నేటి ‘కళ’లకు నాటి జానపదులే పురాతన పునాదులని చెప్పవచ్చు. సాహిత్యపరంగా నేడు గ్రంథ రూపంలో ఉన్న గాథలన్నీ నాడు జానపదులు మౌఖికంగా పాడుకొన్న పాటలే! తరతరాలుగా అవి ప్రజల నాల్కల మీద నాట్యంచేస్తూ వర్తమాన కాలంలో గ్రంథరూపాన్ని దాల్చాయి. జానపదులు పాడుకొన్నవి, చెప్పుకొన్నవి అన్నీ నాటి జనజీవన విధానం ప్రతిబింబించే అనంతమైన సాహిత్యమని చెప్పవచ్చు.
కాయకష్టం చేసుకొంటూ జానపదులు ప్రకృతి నుద్దేశించి ఉచ్ఛరించిన ప్రతి పలుకును ఒక పాటగా భావింపవచ్చు.
‘తెలుగువానికైత దేశ దేశాలకు
నొజ్జ బంతియగుచు విజ్జుగాక
ప్రాజ్ఞుడై కళాతపస్వియై విశ్వ సా
హిత్య రాజ్యమాంధ్రుడేలు గాక!’
అని ‘తెలుగులెంక’ తుమ్మల వారన్నట్టు నాటి నన్నయ నుంచి నేటి నాగభైరవ, సినారె వరకు పండితులు, కవులు, రచయితలు అందరూ పల్లెల్లో జన్మించిన వారే! మహాగ్రంథాలు, ప్రబంధాలు, కావ్యాలు, నాటకాలు, నవలలు మొదలైన సమస్త సాహితీ ప్రక్రియలన్నీ గ్రామవాసులు సృష్టించినవే!
సంగీతపరంగా బిడ్డ పుట్టినప్పటి ‘పురిటి పాటలు’ మొదలుకొని సమస్త గేయాలూ జానపదులు ఆశువుగా పాడినవే! ‘నిద్రపోర తండ్రి నిద్రపోరా!’ అనే ఊయల పాటలు, ‘లాలి పరమానంద లాలి గోవిందా!’ అనే లాలిపాటలు, ‘చందమామ రావే జాబిల్లి రావే!’ అనే గోరుముద్దల పాటలు, ‘సువ్వీ సువ్వీ సువ్వాలమ్మా!’ అనే దంపుడు, తిరగలి పాటలు, ‘సమర్తాయెనే – చిన్నది పెద్ద మనిషాయెనే!’ అనే సమర్త పాటలు, ‘సీతమ్మ పెళ్ళి కూతురాయెనే!’ అనే పెళ్ళిపాటలు, ‘గొబ్బీయలో గొబ్బీయలో!’ అనే సంక్రాంతి గొబ్బిపాటలు, ‘గుప్పెడు నారుగుత్త గవేసీ!’ అనే నాట్లు వేసే పాటలు, ‘కోతలు కోసీ – ఓదెలు వేసీ!’ అనే పంటకోత పాటలు, ‘పొలియో పొలీ – రావేలు గలవాడ రార పొలిగాడ’ అనే తూర్పార పాటలు మొదలుగా ప్రతి పనిని వారు ఆనందోత్సాహాలతో పాటల రూపంలో వ్యక్తంచేస్తూ ఉండేవారు. అంటే – ప్రతి పనీ ఆనాడు కళాత్మకంగా ఉండేదన్న మాట. ‘కళ’నాడు అన్ని రూపాలుగా ప్రతిబింబించేదన్నది నిర్వివాదాంశం.
నాడు ప్రతి ఒక్కరూ జానపద గేయ రూపకాలు హృద్యంగా ప్రదర్శించే వారు. సంక్రాంతి పండుగ రోజుల్లో ‘వచ్చిందోరన్నా – సంక్రాంతి వచ్చిందోరన్నా!’ అనే నాట్యరూపకాన్ని బృంద గానంతో ప్రదర్శించే వారు. ‘కోడిబాయె లచ్చమ్మదీ’ అనే పాట నాట్యంతో మేళవించి వాద్యాలతో కలిసి పాడుతూ ఆనంద హేలలో తేలియాడే వారు. ‘అంకాలమ్మో!’, ‘పోలేరమ్మో!’, ‘గంగాలమ్మో!’ అనే పూనకం పాటలతో ఆయా దేవతలు పూనినట్టు చూసేవారిని గగుర్పాటు చెందేటట్టు అభినయించి వారిని తన్మయత్వంలో ముంచెత్తే వారు.
