది విద్యార్థులు డ్రిల్లు చేస్తున్నట్టు నేటి డ్యూయట్లలో షాట్లు ఫీట్లు చేస్తున్నాయి!

హృదయానికి, మనసుకు సంబంధించిన పవిత్రమైన ప్రేమ ఈనాడు బజారునపడి చౌకబారు ‘‘సరుకు’’ అయింది. పదుగురి మధ్య పడి తన మర్యాద, తన స్థాయిని మంట కలుపుకుంటున్నది. ప్రేమ స్వరూపం మారిపోయింది. అసలు ‘‘ప్రేమ’’ అంటే అర్థం లేకుండా పోయింది! ప్రేమ కళేబరం కాలిపోయి కమిలిపోయింది. వికృతరూపం దాల్చి ప్రేక్షకులకు అసహ్యాన్ని కలిగిస్తున్నది. వయసులో ఉన్న ఏభై, అరవై మంది ఆడ, మగవాళ్ళ మధ్య సిగ్గు, లజ్జ లేకుండా, మర్యాదను చూడకుండా హీరో, హీరోయిన్లు డ్యూయెట్లు పాడుతున్నారు. ఇక వెనుకనున్న పడుచు అమ్మాయిలు తమ ‘‘అందాల్ని’’ ఆడిస్తూ గెంతుతున్నారు. సినిమాలు మారుతున్నాయి. నటీనటులు మారుతున్నారు. కానీ, పాటల్లో మాత్రం ఏమీ మార్పు కనిపించలేదు. పాటల సన్నివేశాల్లో అవే గంతులు … అవే అరుపులు … అవే సర్కస్‌ ఫీట్లు … అదే గోల …! పాటల బాణీల సృజనలో తేనెలొలుకు తెలుగు భాషను ఖూనీ చేస్తున్నారు. పాటల్లో విపరీతమైన స్పీడు, ప్రేక్షకుల నేత్రాల ముందు రెప్పపాటు కాలమైనా నిలబడకుండా పాడుతూ పరుగెత్తే నాయికా, నాయికుల్ని చూస్తుంటే ఇక రసస్వాదనకు అవకాశమేదీ? లాంగ్‌ షాట్‌లోనే సుమారుగా పాటంతా చిత్రీకరిస్తున్నారు. ఆ పాటలు వింటుంటే నేపధ్య గాయకులే పాడుతున్నట్టు ఉంటుంది కానీ, తెరమీదున్న హీరో, హీరోయిన్లు పాడుతున్నట్టు అనిపించదు.

పాటల సన్నివేశాల్లో జుగుప్సాకరమైన పట్టువదలని బిగి కౌగిలింతలు కోకొల్లలు. పాత సినిమాల్లో హీరో గుండెమీద హీరోయిన్‌ వాలిపోయేది. ఇప్పుడీ సన్నివేశం తారుమారయింది. హీరోయిన్‌ వక్షోజాల మధ్య, మీద కూడా హీరో తల ఆన్చి పరవశించిపోతున్నాడు. హీరోయిన్‌ తాలూకు ప్రతీ అవయవాన్ని హీరో ముద్దుపెడతాడు. హీరోయిన్‌ బొడ్డు దగ్గర పొత్తి కడుపు పిసుకుతూ, ఆమె పిరుదులు చరుస్తూ, లయాత్మకంగా దరువులు వేస్తూ, తొడలను పైకెత్తుతూ ‘‘ప్రేమ’’ (శృంగారాన్ని) ఒలకబోస్తాడు. తన బొడ్డు సుడుల లోతుల్ని గూడా బిడియపడకుండా, హీరోయిన్‌ కెమేరా కంటికి ఆనందంగా చూపిస్తూ ‘‘పైకి’’ ఎదిగిపొతున్నానని భ్రమసి మురిసిపోతుంది. డబ్బుకు అమ్ముడుపోయి విలువైన వలువల్ని హీరోయిన్లు విడిచిపెట్టేస్తున్నారు. ఈ చౌకబారు ‘‘ప్రదర్శన’’తో ‘‘తానెంత చులకనై పొతున్నాను’’ అనేది హీరోయిన్‌ గ్రహించడం లేదు. ఎంత బరితెగించిన ఆడదైనా నడివీధిలో పదిమంది చూస్తుండగా తన ప్రియుడికి కన్నుకొట్టదు, సైగచెయ్యదు, ఒడిలో వచ్చి వాలిపోదు. కానీ మన తెలుగు సినిమాల్లో హీరోహీరోయిన్లు సిగ్గు, లజ్జ వదిలేసి బజారునపడి ఎలా గెంతులు వేస్తున్నారో చూస్తుంటే అసహ్యమేస్తుంది. ప్రజల ఆనందంకోసం ఎలాంటి సన్నివేశాలైనా చిత్రీకరిస్తాం – అని అంటే కుదరదు. కారణమేమంటే, సినిమా చూసేది ప్రజలు, దాని ప్రభావం ప్రజలమీద తప్పక పడుతుంది. ఇక, కొందరు హీరోలు హీరోయిన్‌ని కౌగిలించుకున్న సమయంలో ప్రేక్షకుల వైపు చూసి నవ్వుతారు, కన్ను కొడుతుంటారు. దీని అర్థం ఏమిటో ఎవ్వరికీ తెలియదు! ఈ ‘‘నటన’’ అసహ్యంగానూ, ఎబ్బెట్టుగానూ ఉంటుంది. నిజం చెప్పాలంటే ఇది చాలా అనారోగ్యకరమైన ధోరణే…! ప్రజా జీవితాన్ని సహజంగా ఉండేలా చిత్రీకరించాలి. లేనిపోని వికారాలు, వికృతాలు చూపిస్తే ప్రజలు పెడదారిని పడతారు. లక్షలు ఖర్చుపెట్టి సినిమా తీస్తున్నాం అంటే తిరిగి లక్షలు, లక్షలు సంపాదించడానికేనా? అందులో లక్ష్యం ఏదీ ఉండదా? ప్రయోజనం చూడరా? ఆశయం సిద్ధిస్తుందా – అనేది విచారించరా? ఈనాడు ఈ విషయాలేవీ ఆలోచిస్తున్నట్టు కనబడదు. కేవలం ధనార్జన తప్ప మరో ధ్యేయంలేదు ఈనాటి నటీనటులకు, దర్శక నిర్మాతలకు కూడా.

ఇటీవల హీరోయిన్స్‌ పైట మాటే మరిచిపోయారు. తన స్తనములతో హీరోని ఢీకొని అతణ్ణి గుద్దే స్థాయికి ఎదిగింది నేటి హీరోయిన్‌. చక్కని సంప్రదాయం, గౌరవ మర్యాదలు గల సంసారిణిలా కాకుండా, బరి తెగించిపోయి నేటి హీరోయిన్‌ నటన (!) ప్రదర్శిస్తుంది. ఎక్స్‌పోజింగ్‌లో మంచి ఎక్స్‌పర్ట్‌లయ్యారు మన తెలుగు హీరోయిన్స్‌. పాటల సన్నివేశాల్లో వస్తాదుల్లా కుస్తీ పడుతూ హీరో హీరోయిన్లు నేల మీద పడి పొర్లుతూ, బురదలో పడి దొర్లుతున్నారు. నేటి హీరోయిన్స్‌ తాలూకు నటన (ఎక్స్‌పోజింగ్‌) చూస్తే జ్యోతిలక్ష్మి, జయమాలిని కూడా ముక్కుమీద వేలు వేసుకోకపోరు! అయితే, జయమాలిని, జ్యోతిలక్ష్మి లేకపోయినా ఫరవాలేదు. వారులేని ‘‘లోటు’’ తీరుస్తున్నారు నేటి హీరోయిన్స్‌ …! చాలా సినిమాల్లో ఇలాంటి అసందర్భమైన, అసహజమయిన సన్నివేశాలే చోటుచేసుకుంటున్నాయి. వీటిలో తెలుగు జనజీవనం మచ్చుకైనా ప్రతిబింబించడం లేదు. చెడుమార్గాన పయనించేందుకు ప్రేరణ కలిగిస్తున్న నేటి సినిమాలు, సమాజానికి ఆరోగ్యాన్ని ఎలా కలిగిస్తాయి!

