పహరా హుషారు

దిగులు దిగులుగా ఆ డప్పులేమిటి దేవీ
దిగువ లోవలదరా చప్పుళ్ళు చప్పుళ్ళు?
దేవిడీ సిపాయిల దండేను ప్రభూ
దినామూ ఉన్నదే కవాతు

జిగ్గుజిగ్గుమనే ఆ మెఱుపులేమిటి దేవీ
ఎదర మెఱకలన్నీ మిరుమిట్లు మిరుమిట్లు?
తుపాకులు కటార్ల నిగనిగలంతేను ప్రభూ
ఎండలో కటార్ల హొయ్యంకు.

అడివదురుతున్నట్టు ఆ అరుపులేమిటి దేవీ
ఇంత పొద్దుటే ఇన్ని కూచీలు, కూచీలు?
తైనాతూ ఉన్న రివాజే కాదా ప్రభూ
పటాళా బంట్లకి తరిఫీదు!

బారకాసు విడిచి ఆ సాములేమిటి దేవీ
పోరెత్తినట్టు ఆ పరుగులు, పరుగులు?
పదాతి జట్లకి పందేలు కాఁవును హుజూరు,
తమరేల వణుకుతున్నారు?

సాహిణీ చావిళ్ళ గుగ్గిళ్ళ కోసమా దేవీ
తురుపు దండ్ల కిటేపు సాపాటు, సాపాటు?
ఆగీ వాటాన్ని అవుపడరు ప్రభూ
ఆగమేఘాల మీదనున్నారు!

దళవాయి రాజిల్లు దండెత్తడానికా రాణీ,
కనుకుట్టు దళవాయి మేడ, మేడ?
దళవాయిల్లు దాటి పైకొస్తున్నారు ప్రభూ,
రాచవీధుల్లోకేనూ సైన్యాలు!

తమరెక్కడికి దౌడు, మాకాణ్ణిలవరా దేవీ,
మరిచేరూ దివాణం మరియాద, మరియాద?!
రాచవారినే నమ్మి కనిపెట్టుకున్నాం ప్రభూ,
శెలవింక బతికి మేం వెళ్ళాలి, వెళ్ళాలి.

బీగాలు గవఁళ్ళూ పగలగొడుతున్నారు,
యెవఱక్కడ? పహరా ఉషారు!
పగగోలు కేకలు, బలివారు బీరాలు,
చింతనిప్పులు వీళ్ళ కళ్ళు!!

(ఇన్‌స్పిరేషన్‌: డబ్ల్యు.హెచ్‌. ఆడెన్‌ O what is that sound.)