సిమెంట్ రంగుల హొరైజన్ లోంచి సిమెంటు వంతెనల్ని సిమెంటు మబ్బుల్నీ చీల్చుకుంటూ సిమెంట్ రంగు రైలే చడీ చప్పుడూ లేకుండా వచ్చి ఆగింది. ఆగి రైలు మాట్లాడుతుంది. “Easley North! Doors Opening! Easley North!! Doors Opening!!” అని తనకి ఇష్టమైన తియ్యని స్వరంతో. తను రక రకాల టెక్నాలజీల మీద పని చేస్తాడు. మాట్లాడతాడు. ఇంక రిటైరయిపోతాడు కాని రైలు తనతో మాట్లాడటం ఇప్పటికీ ఎంతో అపురూపంగా ఉంటుంది. మొత్తం కంపార్ట్`మెంట్ అంతటికీ తనొక్కడే. Easley North… Liberty… Walhalla… Seneca… Pendelton అని రాక్ క్రీక్ పక్కనే పరుగెత్తే ఈ ఒంపుల చెట్ల రైలు దారి తన జ్ఞాపకాల్లోన చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ప్రతి స్టేషన్, ప్రతి మలుపు, ప్రతి బార్న్, జంక్ యార్డూ, ప్రతి సిగ్నల్ అలాగే. ‘Liberty…Doors Closing! Liberty! Doors Closing!! Do NOT lean on the doors! This train is moving! Next stop… Walhalla!!’ అని దాన్ని గట్టిగా వెక్కిరిస్తుంటే “Who you talkin’ to man?” అని ఒకతను ఎక్కేడు. “You ain’t talk no sweet talk to the train, brothah..! She ain’t no lady! Just the train…umhum…” అని. జడల జడల జుత్తులు బంగారు పన్ను నల్లటి మురికి కోటూ వేసుకుని తన ఎదురుగానే కూర్చున్నాడు. “I was just kidding…” అంటే “You was kiddin..? Yeah, that figures! She sure is better than my lady man! She ‘least says somethin…! Know whatah mean??” అని బొజ్జ ఎగరేసుకుంటూ పెద్ద నల్ల నవ్వు నవ్వేడు.
Walhalla వస్తుంటే సీట్లో బాగా వెనక్కి చేరబడిన వాడు లేచి కూర్చుని జేబులోంచి ఒక చిన్న పుస్తకం తీసి చూపించేడు. దాని మీద మబ్బుల్లో తేలుతూన్న శ్రీ కృష్ణుడి బొమ్మ కింద His Divine Grace AC Bhakti Vedanta Swami Prabhupada అని ఉన్నాది. ఆ బొమ్మకేసి తన్మయంగా చూపిస్తూ “Hey…? You like Krishna man? Kree…shna?? The Joy! An’ the peace…um hmm!” అని అడిగేడు. నవ్వి ఊరుకుంటే “Which part of India are you from?” అన్నాడు. “Near Madras…” అని జవాబు చెప్పి కిటికీలోంచి చూస్తూ Pendelton వస్తుందనగా లేచి నిలబడితే “I like cows man! I like’em all…!” అని Peace Brother! అని అర్ధం వచ్చేలాగ సంజ్ఞలు చేస్తున్నాడు కిటికీలోంచి.