ఇక ప్రేమికులు కలుసుకొనే నాటి పార్కులు, బీచ్‌లు పాతబడిపోయాయి. ఈనాడు ఎటుచూసినా సినిమాల్లో ప్రేమ దృశ్యాలే దర్శనమిస్తున్నాయి. రిక్షాలో ప్రేమ, ఆటోలో ప్రేమ, బ్రిడ్జి మీద ప్రేమ, బ్రిడ్జి కింద ప్రేమ, కాలేజీలో ప్రేమ, చివరకు కాఫీ హోటల్లోనూ ప్రేమే! ఒకే ఒక డ్యూయెట్‌లో భూగోళం అంతా తిరిగొచ్చేస్తున్నారు నేటి ప్రేమికులు! ఒక పాట చిత్రీకరణలో 10, 15 డ్రస్సులు మారుస్తారు. మరి ఈ డ్రస్సులు ఎక్కడ నుంచి వస్తాయని అడగొద్దు. ఇలా డ్రస్సులు మారుస్తుంటే అవి వాళ్ళ హుందాతనాన్ని హతమార్చి, పోకిరీతనాన్ని బయటపెడుతున్నాయి. మరో విషయం, ఒక పాటను పలు ప్రదేశాల్లో చిత్రీకరించి దాన్ని పది, పన్నెండు ముక్కలుచేసి, వాటిని ముందూ వెనుకా రెప్పపాటు కాలంలో రెండేసి ముక్కల్ని కంటిన్యువిటీ లేకుండా ప్రదర్శిస్తున్నారు. ఇదేమి టెక్నిక్‌? ఈ పద్ధతివల్ల ప్రేక్షకుల బుర్ర పాడవుతుంది, చికాకు కలుగుతుంది. ఇలాంటి పాటలు వినోదాన్ని అందించడం మాట అటుంచీ, ఎంతో ఇబ్బంది మాత్రం కలిగిస్తున్నాయి ప్రేక్షకులకు!

లుంగీలు పైకి ఎత్తికట్టి, లోనున్న డ్రాయర్లు కనిపిస్తుండగా డ్యూయెట్స్‌ పాడే హీరోలు, ఇద్దరు హీరోయిన్స్‌ మీద ఎక్కి కూర్చొని తైతక్కలాడే యువ హీరోలు కూడా నేడు మనకు కనిపిస్తున్నారు. ఓ సినిమాలో గోచీతో ఓ నటుడు ప్రత్యక్షమవుతాడు. మరో సినిమాలో ఓ నటుడు దిగంబరుడుగా దర్శనమిస్తుంటే, ఓ హాస్యనటుడు ఆయన్ని చూసి ఎగతాళి చేస్తాడు. మరో సినిమాలో ఓ యువనటుడు ప్రక్కనే ప్రియురాలు ఉంటుండగా మూత్ర విసర్జన చేస్తాడు. ఇదెంత అశ్లీలంగా ఉందో గమనించే వారేరీ? ఇలా చెప్పుకుంటూ పోతే సమయమే చాలదు! ఈ చౌకబారు సన్నివేశాలు సినిమాలో అవసరమా? ఇదే హాస్యమా? హాస్యం అంటే ఏమిటో నేటి హాస్యనటులకు తెలుసునా? హాస్యం గురించి చెప్తూ శ్రీ కె.ఎన్‌.టి.శాస్త్రిగారు ‘‘అలనాటి చలనచిత్రం’’ గ్రంథంలో (111 పేజీ) ‘‘చక్రపాణి’’ వంటి చిత్రాలను గుర్తు చేసుకున్నప్పుడల్లా ఆ చిత్రాలలో హాస్యం ఎటువంటి అశ్లీలతకూ తావీయక హాస్యరసాన్ని అపహాస్యం పాలుచేయక జాగ్రత్త వహించాయన్నది స్పష్టమవుతుంది. నేటి చిత్రాలలోని హాస్యం గురించి వేరే చెప్పనవసరం లేదు. అశ్లీలత, వెకిలి చేష్టలే నేటి హాస్యంగా చలామణీ అవుతున్నాయి. హాస్యరచన చేయడంలో ఆ రెంటినీ రచయితలు ఎన్నుకుంటున్నారు. వారొక్కసారి ‘‘చక్రపాణి’’, ‘‘వరుడు కావాలి’’ చిత్రాలను చూడగలిగితే హాస్యమంటే ఏమిటో తెలుసుకోవచ్చును అని తెలియజేశారు.

అర్థంలేని వెర్రి అరుపులు, పిచ్చికేకలు, బూతు పదాలతో ‘‘రయ్‌ … రయ్‌’’మంటూ యమస్పీడుతో, రసాస్వాదనకు అవకాశం లేకుండా పాటలు పాడుతుంటే, హౌస్‌ఫుల్లయిన హాల్లో ఈలల గోలలు హోరెత్తిస్తున్నాయి. ఇక పాటలు వింటుంటే ఇవి ‘‘తెలుగు పాటలేనా…!’’, ‘‘తెలుగు భాషేనా…!’’ అంటూ ఆశ్చర్యపోవలసిందే! భావం ఎలాగూ ఉండదు, భాషకూడా అర్థం కావడం లేదు. డ్రస్‌ విషయానికి వస్తే, ముఖ్యంగా హీరోయిన్లు ధరిస్తున్న దుస్తులు చాలా అభ్యంతరకరంగా ఉంటున్నాయి. జాకెట్‌కు బదులు ఓ చిన్న గుడ్డను గుండెమీద తాళ్ళతో కట్టుకుంటున్నారు! దేశం నిండా బట్టల షాపులకు కొదువలేదు. మరి హీరోయిన్స్‌కే బట్టలకొరత ఎందుకు వస్తుందో …?! పిల్లల నుంచీ పెద్దవాళ్ళ వరకూ చెప్పే డైలాగులు చాలా ఎబ్బెట్టుగా, అసభ్యంగా ఉంటున్నాయి.

‘‘ఆడవాళ్ళ బొడ్డుమీద అడ్డమైన వస్తువులు విసరడం ఆంధ్రదేశపు సంస్కృతిగా తేల్చేశారు సినిమా నిర్మాతలు’’. (ఏప్రిల్‌ 1977 ‘‘ఆహ్వానం’’ – 89 పేజీ) ఈ వికృత పోకడలతో, విపరీత ధోరణులతో గబ్బు కంపుకడుతున్న తెలుగు సినిమా గమ్యం అగమ్యమయింది. అగోచరమయింది. సినీరంగ ప్రముఖులకు ఇప్పుడీ విషయం బుర్రకు ఎక్కడం లేదు. ఈ విషయాలేవీ వాళ్ళు ఆలోచించడం లేదు. మితిమీరిన సెక్స్‌, హింస, హత్యలు, రక్తపాతాలతో ప్రేక్షకులు హడలిపోతున్నారు. విసిగిపోతున్నారు. కొందరయితే హింస, రక్తపాతం చూసి గుండెదడకు గురవుతున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని సంఘ విద్రోహచర్యలు జరుపుతూ, రౌడీలుగా, గూండాలుగా బ్రతుకు సాగించే వారిని హీరోలుగా చిత్రిస్తున్నారు. ఎవరు ఎన్ని ఎక్కువ ఘోరాలు, నేరాలు చేస్తే అంత పేరు ప్రఖ్యాతులు వస్తాయనే అభిప్రాయం ప్రజలకు కలుగజేస్తున్నాయి నేటి సినిమాలు. ఈ సినిమాల వల్ల సామాజిక ప్రయోజనమేమీ కలుగటంలేదు. అంతేకాకుండా, ప్రజల్లో ఏమాత్రం చైతన్యం ఇవి తీసుకురావడం లేదు. ఎందుచేతనంటే, ఇవి సహజత్వాన్ని కోల్పోయి, పటుత్వం లేనివై, గుల్లగా తయారై రోడ్డు మీదికొస్తున్నాయి.

కథా బలంలేని నేటి సినిమాల్లో సూపర్‌ స్థాయిలో ‘‘సెక్స్‌’’ని జొప్పించి డబ్బులు చేసుకుంటున్నారు. ప్రజల నుంచి దండీగా డబ్బులు దండుకంటున్నారే తప్ప, ప్రజలకు చక్కని సందేశాన్ని తాము తీస్తున్న సినిమాలద్వారా అందివ్వ లేకపోతున్నారు. తాము నిర్మించే సినిమాలు ఎంతవరకు జీవిస్తాయి? వాటి ప్రయోజనమేమిటి? మొదలైన విషయాలు దర్శక, నిర్మాతలు ఆలోచించడం లేదా? తమ బాధ్యతల్ని విస్మరించిన దర్శక నిర్మాతలను, నటీనటుల్ని, సినీకవుల్ని, రచయితల్ని రాబోయే తరాల ప్రజలెలా క్షమిస్తారో అర్థం కావడంలేదు. ఔచిత్యం లేని పేర్లతో, కథాబలం లేని సామాజిక ప్రయోజనం లేని సినిమాలు విడుదలై ప్రజల్ని హింసిస్తున్నాయంటే అతిశయోక్తి కాదేమో! చివరకు ‘‘సి’’ – ‘‘నీ’’ – ‘‘మా’’ అంటే ‘‘సిగ్గు’’, ‘‘నీతి’’, ‘‘మానం’’ – లేనిదని భావించవలసి వస్తోంది.

