మంత్రి – మహిషం – 11
మంత్రి మానసికంగా ఎంతగా రగిలిపోతున్నా, తనకు సహజంగావున్న వ్యంగ్య హాస్య ప్రవృత్తిని విడిచిపెట్టకుండా, మహిషంతో ఇలా అంటున్నాడు.
క్షుద్బాధాం యది యాసి కాసరపతే
తర్హీదు మాకర్ణ్యతా
మస్మాభి ర్హి తృణీకృతాన్` భువి సుబే
దారాన్` సుఖం భక్షయ
నిస్సారా నపరాధ లేశ రహితా
నేతాన్ పలా లోత్కరా
న్నిత్యం భక్షయతా త్వయా క ఇహ హా
లోకోపకారో భవేత్`.
మహిష ప్రభూ! నీకు ఆకలి వేస్తే నా దృష్టిలో గడ్డిపరకలతో సమానులైన, సుబేదారుల్ని హాయిగా తిను. నేను చెప్పేది విను. ఇలా చేస్తే లోకోపకారం చేసిన ఖ్యాతి నీకు దక్కుతుంది. గడ్డికి రుచీ, పచీ లేదు. పాపం గడ్డిపరకలు ఏ తప్పిదం చేయనివి. వీటిని ఎప్పుడూ తినే నువ్వు, తప్పిదాలు చేయడం తప్ప మరొకటి ఎరగని సుబేదారుల్ని తిన్నావంటే, లోక కంటకుల్ని తొలగించినట్టే లెక్క! పైగా నువ్వు కాసరపతివి! తృణప్రాయుల్ని తినేసే హక్కు సహజంగా నీకుంది అని మంత్రి ఆంతర్యం. ఆ సంగతి అలా వుంచవయ్యా, రాజ సభలో ప్రవేశించి ఠీవీగా కూర్చో, నీకేమి తక్కువ? అంటూ మహిషాన్ని ప్రోత్సహిస్తున్నాడు మంత్రి –
కర్షం కర్ష మహర్నిశం వసుమతీం
క్లి శ్నాసి కిం కాసర?
త్వం సభ్యై రధునాతనై ర్నృప సభం
సాకం సుఖే నా వస,
న జ్ఞానం న చ మే స్తి కౌశల
మితి వ్యర్ధాం మతిం మా కృథా
స్త్వత్తో మూఢతమా ఇమే; భవసి హి
త్వం తేషు వాచస్పతిః.
దున్నపోతా! రాత్రీ పగలూ భూమిని దున్నుతూ శరీరాన్నెందుకు కష్టపెట్టుకుంటావు? నన్నడిగితే, ఈనాటి రాజసభలో కూర్చునే సభ్యులతో సుఖంగా కలిసి, కూర్చో. “నా కంత జ్ఞానం లేద”నో, “నాకంత నేర్పరితనం లేద”నో అనవసరపు ఆలోచనకు తావివ్వకు. వీళ్ళు నీకంటె మూర్ఖులు. నిజం చెప్పాలంటే, వాళ్ళలో నువ్వే బృహస్పతివి! సందేహించకు కానియ్యి.
మంత్రికి ఆనాటి రాజసభలను “అలంకరించే” సభ్యుల బుద్ధి విశేషం మీద అంతటి అభిప్రాయం వున్నదన్న మాట! దున్నపోతులను మించిన జ్ఞానశూన్యులు “సభ్యులు” గా చెల్లిపోతున్నారని మంత్రికి ఆవేదన!!
మంత్రి – మహిషం – 12
మంత్రి ఎవరిని ఆశ్రయించుకుంటే మేలు జరుగుతుందో చాలాకాలం గ్రహించుకోలేకపోయానంటూ మంత్రి వాపోతూ అంటున్నాడు.
తా నాశ్రిత్య చిరం ఖలాన్` మధుముచా
వాచా చ నుత్వా బహు
శ్రాంతో హం విఫలశ్రమ స్తదుపరి
ద్రా గ్వైశ్యకర్మా శ్రితః
నిష్కాణ్యద్య శతం వితీర్య మహిషా
భిఖ్యా నుపేత్య ప్రభూన్`
సమ్యక్తైః పరిరక్షిత శ్చ కృతవిత
స్తౌ మద్య హర్షేణ తాన్`.
