అలుసవుతోన్న అమ్మ భాష

భాష అనేది మనిషి తన మనసులోని భావాన్ని ఎదుటి వారికి తెలియజేయడానికీ లేదా సమాచారాన్ని ఒక చోటి నుంచి మరోచోటికి చేరవేయడానికీ ఉపయోగపడే ఒక సాధనం. ఈ భాష ఒక నదీ ప్రవాహం లాంటిది. నది, తను పుట్టినచోట బయలుదేరి అనేక ప్రాంతాలగుండా ప్రవహిస్తూ దారిలో అనేక ఖనిజ లవణాలనూ, మలినాలూ మొదలైన పదార్థాలను తనలో ఇముడ్చుకుంటూ సముద్రంలో కలిసిపోయినట్టే, భాషకూడా పుట్టిన తరువాత ఒక తరం నుంచి మరో తరానికీ, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికీ ప్రవహిస్తూ అనేక మార్పులకూ చేర్పులకూ లోనవుతూంటుంది. భాష మన ఆలోచనలకు ఓ రూపాన్నిస్తూ, తద్వారా మన సంస్కారాన్నీ, సామాజిక స్థాయినీ ప్రతిబింబిస్తుంది. భాష ఒకవైపు సమాజాన్ని ప్రభావితం చేస్తూనే మరోవైపు అనేక ప్రభావాలకు లోనవుతుంది. ప్రస్తుతం తెలుగుభాషను ప్రభావితం చేస్తున్న కొన్ని అంశాలనూ, అవి మన భాషపై ఆదరణ తగ్గడానికి ఏ రకంగా కారణమవుతున్నాయన్న వివరాలనూ ఇక్కడ చర్చిస్తాను. దానితోపాటు నాకు తోచిన కొన్ని పరిష్కార మార్గాలను కూడా సూచిస్తాను.