ప్రజలాదరిస్తున్నారు కాబట్టే ఇలాంటి సినిమాలు తీస్తున్నామని చాలా మంది దర్శకులు, నిర్మాతలు సున్నితంగా సూక్తులు వల్లిస్తున్నారు. చెత్త సినిమాలు వస్తే, ప్రజలే వాటిని ప్రతిఘటించాలని కొందరు ప్రముఖ నటులు శ్రీరంగనీతులు చెప్తున్నారు. సెన్సారుచేసి ప్రభుత్వం వాటికి అనుమతిచ్చి రిలీజ్‌కు దారిచూపిస్తుంది. ‘‘మనకెందుకులే’’ అని ప్రజలు ఈ విషయంలో ఉపేక్ష వహిస్తున్నారు. అనవసర విషయమని శ్రద్ధ చూపడం లేదు. అయితే, చెత్త సినిమాలను ప్రజలు బహిష్కరించవచ్చు. ముఖ్యంగా విద్యావంతులైన యువతీ యువకులు ఆదర్శంగా నిలిచి ఈ మార్గంలో ముందంజ వేయాలి. ఏ ఇంటి కా ఇల్లు చెత్త సినిమాలను బహిష్కరిస్తే కొంతమేరకు పరిష్కారం కాగలదని నా విశ్వాసం. నిర్మాతలకు కూడా కనువిప్పు కలుగుతుంది. ‘‘చెత్త సినిమాల్లో మేము నటించం’’ అని నటీనటులు దృఢమైన నిర్ణయం తీసుకోవాలి. అభిమాన సంఘాల వారు కూడా తమ అభిమాన నటీనటులకు చెత్త సినిమాల్లో నటించవద్దని గట్టిగా చెప్పాలి. బూతుమాటలు, బూతుపాటలు రాసే రచయితల్ని, కవుల్ని సినీరంగం నుంచి బహిష్కరించాలి. గాయనీ, గాయకులు కూడా బూతు పాటలు పాడడం మానివేయాలి.

ఆధునిక కాలంలో విజ్ఞానం అందించిన ఒక దృశ్యరూపం ‘సినిమా’. ఇది మనుషులకో వరం! సంగీతం, నృత్యం, సాహిత్యం వంటి లలితకళల సమ్మేళనం సినిమా. ఈ కళారూపాన్ని ‘పవర్‌ఫుల్‌ మీడియా’గా గుర్తించిన నాటి సినీనిర్మాతలు, దర్శకులు ప్రజలను చైతన్యవంతుల్ని చేసే సాధనంగా మార్చారు. సినిమా ఒక కళేకాదు. నాటినుంచి నేటివరకు సమాజంలోని మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వినోదాన్ని, విజ్ఞానాన్ని, వికాసాన్ని, చైతన్యాన్ని అందించవలసిన దీపిక.

తెలుగు సినిమా ‘‘మూకీ’’ (1921)గా ప్రారంభమై ‘‘టాకీ’’ (1931)గా వికసించి, ఈనాడు యావదాంధ్రలోనున్న టాకీసుల్లో తన విశ్వమోహన రూపాన్ని ప్రదర్శిస్తున్నది. ఆ రోజుల్లో ప్రజల మనోభావాలు, దేశ పరిస్థితుల్ని అవలోకనం చేసి నిర్మాతలు చిత్రాలు నిర్మిస్తుండే వారు. సినిమా చరిత్ర పౌరాణిక చిత్రాలతో ప్రారంభమయింది. 30వ దశకంలో ‘‘భక్త ప్రహ్లాద’’ (1931)తో టాకీ చిత్రాలు ప్రారంభమయాయి. ఆ తరువాత సాంఘిక, జానపద చిత్రాలు జోరందుకున్నాయి.

‘‘మాలపిల్ల’’ (1938), ‘‘రైతుబిడ్డ’’ (1939), ‘‘సుమంగళి’’ (1940), ‘‘దేవత’’ (1941), ‘‘బాలనాగమ్మ’’ (1942), ‘‘భాగ్యలక్ష్మి’’ (1943), ‘‘రత్నమాల’’ (1947), ‘‘ద్రోహి’’ (1948), ‘‘కీలుగుర్రం’’ (1949), ‘‘షావుకారు’’ (1950), ‘‘పాతాళ భైరవి’’ (1951), ‘‘పెళ్ళి చేసి చూడు’’ (1952), ‘‘దేవదాసు’’ (1953), ‘‘చక్రపాణి’’ (1954), ‘‘బంగారు పాప’’ (1954), ‘‘మిస్సమ్మ’’ (1955), ‘‘అర్థాంగి’’ (1955), ‘‘ఇలవేలుపు’’ (1956) – ఇలా ఎన్నో అద్భుతమైన కళాఖండాలు నిర్మాణమై తెలుగు ప్రేక్షక హృదయాలలో చెరగనిముద్ర వేశాయి. ముఖ్యంగా జానపద చిత్రాలే ప్రేక్షకుల్ని తమ వశం చేసుకున్నాయి. ఆ తరువాతి స్థానం సాంఘికాలది.

1940-65ల మధ్యకాలం అనేక కళాఖండాలతో విరిసి తెలుగు సినీ పరిశ్రమ చరిత్రలో స్వర్ణయుగంగా రూపొందింది. ఈ యుగంలోనే ‘‘సుమంగళి’’, ‘‘మళ్ళీ పెళ్ళి’’, ‘‘దేవత’’ ఇంకా ఈనాటి పోకడలతో రూపుదిద్దుకున్న నాటి మేటి చిత్రం ‘‘చూడామణి’’ (1941) కూడా మంచి పేరు తెచ్చుకున్నదే. ఈ చిత్రంలో వచ్చిన ఇబ్బంది ఏమిటంటే ఏడుపు తెప్పించాల్సిన సన్నివేశాలలో కూడా ప్రేక్షకులు నవ్వటం! ఇందులో ‘పుష్పవల్లి’ నటన అమోఘం, అద్భుతం. ఆమె నటనా కౌశలం గురించి చెప్పలేము, సినిమా చూసి తెలుసుకోవలసిందే …! మైసూరు మహారాజా గారి సన్మానం అందుకున్న నాగయ్య గారి ‘‘త్యాగయ్య’’ (1946) గొప్ప కళాఖండమే! నటుడుగా, దర్శకుడిగా, నాగయ్య గారి జీవితంలో ‘‘త్యాగయ్య’’ ఓ మైలురాయిలా నిలిచిపోతుంది. ఇక్కడో సంఘటన చెప్పాలి: మైసూరు మహారాజాగారు తన రాజభవనంలో ‘‘త్యాగయ్య’’ చిత్రాన్ని ప్రత్యేక షో ఏర్పాటు చేయించుకని నాగయ్య గారిని వెండి శాలువాతోనూ, 101 బంగారు నాణాలతోనూ సత్కరించారు. శ్రీరామచంద్రుడి బొమ్మ ఉన్న ఒక బంగారు నెక్లెస్‌ను కూడా బహూకరించారు. 1948లో విడుదలైన ‘‘ద్రోహి’’ కూడా గొప్ప పేరు తెచ్చుకుంది. ఆ మరుసటి సంవత్సరం 1949లో ఓ దేశభక్తుని కథ ఆధారంగా ‘‘నవ జీవనం’’ చిత్రం వచ్చింది. ఈ చిత్రం గాంధేయ వాదంలో రూపుదిద్దుకున్నదని చెప్పవచ్చు. 1949లో రిలీజైన ‘‘గుణసుందరి కథ’’ కూడా తెలుగువారు మర్చిపోలేని చిత్రరాజమే! ఇదో ఫాంటసీ కథ …! ‘‘ఏళైపడుంపాడు’’ తమిళ చిత్రమే తెలుగులో ‘‘బీదలపాట్లు’’గా 1950లో వచ్చింది. ఇక్కడో విషయం ముఖ్యంగా ప్రస్తావించడం చాలా అవసరం: 1947లో స్వరాజ్యమొచ్చింది. స్వతంత్ర భారతదేశ తీరుతెన్నులను గత మూడు సంవత్సరాలుగా గమనిస్తున్న నాటి ప్రజలకు, ఈ చిత్రం ఓ గొప్ప సందేశాన్ని అందించిందనే చెప్పాలి. అప్పటికి దారిద్య్రం దేశం నలుమూలలా ఆవరించి ఉంది. అయితే ప్రభుత్వం దానిని పట్టించుకున్నట్టు లేదు. అధికార మార్పిడిలో రాజకీయ వేత్తలంతా మునిగి ఉన్నారే కానీ, వేళ్ళూనుకొని ఉన్న దారిద్య్రాన్ని నాశనం చేసేందుకు ఎలాంటి ప్రయత్నాలూ చేపట్టలేదు. దారిద్య్రానికి కారణమేమిటి? కొందరు ఎత్తయిన భవనాల్లో నివసిస్తుంటే, కొందరు పూరి గుడిసెల్లో ఎందుకు నివసించాల్సి వస్తూంది? ఈ ప్రశ్నలకు సమాధానమే ‘‘బీదల పాట్లు’’ చిత్రమని చెప్పవచ్చు. నేరాలకు కారణం దారిద్య్రం! ఉన్నవాడి దగ్గర లేనివాడు దోచుకోవడం చట్టరీత్యా నేరమే! కానీ, దానిని నేరమనగలమా? అన్న అభిప్రాయాన్ని వ్యక్తీకరింపజేసే ప్రయత్నమే ‘‘బీదల పాట్లు’’ చిత్రం.

