నిచ్చెన

నేల బంధాన్ని వదలలేక
వలస పక్షులు కాలేక
నిరీక్షణ శ్వాసకోశాలలో ఆక్సిజన్‌ని తిరిగి నింపి
ఒయాసిస్‌ ఆశతో
బ్రతుకు విత్తనాన్ని రేగడి క్షేత్రంలో నాటితే
విగత స్వప్నాలు పండుతున్నాయి.
మడిని తడిపి బతుకును పండించే
అద్భుత బిందువు కోసం కళ్ళల్లో గుడ్లగూబల్ని దాచుకున్న రైతులు
ఆశలపాతబట్టలు చుట్టుకున్న గంగిరెద్దులా
ఏ పాత్ర ధరించాలో తెలీక అప్పుల పాత్రలోనే తుదిశ్వాసలు వదులుతుంటే
ఆభరణాలలాటి ఆరు బుతువులకేమయింది?
తుఫానుగాలులు తప్ప సహజవాయువుల్ని పీల్చి ఎంతకాలమయింది?
ఆకాశానికి భూమికి మధ్య వేలాడే గ్రీష్మపు పోగుల్ని కసిగా ఖండించను
ఎప్పుడమ్మా నువ్వు దిగివచ్చి విరిగిన నడ్డిమీద నీ తడి వేలిముద్రలు వేసేది?
మేఘకన్యలు ఇంకా రెక్కలు మొలిపించుకుంటూ పోతే…
రైతు ఆకలి అక్షరాలు ఎన్ని కావ్యాలనైనా నింపుతాయి.
కథకుడి గాయాల్ని స్కేల్‌కెక్కిస్తే పొలం చాలదు వాటిని కొలవను
తనను తాను ఆరబోసుకునే రైతన్న వంశం గుణింతాలుకూడా దిద్దలేదు.
కాటకం కరెంటులా ప్రవహిస్తుంటే,
బుణం మరణ మవుతుంటే
ఆకల్ని బ్రతుకు ముళ్ళకంపలమీద ఆరేయలేక
జీవధార చిరునామాను వెతుక్కుంటూ…
ఆస్ట్రేలియా పక్షిలా వలసరెక్కలు విప్పుకుని బస్తీమీదవాలితే…
అక్కడ పొట్టకూటికి ఊటలేదు
ఇక్కడ దాహానికే నీరు లేదు.
ఏ రాయైతేనేం గుండెలు చిట్లటానికి?
బస్తీలో పాపాల ఫంగన్‌లాటి మనుషులు
వెబ్‌సైట్‌లో విత్తనాలు ఫీడ్‌చేసి ఇంటర్‌నెట్‌లో అమ్మడంలాటి జీవితాలు
కొసరుగా శిరస్సుమీద వామనుడి గ్లోబల్‌ పాదం
దిక్కుతోచక రైతు బజారుకెళ్తే…
అదెప్పుడో ధృతరాష్ట్రుడి కౌగిలిలోకి వెళ్ళిందట.
గద్దలా చూపులు సారించి చూస్తే
ఉత్సవ విగ్రహాల్లాంటి వృక్షాలేవి?
కొమ్మల్ని కోల్పోయిన కోకిల పాటలేవి?
ఎవరురా వాటిని నరికి జాతీయజండాకి నెత్తుటిచేతుల్ని తుడుచుకునేది?
తస్మాత్‌ జాగ్రత!
పచ్చనోట్లతో ఇప్పుడు మీరు ఆకాశానికి వేసే నిచ్చెనలు
మీ ముందు తరాలకు అవుతాయి ఆకలి పాశాలు.