1. కుర్చీలయ్య కుర్చీల లెక్క
కుతకుతలాడుతోన్న నా మనసుకు కిర్రుకిర్రుమని తాళం వేస్తోంది ఆఫీసు రూంలో నేను కూర్చున్న నా కుర్చీ. కుర్చీని అడ్డం పెట్టుకుని మానేజర్ పదేళ్ళుగా కొద్దికొద్దిగా రంపంతో కోస్తున్నాడు మనసుని.
ఎదురు తిరిగి ఏమైనా అంటే? ఇప్పుడు తను కూర్చున్న కుర్చీలో రేపటికల్లా ఇంకోరు వచ్చి కూచోరు? మూడో మనిషి ఇంటికి వస్తే ఇంకో కుర్చీ వేయలేని పరిస్థితి తనది.
బయట ఏవో పెద్ద కేకలు వినిపిస్తుంటే కుర్చీలోంచి లేచి వచ్చి చూశాను. మానేజర్ పెద్ద గొంతుకతో కుర్చీలయ్య మీద అరుస్తున్నాడు.
కుర్చీలయ్య ప్యూను. అయినా డైరెక్టర్ గది ముందు తన కుర్చీలో శ్రీకృష్ణదేవరాయల లెవల్లో ఠీవీగా కూచుంటాడు. మాట అనడు, మాట పడడు. నా కుర్చీని ఎందుకో ప్రత్యేకంగా తుడుస్తాడు. టీలు, టిఫిన్లు తెచ్చిపెట్టినప్పుడు రూపాయీ అర్ధ టిప్పు ఇవ్వబోతే పుచ్చుకోడు. బలవంతం చేసినా బల్ల మీద పెట్టేసి వెళ్ళిపోతాడు.
ఆఫీసు ఫంక్షనుకు అద్దెకు తెచ్చిన కుర్చీల్లో నాలుగు ఎలా తగ్గాయి? ఇంటికి పట్టుకుపోయావా? దొంగ వెధవ! విషయం తెలుసుకోకుండా తొందరపాటుగా విషం కక్కడం మానేజర్‌కు అలవాటు.
నిప్పులాంటి మనిషిని,నన్ను దొంగను చేస్తారా? అంటూ బయటకు పరిగెత్తిపోయి పెట్రోలు తెచ్చుకుని మానేజర్ ముందే అగ్గిపుల్ల అంటించుకున్నాడు కుర్చీలయ్య. నిప్పును నిప్పే క్షణాల్లో తగలబెడితే చుట్టూ చేరిన మిగిలిన అందరిలాగే నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాను.
మరుసటి రోజు మానేజర్ కుర్చీ వైపు నా రాజీనామాను విసిరి కొట్టి బయటికి వచ్చాను. నా బతుకు బరువును మోయడానికి ఎక్కడో మరో కుర్చీ నాకోసం ఎదురు చూడకపోదు.
2. ఓపికమ్మ ఓపిక
భారతదేశపు బీద అమ్మాయిలందరిలాగే ఓపికమ్మకు ఓపిక ఎక్కువ. పదిహేనేళ్ళకే పెళ్ళి చేస్తే అప్పటివరకూ ముక్కూ మొహం తెలియని అత్తవారింటికి వెళ్ళి ఓపికగా ఇంటెడు చాకిరీ చేసింది. కాలక్రమేణా ముగ్గురు మగ పిల్లలు, ఓ ఆడ పిల్ల పుడితే వారందరినీ ఓపికగా సాకింది. ఇంతలో భర్తను గిట్టనివారెవరో జైలుపాలు చేయగా సంసారం కుదేలు కాకుండా, కిందపడ్డ గుమ్మడికాయలా ముక్కచెక్కలు కాకుండా ఓపికగా కాచుకుంది. బంధువులు మొహం చూపించడం మానేసినా, ఇరుగుపొరుగువారు ఎక్కడ సహాయం చెయ్యాల్సివస్తుందో అని తప్పించుకు తిరిగినా కొండంత దుఃఖాన్ని కడుపులో దాచుకుని పిల్లల కడుపు నిండేలాగా, కేవలం చదువే లోకంగా శ్రద్ధ పట్టేలాగా భర్త జైలునుంచి బయటకు వచ్చేదాకా ఓపికగా బతుకు బండిని లాగింది ఓపికమ్మ. పదేళ్ళ తరువాత జైలునించి ఇంటికి వచ్చాడు భర్త. భర్త అనరానిది ఏమైనా అన్నాడో తనే ఓపిక నశించి ముందుగా నిర్ణయించుకుందో, భర్త జైలునించి తిరిగి వచ్చిన మరుసటి రోజే ఒళ్ళు కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి పిల్లలకు మొహం చూపించలేక ఎటో వెళ్ళిపోయాడు.