మనసున మల్లెలమాల లూగించిన మనోహరమైన దృశ్య కావ్యంగా ‘‘మల్లీశ్వరి’’ని చెప్పుకోవాలి. ఈ చిత్రం 1951లో విడుదలయింది. విదేశాలలో జరిగిన అనేక చిత్రోత్సవాలలో ‘‘మల్లీశ్వరి’’ ప్రదర్శింపబడి ప్రశంసల్ని అందుకున్న ఉత్తమ చిత్రం. 1950లో విడుదలయిన ‘‘షావుకారు’’, 1952లో రిలీజైన ‘‘పెళ్ళి చేసి చూడు’’ – ఈ రెండూ అభ్యుదయ చిత్రాలే. ‘‘షావుకారు’’లో ధనికుడికీ, పేదవాడికీ మధ్య ఉండే వైరుధ్యాన్ని నేరుగా చూపటం జరిగింది. వరకట్నాన్ని, సంప్రదాయ వివాహాల్ని నిరసించే విధానంలో రూపొందిన చిత్రం ‘‘పెళ్ళి చేసి చూడు’’. రెండూ సమాజాన్ని ప్రతిబింబించే విధంగా రూపొంది, ఆరోగ్యకరమైన చిత్రాలుగా ప్రజాదరణ పొందాయి. 1953లో రిలీజైన ‘‘నా ఇల్లు’’ యుగధర్మాన్ని ప్రతిబింబించినదైతే, దు:ఖాంతమయిన ఓ అమర ప్రేమ కథ ‘‘దేవదాసు’’ (1953). దేవదాసు పాటలన్నిటిని తెలుగువారు ఏనాటికీ మరువలేరంటే అతిశయోక్తి కాదు …! సాంఘిక చిత్రాల్లో ‘‘దేవదాసు’’ లాగా ప్రజాదరణ పొందిన సినిమా మరొకటి లేదనంటే – ఇది అక్షర సత్యమని అంగీకరించక తప్పదు. నవ్వులు పువ్వులు అందించిన ‘‘చక్రపాణి’’, శృంగారంలో వేదాంతముందని తెలియజెప్పిన ‘‘విప్రనారాయణ’’, ఇంకా ‘‘బంగారుపాప’’ ఇవన్నీ ఆణిముత్యాలే …! ‘‘బంగారుపాప’’ గొప్ప కళాత్మక చిత్రంగా పేరుగాంచింది. నవ్వుల నవరత్నమాల ‘‘మిస్సమ్మ’’ కూడా 1955లోనే విడుదలయింది. ప్రకృతి వైద్య చికిత్సను గూర్చి తొలిసారిగా ‘‘ఇలవేలుపు’’ (1956) చిత్రంలో ప్రస్తావించారు. ప్రకృతి వైద్య చికిత్సాలయం చుట్టూ ఈ కథ అల్లుకొని ఉంటుంది. ఈ చిత్రంలో మెలోడ్రామా పుష్కలంగా ఉంది. కానీ అది హద్దు దాటలేదు. ఇంకా ‘‘పెళ్ళినాటి ప్రమాణాలు’’ (1958), ‘‘మాంగల్యబలం’’ (1959) కూడా ప్రజాదరణ పొందిన చిత్రాలే.

తెలుగు టాకీ నాల్గవ దశకం (1961-70)లో మంచి చిత్రాలే వచ్చాయి. ప్రేక్షకులను ఆకర్షించడానికి హాస్యం, శృంగారం మొదలైన మసాలాలను కలిపి పాకం చేయడం 1960కి ముందు రోజుల్లో అంతగా కనబడదు. హాస్యమైనా, శృంగారమైనా కథలో భాగంగా ఇమిడి ఉండాలి. అలాంటి కోవకు చెందిన కథలను ఆనాటి దర్శకులు ఎంచుకొనే వారు. అందుకే ఆనాటి చిత్రాల్లో కళాత్మక విలువలు, నైతిక విలువలు మిశ్రితమై పొంగిపొరలేవి. ఈ దశకంలో విడుదలైన ‘‘భార్యాభర్తలు’’ (1961), ‘‘ఇద్దరు మిత్రులు’’ (1961), ‘‘రాముడు – భీముడు’’ (1964), ‘‘డాక్టర్‌ చక్రవర్తి’’ (1964), ‘‘మూగమనసులు’’ (1964), ‘‘ఇల్లాలు’’ (1965), ‘‘ఆడపడుచు’’ (1967) మంచి పేరు పొందినవే. ఆ తరువాత ‘‘అంతులేని కథ’’ (1976) మంచి చిత్రంగా పేరుగాంచింది. 1985లో రిలీజయిన ‘‘ప్రతిఘటన’’ అత్యంత సహజమైన సన్నివేశాలతో నిర్మితమై, సినీజగత్తులో స్థిరమైన స్థానాన్ని సంపాదించుకుంది. 1980-2000 వరకు – ఈ కాలాన్ని సినీ పరిశ్రమ చరిత్రలో ఓ అయోమయ యుగంగా పేర్కొనవచ్చు. ఈ రెండు దశాబ్దాల కాలంలో రిలీజయిన చిత్రాల్లో ‘‘శృంగారం’’ శ్రుతి మించి ఉంది. రిలీజయిన సినిమాకు రెండేసి పేర్లు పెడుతున్నారు – పెద్ద అక్షరాల్లో ఒక పేరు, దానికింద చిన్న అక్షరాల్లో ఇంగ్లీషులో – మరో పేరు! ఎందుకో మరి ఈ పద్ధతి అలవాటుగా మారి, ప్రేక్షకుల్ని తికమకపెట్టే వరకు వచ్చింది.

సుమారుగా 20 సంవత్సరాల నుంచి విడుదలైన, వస్తున్న చిత్రాల్లో కళాత్మక నైతిక విలువలు గానీ, మానవీయ విలువలు గానీ ఎక్కడా కనిపించవు. ఇవి ‘‘పుబ్బ’’లో పుట్టి ‘‘మఘ’’లో మాడి మసైపోతున్నాయి. చూసిన ‘‘పిక్చర్‌’’ ఏమిటో, ఇంటికి తిరిగి వచ్చేలోగా ప్రజలు పేరే మరిచిపోతున్నారు! ఇవి సమాజాన్ని ఎంతగా భ్రష్టుపట్టిస్తున్నాయో ప్రజలకు తెలుసు. అయినా, ప్రజలింకా ‘‘ప్రతిఘటన’’ చొక్కా ధరించడం లేదు! ‘‘నిర్లక్ష్యం’’ ముసుగులో కునుకుపాట్లు పడుతున్నారు!

హీరోలను దృష్టిలో పెట్టుకొని ఈనాటి రచయితలు కథలల్లుతుంటే అందులో వ్యక్తి పూజే దర్శనమిస్తుంది. రచయితలకు స్వేచ్ఛ కరువే! నిజాయితీగా కథ రాయలేకపోతున్నారు. ఆశయాల్ని, ఆదర్శాల్ని చూపించడంలో విఫలులవుతున్నారు. సినిమాలన్నీ ఇంచుమించు ఒకే మూసలో నుంచి వచ్చినట్టే కన్పిస్తున్నాయి! పాత్రలను దృష్టిలో పెట్టుకొని మాటలు, పాటలు రాయాలి, కానీ నేడు పాత్రధారులను దృష్టిలో పెట్టుకని రాస్తున్నారు! నటీనటుల వంశాన్నీ, వాళ్ళ గత కీర్తినీ ఉటంకిస్తూ మాటలు, పాటలు రాస్తుంటే వినేందుకు అసహ్యంగా, ఎంతో ఎబ్బెట్టుగా ఉంటున్నాయి! ‘‘సినిమా’’ అంటే అదో సామాజిక కథ – స్వేచ్ఛగా, స్వతంత్రంగా సాగిపోవాలి. అప్పుడే ఆ కథ సహజంగా ఉంటుంది. ఇప్పుడీ పద్ధతి అసలు లేదనే చెప్పాలి. నేటి సినిమాలు చూస్తుంటే, మనముంటున్నది ‘‘రంకు’’ సమాజంలోనా! అనే అనుమానం, ఆశ్చర్యం, ఆందోళన కలుగుతున్నాయి. ఆనాటి సినిమాలు స్వర్ణయుగానికి చెందినవై ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయి, వాటిని తలచుకనునప్పుడల్లా మనసులు సంతోషంతో నిండగా పరవశం చెందుతుంటారు జనమంతా. నాటి సినిమాలు ‘‘ప్రకృతి’’కి చెందుతాయి. నేటి సినిమాలు ‘‘వికృతి’’గా నిలిచి ప్రజల మనసుల్ని పాడుచేస్తున్నాయి.

ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాలన్నిటికీ ‘‘ప్రేమ’’ కథావస్తువు. దానిచుట్టూరా కథ తిరుగుతుంది. దేశంలో ఎన్నో సమస్యలుండగా వాటిని స్పృశించటం లేదు రచయితలు. పదవ తరగతికి రాక పూర్వమే ఈనాటి పిల్లలు ప్రేమలో పడిపోతున్నారు. విద్యార్థుల్ని సత్‌పౌరులుగా తీర్చి దిద్దేందుకు నేటి సినిమాలేమాత్రం దోహదం చేయడం లేదు. పితృభక్తి, గురుభక్తి, దేశభక్తి – వీటిమీద నేడు సినిమాలు నిర్మితం కావటంలేదు. అందుకే ఈనాటి యువతలో పైన పేర్కొన్న భక్తి భావాలు, పెద్దల ఎడల మర్యాద, మన్నన ఇత్యాది భావాలు మృగ్యమై పోతున్నాయి. విశృంఖలత్వంతో యువత పెడదారి పడుతుంది. ఈ కోవకు చెందిన చిత్రాలు ఎంతో అనర్థాన్ని తెచ్చి పెడుతున్నాయి. సమాజానికెంతో అనారోగ్యాన్ని కూడా కల్గిస్తున్నాయి.

‘‘సినిమా’’ ఒకప్పుడు ‘‘కళ’’ ఆ కాలంలో – ప్రారంభ దశలో గొప్ప ‘‘కళాఖండాలు’’ మనోహరమైన ‘‘దృశ్యకావ్యాలు’’ నిర్మితమై ఆబాలగోపాలాన్ని ఆనందపరిచేవి, ఆహ్లాద పరిచేవి. ఈ రోజుల్లో ‘‘సినిమా’’ వ్యాపారమయిపోయింది. వ్యాపారంలో రాబడీ – లాభం మాత్రం చూసుకుంటారు గదా! అందుచేత ‘‘సరుకు’’ నాణ్యతలోపించింది. ఈ విషయం నేను వ్యాసం ప్రారంభంలోనే విశదం చేశాను. ఈనాడు నైతిక విలువలు లేవు. మంచి కుటుంబ గాథా చిత్రాలు రావడం లేదు. ప్రజలకోసం ఎవరు ఆలోచిస్తున్నారు? నేల విడిచి సాము చేస్తున్నారు. ప్రజలే విరక్తి చెంది సినిమాలను బహిష్కరిస్తే, మరి ఎవరికోసం సినిమాలు నిర్మిస్తారు? రాజకీయంలో ఎలాగయితే పెట్టిన ఖర్చు సంపాదించుకుంటారో సినిమా ద్వారా అంతే జరుగుతోంది….!

ఆనాటి స్వర్ణయుగానికి చెందిన సినిమాల్లోని గౌరవ గరిమలు నేడు కానరావు. కేవలం ప్రేమకోసమో, ఆధిపత్యం కోసమో హత్యలు – రక్తపాతాలు, చేతులు నరికేయడం, కాలు తెగ్గొట్టడం, చివరకు (హింస క్లై మాక్స్‌లో) తలలు కూడా నరికెయ్యడం చాలా సులువుగా జరిగి పోతున్నాయి….! లాటరీలు నడిపి సినిమాలు ఆడించే రోజులు కూడా ప్రజలు చూశారు. దీన్నిబట్టి సినిమాల్లో ఎంతటి పస, పట్టు ఉన్నాయో తెలుస్తుంది కదా! ఏ రోజైతే అడ్డు, అదుపులేకుండా స్వైర విహారం చేస్తున్న సెక్స్‌, బూతు సన్నివేశాలు తొలగిస్తారో ఆ రోజు సినిమా ‘‘రంగు’’ బయటపడుతుంది, దాని ‘‘వయసు’’లోని బింకమేమిటో తేట తెల్లమవుతుంది! రారాజు దుర్యోధనుడు మయసభలో ప్రవేశించినప్పుడు తనకు కలిగిన అనుభవాల వల్ల ‘‘ఖంగు’’ తింటాడు. ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా అతనికి దర్శనమిస్తాయి. సరిగ్గా అదేవిధంగా నేటి సినిమాల్లో మయసభ సీనులు కోకొల్లలుగా కనిపిస్తున్నాయి! సమాజంలోని యదార్థ దృశ్యాలు ఈనాడు చిత్రాల్లో కానరావడం లేదు.

సృష్టిలో మానవజన్మ ఉత్తమమైనది. అతనిలో మాత్రమే అనేక సద్గుణాలు – నీతి, న్యాయం, నిజాయితీ, సత్యం, త్యాగం, ధర్మం మొదలైనవి కనిపిస్తాయి. ఈ గుణాల్ని వికసింపచేసేందుకు కళలు సాధనాలుగా ఉపయోగపడాలి. వ్యక్తిత్వ వికాసానికి కళలు దోహదపడాలి. మరి సినిమా కూడా ఓ కళే! అందుచేత సినిమాలు ప్రజల మనసులలో నైతిక విలువల్ని పెంచడం ద్వారా, వ్యక్తులలో వికాసత్వాన్ని కలిగించి సమాజ గమనాన్ని చైతన్య మార్గాల వైపు తిప్పాలి. వినయ విధేయతల్ని, ప్రేమ వాత్సల్యాల్ని, నీతిమార్గాల్ని బోధించాలి. ప్రజలకు ఆశావాదాన్ని. బ్రతుకు విలువల్ని నేర్పాలి. ఇంతటి గురుతరమైన బాధ్యత భుజాల మీద మోస్తున్న సినిమా పక్కదారి పడితే, అది అందించే సందేశం ఎలా ఉంటుంది? సమాజ గమ్యం ఏమవుతుంది? మేధావులు, విజ్ఞులు, నేతలు ఆలోచించాల్సిన విషయమే కదా!

పాట మానవ జీవితంలో ఒక భాగం. మానవుని శారీరక మానసిక పరిశ్రమ నుంచి పాట పుట్టింది. సినిమా కూడా మానవ జీవితమే. అందుకే సినిమాకు పాట అవసరమయింది. పాత్రల ఆలోచనలను స్పష్టపరచడానికి, మాటల్లో చెప్పలేని భావాల్ని విశదం చేయడానికి, కధా గమనాన్ని వేగవంతం చెయ్యడానికి, పాత్రల విశిష్ట లక్షణాల్ని పెంచడానికి పాట అవసర మొచ్చింది. సినిమాల్లో పుట్టిన పాట మానవుని గతినే మార్చేస్తున్నది. సినిమా పాటలు మనకు ప్రశాంతతని, ఆశావాదాన్ని, ఐక్యతా భావాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, నాయకత్వ లక్షణాల్ని, వ్యక్తిత్వ వికాసాన్ని అందిస్తున్నవి. ఈ పాటల్లో ఎన్నో రకాలున్నాయి. దేవుని భక్తిపాటలు, దేశభక్తి పాటలు, చైతన్య గీతాలు, భావగీతాలు, విషాద గీతాలు, విరహ గీతాలు, వైరాగ్యగీతాలు,జానపద గీతాలు, ప్రేమ గీతాలు, హాస్య గీతాలు ఇలా చాలా రకాలున్నాయి.

సినిమా పాట మానవునిలో నిద్రాణమైవున్న శక్తిని ప్రేరేపించే ఉత్ప్రేరకంగా పని చేస్తుంది. నాడు ‘రామ కథను వినరయ్యా’ పాట పిల్లల్లో పెద్దల్లో ఎంత చైతన్యాన్ని కలిగించిందో ఈనాటి పెద్దలకు తెలుసు. నాడు ఏ రకం పాటలోనైనా కొంత సందేశాన్ని చేర్చడానికి సినీపాటల రచయితలు శతవిధాలా ప్రయత్నించారు. ఇక్కడో విషయం చెప్పాలి. మల్లీశ్వరి నాట్యాన్ని చూసి ముగ్ధుడైన పెద్దన ఆశువుగా ఓ పద్యం చెబుతాడు. ‘‘భళిరా ఎన్నడు జారె నీభువికి, రంభారాగిణీ రత్నమేఖలయో …’’ అనేది. అల్లసాని వారు చెప్పిన పద్యం కాబట్టి అల్లసాని వారి శైలిలోనే ఉండాలనేది దర్శకుని పట్టుదల. దానికోసం దేవులపల్లి వారు 108 పద్యాలు తయారుచేశారు. కావలసింది మాత్రం ఒక్క పద్యమే. ఇంత ప్రయత్నం ఎవరినో సంతృప్తి పరచడానికి కాదు. ప్రేక్షకులకు వడ్డించే ముందు తమను తాము సంతృప్తి పరచుకోడానికి. ఆ దర్శక రచయితల పట్టుదలకూ, అంకిత భావానికి ఇదొక తార్కాణం. సూక్ష్మంగా చెప్పాలంటే పాటద్వారా శ్రోతలలో ఒక హృదయపు కదలికని వాళ్ళు ఆశించారు. ఈనాటి సినీపాటల రచయితల్లో లోపించినదదే!

నాటి సినిమాల్లోని మధురగీతాల్ని ఓసారి పరిశీలిద్దాం.

