(పెమ్మరాజు వేణుగోపాలరావు గారు అట్లాంటా లోని ఎమరీ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. అనేక కవితలు, కథలు, అనువాదాలు రాశారు. )
కవిత
కాలజల సమన్వితమైన నదిని చూసి
కాలమూ మరొక నదేనని గమనించి
నది మాదిరినే మనమూ దారి తప్పిన వారమని
మన రూపాలూ నీళ్ళవలె
మారిపోతుంటాయని
గమనించడం
తనే మరొక కలయినా “మెలకువ”
తను నిద్రించటం లేదని కలగంటుందని
మన శరీరాలు నిత్యం భయపడే చావు
చావు కాదు ప్రతి రాత్రి వచ్చే నిద్ర అని
గ్రహించడం
ప్రతిరోజునీ, ప్రతి సంవత్సరాన్నీ
మానవజీవితానికి చిహ్నాలని
గమనించి
అన్నేళ్ళ దారుణాన్ని
పాటగా, మాటల గొణుగుడుగా, గుర్తుగా
మార్చడం
చావులో నిద్రని
సూర్యాస్తమయంలో విషాదమైన బంగారాన్ని
చూడటం
అదీ, చావు లేనిదీ బీదరికంలాటిది
కవిత్వం.
సూర్యోదయాస్తమయాల వలే
మళ్ళీ తిరిగి వచ్చేది కవిత్వం.
ఒకోసారి గమనించండి
ఏ సాయంత్రమో అద్దంముందు నుంచుంటే
ఎక్కడినుంచో ఏదో ముఖం
మనకేసి చూస్తున్నట్లుంటుంది.
మనకి మన ముఖాన్ని చూపించే
అద్దంలా ఉండాలి కవిత్వం.
వింతలెన్నో చూసి మొహమ్మొత్తిన యులిసెస్
పచ్చని తన స్వంత ఊరు ఇథకా చూడగానే
ప్రేమతో కళ్ళనీళ్ళు బెట్టుకున్నాడట
కవిత్వం అంటే ఎల్లప్పుడు పచ్చగా శోభిల్లే
ఆ ఇథకా లాంటిది; వింతలు చూపేది కాదు.
కవిత్వం అంతులేని నది.
ఒక్కచోటే ఉన్నట్లే కనిపిస్తూ
ప్రవహిస్తూ ఉంటుంది.
ఒకసారి ఒకలాగ
మరోసారి ఇంకోలాగ
అస్థిరంగా ఉండే
హిరాక్లిటస్‌కి అద్దంలా
అంతులేని నది.
Jorge Luis Borges (1899 – 1986) is an Argentine poet, essayist, and short-story writer, whose centenary is being celebrated this year all over by the literary world. He was born in Buenous Aires and educated in Europe. He settled in Buenous Aires to become one of the most influential literary figures of this century.. His tales of fantasy and dream worlds have become classics of the twentieth century. With eye problems, he became totally blind in the last decades of his life. His greatest contribution is his rediscovery of the Spanish language. He took the Spanish language towards regions that had not before been visited using words with the greatest of clarity and precision than any Spanish writer of this century.