అతను వెళ్ళే దాకా నిలబడి కేబిన్ పక్కన మట్టి దార్లోంచి రోడ్డుమీదికొచ్చేడు. Elm Street అని Gage Blvd. అని Saint St. అని Montgomery అనీ ఆకుపచ్చ స్ట్రీట్ సైన్లు ఒక్కోటీ మననం చేసుకుంటూ New Comer దగ్గరికి వచ్చి చూసేడు. పాత ఇటుకలు తాపడం చేసిన చిన్న భవనం అలాగే ఉంది. బేస్మెంట్ లోకి మెట్లలోకి అలవాటుగా దిగి పోబోతే పై అంతస్తు కిటికీ లోంచి ఎర్రటి పొడుగు మచ్చల మొహం, చలి కోటు వేసుకున్నాయన “Sir..? Sir?! Can I help you there? Hello..?” అని అరుస్తున్నాడు. అక్కడ బేస్ మెంట్లో ఒక పాత పుస్తకాల షాపు ఉంటుంది. ఉండాలి…? ఉండేది! “Twice Born…! Books?!” అని ఎండలోకి కళ్ళు చిట్లించి అడిగితే ఆయన బాల్కనీ లోకి దిగొచ్చి “Oh Heather? She’s gone… couple of six years now! That place..they’re using it for storing furniture.” అని ఇనప కమ్ముల వెనకనుండి ఎత్తుగా ఆసక్తిగా చూస్తున్నాడు. ఆ తలుపు ఎప్పుడూ తీసే ఉండేది. తియ్యగానే మువ్వల గంట ఒకటి మ్రోగిస్తూ తేమగా మొగలి ఊదొత్తులు పాత పుస్తకాల వాసనల ప్రపంచాన్ని ఆవిష్కరిస్తూ. ఆవిడ్ని పూసల మామ్మ అని పిల్చుకొనేవాడు. రంగు రంగుల పూసలు రుద్రాక్ష తావళాలు మెడ నిండా వేసుకొని కళ్ళద్దాల్లోంచి నవ్వి మళ్ళీ పుస్తకంలో తల దించుకొనేది. హెదర్ అని తెలీదు. “Gone..where?” అంటే ఆయన ఆకాశం లోకి చూపించి భుజాలు ఎగరేసేడు. ఆయన లోపలికి వెళ్ళిపోతున్నవాడు మళ్ళీ తలుపు తీసుకుని బయటికొచ్చి “If you need a book or something, I’d go to Amazon.com!” అన్నాడు సానుభూతిగా చూస్తూ. “That’s a good idea. I think I’ll try Amazon, thank you!” అంటే ‘నీకు నేను చెయ్యగలిగింది అదే!’ అన్నట్టు తలుపుల్లోంచి ఒక చేత్తో bye చెప్తూ.
పూసల మామ్మ పుస్తకాల గుయ్యారం తన ఆధ్యాత్మిక రాజధాని. అక్కడ పది సెంట్లకి Nietzsche, పావలాకి Diamond Sutra, డాలర్ కి అట్ట డబ్బాడు పొయెట్రీ లేదా ధూళి రంగుల్లో Boundary Value Problems. పేజీల్లోకి నీళ్ళు ఇంకుల తడి రంగుల చారలు నింపుకున్నవి 1920 లు 1830 లు 40 ల వాళ్ళు – తెలివైన వాళ్ళు, సున్నితమైన వాళ్ళు, అందాన్ని జీవితాన్ని అబ్బురంగా ఆరాధించేవాళ్ళు, తమ ఒంటరి నిజాన్ని మొండిగా తప్పనిసరిగా కౌగలించుకొని మోస్తూ పైకి మామూలుగానే Hello David! అనుకుంటూ సాటి మనుషుల్ని నిశ్శబ్దంగానే బవిరి గెడ్డాలు ట్యూనిక్ లు వేసుకుని పట్టరానంత తమకంతో ప్రేమించిన వాళ్ళు, లేత నీటి రంగుల ఎండలనీ పచ్చటి తోటలనీ మబ్బుల్ని మోసుకుంటూ కులికే వెర్మాంట్ చెరువుల్నీ అన్నిట్నీ కౌగలించుకున్న వాళ్ళూ నొప్పితో మనస్ఫూర్తిగా స్నేహం చేసిన వాళ్ళూ – వీళ్ళందరి హృదయాలూ అక్కడ ఐదు పైసలకీ పది పైసలకీ దొరుకుతాయి. వాళ్ళు లేరు. పూసల మామ్మ లేదు. మెట్లు దిగిపోయి కొండ దిబ్బ ఎక్కుతుంటే బేకన్ వండుతున్న ఆవిర్ల వాసనలు మాత్రం అవే. సుళ్ళు తిరుగుతూ నారింజ మేపిల్ ఆకుల సుడిగుండాలూ అవే. ‘తిం..టా… కా..లమ్! కా..లమ్… తి…ంటా!!’ అని లయబద్ధంగా క్లాక్ టవర్ కంచు హెచ్చరిక అదే.