‘‘బ్రతుకు తెరువు’’: ‘‘అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం’’

‘‘విచిత్ర కుటుంబం’’: ‘‘ఆడవే, ఆడవే జలకమ్ములాడవే కలహంసలాగ, జలకన్యలాగ’’

‘‘ఆరాధన’’: ‘‘పగలే వెన్నెల, జగమే ఊయల’’

దొంగరాముడు: ‘‘చిగురాకులలో చిలకమ్మా’’

గుండమ్మ కథ: ‘‘ఎంత హాయి ఈ రేయి, ఎంత మధుర మీ హాయి’’

దాగుడు మూతలు: ‘‘అడగక ఇచ్చిన మనసే ముద్దు అందీ అందని అందమే ముద్దు’’

సిరి సంపదలు: ‘‘ఈ పగలు రేయిగ పండువెన్నెలగ’’ ‘‘ఎందుకో సిగ్గెందుకో’’

మంచి చెడు: ‘‘రేపంటి రూపం కంటి, పూవింటి దొరనే కంటి’’

బందిపోటు: ‘‘ఊహలు గుసగుసలాడే, నా హృదయము ఊగిసలాడే’’

పరువు ప్రతిష్ట: ‘‘ఆ మబ్బు తెరలలోన దాగుంది చందమామా’’

కులగోత్రాలు: ‘‘చెలికాడు నిన్నే రమ్మని పిలువ’’

మల్లీశ్వరి: ‘‘ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు’’

తోడికోడల్లు: ‘‘కారులో షికారు కెళ్ళే పాల బుగ్గల పసిడి దానా’’

నిర్దోషి: ‘‘మల్లియలారా మాలికలారా మవునముగా ఉన్నారా’’

వెలుగునీడలు: ‘‘కల కానిది విలువైనది బ్రతుకు’’, ‘‘పాడవోయి భారతీయుడా’’

ఇల్లరికం: ‘‘నేడు శ్రీవారికి మేమంటే పరాకా’’

దేవదాసు: ‘‘జగమే మాయ …. బ్రతుకే మాయ!’’

పసిడి మనసులు: ‘‘చిన్నారి నీ చిరునవ్వు, విరిసిన మల్లెపువ్వు’’

ఇలాంటి మధుర గీతాలు ఇంకా చాలా ఉన్నాయి. వాటి వివరాలన్నీ ఇక్కడ ప్రస్తావించడం అసాధ్యమే! వాటి గురించి ఎంత చెప్పినా (రాసినా) అది తక్కువే అవుతుంది ….!

ఇక, ప్రజల మనసుల్నేగాక, మెదడుల్ని కూడా కబళించే అయోమయ యుగానికి చెందిన సినిమాల గురించి కూడా తెలుసుకోవాలి. ఔచిత్యంలేని పేర్లు తగిలించుకని ఈ సినిమాలు మార్కెట్‌లో దిగుతున్నాయి. వాటిలో కన్ని: ‘‘రెండు తోకల పిట్ట’’, ‘‘ ఎదురింటి మొగుడు – పక్కింటి పెళ్ళాం’’, ‘‘దొంగ మొగుడు’’, ‘‘ ఉమ్మడి మొగుడు’’, (మరి ‘‘రంకు మొగుడు’’ సినిమా రాదని మనం చెప్పలేమే!) ‘‘కిరాయి అల్లుడు’’ (దీనర్థం రంకు మొగుడు అనేగా!) ‘‘ఇంట్లో ఇల్లాలు – వంటింట్లో ప్రియురాలు’’ (‘‘పడక గదిలో వెలయాలు’’ అనేది రావచ్చు!’’) ‘‘ఆయన కిద్దరు’’, ‘‘ఏవండీ, ఆవిడొచ్చింది’’. ‘‘నాతో వస్తావా’’, ‘‘జంబలకిడి పంబ’’, ‘‘ఆ ఒక్కటీ అడక్కు’’, ‘‘మా ఆవిడ మీదొట్టు మీ ఆవిడ చాలా మంచిది’’, ‘‘తప్పు చేసి పప్పు కూడు’’, ‘‘అదుర్స్‌’’, ‘‘శీనుగాడు చిరంజీవి ఫ్యాన్‌’’, ‘‘ప్రేమించుకుందాం, రా’’, ‘‘పెళ్ళిచేసుకుందాం, రా’’ (పిల్లల్లి కందాం, రా! ఇదే కాదా తర్వాత రావాలి ….!) ‘‘అక్క మొగుడు – చెల్లెలి కాపురం’’ – వినడానికే ఈ పేర్లు అసహ్యంగా లేవూ? పాటల్ని కూడా పరిశీలిస్తే, సాహిత్యపు విలువలు ఏ స్థాయిలో ఉన్నాయో గమనించగలం.

‘‘సూదిలో దారం – సందులో బేరం’’

‘‘నీ క్కావలసింది నా దగ్గర ఉంది’’

‘‘అడగనా …. అడగనా, నోరు విడిచి అడగరానిది’’

‘‘ఒక్కసారి …. ఒక్కసారి నొక్కి చూడయో’’

‘‘పట్టుకో పట్టుకో రెండు పట్టుకో’’

‘‘నూకలిస్తా మేకలు కాస్తావా,

రవికలిస్తా రాతిరి కొస్తావా?’’

అశ్లీల పదాలు, బూతు, ద్వంద్వార్థాల పదాలు పాటల్లో, మాటల్లో చోటు చేసుకుంటున్నాయి.

గొప్పింటి అల్లుడు:

‘‘మూడొచ్చి కూర్చుంది ఆ పద్దయో ఆ కాస్త కానీయరో’’.

రాజకుమారుడు:

‘‘కన్నులతో కన్నెరికం తీర్చిన వాడా

పైటలలో పాటలెన్నో దాచిన దానా’’

సమరసింహారెడ్డి:

‘‘నందమూరి నాయకా, అందమైన కానుక

బుల్లో బొంగరం తిప్పేయనా నీ బంగారి బొడ్డుమీద’’

కన్యాదానం:

‘‘అందాలే ఊరిస్తుంటే ఆగదు నా మనసు

ఆ సీనే మొదలయిపోతే స్టాపంటూ లేదంటూ’’

అల్లరి అల్లుడు:

‘‘రైక చూస్తే రాజమండ్రి

పైట చూస్తే పాలకొల్లు’’

మాయలోడు:

‘‘మనసు పట్టు తప్పింది.

వయసు గుట్టు తడిసింది.’’

అడవి రాముడు:

‘‘ఆరేసుకోబోయి పారేసుకున్నా’’

ఈ గీతంతో పాటల పతనం ప్రారంభమయిందని చెప్పాలి.

ఘరానా మొగుడు:

‘‘ఓంతమ్మా ఓంతమ్మా షేపులు అంతంత ఉన్నాయి ఎత్తులు బోలోబోలో

నీ కన్ను పడ్డాక ఓరయ్యో. పొంగేస్తున్నాయి గుత్తులు చలోచలో’’

నా అల్లుడు:

‘‘కన్నుకొడితే వచ్చేయనా

కన్నె పొంగులిచ్చేయనా

హే జారేసుకో పైట జారేసుకో

పరువాలు నామీద నూరేసుకో’’

అన్నయ్య:

‘‘మండపేట కుర్రదాన్ని ఓ బావయ్యో

మనీ పర్సు చూస్తే తస్సదియ్యా మహా ఇదయ్యో’’

ఆది:

‘‘పైన ఎన్ని అందాలున్నా లోపలుందీ తెలిసేదెట్టా

నా ఒళ్ళోకి వస్తావా, నే కోరింది కొరికి ఇస్తావా?’’

అక్కడమ్మాయి – ఇక్కడ అబ్బాయి:

‘‘జఘనముతో జగడములో చకచక సుఖపడదాం’’

తెలుగు పాటల్లో ఇంగ్లీషు, హిందీ పదాలు జోరందుకుంటున్నాయి.

బద్రి:

‘‘వై డు యు వర్రీ వేర్‌ యు బోర్స్‌ ఆర్‌ యు దేర్‌ బ్రదర్‌’’

‘‘ఏ దేశ్‌ ద ష్యారా ప్యారా కిన్‌ కీ నజర్‌ లగీ సే’’

అర్థంలేని మరో పాట:

‘‘కాలేజీకి టీనేజీకి స్వీటేజీకి హటేజీకి కట్టెయి తకధిమి

లవ్వేజీకి నవ్వేజీకి కన్యాజీకి మారేజీకి పెట్టెయి పెదరిమ’’

శంకర్‌ దాదా M.B.B.S.,:

‘‘చైలా చైలా చైలా …. నేను వెంటపడ్డ పిల్లపేరు లైలా’’

ఏమాత్రం మాధుర్యం లేని, పసలేని పాట. పోనీ – ‘‘నేను ప్రేమించే పిల్ల పేరు లైలా’’ అని అంటే ఎంతో బావుణ్ణు గదా! ‘‘వెంటపడ్డ’’ అనే పదాలతో నాయకుని స్థాయి, హుందాతనం దిగజారిపోలేదా? నిజం చెప్పాలంటే, ఇలాంటి చౌకబారు నటనలు చాలా అనారోగ్య కరమైనవే….!

