మూడు లాంతర్లు – 5

అయోవా రైటర్స్ వర్క్‌షాప్ (Iowa Writers Workshop) ఒక సారస్వత పాఠశాల. డెబ్భయ్యైదేళ్ళుగా కాల్పనిక సృజనను ప్రేమించి, సాధన చేసే విద్యార్ధులు, సృజనకారులకు ఆటపట్టుగా ఉన్నాది. అక్కడ పాఠాలు చెప్పేవాళ్ళు స్వయంగా సృజనకారులు. వాళ్ళు ఇంటర్వ్యూల వంటి వాటిలో చెప్పుకున్న సంగతుల్ని పరిశీలిస్తే సృజనను వాళ్ళు ఎంత శ్రద్ధతో, పట్టుదలగా నిర్వహించుకుంటారో, అర్ధం చేసుకోటానికీ, అందిపుచ్చుకోటానికీ ఎంతగా పరితపిస్తారో తెలుస్తుంది. అక్కడ ప్రవేశం దొరకటం, దొరికినా ఉత్తీర్ణులై బయటపడటం చాల కష్టమట. ఆ విద్యార్ధులు సృజనకారులుగా సఫలం కాలేకపోతే అప్పుడు ఇతర రంగాల్లోకి లాయర్లు, డాక్టర్లు ఇలాక్కూడా వెళ్ళిన సందర్భాలున్నాయట. అక్కడి చదువు చాల ఖర్చుతో కూడుకున్న పని. అది పాఠశాల అని పేరేగాని సృజనను బోధించగలిగింది తక్కువని, అక్కడ కల్పించిన వాతావరణం, చేరిన మనుషులే ఒక పరంపరగా సారస్వత సృజనను పట్టుదలగా అభ్యాసం చేసి అవగతం చేసుకొనేందుకు అవకాశాలనీ, చెప్పుకుంటారు. విశ్వవిద్యాలయాల్లో మామూలుగా ఉండే ఇంగ్లీష్ విభాగాలు భాష, సాహిత్యం, విమర్శ, సంస్కృతి వంటి విషయాలమీద చేసే పనికీ, నిర్వహణకూ భిన్నంగా కేవలం కాల్పనిక సృజన ఒక్కటే పాఠ్యాంశంగా, లక్ష్యంగా ఉన్న ఇలాంటి పాఠశాలలు బెనింగ్‌టన్ కాలేజీ (The Bennington writing seminars) అనీ, ఇంకా వర్జీనియా యూనివర్సిటీ (Creative writing program) వంటి చోట్ల ఇంకొన్ని మాత్రం ఉన్నాయి.

