ముసలి కట్టెల మీది
మంటల గుబురుల్లోంచి
గంగ వైపుకి పాకే
తెల్లని పొగ పాము.
నీళ్ళల్లో ఊగుతున్న
నిర్జీవ హస్తాన్ని
ఒడ్డుకి లాగే
అఘోరా డేగ.
అట్టలు కట్టిన జుట్టుముడి
మడిచిన కాళ్ళు
ముడిచిన వేళ్ళు
మూసిన కళ్ళు
సాధువు పిసినికాయ.
పురాతన ధ్వనులేవో
ముక్కున కరుచుకుని
గంగ మీదుగా
పడవల పైకెగిరి
కాశీ ఇరుకువీధుల్లో
రెక్కలార్చే
గాలి వాయసం.
తడి పాదాలను మోస్తున్న
మూగ బండలను తట్టి
నీళ్ళు తాగి బరువెక్కిన
బట్టలను తాకి
ఊరికే మెట్లెక్కి దిగే
సూర్యుడు యాత్రికుడు
పాములు
ఆకారాలను మార్చే
మబ్బులను చేరి
వాయసాలు
నిరామయంగా ఊగుతున్న
పడవలను తాకి
డేగలు గంగ మీదికి
పంజాలు విసిరి
పిసినికాయలు
సీతాకోక చిలుకలై
నలుదిక్కులా వెదికితే
గంగ ఒడ్డున
యాత్రికుడి దోసిలిలో
దొరికిపోయింది అదిగో
మణికర్ణిక.
(శివుడు సతీదేవి దేహాన్ని భుజాన వేసుకుని వెళుతున్నప్పుడు ఒక్కక్క అవయవము ఒక్కొక్కచోట పడిపోతూ ఈ ఘాట్ వద్ద చెవి కమ్మ పడిపోయిందని చెబుతారు. ఇక్కడ దహనమైన శరీరం తాలూకు ఆత్మను శివుడు స్వయంగా మణికర్ణిక కనిపించిందేమోనని అడుగుతాడట. పురాణ కధనాల ప్రకారం ఇది మణికర్ణికా ఘాట్.)