ఏం చేస్తున్నావురా!

డెబ్భై ఏళ్ళ పిల్లాడా
ఏం చేస్తున్నావురా ఇక్కడ-
మాటలతో గోళీకాయలాడుతున్నా
మనవడితో కుస్తీ పట్టు పడుతున్నా
వాడిలోంచి నే బయటికొస్తే
నాలోంచి వాడు బయటికొస్తాడు

డెబ్భై ఏళ్ళ పిల్లాడా
ఏం చేస్తున్నావురా ఇక్కడ-
పద్యాలతో బిల్లంగోడు ఆడుతున్నా
ఎగురుతున్న మాట నందుకుంటానికి
ఒంటికి రెక్కలు మొలిపించుకుంటున్నా
జమ్మిచెరువులో పిట్టలెగిరిపోయినట్టు
మాట ఎగిరిపోతుంటే వెర్రిగా చూస్తున్నా
గత, వర్తమాన భవిష్యత్తులను కుమ్మేసి
కలగలిపి ఒక దారం నేస్తున్నా
రెండు పుల్లల మధ్య దివ్వంగా
ఆసు పోస్తున్నా
వర్తమానం పై ఆరేసిన ఒక వస్త్రాన్ని
బహు సుతారంగా చినిగిపోకుండా లాగుతున్నా

డెబ్భై ఏళ్ళ పిల్లవెధవా
బుద్ధి లేదా, బురదలో పొర్లుతావా-
మళ్ళా బురదలో పొర్లే అర్హత యిప్పుడే సంపాయించా
బురదలో చేతులు ముంచి
మీ ముఖం మీద ముద్ర వేస్తా
చూడండ్రా
ఆకాశాన్ని ముడ్డి కిందేసుకు కూచున్నా
యిన్ని భాషల్తో యింత విస్తారంగా పాడుకుంటూ
బంతాట ఆడుకుంటున్నా

తడిక చాటు నెవరయినా
అమ్మాయి కనపడిందా-

గుడ్డి వెధవా! అది గూడా నేనేరా