భారతీయ సంస్కృతికి, సంప్రదాయానికి సంబంధించి ‘కళలు’ ఎన్నెన్నో రూపాలుగా విలసిల్లాయి ఆనాటి గ్రామాల్లో. పురాణ గాథలకు సంబంధించిన ‘కోలాటాలు’, ‘కులుకు భజన’, ‘పండరి భజన’, ‘దైవ భజన’ భక్తి శ్రద్ధలతో, నాట్యవైదుష్యంతో కళాత్మకంగా ప్రదర్శింపబడుతుండేవి ఆనాటి పల్లెల్లో!
కోలాటాలు రెండు, మూడు విధాలుగా ఆడేవారు. కాళ్ళకు గజ్జెలు కట్టుకని, కోలాటం కర్రలు పట్టుకొని గుండ్రంగా నిలబడి పాటకు తగిన అడుగు 9(కోపు) చొప్పున ‘ఉద్దిమానుకోపు’, ‘కత్తెరకోపు’, ‘బురుజుకోపు’, ‘జందెంకోపు’ అంటూ అడుగుకొక కోపు పేరుతో దానికి తగిన పాటలతో కోలాటమాడే వారు. ‘ఖడకోపు’ కోలాటంలో ఎత్తులో ఒక చెక్క బిళ్ళను కట్టి దాన్నుండి వ్రేలాడదీసిన నూలు తాళ్ళను కోలాటమాడే వాళ్ళు పట్టుకని జడకోపుపాట పూర్తయ్యేంతవరకు అడుగులు వేస్తూ ఆడితే అన్ని తాళ్ళు మనోజ్ఞమైన ఒక పెద్ద జడ అల్లినట్టు తయారవుతుంది. తిరిగి మళ్ళీ అడుగువేసి ఆడితే ఆ అల్లిక అంతా విడిపోతుంది. ఏ ఒక్కరు అడుగు తప్పు వేసినా ఈ అల్లిక చిక్కుముడి పడుతుంది.
‘రార వేణుగోప బాలా! రాజిత సద్గుణ జయశీలా’
‘ఓం గజరాజవదనం భజే – మముపాలాయ గజరాజ వదనం భజే!’
‘కూర్చోని చెరిగే చెలియకురులపై తుమ్మెద లాడుచున్నవి – గండు తుమ్మెద లాడుచున్నవి’
‘ఓహో! నిండిపారితీవి నురుగులు కమ్ముచు – ఎంత శౌర్యమె నీకు గుండ్లకొమ్మా!’
ఇలా ఎన్నో పాటలు ఏ పాటకు తగిన అడుగు, ఆ అడుగుకు తగిన తాళం, వాద్యాలతో కోలాట మాడుతూ ప్రతిపాట చివర ‘మనోహర ఇందు రారా – నా మనవిని గైకొని పోరా!’ వంటి ‘ఉసెత్తు’ (వేగం) కీర్తనలతో పాట ముగిస్తారు. తిరునాళ్ళలో ఆర్కెస్ట్రాతో కూడిన అన్ని హంగులతో కోలాటమాడి అందరిని ముగ్ధులను చేసేవారు ఆనాటి కళాకారులు.
‘కులుకు భజన’, ‘బృందావనం భజన’ ప్రక్రియలో ‘ఆర్యులారా! ఆర్యులారా! ఆర్యులారా! అందరికి వందనము ఆర్యులారా!’ అంటూ భజన కళాకారులు ఒక చేతిలో గలగలలాడే చెక్కలు పట్టుకని, ఒక చేతిని ముద్రగా ఉంచి గుండ్రంగా నిలబడి పాటకు తగిన అడుగువేస్తూ ఆడేవారు. వీటిలో భారత, రామాయణ గాథలకు సంబంధించిన పాటలు ఎక్కువగా ఉంటాయి. ఈ భజనల్లో కొన్ని అడుగులు భరత నాట్యం, కూచిపూడి సంప్రదాయానికి సంబంధించినవి ఉంటాయి.