పిల్లలు మాత్రం ఓపిక పట్టారు. దాతల సహాయంతో చదువుకుని పెద్ద ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఒకప్పుడు మొహం తిప్పుకున్న బంధుమిత్రులు మరలా చుట్టూ చేరి నీరాజనం పట్టారు.
పిల్లలంతా కలిసినప్పుడు విచారంగా అనుకుంటూ ఉంటారు, అమ్మ ఓపికమ్మ ఇంకాస్త ఓపిక పట్టలేక పోయిందే అని.
3.నవ్వులయ్య చిరునవ్వులు
నేను ఉదయంపూట బడికెళ్ళేటప్పుడల్లా ఎదురొచ్చేవాడు నవ్వులయ్య. నావైపు చూసి తప్పకుండా నవ్వేవాడు. నేనూ నవ్వుకు బదులు నవ్వితే సంతోషిస్తూ వెళ్ళిపోయేవాడు.
నేను పదో తరగతికి వచ్చాక తెలిసింది నవ్వులయ్య మగవాడు కాదని. తెల్లని చొక్కా, తెల్లని పంచె కట్టుకుని, విబూధి రేఖలు దిద్దుకుని, ఆ రేఖల మధ్యలో కుంకుమ బొట్టు పెట్టుకుని, పొడుగ్గా పెంచిన జుట్టును వెనకాల ముడి వేసి చకచకా నడిచిపోతుంటే మగవాడనే అనుకున్నాను. కానీ కాదుట. అలాగనీ ఆడా కాదుట. అటూఇటూ కాని వ్యక్తిట. ఆ సంగతి తెలిసిన తరువాత నాలో ఏదో తెలిసీ తెలియని గందరగోళం ఏర్పడి నవ్వులయ్య ఎదురుపడ్డా ఇదివరకిట్లా నవ్వటం మానేశాను. నావంటి అవివేకులను తన జీవితకాలంలో ఎంతమందిని చూశాడో, రెండు మూడుసార్లు నావంక చూసినా నావైపునించి ఏ స్పందనా లేకపోవడంతో ఇక నావంక చూడడం మానేశాడు.
అలా సంవత్సరాలు గడిచిపోయాయి. మా ఊరి సంప్రదాయం ప్రకారం నా పెళ్ళికి నవ్వులయ్యను పిలిపించారు నాన్న. నవ్వుతూ ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఏదో జబ్బుచేసి చనిపోయాడు నవ్వులయ్య.
ఊరు ఊరంతా వెళ్ళింది శవయాత్రలో. తిరిగి వస్తూ జనమంతా, దేవుడు శాపంపెట్టి పుట్టించినా నవ్వులపాలు కాకుండా సొంత కష్టంతో బతికాడు, నిఖార్సైన మనిషి, ఊళ్ళో ఏ కార్యక్రమం జరిగినా వంచిన నడుం ఎత్తకుండా పనిచేసేవాడు, అర్ధరాత్రి, అపరాత్రి అని లేకుండా ఏ కష్టానికి పిలిచినా పరిగెత్తుకు వచ్చేవాడు, ఊరికి నవ్వులయ్య లేని లోటే లోటు–అని నవ్వులయ్య వల్ల తాము పొందిన సాయాలన్ని ఒకరికొకరు కథలుగా చెప్పుకున్నారు.