కారణాలు

  1. సహజ సిద్ధమైనవి: దేశ కాలమాన పరిస్థితులను బట్టి ప్రతి భాషలోనూ మార్పులు వస్తాయి. ఇప్పటి తెలుగు భాషకూ కొన్ని తరాల ముందరి తెలుగు భాషకూ తేడా ఉన్నట్టే కాలంతో పాటుగా వచ్చే మార్పులు ఇవి. ఈ మార్పులు సహజ సిద్ధమైనవి. క్రొత్త పదార్థాలనూ, ప్రక్రియలనూ, యంత్రాలనూ, విషయాలనూ కనుగొంటున్న కొద్దీ వాటికి సంబంధించిన పదాలు కూడా భాషలో చేరుతూ ఉంటాయి. రైలు, బస్సు, పంట్లాం, ఇంటర్నెట్‌ వగైరా విరివిగా వాడబడేవి ఇతర భాషలనుంచి తెలుగులోకి వచ్చిన పదాలకు ఉదాహరణలు. వీటికి సంబంధించిన అనువాదాలు కృతకంగా ఉండడంతో పరభాషల నుంచి వచ్చిన పదాలే ప్రాముఖ్యాన్ని సంతరించుకుంటాయి. అదేవిధంగా భారతీయ భాషల నుంచి ఆంగ్లంలోకి వెళ్ళిన పదాలు కూడా కొన్ని ఉన్నాయి. వాటికి ఉదాహరణలు మంత్ర, గురు, నిర్వాణ, యోగ అనే పదాలు. ఈ రకమైన సహజ సిద్ధమైన మార్పులను ఎవరూ ఆపలేరు.
  2. ఆర్థిక పరమైనవి: ఆర్థిక శాస్త్రంలోని ఓ ముఖ్యమైన అంశం ఉత్పత్తికీ వినియోగానికీ ఉన్న అవినాభావ సంబంధం. వినియోగం ఎక్కువగా ఉన్నప్పుడు సరఫరా కూడా ఎక్కువగానే ఉంటుంది. ప్రస్తుతం ఆంగ్లభాష తెలిసిన వారికి ఉపాధి అవకాశాలు ఎక్కువా, తెలుగు మాత్రమే వచ్చిన వారికి తక్కువా కాబట్టి తెలుగు భాష నేర్చుకోవలసిన అవసరం తగ్గుతోంది. ప్రతివారూ తమ పిల్లలకు తెలుగు భాషను నేర్పించడంలో కన్నా, ఇంగ్లీషు, స్పానిష్‌, ఫ్రెంచ్‌, జెర్మన్‌ వగైరా భాషలను నేర్పించడంలోనే ఎక్కువ ఆసక్తి చూపిస్తారన్న విమర్శ ఉన్నా ప్రతి ఒక్కరి మనుగడకూ మంచి ఉద్యోగం అవసరం కాబట్టి ఉపాధి అవకాశాలను బట్టే భాషాజ్ఞానం కూడా ఏర్పడుతోంది. ఏ భాషకైనా అవసరం పెరిగినప్పుడు, దానిపై అభిమానం పెరుగుతుంది. అభిమానం పెరిగినప్పుడు ఔన్నత్యం దానంతటదే వస్తుంది. తెలుగు భాష యొక్క అవసరం తగ్గడం ప్రస్తుత సమస్యకు ఒక ముఖ్య కారణం.
  3. విద్యాపరమైనవి: వైద్య, సాంకేతిక, వ్యవసాయ శాస్త్రాలూ మొదలైన శాఖల్లో ఉన్నత విద్యంతా ఆంగ్ల మాధ్యమంలోనే సాగుతోంది. దీనివల్ల, ఒక స్థాయి దాటిన తరువాత విద్యలో తెలుగు వాడకం తగ్గుతోంది. అదీకాక, తెలుగు కాకుండా ఇతర భాషలను పాఠ్యాంశాలుగా ఎన్నుకునే వీలుతోబాటు, తెలుగులో మార్కులు తక్కువ వస్తాయన్న కారణంగా తెలుగు నేర్చుకునే అవకాశం తగ్గుతోంది.
  4. సామాజిక పరమైనవి: ఏ కారణం చేతోగానీ మన తెలుగు వారికి మాతృభాషలో సంభాషించడం పెద్ద నామోషీ. పొరుగింటి పుల్లకూర రుచి మనకు తెలిసినట్టుగా వేరెవరికీ తెలియదేమో అందుకే తెలుగువారు తెలుగులో తప్ప వచ్చీ రాని మరే భాషలోనైనా సంతోషంగా సంభాషిస్తారు. మన భాషపై మనకున్న చిన్న చూపువల్లో, ఇతర భాషల్లో మాట్లాడ్డం గొప్ప విషయంగా భావించడం వల్లో మన భాష మనవల్లే అలుసవుతోంది.
  5. సాంకేతికాభివృద్ధి: దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం మన దేశంలో వచ్చిన కేబుల్‌ టీవీ మన సంస్కృతిని బాగా మార్చేసింది. ఒకానొకప్పుడు వారానికొకసారి ప్రణయ్‌రాయ్‌ చదివే ‘వరల్డ్‌ దిస్‌ వీక్‌’ వార్తాంశాల్లో తప్ప మనకి కనబడని ఎన్నో విషయాలు అనునిత్యం మన కళ్ళ ముందుంటూ బయటి ప్రపంచంపై మనకున్న అవగాహనను బాగా పెంచేశాయి. అంతేకాక దూరదర్శిని కారణంగా పుస్తక పఠనం బాగా తగ్గిపోయింది. టెలిఫోన్లు, ఈ – మెయిల్స్‌ వల్ల అందరిలోనూ ఉత్తరాలు రాసే అలవాటు బాగా తగ్గిపోయింది. ఏ భాష మనుగడకైనా వినడం, మాట్లాడడం, చదవడం మరియు రాయడం అనే నాలుగంశాలు చాలా ముఖ్యం. సాంకేతికాభివృద్ధి కారణంగా తెలుగు చదవడం, రాయడం అనే అంశాలు బాగా దెబ్బతిన్నాయి.
  6. ప్రపంచీకరణ: ఆర్థిక, సాంకేతికాభివృద్ధుల కారణంగా విదేశాల్లో అవకాశాలు పెరుగుతూ, విదేశాల్లోని అవసరాలు మన దగ్గరకు వస్తూ ప్రస్తుతం ప్రపంచమంతా వసుధైక కుటుంబంలా తయారవుతూ, ఒకే భాషా, ఒకే సంస్కృతి అన్నట్టుగా మారుతోంది. ప్రపంచీకరణ వల్ల ప్రపంచం అంతా మనకు దగ్గరవుతోండగా, మన భాష మాత్రం మనకు దూరమవుతోంది. భాషాసంస్కృతులు ఒక దానితో ఒకటి ముడిపడి ఉంటాయి కాబట్టి మారుతోన్న మన సంస్కృతితో బాటుగా మన భాషకూడా మారుతోంది.