‘పండరి భజన’ భక్తిరస ప్రధానమైన పండరి నాథుని కొలిచే భజన. పంచెకట్టుకని, కాళ్ళకు గజ్జెలు కట్టి, ‘అల్పి’ (ఊలు కుచ్చులు, పూసలు అల్లిన ఒక రకం కాషాయ రంగు చొక్కా లాంటిది) తొడుక్కొని చేతిలో కాషాయ రంగు పండరి జెండా పట్టుకొని ‘రండయ్యో! రండయ్యో పండరి పురమునకు’ మొదలైన పాటలు పాడుతూ పాటకు తగిన అడుగుతో భజనకోరులు ఆడేవారు. ఇలా భక్తి పారవశ్యాలతో పాడుతూ, సులభమైన అడుగులు వేస్తూ భజన చేస్తూ వారి ప్రదర్శన తన్మయత్వంలో ముంచి తేల్చుతుంది.
ఇంకా దేవాలయాల్లో భక్తజన సందోహం తాళం వేస్తూ భక్తి గీతాలు ఆలపించటం గ్రామాల్లో నిత్యమూ జరుగుతుండేవి. నాటి సాహిత్యం, సంగీతం, నాట్యం, అభినయ వీక్షణం – అదో ఆనందహేల! దీక్ష, పారవశ్యం, ఏకాగ్రత మేళవించిన త్రివేణీ సంగమం లాంటి కళాత్మకమైన ప్రదర్శనలవి.
నాడు గ్రామాల్లో ‘గంగిరెద్దుల వారు’ ఎద్దును రామునిగా, ఆవును సీతమ్మగా అలంకరించి సీతారాముల కళ్యాణం జరిపించి ప్రజలను ఆనందపరవశులను చేసేవారు. నాటి పామరులైన గంగిరెద్దుల వారు పశువులతో ఈ ప్రయోగం చేయించి సీతారాములను, వారి సంభాషణలను కర్ణపేయంగా, నయనానందకరంగా ఆడించిన దర్శకులుగా, నిర్మాతలుగా ఈనాటికీ మనం వారికి ఋణపడి ఉన్నాం.
రామాయణ భారతాదులను వినటమే కాని పాత్రల స్వరూప, స్వభావాలను, వేషధారణను ప్రజలు చూడని పూర్వకాలంలో కళాత్మకంగా రూపొందించిందే ‘తోలుబొమ్మలాట’. నాడు ఈ తోలుబొమ్మలాట తెలుగు గ్రామాల్లో ప్రఖ్యాతి గాంచి ప్రజాదరణ చూరగొన్నది. బొమ్మలాట కళాకారులు గ్రామవాసులే అయినా వారు భారత రామాయణాల్లోని పాత్రలను పూర్వకవులు వర్ణించిన దానికి ప్రతిరూపంగా ఆ బొమ్మలను మేకతోలుపై నమూనాలు గీసుకొని కత్తిరించుకనే వారు. బొమ్మకు ఏ కీలుకు ఆ కీలు కదలికలు ఉండేలా తయారుచేసి పాత్రకు తగిన రంగులు అద్ది జీవకళ ఉట్టి పడేటట్టు వస్త్రాభరణాలు చిత్రీకరించే వారు. రథాలు, గుర్రాలు, ఏనుగులు మొదలైన బొమ్మలు వీరి ప్రావీణ్యం, కృషి, తపస్సులలో పరిణతి చెంది ఆయా పాత్రలు మన కళ్ళముందు నిలిచేవి. కళకోసం బ్రతికిన వారి కృషి అనన్య సామాన్యమైనది. వ్యాపార పథంలో సాగిపోయే నేటి సినీ పరిశ్రమను వాటితో పోల్చలేము. కేవలం ఒక తెల్లపరదా, దీపాలు (ఆ తర్వాత పెట్రోమాక్స్ లైటులు), ఒక చెక్కబల్ల సహాయంతో శ్లోకం, పద్యపఠనం, అర్థ తాత్పర్యాలతో