ఇంతవరకు చెప్పిన దుర్మార్గుల్ని ఆశ్రయించుకొని తేనె మాటలతో వాళ్ళను చాలాకాలం పొగిడి పొగిడి, అలసిపోయాను. వారి నాశ్రయించడంవల్ల వట్టి శ్రమ తప్ప ఏ ప్రయోజనం కలగలేదు. వాణిజ్యం వైపు మళ్ళాను. అలా సంపాదించిన, నూరు మాడలు ఖర్చు చేసి, మహిష ప్రభువుల్ని ఆశ్రయించాను. ఆ ప్రభువు వారే నన్ను రక్షించారు. అందుకు కృతజ్ఞతతో వారిని సంతోషంగా స్తోత్రం చేస్తున్నాను. దుర్మార్గుల్ని ప్రభువులనుకొని పొరబడి నా తప్పు తెలుసుకొని, అసలైన రక్షణ నిచ్చే ప్రభువు సన్నిధి చేరి, సుఖపడుతున్నానని మంత్రి భావం.
నీ ఔదార్యం గొప్పదయ్యా, నువ్వు సామాన్య జంతువవుకావు అంటూ కృతజ్ఞతా పూర్వకంగా, మంత్రి అంటున్నాడు మహిషంతో –
త్వం క్రేతోసి మయా పణైః కతీపయై
ర్భ్ర్తుం కుటుంబం నిజం
త్వం తు ప్రా గధ మరణతా మివ భజన్
స్వం క్లేశయిత్వా వపుః
నానాధాన్య సముద్భవై ర్యదకరో
స్త్వం మాం తథా నిర్వృతం
తత్తే స్మి మూల్యం వినా.
శ్రీ మహిషరాజా, వినవయ్యా! నా భార్య, పిల్లలను పోషించుకోవడం కోసం కొంత సొమ్ము ఖర్చుచేసి నిన్ను కొన్నాను. నువ్వేమో, నా కెప్పుడో బాకీ పడినట్టు, నీ శరీరాన్ని శ్రమపెట్టి అనేక విధాలైన ధాన్యాలు పండించి నన్ను సుఖపెట్టావు. ఆ యీ కారణం వల్ల నువ్వు నాకు చేసిన ఉపకారాలకు జవాబుగా నేను నీకు అమ్ముడు పోతున్నాను. ఇందుకు నువ్వేమీ “వెల” చెల్లించనవసరంలేదు.
మంత్రి కన్నీటితో అన్నమాటలివి. నన్ను మనిషి….సాటి మనిషి అవమానాల పాలు చేసి, కష్టపెట్టాడు. నువ్వు జంతువవై వుండీ, నువ్వు శ్రమపడి నన్ను సుఖపెట్టావు. నిన్ను నేను కొని వుండ వచ్చు. నేను నీకు “వెల” ఏమీ చెల్లించనవసరం లేని విధంగా అమ్ముడు పోతున్నానని మంత్రి కృతజ్ఞత తెలుపుతున్నాడు.
మంత్రి – మహిషం – 13
నాకు నువ్వు నీకు నేను అన్యోన్యంగా కట్టుబడి ఉన్నామంటూ మంత్రి అనుబంధాన్ని విశదం చేస్తున్నాడు.
త్వం బద్ధోసి హి మద్గుణై ర్దృఢ మహం
బద్ధోస్మి చ త్వ ద్గుణై
స్త్వం మాం రక్షసి సైరిభోత్తమ సఖే!
రక్షామి చ త్వా మహం
ఇ త్యన్యోన్య కృతోపకారముదితా
వావా మిహ ద్వా వపి
స్థాస్యావ శ్శరదాం శతం
ద్రుత అమీ నశ్యంత న శ్శత్రవః
సైరిభశ్రేష్టుడా! నువ్వు నా గుణాలకు (త్రాళ్ళకు) కట్టుబడి వున్నావు. నీ గుణాలకు (మంచి లక్షణాలకు) నేను గట్టిగా కట్టుబడి వున్నాను. అంటే, ఉభయుల్ని రెండు విధాల “గుణాలు” (త్రాళ్ళు) బంధించివుంచాయి. నువ్వు నన్ను కాపాడుతున్నావు. నిన్ను నేను కూడా కాపాడుతున్నాను. ఈ విధంగా ఒకరికొకరం ఉపకారం చేసుకోవడం ద్వారా సంతోషం పొందుతున్న మన మిద్దరం కూడా నూరేళ్ళు నిండుగా జీవిద్దాం. మన శత్రువులు నశించిపోదురు గాక!