ఇంక చీకటి పడుతోంది గాని Straton House అట్ట ఎపార్ట్ మెంట్లలో దీపాలు వెలగటం లేదు. ఉండుండి అవే డార్మిటరీల కేరింతల్ని తోపుల్లోంచి మోసుకొస్తూ నీటి గాలి అదే గాని దాంట్లో గురవా రెడ్డి సిగరెట్ పొగ జాడలు లేవు. లంచ్ కి ఒక కక్కుర్తి బురీటో మాత్రం తిని బేస్ మెంట్లలో టైపులు కొట్టి కొట్టి ఆవురావురుమని కాళ్ళు వేలాడేసుకుంటూ వచ్చినట్టు గడాకలి అలాటిదే కాని ఆ పరదాల వెనక పెంజీకటి కవ్వల దవ్వుల నెవ్వడూ- రామాయణం గాడో అనుముల గాడో ఆకునూరి గాడో పంచాపకేశన్ గాడో ఎవడూ న్యూస్ పేపర్లు బంగాళ దుంపలూ గదినిండా పరిచి “అబే దొంగ సాలే ఉఠ్ కుకింగ్ టర్న్ నీదేన్ బే నీ యబా భుజియా కాట్ కర్ సాలేగా!” అని వంటలు చేస్తున్న దాఖలాలు ఏమీ లేవు. దగ్గరగా వెళ్ళి చూస్తే కర్ర మెట్లు ఎక్కి పైకెళ్ళడానికి లేకుండా పచ్చటి టేపులు అడ్డంగా చుట్టున్నాయి. కిటికీలకీ తలుపులకీ అడ్డదిడ్డంగా కర్రచెక్కలు దిగ్గొట్టేరు. బొక్కి సైకిళ్ళు మూడు దుమ్ము కొట్టి తుప్పట్టి సైకిల్ రేక్ ల్లో. హడావిడిగా అటూ ఇటూ తిరిగే బొద్దింకలు కూడా లేవు మెట్ల మీద.
తుప్పల్ని తప్పించుకుంటూ వరండాల్లోంచి ఆ చెక్కలింటి చుట్టూ మళ్ళీ మళ్ళీ నడిచి మొత్తం పదహారు ఎపార్ట్ మెంట్లూ చూసుకున్నాడు. అనుమానంగా ఏదైనా ఒక దీపం కోసం ఒక గొంతు కోసం అద్దాల సందుల్లోంచి కళ్ళు చిట్లించి చెవులు రిక్కించి. బయటి వెన్నెల పడి గుడ్డి వెలుగులో తన 212B లోపల దుమ్ము కప్పిన న్యూస్ పేపర్లు, లేత ఆకుపచ్చ కంబళీలు కప్పిన సోఫాలు అవే చిందర వందరగా లోపల. ఆ సోఫా మీద ఇలాంటి వెన్నెల రాత్రే గురవా రెడ్డి వాళ్ళ నాన్నగారు తనని ఎదురుగా కూర్చో పెట్టుకుని రాత్రి తెల్లార్లూ మాట్లాడుతూనే ఉన్నాడు. తనని వాళ్ళబ్బాయి ‘రాంచిలుక గా!’ అని పిలుస్తాడేం? అని ఆశ్చర్యంగా అడిగేడు. అది తన Unix account name అని, తన పూర్తి పేరు చిలకపాటి రామలింగేశ్వర్రావు అనీ చెప్తే ‘యూనిక్స్ యూనిక్సంటాడు మావోడు కూడా. అదొక బేంకా?’ అని అడిగేడు. ఆయన లారీ డ్రైవరు. ఆయనొచ్చిన మర్నాడే గుర్వా గాడు ఆయన్ని తనకి అప్పచెప్పి “నీకూ ఈ రాం చిలక గాడికీ కరక్టుగా సరిపోయిద్ది నాయినా! ఈడూ నీకుమల్లె ఊరోడే! ఈడికి ముసిలోళ్ళంటే పిచ్చి లేవే బకరా గాడికి. అక్కడ మెట్లు దిగితే బుక్కులమ్మే ముసిల్దాయుంటాది చూడు? అదీడి గర్ల్ ఫ్రెండు! ఎక్కడేనా రోడ్డు మీద ముసిలోడు కనిపింస్తె చాన! ‘తాతియ్యా తాతియ్యా రా తాతియ్యా ఫ్రెండ్షిప్ చేద్దారి’ అన్నసుమంట్నాకొడుకే యీడు. నువ్వు రూట్లెళ్ళిన స్టోరీలన్నీ చెప్పు ఇంటాడు. మేఁవలాగ అట్లాంటా యెల్లొచ్చెస్తాం!” అని తనని ఆయనకి అప్పగించేడు. “మా అయ్య జాగర్తరే చిలకా!” అని మెట్లు సగం దిగి అక్కడాగి, అనుముల గాడూ రాజా గాడూ ఇకిలించి నవ్వుతుంటే, వాళ్ళు ఎక్కడికెళ్తున్నదీ ఆ విషయం ‘మా అయ్యకి చెప్పేవో షేకాడిపోయిద్ది జాగర్త!’ అని పీక ఉత్తరించినట్టు సంజ్ఞ చేస్తూ తాళాల గుత్తి గిర గిరా తిప్పుకుంటూ.
