ఎడారి అంచున

“ఇల్లొదిలి పెట్టి యెనిమిదేళ్ళకు పైగానే అయింది,” అన్నాడు మిచెల్. మిచెల్, అతనితో ప్రయాణిస్తున్న స్నేహితుడూ అప్పటికే చెట్టు నీడకి చేరుకున్నారు. చేతిలో వున్న సంచులని కింద పడేసి తామూ కూలబడ్డారు.

“ఎనిమిదేళ్ళ పాటు ఒక్క ఉత్తరం కూడా రాయలేదు నేను. రాద్దామనుకుంటూనే బద్ధకంతో అలా రోజులు గడిపేశాను. దానికి తోడు, నాకంటే ఓ రోజు ముందే మా వూరు చేరుకున్న దరిద్రుడొకడు మా ఇంట్లో నేను చచ్చిపోయానని చెప్పాడట!”

మాటలాపి నీళ్ళ కేంటీన్ తీసి కొంచెం గొంతు తడుపుకున్నాడు.

“ఇక చూస్కో! నేనెళ్ళేసరికి ఇంటిల్లిపాదీ యేడుపులూ, పెడ బొబ్బలూ! అందులోనూ, నేనిల్లు చేరేసరికి సరిగ్గా రాత్రయింది. దాంతో ముందు దయ్యం అనుకుని జడుసుకున్నారు. తలుపు తెరిచిన మా చెల్లెలయితే భయంతో దాదాపు మూర్ఛ పోయింది.” చెప్పటం ఆపి పైపు వెలిగించుకున్నాడు.

“నేనెళ్ళేసరికి, అమ్మ పైన గదిలో పడుకోని ఏడుస్తూ వుంది. చెల్లెళ్ళందరూ బిక్క మొహాలేసుకొని వున్నారు. నాన్నేమో కింద ఒక్కడే టేబిల్ దగ్గర కూర్చొని బెక్కుతున్నాడు.”

మళ్ళీ మాటలాపి లేచి ఒళ్ళు విరుచుకున్నాడు మిచెల్. తన కుక్కపిల్లకి కొన్ని నీళ్ళు తాగించాడు.

“నేనొచ్చిన సంగతి తెలిసి అమ్మ ఒక్క గెంతుతో కిందకి దిగింది. అందరూ నన్ను ముట్టుకోడానికి పోటీలు పడ్డారు. దెయ్యాన్ని కాదని నిశ్చయించుకోడానికి కాబోలు! నా మీద పడి అంతా ముద్దులు కురిపించేసరికి ఊపిరాడలేదంటే నమ్ము! అది సరే కానీ, ఈ కుక్క పిల్లకెంత దాహమో చూడు! అసలు దీంతో పాటు ఒక నీళ్ళ టాంకరు తెచ్చుకోవాల్సింది మనం. ఈ ఎండలకిది ఇద్దరు మనుషుల నీళ్ళు తాగుతుంది.”

కుక్కపిల్లకి ఇంకొన్ని నీళ్ళు తాగించాడు.

“ఏం చెప్తున్నానూ? అదే, అమ్మ నన్ను చూసి సంతోషం పట్టలేక మూర్ఛపోయింది. ఏం సంబరం ఇంట్లో! రాత్రంతా కబుర్లు చెప్పుకుంటూనే వున్నాం. నాన్నకైతే ఖాయంగా పిచ్చెక్కిందనుకున్నా. అమ్మేమో అసలు మూణ్ణాలుగు గంటలపాటు నా చేయి వదలనేలేదు. నీ చాకు ఒకసారివ్వు.”

చాకు తీసుకొని పొగాకు కట్టలోంచి చిన్న ముక్క కోసుకున్నాడు.

“ఇహ ఆ మర్నాడు చూడాలి. ఇల్లంతా వచ్చే జనం, పోయే జనం, తిరణాలనుకో! చుట్టు పక్కల వాళ్ళంతా దిగబడ్డారు, నేను చిన్నప్పుడు ఇష్టపడ్డ అమ్మాయితో సహా! ఆసలా అమ్మయికి నేనంటే ఇష్టమని అనుకోనేలేదు నేనెన్నడూ. అమ్మా, చెల్లెళ్ళూ మళ్ళీ నేనిల్లు వదిలి బయటికి వెళ్తానేమోనని తెగ భయపడ్డారు. ఎందుకంటే…”

“తాగొస్తావని భయం కాబోలు!”

“ఛ! ఛ! మళ్ళీ దేశం వదిలి వెళ్ళిపోతానేమోననోయ్! ఆఖరికి బైబిలు పట్టుకొని, అమ్మా నాన్నా వున్నంతవరకూ ఇల్లు వదిలిపోనని ఒట్టేసుకున్నాక గానీ వాళ్ళు తెరపిన పడలేదు.”