ఉపకార గుణం, కృతజ్ఞతాభావం, సుగుణాలకు నిబద్ధులై వుండడం చిరకాలం జీవించడానికర్హతలుగా మంత్రి పరోక్షంగా సూచిస్తున్నాడు. మహిష రాజాధి రాజును ఒక పక్కన స్తోత్రం చేస్తూనే, ఆ చేయడంలో, తనను బాధించే ఒక “లోటు” లేదా “లోపం” గురించి మంత్రి వాపోతున్నాడు.
స్తోతు త్వాం మహిషాది రాజ సుగుణాం
దీదాంసతే ధీ ర్మమ
త్వం చ స్తుత్యత యా ప్రబంధ వచసాం
యోగ్యోసి కిం త్వ స్వహం`
విత్తోన్మత్త నరేంద్ర దుర్గుణ ఘటా
మిధ్యాస్త వోపక్రమై
ర్వాగ్భిః పర్యుషితాభి రద్య భవతః
కుర్వే మతిం క్షమ్యతాం`
రారాజా! మంచి గుణాలకు ఆలవాలమైన నిన్ను స్తోత్రం చేయాలని నా బుద్ధికి తోస్తోంది. నువ్వు స్తుతికి అర్హుడవే కనుక నీ పై గ్రంధ రచన చేయడానికి యోగ్యుడవు. డబ్బు మదంతో వెర్రెత్తి, మంచి చెడ్డల్ని మరిచిన పాలకుల గుంపుల దుర్గుణాలను, దొంగస్తోత్రాలు చేసి నా పద జాలానికి మకిలి పట్టించాను కదా! అటువంటి “పాసిపోయిన” పదజాలంతో నిన్ను స్తోత్రం చేస్తున్నందుకు నన్ను క్షమించు!
అర్హుల్ని స్తుతించకపోవడం ఒక తప్పయితే, అనర్హుల్ని స్తుతించడం పెద్ద తప్పు. పని గడవడం కోసం, శుంఠల్ని స్తోత్రం చేసి చేసి, మాటలకు మకిలి పట్టించడం నేరం. అటువంటి “నిలవ” మాటలతో స్తుతి చేస్తున్నందుకు మన్నించవయ్యా అంటూ మంత్రి సిగ్గుపడుతున్నాడు.
మంత్రి – మహిషం – 14
నువ్వు సమర్థుడివి. మమ్మల్ని రక్షించగల వాడివి నువ్వే అంటూ కృతజ్ఞతా పూర్వకంగా మంత్రి, మహిషాన్ని సంభావిస్తూ అంటున్నాడు.
శంబా కారు పిషాణి శిత్తి రియదా
ముంజాళి కంబాళికా
సూచీ కారు విశేష కోద్రవ తిల
శ్యామాక గోధూమకాన్`
త్వం సిద్ధార్థ కుళుత్థ ముద్గ తువరీ
నిష్పావ మాషాదికం
తం తం కాల ముపేత్య సైరిభపతే
నిష్వాద్య సంరక్షణః
సైరిప్రభూ! ద్రావిడ దేశంలో ప్రసిద్ధంగా పండే శంబాలు, కారులు, పిషాణాలు, రియడాలు, ముంజాళులు, శంబాళికలు, సుచీలు మొదలైన రకరకాల వడ్లు, కొర్రలు, నువ్వులు, చామలు, గోధుమలు, తెల్లావాలు, ఉలవలు, పెసలు, కందులు, అనుములు, మినుములు మొదలైన ఇతర పంటలు, కాలానుగుణంగా ఉత్పాదించి నువ్వు మమ్మల్ని రక్షించు.