నవరసా లొలికిస్తూ ఒంటి చేత్తో బమ్మలను ఆడించే ఆ అద్భుత కళాప్రదర్శన మనిషి మనినంతకాలం మరచిపోయే ప్రక్రియ కాదు. ‘జుట్టు పోలిగాడు’, ‘కేతిగాడు’, ‘బంగారక్క’ల హాస్యరస పోషణ ఎంత ఉత్సాహభరితంగా ఉండేదో, ఎంత కడుపుబ్బ నవ్వించేదో మాటల్లో గాని, రాతల్లో గాని వర్ణించనలవి కాదు. ఆయా పాత్రలను బొమ్మల రూపంలో ఆడించే కథా కథన కౌశలం, యుద్ధ ఘట్టాల్లో రథాలు, గుర్రాలు, ఏనుగులు మొదలైన వానిని నడిపించటం, బాణయుద్ధం, మల్లయుద్ధం, మీసం దువ్వటం లాంటి దృశ్యాలను నేపథ్య సంగీతం, గానాలతో యదార్థంగా మన కళ్ళు ముందు జరిగినట్టు ఆడించే వారి కళావిన్యాసం ఆనాటి వారికే చేతనయింది. ఈ ప్రదర్శనల ద్వారా నాడు పామరులు సైతం భారతాది కథలను, పాత్రల స్వభావాలను, నాటి సంస్కృతి – సంప్రదాయాలను తెలుసుకోగలిగారంటే ప్రజలను తోలుబొమ్మలాట అంతగా ప్రభావితం చేయబట్టే! గ్రామాల్లో నేటికీ ఆ సంప్రదాయపుటానవాళ్ళు అప్పుడప్పుడు మనల్ని జాగృతం చేస్తూనే ఉన్నాయి.
తోలుబొమ్మ లాటల్లాగే వీధి నాటకాలు కూడా అంతే ఖ్యాతి గడించాయి. వీధి నాటకాలు ఆడేవాళ్ళు ఒక తెగకు చెందిన వారు. వీరు వివిధ ప్రాంతాలు పర్యటిస్తూ ఒక్కొక్క గ్రామంలో కొన్ని రోజులుండి, కొన్ని కుటుంబాలపేర నాటకాలు ఆడి వారి నుండి సంభావనలు, బహుమతులు, భోజన వసతులు పొందేవారు. వీరు వేషధారణకు కావలసిన దుస్తులు, కిరీటాలు తామే తయారుచేసుకొని వారి కళానైపుణ్యాన్ని, సంగీత ప్రావీణ్యాన్ని ప్రదర్శించే వారు. వీరు పౌరాణికాలే కాక చారిత్రక, జానపద నాటకాలను స్త్రీ, పురుషులు కలిసి నటించే వారు. వీధి నాటకాల్లో ‘సారంగధర’ నాటకం ప్రముఖంగా ప్రదర్శించే వారు. సూత్రధారునితో నాటకం ప్రారంభించి నాటక లక్షణాలతో నాటకం రసరమ్యంగా ప్రదర్శించే వారు. వీరి హాస్య రసపోషణ ఎంత అద్భుతంగా ఉంటుందో చూసిన వారికే విదితమవుతుంది.
గ్రామంలో ప్రతి ఇంటి ముందు ప్రదర్శిస్తూ ఆంధ్ర దేశమంతటా ప్రజలను ఉర్రూత లూగించిన గొప్ప నాటక ప్రక్రియ ‘పగటి వేషం’ Mobile Drama). పగటి వేషగాళ్ళ చాతుర్యం, బుద్ధికుశలత, నటనా వైదుష్యం నిరుపమానమైనది. ఎక్కడో స్టేజిమీద ఉంది నటించటం కాదు – ప్రజల మధ్య ఉండి సందర్భోచితంగా హావ, భావ, నటనా, సంభాషణా చాతుర్యంతో మనల్ని మనం మరచిపోయేటట్టు ఏ జంకు, గొంకు లేకుండా నటించడం అంత సులభం కాదు.