పెద్ద పెద్ద కప్పుల్లో చిక్కటి పాలనే మరిగించి NesCafe కాఫీ కలిపిస్తే ఆయన మీసాలంతా నురుగు అంటించుకొని తాగుతూ కర్ర బాల్కనీ లోంచి దూరాన్న లేక్ కియోవీలో పడి చెదురుతున్న దీపాల్ని చూస్తూ “అబ్బా ఇది ఎంత అందమైన దేశం? ఇలాటి చోట బండి తీస్తే సరదా!” అన్నాడు. అది ఆయన తనతో మాట్లాడిన మొదటి మాట. ఆ మాట అన్న తీరు ఆయన ఇంట్లో కూడా మడత నలగని తెల్లటి ఫేంటు తెల్లటి చొక్కా తొడుక్కుని సన్నంగా నిటారుగా కూర్చున్న పద్ధతీ ఇంకా జ్ఞాపకమే. ఆయన పేరు బిచ్చా రెడ్డి. ఫ్రిజ్ మీద నుండి పోగులూడిపోతున్న లెదర్ బేగు తీసి తెచ్చి ఫొటోలు చూపించేడు. రంగులు వెలిసిపోతున్న ఫొటోలు కొన్ని. అన్నిట్లోనూ తెల్ల ఫేంటూ తెల్ల చొక్కా మఫ్లర్ వేసుకుని నవ్వుతూ. ఆయన కొత్త లారీలో కేబిన్లో కూర్చుని గర్వంగా నవ్వుతున్నది ఒకటి. లారీ ఫొటోలు. ఒరిస్సాలో బెంగాల్లో రోడ్డు పక్కన కాళికా దేవి గుళ్ళ ముందు ఆపినవి. Ashok Leyland. దాని ఉబ్బిన బుగ్గల నోటి కింద జై జవాన్ జై కిసాన్ అని APZ087 అనీ రాసుంటాయి. చెరొక వైపూ కొమ్ములకి నిమ్మకాయలు కట్టుకుని సిందూర చుక్కల బొట్లు పెట్టుకుని. పచ్చని మొహం బంపర్ చుట్టూ ఆంధ్రా ఒరిస్సా కర్ణాటక తమిళనాడు అని రాసున్నవి ఒత్తి ఒత్తి గర్వంగా చదివేడు ఆయన. చూపుడు వేలితో ఫొటో మీద తట్టి “ఈ బండి మా చల్లంతల్లి ఆలిండియా పెర్మిట్టు. ఈయమ్మొచ్చేకే వీడికి JNTU… మరిక్కడికి రావటము…!” అని తృప్తిగా నెమరు వేసుకున్నాడు. బండి వెనక బంపర్ మీద అర్ధ చంద్రాకారంగా ‘హుసేన్ గురుని దీవెన’ అని రాసుంటుంది. తను నవ్వు ఆపుకున్నా కళ్ళల్లో నవ్వుని గ్రహించి “ఏం నవ్వేరు? కాదేం నవ్వేరు?” అని రెట్టించేడు.
“లారీని చల్లంతల్లి అంట్నారని…’ అనంటే “చల్లంతల్లే గాదూ?! ఒక్కోసారి…దూరాల మీదెల్లినప్పుడు…జీటీ మీద రాత్రల్లా కొట్టుకోనెళ్ళగా వెళ్ళగా! ఇంక కల్కటా వచ్చెస్తాదనగా…”
“ఊఁ…?”
“అలాటప్పుడు నాకనిపిస్తాది. ఈ బండిని మనం తోల్తునాఁవా? లేకపోతె ఈ బండే మన్ని తోల్తందా… అని!” అన్నాడు. అని చాలా సేపు – ఒక రెండు మూడు మిముషాలు – ఎటు చూస్తున్నాడో తెలియకుండా, అలాగని కళ్ళూ ఆర్పకుండా కూర్చుండిపోయేడు. మనుషులు అలాగ ఏ మాటా ఆడకుండా ఎదురుగా ఉంటే తనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పటికీ. ఏదో ఒక మాట కలుపుతాడు.