ఒకప్పుడు భాషలో వచ్చే మార్పులకు కొన్ని తరాలు పడితే, ఈ ఆధునిక యుగంలో ఒక్క తరంలోనే ఎన్నో మార్పులను చూస్తున్నాం. భవిష్యత్తులో తెలుగు మాట్లాడే వారి సంఖ్యలో పెద్దగా మార్పు రాకపోవచ్చు కానీ తెలుగును రాసే లేదా చదివే వారి సంఖ్య మాత్రం క్రమంగా తగ్గిపోతోందన్నది అందరూ గమనించవలసిన విషయం. మార్చలేనీ, మార్చకూడనీ విషయాల గురించి మనం ఏమీ చెయ్యలేకపోయినా వ్యక్తిగతం గానూ, వ్యవస్థాపరం గానూ భాషాపరి రక్షణకై మనం చేపట్టవలసినవి కొన్ని ఉన్నాయి. అందులో కొన్ని:

  1. సంస్కరణ అన్నది ముందు వ్యక్తిలోనూ తరువాత వ్యవస్థలోనూ జరగాలి. తెలుగులో మాట్లాడ్డం చిన్నతనంగా భావించకుండా, ఘనమైన చరిత్ర ఉన్న ఒక ఉన్నత భాషను మాట్లాడ గలుగుతున్నందుకు ప్రతి తెలుగువాడూ గర్వించాలి. తేనెలూరే తెలుగు భాషలోని మాధుర్యాన్ని ఆస్వాదించి, ఆనందించడం ఒక వరంగా భావించాలి. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ఆత్మావలోకనం చేసుకోవాలి.
  2. అందరూ పుస్తక పఠనాన్ని అలవరచుకోవాలి. అది మెదడుకు మంచి వ్యాయామాన్నిచ్చే ప్రక్రియ. మంచి సాహిత్యం దొరకడం లేదని సాకు చెప్పకుండా, మనం ఆదరిస్తే మంచి ప్రతికలూ, నవలలూ అవే వస్తాయన్న విషయాన్ని గమనించాలి. అనేక రకాల వ్యాపకాలూ, వినోద సాధనాలూ, దూరదర్శనీ ఉన్నా అమెరికా లాంటి దేశాల్లో పుస్తక పఠనం ఇంకా బాగానే కొనసాగుతోంది. కారణం, సాహితీ విలువలు తగ్గకుండా ప్రచురణలు రావడం.
  3. ఆంధ్ర రాష్ట్రంలోని ప్రతి పాఠశాలలోనూ, కనీసం ఇంటర్మీడియట్‌ వరకూ తెలుగును తప్పనిసరి పాఠ్యాంశంగా చెయ్యడమే కాక కళాశాలా, స్నాతకోత్తర విద్యల్లో కూడా ఏదో ఒక స్థాయిలో తెలుగును పాఠ్యాంశంగా చెయ్యాలి. అంతేకాకుండా సంస్కృతం, హిందీలతో పోల్చినప్పుడు తెలుగులో తక్కువ మార్కులు వస్తాయన్న అపప్రధ కూడా పోవాలి. ప్రశ్నకు తగిన జవాబు రాసినప్పుడు అర్హమైన మార్కులను వెయ్యాలి. ర్యాంకులనేవి ప్రతిభకు ప్రమాణాలుగా మారిపోయి, ఒకటి రెండు మార్కుల్లోనే భవిష్యత్తంతా మారిపోతున్న ఈ రోజుల్లో సరిగా మార్కులు రాని తెలుగు భాషను ఎంచుకోవడానికి విద్యార్థులు సుముఖత చూపించరు. విద్యావిధానమే భాషను విద్యార్థులకు దూరం చేయకుండా తగిన చర్యలు తీసుకుని, తెలుగు భాషలో పరీక్షా విధానాన్ని సరిచెయ్యాలి.
  4. అనేక ప్రభుత్వ మరియు ఇతర ప్రవేశ లేదా పోటీ పరీక్షల్లో తెలుగు భాషకు సంబంధించిన పరీక్షలను కూడా చేర్చాలి. ఉన్నత విద్యకూ, ఉపాధికీ తెలుగు అవసరం అయినప్పుడు అందరూ తప్పని సరిగా నేర్చుకుంటారు.
  5. భాష విషయంలో పత్రికల పాత్ర తక్కువేమీ కాదు. చదువుకునే రోజుల్లో కేవలం తరగతి పుస్తకాలు మాత్రమే చదువుతాము. దిన, వార, మాస పత్రికలను జీవితాంతం చదువుతాము. కాబట్టి పత్రికలలో వాడే భాషా, ప్రచురితమయ్యే అంశాలూ మన మీదా మన భాషమీదా ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. నిత్యం చదివే అనేక విషయాల్లో ఆంగ్ల పదప్రయోగం వల్ల వాటికి ప్రత్యామ్నాయ తెలుగు పదాల ఉనికి దెబ్బతింటోంది. వార్తా పత్రికల్లోనూ, ఇతర పత్రికల్లోనూ ఉన్నత భాషా ప్రమాణాలను పాటిస్తూ తద్వారా భాషాభివృద్ధికి దోహదం చెయ్యాలి. అలాగే మంచి సాహితీ విలువలున్న శీర్షికలనూ, భాషకు సంబంధించిన వ్యాసాలనూ ప్రచురించాలి.
  6. చలన చిత్రాల్లోనూ, దూరదర్శినిలోనూ ఆంగ్లభాషా వినియోగాన్ని బాగా తగ్గించాలి. వ్యాపార ప్రకటనల్లో కూడా తెలుగు వాడకాన్ని ప్రోత్సహించాలి. ఒకప్పుడు చలన చిత్ర పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాదుకు రావడానికి మన రాష్ట్రప్రభుత్వం అనేక రాయితీలను ఇచ్చింది. అలాగే, నిర్దేశించిన దాని కన్నా ఎక్కువ శాతం చిత్రనిర్మాణం కనుక రాష్ట్రానికి బయట జరిగితే అధిక పన్నులు వసూలు చెయ్యడం లాంటివి జరిగేవి. అదేవిధంగా మోతాదుని మించి ఆంగ్లభాషా ప్రయోగం జరిగిన చిత్రాలపై పన్నులు వెయ్యడమో, రాయితీలు తగ్గించడమో చేసి తెలుగుభాషా వినియోగాన్ని ప్రోత్సహించాలి. దూరదర్శినీ, చలనచిత్రాల ప్రభావం భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్ర దేశంలో చాలా ఉంది కాబట్టి ఈ మాధ్యమంలో చేసే ముఖ్య సంస్కరణలు భాషాభివృద్ధికి తోడ్పడతాయి.
  7. ఏ సాంకేతిక పరిజ్ఞానం అయితే భాషపై దుష్ప్రభావం చూపించింది అనుకున్నామో, దాన్నే భాషాభివృద్ధికి వాడుకోవాలి. దూరదర్శినిలో వచ్చే కార్యక్రమాల ప్రభావం ఎదిగే పిల్లలపై బాగా ఉంటుంది. కాబట్టి పిల్లలను ఆకట్టుకునే విధంగా మంచి కార్యక్రమాలను రూపొందించాలి. ఉదాహరణకు, అమెరికాలో ‘డోరా ది ఎక్స్‌ ప్లోరర్‌’, ‘బ్లూస్‌ క్లూస్‌’, ‘బార్నీ’ లాంటి కార్టూన్‌ మరియు ఇతర కార్యక్రమాలకు ఎంతో ప్రాచుర్యం ఉంది. వినోదం రూపంలో ఉన్న విద్యా కార్యక్రమాలు ఇవి. తెలుగులో అలాంటి పాత్రలు లేవు. ఇతర దేశాలకు మన ప్రతిభను అరువిచ్చిన తెలుగువారు స్వంతగడ్డపై ప్రయోజనానికి కూడా అదే పరిజ్ఞానాన్ని వాడాలి. ప్రజల మనసులను హత్తుకునే విధంగా కార్టూను పాత్రలను స్పష్టించి, ప్రసార కార్యక్రమాలు రూపొందించి. వాటిద్వారా తెలుగు భాషనూ, ఇతర విద్యాంశాలనూ బోధించాలి.