ముఖ్యంగా, ఈనాటి సినిమా పాటలు …. అవి ఏవైనా పాటలా? అయ్యో రామ….! వెరైటీ గొంతులు….! అర్థంకాని పదజాలంతో సాహిత్యం!! కలవరపరిచే వాయిద్య ధ్వనులు!!! ఏం కాలం దాపురించిందిరా దేవుడా! ఈనాటి రచయితలు, గాయకులు, సంగీత దర్శకులు కాస్త కళ్ళుతెరిచి గమనిస్తే ఎంత బాగుంటుంది! ప్రేక్షకుల ‘‘అభిరుచి’’ అనే వంకతో అందర్నీ పక్కదారి పట్టిస్తే నిర్మాత పరిస్థితి అధోగతే! షుగరువ్యాధి ఉన్న కొద్దిమందిని దృష్టిలో ఉంచుకొని పాయసాన్ని చేదుగా చేసి అందరికీ ఇస్తే దాన్ని కాలువలో పోసుకోవడమేగా చివరికి! విలువల్లేని సాహిత్యం, రణగొణ ధ్వనుల సంగీతం ఎక్కువకాలం నిలబడవు. ప్రజలు చూస్తున్నారనుకుంటున్నారేమో! నిర్మాతల చేతులు కాలిపోతున్నాయి. సినీరంగమే బావురుమనే పరిస్థితులు వచ్చేశాయి. కొత్త పాటలు రాగానే ముందు పాటలు గోవింద….! కానీ లవకుశ, మాయాబజార్‌, మిస్సమ్మ, దేవదాసు, ఆత్మీయులు, అప్పుచేసి పప్పుకూడు, ప్రేమనగర్‌ లాంటి చిత్రాలు ఎప్పుడు విడుదలయ్యాయి, ఇప్పటికీ ప్రజలు ఎందుకిష్టపడుతున్నారు. అందుకే, సంగీత దర్శకులు పాటలోని మాటలు వినిపించేలాగ మంచి ట్యూన్‌ కట్టాలి. ఆ బాధ్యత దర్శకులదే. మంచి ట్యూన్‌ లేకపోతే పాట బ్రతకదు. అది గుర్తుంచుకోవాలి. అలాగే పాటల రచయితలు ఇంగ్లీషు, హిందీ, తెలుగు పదాలతో పాటల్ని రాస్తున్నారు. శ్రోతలు కొంత కాలం వింటారు. చాలా తొందరగా మర్చిపోతారు. రచయితలూ ఆలోచించాలి. వాళ్ళకు డబ్బు కావాలి, హాయిగా బ్రతకాలి. మరి, వాళ్ళు రాసిన పాటలు దశాబ్దాల పాటు బ్రతకద్దూ!

నేటి సినిమాలను వ్యాఖ్యానిస్తూ ప్రముఖ నటులు శ్రీ జగ్గయ్యగారు ఏమన్నారో చూడండి: ‘‘ఈ మధ్య వస్తున్న తెలుగు చిత్రాలను చూస్తుంటే పాతతరం నటులైన మేము రాజీపడలేకపోతున్నాం. కుటుంబంతో సినిమాకు పోలేని పరిస్థితి. కాసులు కూడగట్టుకోవాలను కోవడం నిర్మాతల అవివేకం. ఈ చిత్రాలని విద్యార్థులే బహిష్కరించి సమాజానికి మార్గదర్శకులు కావాలి’’. (10-7-1996, ఆంధ్రప్రభ సచిత్రవార పత్రిక)

ఈ సందర్భంలో శ్రీ గుమ్మడి వెంకటేశ్వరరావు గారు చేసిన వ్యాఖ్య కూడా గుర్తు పెట్టుకోవలసినదే: ‘‘ప్రస్తుతం ఒక వింత ప్రవాహంలాగా అతి వేగంగా కొట్టుకు పోతున్న నేటి సినిమా రంగంలో ఎంటర్‌టైన్‌మెంట్‌ అంటే అసభ్యం, అశ్లీలం, ద్వంద్వార్థాల మాటలు, బూతు మాటలనే అర్థం చెప్పుకుంటున్న ఈ రోజుల్లో నాలాంటి చాదస్తపు కళాకారుడు కొట్టుకు పోగలడే తప్ప ఎదురీదలేడు.’’ (14-4-1997 ‘‘ఈనాడు సినిమా’’.)

అక్కినేని నాగేశ్వరరావుగారు ఏమన్నారో చూడండి: ‘‘….సినిమాల్లో అయితే సాంకేతిక విప్లవం కనిపిస్తోంది. గ్రాఫిక్‌ ప్రభావం ఎక్కువైంది. కథ పలుచబడింది.’’ (‘‘ఈనాడు సినిమా’’ జనవరి 13. 2006)

సుప్రసిద్ధ నటీమణి భానుమతి గారి వ్యాఖ్య కూడా పదును గానే ఉంది: ‘‘ఈనాడు డబ్బులకోసం బూతుచిత్రాలు తీస్తున్న నిర్మాతల కంటే, పొట్ట కూటికోసం ఒళ్ళు అమ్ముకుంటున్న ఆడది నయం అనిపిస్తోంది’’. (7-8-1996. ‘‘ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక’’.)

‘‘తెలుగు సినిమా విషయానికి వస్తే, వాటివాటి అవసరాన్ని బట్టి కత్తిరించుకుంటూ కథలకి విశాలత్వం లేకుండా చేశాయి. తెరమీద కనిపించే జీవితపు పరిమితులు, పాత్రల పరిమితులు మరీ విసిగించి పారేసి ‘ఇంతకంటే మంచి సినిమాని తెలుగులో చూడలేమా’’ అని మనం వాపోయేలా చేశాయి. గత కొద్ది సంవత్సరాలుగా తెలుగు సినిమాలు ఎంత కమర్షియల్‌ సక్సెస్‌ సాధిస్తున్నాయో అంత చొప్పదంటు కథల్ని అల్లుతున్నాయి’’. అని ఇంద్రగంటి కిరణ్మయి గారు తన ‘‘సినిమాలోచన’’ గ్రందం¸లో వ్యాఖ్యానించారు.

‘‘మనం సినిమా థియేటర్లో కూర్చున్నాం అనే ఆలోచన రానీయకుండా తనలో లీనమై, తనతోపాటు మనల్ని కూడా ఆ వాతావరణంలో విహరింపజేసేదే నిజమైన సినిమా’’.

‘‘మంచిని చెడుని కూడా సమంగా ప్రదర్శించే సినిమా చాలా శక్తిమంతమైన మాధ్యమం. రెండు వైపులా పదును గల కత్తి. దాని ప్రభావం ఏమిటో, ఎంతవరకో కాలమే నిర్ణయిస్తుంది.’’ అంటూ శ్రీ ఎస్‌.వి.రామారావుగారు తన ‘‘తెలుగుతెర’’ గ్రంథంలో తెలియజేశారు.

‘‘ఆధునిక యుగంలో కళాపోషణకు సినిమా రంగం బలమైన సాధనంగా పరిణమించింది. కానీ, ఈ పరిశ్రమ ప్రారంభమైన తొలిదశల్లో కనిపించిన విలువలు కొంతకాలం తరువాత క్షీణించడం మొదలయింది. వ్యాపారానికి ప్రాముఖ్యత పెరిగి, జనాకర్షణ నెపంతో, చౌకబారు సంగీతమూ, జీవంలేని సాహిత్యమూ అందులో ప్రవేశించాయి’’ అని శ్రీ ఎం.వి.రమణారెడ్డి గారు తను రచించిన ‘‘తెలుగు సినిమా – స్వర్ణయుగం’’ గ్రంథంలో తన అమూల్యమైన అభిప్రాయం వ్యక్తం చేశారు.

‘‘తెలుగు సినిమా పయనం ఎటువైపు’’ – అనే తన వ్యాసంలో ప్రసిద్ధ రచయిత శ్రీ వాసిరాజు ప్రకాశం గారు వెలిబుచ్చిన అంశాలు కూడా విచారించదగ్గవే: ‘‘ఇంత వినోదం చాటున నైతిక విలువలు ఏమవుతున్నాయి? యువతరాన్ని ఆకర్షించే ప్రయత్నంలో శృంగారం శ్రుతి మించింది కదా? బూతును నియంత్రించవలసిన సెన్సార్‌ ప్రేక్షక పాత్రకే ఎందుకు పరిమితం అయ్యారు? ఇలా ఎంతకాలం కొనసాగుతుంది. సినిమా అనే సమగ్ర కళాస్వరూపానికి పూర్వవైభవం వస్తుందా? లేక తెలుగు సినిమా నైతిక విలువల చౌరాస్తాలో బందీగా ఇలా ఉండి పోవలసిందేనా? ఈ సమస్యలకు పరిష్కారం ఏమిటి? సినీపరిశ్రమలో పెద్ద తలలు ఒక్క సారయినా ఒకచోట కూర్చొని, పరిస్థితిని సింహావలోకనం చేసి, ఈ పరిస్థితి మెరుగయ్యేందుకు మార్గోపాయాలు ఆలోచించకుండా వుంటే …. ఈ పరిస్థితే నానాటికి తీసికట్టు నాగం బొట్టు!’’ (ఆదివారం ‘‘వార్త’’, 31 మార్చి 2002)

‘‘నిర్మాతగా నాలుగు దశాబ్దాలు’’ అనే తన వ్యాసంలో ప్రముఖ సినీరచయిత శ్రీ వాసిరాజు ప్రకాశం గారు ఇలా వివరిస్తున్నారు:

‘‘నాలుగు దశాబ్దాల కాలం ఓ అగ్రశ్రేణి నిర్మాత, దర్శకుడుగా తెలుగు తెరను శాసించిన శ్రీ వి.బి.రాజేంద్ర ప్రసాద్‌ గారు ప్రస్తుతం మవునంగా ఉన్నారు. ఈ రోజు ఎందుకు సినిమా నిర్మిచటం లేదన్న ప్రశ్నకు ఆయన వద్ద సంసిద్ధంగా ఉన్న సమాధానం ఒకటే! ‘‘ఆనాటి స్వర్ణయుగంలో పనిచేసిన మా తరం వారికి ఇప్పుడు సిగ్గు విడిచి సినిమాలు తీయాలి. ఆ పరిస్థితి అవసరం లేదు, కనుక సినిమాలు తీయటం లేదు’’. ఈనాటి పరిస్థితులకు తగినట్లు మెట్లు దిగలేక, విలువలు కోల్పోలేక మౌనరాగాలు ఆలపిస్తున్నారు’’. (ఆదివారం ‘‘వార్త’’, 8 డిసెంబరు 2002)

అధ్యాపకులు, మాజీ పార్లమెంట్‌ సభ్యులు, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు అయిన డా॥ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ గారు ‘‘ఇది ఉపాధ్యాయుడిగా నా ఆకాంక్ష’’ అనే తన వ్యాసంలో నేటి సినిమాలపై వ్యక్తం చేసిన అభిప్రాయాలు కూడా మనమంతా మననం చేయదగినవే:

‘‘ప్రస్తుతం వస్తున్న తెలుగు చలన చిత్రాలలో అధ్యాపకులను హీనంగా, జుగుప్స కలిగించే విధంగా చూపిస్తున్నారు. ఉపాధ్యాయ విద్యార్థి సంబంధాలను వికృతంగా చిత్రించటం పరిపాటిగా మారింది. గత మూడు సంవత్సరాలుగా వెలువడుతున్న చాలా సినిమాల ఇతి వృత్తాలు కళాశాల జీవితంతో ముడిపడిన టీనేజీ ప్రేమ గాథలై ఉండడం గమనార్హం. విద్యాలయాలను ప్రేమ సంబంధాల కేంద్రాలుగా, విద్యార్థినీ విద్యార్థులను కేవలం ప్రేమ పక్షులుగా చిత్రీకరిస్తున్నారు. ఇది హద్దులుదాటి అధ్యాపకులను కూడా విద్యార్థుల ప్రేమ కలాపాలను వర్ణించే వారుగా, అతి జుగుప్సాకరంగా చిత్రిస్తున్నారు. అధ్యాపకులను విదూషకులుగా, జోకర్లుగా, ప్రేమ వ్యవహారాలు నడిపే బ్రోకర్లుగా, నైతిక విలువలు లేని వాజమ్మలుగా చిత్రిస్తున్నారు’’.

‘‘సామాన్య ప్రేక్షకుల ఆలోచనా సరళి పై సినిమాల ప్రభావం చాలా ఎక్కువుగా ఉంటుందన్న సంగతి మనకు. తెలుసు. ఈ సందర్భంగా గమనించాలి – ‘‘నాలుగు గోడల మధ్య నీలినీడల నడుమ చూసే సినిమా ప్రభావం గోడలుదాటి మొత్తం సమాజాన్నే శాసించగలిగే స్థాయి కలిగి ఉంటుంది. ఈ ప్రభావం మన ఆలోచనా ధోరణిపై ప్రస్ఫుటంగా కనపడుతుంది. ప్రేక్షకుల అనుభూతులను తీవ్రస్థాయిలో ప్రతి స్పందింప చేసే రీతిలో ఈ ప్రభావం విస్తరిస్తున్నది. అందుచేత మంచిగాని, చెడుగాని, సత్ప్రవర్తనను గాని, విద్రోహ చర్యలను కాని ప్రోత్సహించే మహత్తర సాధనంగా దీనిని గుర్తించి, దీనిపై నియంత్రణను సమాజ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది’’.

‘‘ప్రస్తుతం సినిమాలలో చూపిస్తున్న అసభ్యకరమైన దృశ్యాలను ఆదర్శంగా, ప్రేరణగా తీసుకొని చాలాచోట్ల విద్యార్థులు తమ తమ కళాశాలల్లో అనుచితంగా ప్రవర్తిస్తున్న సంగతి మనం నిత్యం చూస్తున్నాం’’.

‘‘జాతి నిర్మాణ ప్రక్రియ తరగతి గదులలో ప్రారంభ మవుతుందన్న కొఠారి భావాన్ని మనం అంగీకరిస్తే, ప్రస్తుతం సినిమాలు చూపిస్తున్న తరగతి గదుల వ్యవహారం, ఉపాధ్యాయ, విద్యార్థినీ విద్యార్థుల సంబంధాలు గమనిస్తే మన జాతి భవిత ఏమౌతుందో విజ్ఞులందరూ ఆలోచించవలసిన తరుణం ఆసన్నమయింది’’.

(‘‘ఆదివారం ఆంధ్రజ్యోతి’’ – 16 మార్చి 2003.)

‘‘కళ సరియైన ప్రయోజనం సాధించకపోయినా, ప్రజలకు దూరమైపోయినా, ప్రజలను మాయోపాయాలతో మభ్యపెట్టినా సరియైన విమర్శద్వారా ఈ లోపాల్ని చక్కబరచవచ్చు. విమర్శవల్ల కళలు తమ బాధ్యతను గుర్తించగలుగుతాయి’’ అని ప్రసిద్ధ కథా రచయిత కొడవటిగంటి కుటుంబరావు గారు విమర్శల మీద తనకున్న ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కానీ, కళగా పేరొందిన సినిమా తన బాధ్యతను గుర్తించలేదనే గట్టిగా మనం చెప్పవలసి వస్తుంది.

దర్శకేంద్రులు, దర్శక రత్నలు, నటసామ్రాట్‌, నటరత్నలు, ప్రతిష్టాత్మకమైన సాహితీ పురస్కారాలు అందుకున్న కవులు, రచయితలు గల తెలుగు సినీరంగానికి ‘‘తెగులు’’, ‘‘చీడ’’ పట్టుకున్నాయి. వ్యాపార ధోరణి అధికం కాగా, గాడితప్పి సినిమా ముందుకు ‘‘జారి’’ పోతుంది. సమాజాన్ని పెడదారి పట్టిస్తున్నాయి నేటి సినిమాలు. మార్పు సహజమే, అనివార్యమే. కానీ, శుభదాయకమైన మార్పుకాదిది. ఆరోగ్యదాయకమైనది కూడా కాదు. రంకుతనాన్ని, సెక్స్‌ని ప్రచారం చేసే సాధానాలుగా నిలిచిపోతున్నాయే తప్ప, నేటి సినిమాల వల్ల ప్రయోజనమేమీ కన్పించడంలేదు. ప్రేమంటే ఏమిటో ఎరుగని అమాయక పసివారి హృదయాల్లో విషబీజాలు నాటుతున్నాయి నేటి సినిమాలు. నేడు సమాజంలో పెచ్చు పెరిగిన మానభంగాలు, హత్యలు, అత్యాచారాలు, హింసాదౌర్జన్యాలకు నేటి సినిమాలే ముఖ్య కారణమంటూ ఎందరో తమ ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మధురమైన సంగీతం, మనోహరమైన గీతాలు, ఆహ్లాదకరమైన సన్నివేశాలతో మంచి కథాబలం కలిగిన సినిమాల కోసం ప్రజలు తహతహ లాడుతున్నారు. ఎదురు చూపులు చూస్తున్నారు. అలాంటి ‘‘విలువలు’’న్నటువంటి సినిమాలు తప్పక వస్తాయని ప్రజలు గంపెడాశతో ఉన్నారు. ప్రజల్ని నిరాశపరిచి, వారి ఆశల్ని నట్టేట ముంచవద్దని దర్శక, నిర్మాతలకు, నటీనటులకు, చివరగా రచయితలకు వినయ పూర్వకంగా విన్నవించుకుంటున్నాను.

నా ఈ వ్యాసానికి సహాయపడిన గ్రంథాలు:

  1. ‘బ్లాక్‌ అండ్‌ వైట్‌’’, రావికొండలరావు.
  2. ‘అలనాటి చలన చిత్రం’’, కె.ఎన్‌.టి.శాస్త్రి.
  3. ‘తెలుగు తెర’’, ఎస్‌.వి.రామారావు.
  4. ‘తెలుగు సినిమా స్వర్ణయుగం’’, డా॥ ఎం.వి.రమణారెడ్డి.
  5. ‘‘సినిమా లోచన’’, ఇంద్రగంటి కిరణ్మయి.
  6. ‘సినిమా పాటలు – వ్యక్తిత్వ వికాసం’’, నారాయణ డి.వి.వి.ఎస్‌.

రచయిత్రి, రచయితలందరకూ వినయపూర్వకంగా కృతజ్ఞలు తెలియజేసుకుంటున్నాను.*