ఇలాంటి చోట్లకి వేలాది మంది చాల ఆత్రంగా రచయితలు కావాలని వెళితే వాళ్ళలో ఏ కొద్దిమందో రచయితలుగా నిలదొక్కుకోగలుగుతారు. అయినప్పటికీ సారస్వత విద్యార్ధులు సృజనను అభ్యాసం చెయ్యటానికీ, ప్రకటించుకోడానికీ ప్రయత్నాలు మానుకోరు. ఇక్కడి ఉపాధ్యాయులు విద్యార్ధుల్ని కవ్వించి, దండించి, ప్రోత్సహించి, అవమానించీ బోధించే పద్ధతులు కూడా కధలు కధలు చిత్రంగా ఉంటాయి. సృజనని బోధించే పనిలో వాళ్ళది ఒకొక్కరిదీ ఒక్కో తోవ గాని వాళ్ళ ధ్యాస, శ్రమా అన్నీ సృజన మీదే! మచ్చుకి ఒకటి, ఎల్కిన్ (Stanley L. Elkin) అని నవలా రచయిత, స్వయంగా ఉపాధ్యాయుడు చెప్పిన కధ ఉంది. ఎల్కిన్ గురువు రాన్డాల్ జారెల్ (Randall Jarrell) అనే కవి ఆయన చదువుకుంటున్న యూనివర్శిటీకి కొన్ని నెలలు సారస్వత పాఠాలు చెప్పడానికి వచ్చేడు. ఏ పాఠమూ చెప్పకుండా రోజూ చెహోవ్ (Anton Chekhov) కధలు మాత్రం చదివిస్తున్నాడు. విద్యార్ధులు ఒక్కొక్కర్నీ ఒక కధ రాసుకొని తెచ్చిమ్మన్నాడు. ఎల్కిన్ కధల్ని దిద్ది ఉంచిన ప్రతిని ఇవ్వడానికి ఒకరోజు పొద్దున్నే రమ్మన్నాడు. తీరా చెప్పిన సమయానికి వెళ్తే ఆఫీసులో లేకుండా ఇంట్లో పడుకుని ఉన్నాడు. ఎల్కిన్ ఫోన్ చేస్తే నిద్రలేచి అప్పటికప్పుడు ఆ నిద్దరమొఖంతోనే కార్లో వచ్చి అతన్ని కూడా ఎక్కించుకొని, అతను రాసిన రెండు కధల దిద్దిన ప్రతుల్ని చేతిలో పెట్టేడు. ఆ కధల్లో ప్రతి పేజీలో ఎక్కడెక్కడ ఏమేం లోపాలున్నాయో అవన్నీ ఆయనకి బొమ్మ కట్టినట్టు గుర్తున్నాయి. అవి ఒకొక్కటీ పేజీలు తిప్పమంటూ ఎక్కడెక్కడ ఏమేం బాగులేదో అన్ని వివరాలూ చదివి చెప్తున్నట్టే జ్ఞాపకం తెచ్చుకొని ఒక గంటసేపు ఊరంతా కారు నడుపుతూనే అతనికి విమర్శ చేసి చెప్పేడు. ఆయన తన కధల్ని అలా చీల్చి చెండాడుతుంటే ఎల్కిన్ ఏం మాట్లాడకుండా వింటూ కూర్చున్నాడు. ఆయన ఒక గంట తరవాత ఎల్కిన్‌ని మళ్ళీ బయల్దేరినచోటే దించి ఇంటికెళిపోయేడు. చివరికి పాతికమంది విద్యార్ధుల్లో ఆయన ఒక్క ఎల్కిన్‌కి, ఇంకొకరికీ మాత్రమే A గ్రేడ్ ఇచ్చేడు. ఆయన వెళ్ళేముందు ఎల్కిన్ మళ్ళీ వెళ్ళి ‘ఈ కధ ప్రచురిస్తే బావుంటుందా?’ అని అడిగితే ఆయన “I don’t know.” అన్నాడు. ఎల్కిన్ ఈనాటికీ తన విద్యార్ధులెవరైనా తమ రచనల్ని గురించి అవి ప్రచురించుకోవచ్చా అనడిగితే అతను ఈ కధ చెప్తాడట.

ఇలాంటి పాఠశాలల నిర్వహణను చూస్తే, చెప్పేవి వింటే వాళ్ళు సృజనని ఒక నిగూఢమైన సంపద లాగ, పరిశ్రమించి తవ్వి తవ్వి పైకి తెచ్చే ప్రయత్నం చేస్తూ పోగా ఎప్పుడైనా అరుదుగా చేతికి చిక్కే నిధిలా చూస్తున్నారనిపిస్తుంది. ఐనా సరే తమ సమయాన్నీ, శక్తినీ సృజన కోసమే సంతోషంగా వెచ్చిస్తున్నారు. అదే వాళ్ళకి సంతోషం; అంతకంటే ఎక్కువగా ఒక తప్పనిసరైన ప్రవృత్తి. జాన్ ఇర్వింగ్ (John Irving) అని ఆయన, చదువుకుని, ఏవో పదవులు అందుకుని కూడా ఉన్న సమయమంతా ఒక్క రాయడానికే వెచ్చించాలి అని అన్ని పన్లూ ఒదులుకున్నాడు. ఇలా సృజన తీవ్రమైన, నైసర్గికమైన స్వభావంగా ఉన్నవాళ్ళే అక్కడ చేరుతారు. అలాంటివాళ్ళు చెప్పే సూక్ష్మమైన విషయాలు (insights) ఇక్కడ చాల పనికొస్తాయి. సుమారు నలభై సంవత్సరాల క్రితం, అంతకు ముందూ మనకి కూడా ఇలాటి సృజనకారుల వ్యవస్థలుండేవని చూచాయగా తెలుస్తుంది. గడియారం రామక్రిష్ణ శర్మగారికి చదువుకోవాలనుండేదిగాని స్థోమత లేదు. ఆయన గురువు గారి కోసం వెతుక్కొని వేలూరి శివరామ శాస్త్రిగారి పంచన చేరిన సంగతులు శతపత్రము అని ఆత్మకధలో రామక్రిష్ణ శర్మ చెప్పుకుంటున్నారు. ఉపాధ్యాయునిగా శివరామ శాస్త్రిగారి మూర్తిమత్వం చాల కదిలిస్తుంది. కవిగా, సృజనకారునిగా శివరామ శాస్త్రిగారిది చాల అపురూపమైన ప్రతిభ అని, అంతటి ప్రతిభనూ మించి ఆయన కరుణార్ద్ర హృదయుడనీ ఆయన రాసినవి – దొరికిన కొన్నీ చదివినా అవగతమౌతుంది. ఆయన మహా పండితుడట, ఫ్రెంచ్, సంస్కృతం భాషల్లో విశేషమైన అధికారం ఉన్నవారట. ఆయన వస్తుంటే గొప్ప కవులని పెరుమోసినవాళ్ళు సైతం భక్తితో, కొంత భయంతో పక్కకు తప్పుకొనేవారట. ఇవి నారాయణరావుగారు నాకు చెప్పిన సంగతులు. ఈమాట సంపాదకులు వెంకటేశ్వర రావుగారికి ఆయన చిన్నతాతగారట. ఆయన తన స్వంత ఖర్చుతో ఏలూరు దగ్గర సూరవరంలో మామిడితోటలో సారస్వత పాఠశాలను నిర్వహించేవారట. అక్కడ పాఠమే కాదు, భోజనం, బస, బట్టలు అన్నీ ఉచితం. పాఠం నేర్చుకునేవాళ్ళ కులాలు పట్టింపు లేదు. రామక్రిష్ణ శర్మ గారు చెప్తున్నారు:

“మా గురుదేవుల వ్యక్తిత్వం చాలా గొప్పది. విశిష్టమైనది. ఆగర్భ శ్రీమంతులైనా నిరాడంబరులు. దార్శనిక పండితులైనా నిరహంకారులు. మాన్యులను సామాన్యులను సమానంగా చూసే ఉదాత్తవర్తనులు. శిష్యవత్సలులు. వారిని గూర్చి ఎంతరాసినా తక్కువే. నాకు వారి సన్నిధిలో విద్యనభ్యసించే అదృష్టం లేదు. హతవిధి లసితానాం హీ విచిత్రో విపాకః అనే మాఘ శ్లోకాన్ని తలచుకుంటూ ప్రయాణమయ్యాను.” అని. శివరామ శాస్త్రిగారికి పిల్లల్లేరట. ఆయన చివరి రోజుల్లో తనకున్నది ఊళ్ళో దళితులకి రాసిచ్చి పోయేరట. ఆయన సృజనలు అగ్ని ప్రమాదంలో తగలబడి, పోయినవి పోయేయట. వెతికినా ఏమీ దొరకవు.

ఇలాంటి పాతకాలపు పాఠశాలల్లో విద్యార్ధులకి పాఠం, బస, భోజనం అన్నీ అక్కడే. వాళ్ళ పాఠం, పరీక్ష, యోగ్యతా పత్రాలూ అన్నీ కాయితంతో పని లేకుండా మౌఖికమైనవే, కాని చాల నాణ్యమైనవి. దువ్వూరి వేంకట రమణ శాస్త్రిగారు తాతా రాయుడు శాస్త్రిగార్ని గురించి, ఆయన పాఠశాలను గురించీ ఇలాగే కృతజ్ఞతతో చెప్పుకున్నారు. త్రిపుర బెనారస్ విశ్వవిద్యాలయంలో సైన్స్ చదవటానికి వెళ్ళి, సగంలో ఆపీసి ఇంగ్లీష్ సాహిత్యం చదువుకోడానికి వెళ్ళిన సంగతులు, ఆయన ప్రొఫెసర్లు పాఠాలు చెప్పే పద్ధతుల్ని గురించి ఆ సంగతులూ కధలు కధలుగా చెప్పేవారు. ఆయన అధ్యాపకుల్లో ఒకరు గొప్ప ప్రతిభావంతుడు, గుడ్డివాడు. దృష్టిలోపం ఆయన పాండిత్యానికీ, అధ్యాపకత్వానికీ ఏమాత్రం అడ్డు రాలేదు. ఇంగ్లీష్ సాహిత్యాన్ని వేరొకరు చదివి చెప్తుంటే విని అనర్గళంగా పాఠం చేసి చెప్పేవారట. త్యాగపూరితమైన బాధ్యతల్ని సంతోషంగా తలకెత్తుకోవడంలో ఆ గురువుల ఆంతర్యం ఏమయి ఉంటుంది? బోధన సృజనకారుల వ్యక్తిత్వాల్లో ఒక పార్శ్వంగా ఉండటం సర్వ సాధారణం. చేరదీసి పాఠం చెప్పటం, నేర్చుకుంటే చూసి సంతోషించటం వాళ్ళ స్వభావమని తోస్తుంది.