4. స్వాభిమాన్ స్వాభిమానం
స్వాభిమాన్, శ్రీకుమార్ ఒకే బళ్ళో చదువుతున్నారు. స్వాభిమాన్ మధ్యతరగతి పిల్లవాడు. శ్రీకుమార్ ధనవంతుల బిడ్డ. తన లెవల్ కాకపోయినా తను మేపే తన మిత్రబృందంలో చేర్చుకుని ఏడాదిగా రీసెస్‌లో చిరుతిళ్ళు కొనిపెడుతూ స్వాభిమాన్‌ను దువ్వుతూ వస్తున్నాడు శ్రీకుమార్. కారణం స్వాభిమాన్ బాగా చదువుతాడు కాబట్టి పెద్ద పరీక్షల్లో తనని గట్టెక్కిస్తాడని. కానీ పరీక్షలో తాను అడిగినా వాడు చూపించలేదు!
స్వాభిమాన్ సమాధానపత్రం తిరిగి ఇచ్చి బయటికి వచ్చిందాక ఎదురుచూసి, స్వాభిమాన్ బయటకు రాగానే ఉక్రోషంగా అడిగాడు, అడుగుతున్నా ఎందుకు చూపించలేదురా అని. కాపీ కొట్టడం, చూపించడం రెండూ తప్పేనని మా నాన్న చెప్పార్రా అన్నాడు స్వాభిమాన్ బాధగా. మరి సంవత్సరంనించీ రీసెస్‌లో డబ్బులు పెట్టి నేను కొనిపెడుతుంటే పందిలాగా తిన్నావ్? అన్నాడు శ్రీకుమార్ దాచుకోలేని ఉక్రోషంతో పంది అన్న పదాన్ని ఒత్తి పలుకుతూ. స్నేహితుల ముందు ఈ హఠాత్ అవమానానికి తల కొట్టేసినట్టయింది స్వాభిమాన్‌కు. కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ అక్కడినించి వెళ్ళిపోయాడు.
మరుసటి రోజు మొత్తం డబ్బులు లెక్కకట్టి తీసుకొచ్చి శ్రీకుమార్ చేతిలో ఉంచి, నువ్వేదో స్నేహంకొద్దీ వాళ్ళందరితో పాటు నాకూ కొనిపెడుతున్నావనుకున్నాను గానీ నువ్వు అంతమాట అన్నాక ఇంకా నేను నీ స్నేహితుడిగా ఉండలేనురా అన్నాడు స్వాభిమాన్.
ఇలా నలుగురి ముందూ డబ్బు చేతిలో పెట్టి తనను కాదని వెళ్ళిపోగలడని ఊహించలేదు శ్రీకుమార్. వాడి అహం దెబ్బ తింది. ఎంత పొగర్రా నీకు? పళ్ళు పటపటలాడించాడు, అసలే పరీక్ష తగలేసిన బాధలో ఉన్నాడు. ఇది పొగరు కాదురా, స్వాభిమానం అంటారని మా నాన్నే చెప్పాడు అన్నాడు స్వాభిమాన్.
అంటే ఏమిటో శ్రీకుమార్ అర్థంకాలేదు. ఇంటికి వెళ్ళి వాడి నాన్నను అడిగాడు. ఎవరిని ఎక్కడ ఉంచాలి, ఎవరిని లోపలికి పిల్చి సోఫాలో కూచోబెట్టాలి, ఎవరిని గేటు బయట నిలబెట్టి సమాధానం చెప్పి పంపెయ్యాలి, ఎవరు పలకరించితే వినబడనట్టు నటిస్తూ అవతలివాళ్ళను న్యూనపరచాలి, మనుషులను ఎలా వాడుకోవాలి లాంటివన్ని వాళ్ళ నాన్నను చూసే నేర్చుకుంటున్నాడు వాడు.