ఈ విధంగా వ్యిక్తి గతంగానూ, సమాజ, ప్రభుత్వ పరంగానూ తీసుకోగలిగిన చర్యలెన్నో తెలుగు భాషాభివృద్ధికి తోడ్పడతాయి. ఇవన్నీ కష్టమైనవీ, క్లిష్టమైనవీ, ఖర్చుతో కూడుకున్నవీ కావు. మానసిక వికాసానికి తోడ్పడే పుస్తక పఠనంలో కష్టమేముంది? తెలుగు పరీక్షల్లో మార్కులు సరిగా వెయ్యడంలో క్లిష్టతేముంది? రాసే వార్తల్లోనూ, తీసే చిత్రాల్లోనూ, చేసే ప్రసారాల్లోనూ తెలుగు వాడడానికి ఖర్చేముంది? కావలసిందల్లా ఒక్క క్షణం ఆగి ఆలోచించడం. ప్రజలూ, ప్రభుత్వమూ, వినోద ప్రసార మాధ్యమాలూ ఒక్క క్షణం ఆలోచించి, చిన్న నిర్ణయం తీసుకుంటే చాలు. ఆ చిన్న నిర్ణయమే అంతులేని ప్రభావాన్ని చూపి కొద్ది సంవత్సరాల్లోనే తెలుగుభాషకు పునర్వైభవాన్ని ఇస్తుందని నా ప్రగాఢ విశ్వాసం.

అమ్మ భాషను అలుసు చెయ్యకుండా దాని అభివృద్ధికి ప్రతి ఒక్కరం కృషి చేద్దాం.*