భూమి సారవంతమైనది. నువ్వు ఎంతటి శ్రమనైనా తట్టుకోగల బలశాలివి మాత్రమే కాదు, నిన్ను నమ్ముకున్న వాళ్ళని రక్షించే సద్గుణశాలివి కూడా కనుక, నిన్నీ కోరిక కోరుతున్నాను. ఈ పంటలు మా పొట్ట నింపడమేకాదు, మాకు ధన సంపాదన కూడా చేసి పెడతాయని ధ్వని. బుద్ధి హీనుడు, చేతికందిన అన్నాన్ని జారవిడిచి, భిక్షాటనకు బయలుదేరతాడనే న్యాయాన్ని స్మరించుకొంటూ మంత్రి మహిష హృదయాన్ని ప్రశంసిస్తున్నాడు.
న బ్రూషే పరుషం న జల్పసి మృషా
వాదాన్ న గర్వోన్నతిం
ధత్సే ప్రత్యుత లాంగలే నియమిత
స్స్వం క్లేశయిత్వా వపుః
మర్త్యానా మనుపాధి జీవనకృతే
త్వం కల్పసే కాసర!
త్వ య్యేవం సతి దుర్నృపా ననుసరన్
హంతా స్మ్యహం వంచితః.
నువ్వు కటువుగా మాట్లాడవు. అబ్ద్ధాలు చెప్పవు. గర్వంతో రెచ్చిపోవు. ఈ సుగుణాలు సరే. నాగలికి కట్టిన నీ శరీరాన్ని కష్ట పెట్టుకుని మనుషులకు ఉపద్రవాలు లేని జీవనోపాధి ఏర్పరుస్తున్నావు. నువ్వు ఇంత ఉదారంగా ఉంటూంటే, అయ్యయ్యో, నా సంగతి చూడు! నేను దుర్మార్గులైన పాలకుల వెంటబడి మోస పోయాను!
తెలివి తేటలకల్లా ముఖ్యం, ఇతరుల యోగ్యతా యోగ్యతల్ని అంచనా వేసుకుని యోగ్యుల్ని ఆశ్రయించడం ప్రధానం. నేను ఉపకారివైన నిన్ను గుర్తించి, ఆశ్రయించడంలో ఆలస్యం చేశానయ్యా! అని మంత్రి వాపోతున్నాడు.
మంత్రి – మహిషం – 15
సేవించుకోదలిచినప్పుడు మాన మర్యాద లెరిగిన, వివేకం కలిగిన “పాలకుడు” దొరకడం కూడా అదృష్టమే! అంటున్నాడు మంత్రి.
పైశున్యం నహి కర్ణగామి భవతో
నాంచ స్యయే వంచనా
మేకా కారత యైవ తిష్ఠసి సఖే
సర్వా స్వవస్థా స్వపి
భూపాలై రల మవ్యవస్థ విషయై
ర్దిష్ట్యాద్య లబ్దోసి నః
శ్రీమత్కాసర సార్వభౌమ భవతా
నా ధేన మోదామహే
మిత్రమా! కాసర సమ్రాట్`! చెప్పుడు మాటలే పనిగా పెట్టుకొన్న కొండెగాళ్ళ మాటలు, నీ చెవి కెక్కవు. నువ్వు ఎవరినీ మోసం చేయవు. ఎటువంటి పరిస్థితుల్లోనూ నువ్వు ప్రవర్తనలో హెచ్చు, తగ్గులు లేకుండా ఒకే విధంగా వుంటావు. ఈ రాజులున్నారు చూశావా, వీళ్ళెప్పుడు అరాచకంగా వుంటారు. (వారి చేతల్లో మాటల్లో, నిలకడ వుండదు) చాలు చాలు. వాళ్ళు వద్దు. మా అదృష్టం కొద్దీ నువ్వు మాకు దక్కేవు. నీ వంటి ప్రభువు దొరికినందుకు మాకెంతో ఆనందంగా వుంది. ఆశ్రయించుకున్న వాళ్ళను రక్షించడంలో అగ్రేసరుడైన నిన్ను ఆశీర్వదించకుండా ఉండలేనంటున్నాడు మంత్రి.