వాళ్ళ నాన్న పెద్దగా నవ్వి, అవన్నీ జీతంరాళ్ళతో బతికే మధ్యతరగతి దద్దమ్మలు చెప్పే సొల్లు కబుర్లురా అన్నాడు.
కానీ ఆ రోజెందుకో మొదటిసారిగా వాడు వాళ్ళ నాన్న ఇచ్చిన సమాధానంతో సమాధానపడలేకపోయాడు.
5. అపరాజితే అపరాజిత
అబ్బాయిలు అవసరానికి ఆడపిల్లలతో ఎక్కడలేని సొల్లు కబుర్లు చెప్పి మోజు తీరాక అమ్మల వెనక, అక్కల వెనక దాక్కుంటారని చాలా ఆలస్యంగా తెలుసుకుంది తను.
మా అమ్మ ఒప్పుకోదు అని మనోహర్ మళ్ళీ అన్నాడు, నాలుగు సంవత్సరాలైంది ఈ ప్రేమ మొదలై. చివరికి కాలేజీనించి వెళ్ళిపోయే రోజు కూడా వచ్చింది. పైగా నేనేం నిన్ను మోసం చెయ్యలేదు, నువ్వే మొదలెట్టావ్ అన్నాడు తెలివిగా. ఇప్పుడు నేనేం చెయ్యాలి? దుఃఖం ముంచుకొచ్చింది.
సరే, నాదే తప్పు. ఇవాల్టితో ఇదంతా కట్. గుడ్ బై అని చెప్పేసి పెట్టేబేడా సర్దుకుని హాస్టల్ ఖాళీచేసి ఇంటికి వచ్చేసింది. ఇంక, ఈ కల్లబొల్లి ఆశల కోసం సమయం వృధాచేసే అవివేకం తనలో అణువంతైనా మిగిలి లేదు.
జరిగినదానికి వగచి లాభం లేదు. ఏదో చెయ్యాలి. ఇక ఆపై సంవత్సరాలపాటు సివిల్స్ పుస్తకాలే లోకంగా గడిపింది. మొదటిసారి ప్రిలిమ్స్ లోనే పోయింది. కొన్ని నెలలపాటు నిరాశలో కూరుకుపోయింది. మళ్ళీ ధైర్యం తెచ్చుకుని పరీక్షకు సిద్ధమైంది. ఈసారి మెయిన్స్ పోయింది. చివరగా ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్‍వ్యూ, మూడు గండాలు విజయవంతంగా దాటుకుని విజేతగా నిలిచినప్పుడు, అన్ని పేపర్లు, టీవీల్లో తను ఇంటర్‍వ్యూలు ఇచ్చినప్పుడు మనసు సంవత్సరాల కష్టం మర్చిపోయి విజయానందాన్ని అనుభవించింది.
మరో ఐ.ఏ.ఎస్.తో పెళ్ళి కూడా కుదిరాక, పెళ్ళి శుభలేఖ ఇవ్వడానికి మనోహర్ ఇంటికి వెళ్ళింది. ఓ, ఐ.పి.ఎస్! ఆడపిల్లలకి ఎందుకూ ఇవన్నీ? ఆడపిల్లలు సుతారంగా ఉండాలి! అమ్మ నాకూ సంబంధాలు చూస్తోంది, తనకు ఎవరు నచ్చితే వాళ్ళే, అన్నాడు తనకు అలవాటైన లోగొంతుకతో. ఎప్పుడూ మృదుమధురంగా మాట్లాడతాడు కడుపులో ఎంత మంట ఉన్నా.
ఇంతలో లోపలినించి మనోహర్ అమ్మ పిలుపు. అమ్మకు కూరలో పోపుకు సాయం కావాలేమో చూడు, అనేసి అక్కడినించి కదిలిపోయింది అపరాజిత.
మనోహర్ చెత్త కబుర్లు వినేంత తీరిక ఇప్పుడు అపరాజితకు లేదు.
మరి ఈ డబల్ శుభవార్తను ఇంకా చాలామంది శ్రేయోభిలాషులతో పంచుకోవాలి కదా.