‘గీతే వాద్యే తథానృత్తే
…………….
త్యక్త లజ్జ స్సుఖీభవేత్’
అని శాస్త్రకారులు అన్నట్టు ఇలా పగటి వేషగాళ్ళు ప్రజల ముందు వారి కళానైపుణ్యాన్ని ప్రదర్శించి, ప్రదర్శనలోని సంప్రదాయాల్ని నిగ్గుదేల్చటానికి వారు చేసిన కృషి అనల్పమైనది. వారు ‘రామాంజనేయ యుద్ధం’, ‘భీమాంజనేయ యుద్ధం’, ‘కృష్ణార్జున యుద్ధం’, ‘శూర్పణఖ ముక్కు, చెవులు కోయటం’ మొదలైన ఘట్టాలు గ్రామంలో తిరుగుతూ రోజుకొక్కటి చొప్పున ప్రదర్శించే వారు. ‘అర్ధనారీశ్వరం’ వీరు ప్రదర్శిస్తే అద్భుతంగా ఉండేది. ఒకే కళాకారుడు శివుడు, పార్వతిగా మేకప్ చేసుకొని కేవలం ఒక ముసుగును ప్రక్కకు తొలగిస్తూ ఈశ్వరుడు, పార్వతుల రెండు రూపాలను ప్రదర్శించే ఆ టెక్నిక్‌కు జోహారులర్పించవలసిందే! ఇలా ఒక గ్రామంలో కొన్ని రోజులు ప్రదర్శించి చివర గ్రామస్తుల నుంచి సంభావనలు, బహుమతులు పొందేవారే ఈ వీధి భాగవతులు.
నాటి పెద్దలు గ్రామాల్లో జరిగే తిరునాళ్ళలో నాటకాలను, భజనలను ప్రదర్శింపజేయటమే కాక, కూచిపూడి, భరత నాట్యాలు, పాట కచేరీలు, మేళం, వాద్యకచేరీలు ఏర్పాటుచేసే వారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన భరత నాట్యం, కూచిపూడి నృత్యం వాసి తరుగని నాట్యకళలుగా తెలుగుదేశంలో గౌరవ ప్రదమైనవిగా, ఉన్నత విలువలుగలవిగా నేటికీ ఆరాధింపబడుతూనే ఉన్నాయి.
నాటక కళకు ఒక పరిపూర్ణత్వాన్ని కల్పించి నేటి సినిమాలకు తీసిపోని విధంగా తీర్చిదిద్దిన వారు ‘‘శ్రీ సురభి నాటక సంస్థ’ వారు. వారి కళాసేవ, కృషి, ఆరాధన ఎనలేనివి. వారు నాటకాల్లో చేసిన ప్రయోగాలు, అద్భుతాలు ఏ నాటికీ మరచిపోలేనివి. నారద మహర్షి దివి నుంచి భువికి దిగిరావటం, యమ ధర్మరాజు తన వాహనమైన మహిషంతో రావటం, బాలనాగమ్మ శునకంగా మారటం, మాయల ఫకీరు మాయలు, పుష్పక విమాన యానం, మయసభలోని విచిత్రాలు – ఇలా కనువిందు చేసే కమనీయ దృశ్యాలను ప్రేక్షకులు సంభ్రమాశ్చర్యలలో తిలకించే ప్రదర్శనలతో ఆంధ్ర, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో జైత్ర యాత్రలు సలిపిన వారు ‘సురభి నాటక సమాజం’ వారు. వీరి వైర్‌వర్కింగ్, సన్నివేశానికి తగిన సహజమైన సెట్టింగ్స్, మేకప్, హావ, భావ, నటనా చాతుర్యం ‘నభూతో నభవిష్యతి’. నాటకాలకు జీవం పోసి మరువలేని మధురానుభూతులను మనకు మిగిల్చిన వారు శ్రీ సురభి నాటక సంస్థ వారు. వీరి ప్రేరణతో నేడు గ్రామాల్లో వీరిని అనుసరించి, అనుకరించి ప్రదర్శింపబడే నాటకాలు వాటికి సజీవ దర్పణాలు.