చెప్పడం అయిపోయినట్టు లేచి నిలబడ్డాడు మిచెల్. కుక్కపిల్లనెత్తుకున్నాడు. కాసేపు దాని కాళ్ళు పరీక్షించాడు.

“వీడి కాళ్ళు చూడు, ఎంతెంత గాయాలైనాయో! పొద్దునంతా బానే నడిచాడు పాపం. ఇక్కణ్ణించి కొంత దూరం మోసుకెళ్తా వీణ్ణి. అప్పుడు వీడికింత దాహం కూడా వేయదు.”

“అది సరే, నువ్వు అమ్మా నాన్నలకిచ్చిన మాట యెందుకు తప్పుతున్నావ్?”

కుతూహలంగా అడిగాడు స్నేహితుడు. మిచెల్ కాసేపు జవాబివ్వలేదు. ఒళ్ళు విరుచుకున్నాడు. బరువైన సంచీ వైపు కాసేపూ, దూరంగా ఎర్రటి ఎండలో మిల మిలా మెరుస్తూ అనంతంగా కనిపిస్తున్న నీడలేని ఎడారి వైపూ చూశాడు. కాసేపు ఆలోచించాడు, ఆవలించాడు.

“అదా? ఓ వారం అందరూ అలాగే వున్నారు. ఆ తరవాత అందరూ సణగడం మొదలు పెట్టారు. పనీ పాటా లేని వాణ్ణెవరు పోషిస్తారు చెప్పు?” ఎటో చూస్తూ అన్నాడు.

స్నేహితుడు పగలబడి నవ్వాడు. మిచెల్‌కీ నవ్వాగలేదు. ఇద్దరూ తమ సంచీలు భుజాలకు తగిలించుకున్నారు. కెటిల్స్ చేతికెత్తుకున్నారు. మిచెల్ కుక్కపిల్లనీ ఎత్తుకున్నాడు. మాసిపోయిన గడ్డాలతో, ఎండలకి ఎర్రబడి మొరటుగా అయిన మొహాలతో, ఇద్దరూ చెట్టూచేమలని వెనకనే ఒదిలిపెట్టి ఎడారి వైపుగా ఎండ లోకి నడిచారు.

(మూలం: On the edge of a plain, 1893.)


[హెన్రీ లాసన్ (Henry Lawson, 1867-1922): హెన్రీ లాసన్ ఆస్ట్రేలియాకి చెందిన పాత తరం రచయిత. బాంజో పాటర్సన్, హెన్రీ లాసన్ ఇద్దరూ ఆస్ట్రేలియాలో బ్రిటిష్ పాలన గురించీ, ఆస్ట్రేలియా పల్లెటూళ్ళలో యూరోపియన్ల బ్రతుకుల గురించీ వివరంగా, విస్తృతంగా రాసారని చెప్పొచ్చు. లాసన్ పేరున్న కథకుడే కాక, మంచి కవి కూడా. కథ వివరాలూ, వర్ణనలతో చిక్కగా వుండడంకంటే గల్పికలా (sketch) అందీ అందకుండా వుండాలని లాసన్ అభిప్రాయపడ్డాడు. బాంజో పాటర్సన్ ఆస్ట్రేలియాలోని Outback జీవితాన్ని అందంగా, రొమాంటిక్ సాహసంలా చిత్రీకరిస్తే, లాసన్ కుండ పగలేసినట్టు, యూరోపియన్లు తట్టుకోలేని ఎండ, ఎన్నడూ చూడని జంతువుల తాకిడి, ఎంతో శ్రమతో కూడిన కఠినమైన జీవితాన్నీ చిత్రించాడు. ఆయన కథలనిండా ఆస్ట్రేలియాలో స్థిరపడ్డ యూరోపియన్లు వాడే విచిత్రమైన ఆంగ్ల పదాలు నిండి వుంటాయి. ప్రతీ కథకీ వెనక ఈ పదాల అర్థం వివరించబడి వుంటుంది. ఇప్పుడు ఆస్ట్రేలియాలో వుంటూ, ఆ పదాలని రోజువారీ భాషలో వినేవాళ్ళకి, ఆయా కొత్తపదాలు అసలు ఇంగ్లీషులో వుండేవి కాదనీ, కేవలం వందేళ్ళ కిందవలస వచ్చిన యూరోపియన్ల వాడుకలో పుట్టినవనీ తెలుసుకుంటే కొంచెం విచిత్రంగా వుంటుంది.]

శారద

రచయిత శారద గురించి: ఆస్ట్రేలియా ప్రభుత్వోద్యోగిగా పనిచేస్తూ, బ్రిస్బేన్ నగరంలో నివసించే శారద తెలుగులో, ఇంగ్లీష్‌లో కథలు, అనువాదాలు రాస్తూ వుంటారు. నీలాంబరి అనే పేరుతో వీరి కథల సంపుటి ప్రచురించారు. ...