“హుసేన్ గురుడు అంటే ఎవరండీ?” అనడిగేడు. ఆయన సుభాష్ చంద్ర బోస్ అన్నంత మామూలుగా “నెమళ్ళదిన్నె హుసేన్ గురుడు!” అన్నాడు. “స్వామి పేరే గురువా పేరు.” అన్నాడు. బయట చలిలోకి తీసుకెళ్ళి సిగరెట్ ముట్టించుకుని మళ్ళీ ఒక కప్పు నిండా కాఫీ కలిపించుకున్నాడు. ‘పీపల్ రాజా నామ్ రే! నదీ కినారే గాఁవ్ రే!!’ అని చీకట్లోకి పెదాల్లోంచి సిగరెట్ జారిపోకుండా పాడుతూ పాడుతూ మధ్య మధ్య కాఫీ తాగుతూ తాగుతూ తన జీవితం అంతా కధ లాగ చెప్పేడు. వాళ్ళది చాగలమఱ్ఱి. కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ తాలూకా చాగలమఱ్ఱి. వాళ్ళ తాత రెండువందల అరవైనాలుగెకరాల కామందు. కలరా వొచ్చి ఊళ్ళో ఆడుతూ పాడుతూ తిరిగే పిల్లలూ సావాసులూ కళ్ళ ముందే చనిపోతే చూసి తట్టుకోలేక ఆయన ఆస్తులన్నీ దానాలకీ ధర్మాలకీ రాసిచ్చి దేశాలు పట్టి పోయేడు. వాళ్ళ నానమ్మ పేరు పాలేటమ్మ గారు. ఆవిడే సంసారం బాధ్యతలు తలకెత్తుకుని వాళ్ళ తండ్రుల్నీ అత్తల్నీ పెంచి పెళ్ళిళ్ళు చేసింది. బిచ్చారెడ్డి గారికి మూడు వెళ్ళి నాలుగేళ్ళు నిండకుండానే అ ఆ ఇ ఈ లూ, అంకెలూ, గుణింతాల వరుకూ వొచ్చేసేవి. వాళ్ళ నాన్నకి సరిగ్గా జరక్క చిన్నప్పట్నుండే ఇంట్లో అందరూ పనుల్లోకి పోవల్సి వచ్చింది. బిచ్చారెడ్డి గారికి వ్యవసాయం పన్లు ఎక్కలేదు. ఇంట్లో చెప్పకుండా కర్నూలు పారిపోయి మోటార్ ఫీల్డ్ లో చెక్కరు కింద చేరిపోయేడు. అలా డ్రైవింగ్ నేర్చుకుని నార్తిండియా రూట్లు తిరుగుతుంటే జగదల్ పూర్ దగ్గర మఠం అరుగుల మీద ఇల్లొదిలి పోయిన తాతగారు కనిపించేడు. ఆయన్ని బండ్లో కూర్చోపెట్టుకుని నేరుగా చాగలమఱ్ఱి ఇంటికెళ్ళిపోయేరు. తాత, మనవడు ఇద్దరూ ఒక్కసారే ఇంటికి తిరిగొచ్చేరని వాళ్ళ నానమ్మ ఏడు రోజులు సంబరాలు చేయించింది. ఆరిపోతున్న సిగరెట్ కి కొత్త సిగరెట్ ముట్టిస్తూ ఇవన్నీ. వాళ్ళ ఇంట్లో వాళ్ళందర్నీ వాళ్ళు పంతొమ్మిది మంది కుటుంబం వరసగా ఇటూ అటూ కూర్చుని అన్నాలు తింటుంటే వాళ్ళ నాయినమ్మ వంగిపోయి నడుస్తూ ఎలా వడ్డించేదో, తన షావుకారు లారీ లెఖ్ఖల లెడ్జర్లలో ఎకౌంట్లన్నీ ఒక సారి పేజీ పైనుండి కిందికి ఇలా చూసీ చూట్టమే తను మొత్తం లెక్క ఎంతయ్యిందో ఎలా చెప్పేసేవాడో అవీ.
(ఇంకా ఉంది)