గ్రామాల్లో రాత్రి వేళల్లో చెప్పే హరికథ, బుర్రకథ, జంగం కథలు, గొల్ల సుద్దులు మొదలైన సంగీత రూపకాలే కాక వారి కథా విధానం కూడా రసరమ్యంగా ఉండేవి. పల్నాటి కథ, కాటమ రాజు కథ, బాలనాగమ్మ కథ, దేశింగు రాజు కథ, కాంభోజ రాజు కథ, భట్టి విక్రమార్క కథలు, సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి కథలు మొదలైన ప్రసిద్ధి పొందిన గాథలు పైప్రక్రియల ద్వారా పండిత పామరులను సైతం ఆకట్టుకనే విధంగా చెప్పేవారు ఆనాటి గ్రామ కళాకారులు.
హరికథ పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు గారు, బుర్రకథ నాసర్‌గారు మన గ్రామవాసులే! వారిని ఆదర్శంగా స్వీకరించి ఎందరో కళాకారులు ఆకళారాధన చేస్తున్నారు నేడు. బుర్రకథ కేవలం ముగ్గురు కళాకారులతో నవరసాలొలికించే కథా విధానంలో రసరమ్యంగా సాగేది.
ఆంధ్రదేశమంతా ఉర్రూత లూగించిన ఎన్నో నాటకాలు – సారంగధర, పాదుకా పట్టాభిషేకం, మోహినీ భస్మాసుర, పాండవోద్యోగ విజయాలు, గయోపాఖ్యానం, రామాంజనేయ యుద్ధం, సత్యహరిశ్చంద్ర, బాలనాగమ్మ, చింతామణి, కన్యాశుల్కం, వరవిక్రయం – నేటికీ మేటి నాటకాలే!
ప్రముఖ నటులైన బళ్ళారి రాఘవ, స్థానం నరసింహారావు, బందా కనకలింగేశ్వరరావు, ఈలపాట రఘురామయ్య, అబ్బూరి వరప్రపాదరావు, షణ్ముఖి ఆంజనేయులు, నటీమణులు అబ్బూరి కమలాదేవి, టి.కనకం వారంతా తెలుగు పల్లె తల్లులుగన్నవారే! వీరు ఆంధ్రదేశంలోనే కాక ఇతర రాష్ట్రాలలో, విదేశాల్లో కూడా తెలుగుతేజాన్ని, మాధుర్యాన్ని పంచి పులకరింపజేసినారు. వీరి స్ఫూర్తితో ఇప్పటికీ గ్రామాల్లో పండుగ, పర్వదినాలను పురస్కరించుకని నాటకాలను నేర్చుకొని ప్రదర్శిస్తున్నారు ఔత్సాహికులు. నేడు గ్రామాల్లో పామరులలో సైతం ‘ఎక్కడి నుంచి రాక ఇటకు?’, ‘బావా ఎప్పుడు వచ్చితీవు?’, ‘జెండాపై కపిరాజు’, ‘సీతమ్మజాడ మీ చెవినేయమైతిమ’ మొదలైన పద్యాలు ఆ రాగాలను అనుకరించి పాడగలుగు తున్నారంటే అది పూర్వనటుల గానమాధుర్య, నటనా కౌశలాల ప్రభావమే! అప్పటి సినిమాల్లోని నటీనటులు సింహభాగం పల్లె వాసులే!
నేడు కొన్ని గ్రామాల్లో పండుగ దినాల్లో నాటకాలు ప్రదర్శిస్తూనే ఉన్నారు. కళాభిమానులు నేటికీ నాటక సమాజాలుగా ఏర్పడి నాటకాలు, నాటికలు, ఏకపాత్రాభినయాలు, మిమిక్రీలు, పాటల పోటీలు, నాట్యపోటీలు నిర్వహించి తగిన బహుమతులు ఇచ్చి నాటి కళలకు ఊపిరిపోస్తున్నారు.
గ్రామాల్లో జరిగే సంబరాల్లో కర్రసాము, మల్లయుద్ధం, గారడీలు, మోడీ, విచిత్ర వేషధారణ మొదలైన కళాత్మకమైన విద్యలు ప్రదర్శించే వారు నాటి పల్లె ప్రజలు.