న స్వప్నేపి దరిద్రతా ప్రసజతి
త్వా మాశ్రితానాం నృణాం
కో శే ద్రవ్య చయైః ప తంతి బహువ
శ్స్యాల్యాదయో వ్రీహయః
ఇత్థం సర్వ జనావన ప్రతి భువే
దీనా వళీ బంధవే
భూ యస్యో మహిషాధిరాజ భవతే
భూ యా సుర ద్యాశిషః.
నా మహిష రాజా! నిన్ను నమ్ముకొని బతికే మనుషులకు కలలో కూడా పేదరికాన్ని దరిజేరనివ్వవు. కోశాలలో, కొట్టాలలో ధన సంపద, ధాన్య సంపద వచ్చి పడతాయి. (అంటే డబ్బుకి డబ్బు, వివిధ ధాన్య రాశులకు రాశులు వృద్ధి అవుతాయి). ఇలాగ ప్రజలందరిని రక్షించడానికి కంకణం కట్టుకున్న దీన జనబంధువువైన నీ కివే మా ఆశీర్వాదాలు. నీకు ఏ రోగాలు లేకుండా, దృఢమైన శరీరం కలకాలం వుండాలని కోరుకుంటున్నామని సారాంశం.
నీ ఆరోగ్యం మా ఆరోగ్యం. నీ సేవ మా భాగ్యం. నీ దయా వీక్షణం మాకు రక్షణం. పది కాలాలపాటు నువ్వు బాగుండాలని కోరుకుంటామయ్యా! అని మంత్రి కృతజ్ఞతా వచనం!
మంత్రి – మహిషం – 16
రోజూ దుష్ట పాలకుల కటువైన మాటలు విని విని విసిగి పోయిన చెవులకు, మహిష కంఠధ్వని, అమృతపాయంగా వినిపిస్తుందంటున్నాడు మంత్రి.
నిత్యం హంత వివర్ధమాన సుమహా
దుష్ప్రాభవోత్సాహ వ
ద్దు ర్భూపాలకృపా లవ చ్యుత రుశ
త్యాకర్ణ నో దీర్ణయోః
నిర్వ్యా జం మమ కర్ణయో స్త్య మమృతం
హుంకారవం చా కృథా
దిష్ట్యా సంప్రతి సీద సీహ మహిష
క్షేత్రేషు కృ ష్యున్ముఖః.
ఒకనాటి కొకనాడు పెరిగిపోతున్న దురభిమానం, దుష్పరిపాలనం గల చెడ్డ పాలకులు మాట్లాడే మచ్చుకైనా దయలేని, కటువైన, మాటలు విని విని, చెవులు చిల్లులుపడ్డ నాకు, నువ్వు ఏ కారణం లేకుండానే చేసే హుంకారం అమృత సమానంగా వినిపిస్తోంది. అటువంటి నువ్వు, ఓ మహిషరాజా! దైవవశాత్తు (విధి ప్రేరణవల్ల) పొలం దున్నే నిమిత్తం వరిమళ్ళలో ఉత్సాహంగా శరీరాన్ని కష్టపెట్టుకుంటున్నావు. సుఖపడవలసిన నీకు కష్టాన్ని, సుఖాలకు తగని దుష్టులకు వైభవ సమృద్ధిని, ఆ “విధి” కల్పించిందని మంత్రి ఖేదపడుతున్నాడు.
నిజంగా దయగలిగి రక్షించగల మహిష రాజాధిరాజును ఆశ్రయించకుండా, కొందరు దుష్ట ప్రభువుల్ని పట్టుకు వ్రేలాడతారెందుకు? అని మంత్రి అసహనంతో ప్రశ్నిస్తున్నాడు.
మూఢా భాస ధనోష్మ భీష్మవదన
క్ష్మాపాల పాశాంగణే
ష్యాశా పాశ వికృష్యమాణ హృదయా
వ్యర్ధాం స్థితిం తన్యతే
అస్మ ద్భూపతి మాశ్రయంతి న బుధాః
కామప్రదం సైరిభం
యోస్మా నక్షతి రక్షతి క్షితిఫలై
సౌమ్య స్సమస్తై రపి.
మూర్ఖులు, నిందితులు, డబ్బున్నది కదా అని ఎప్పుడూ రుస రుసలాడుతూ ముఖాన్ని కోపంతో మటమట లాడించుకొంటూండే తుచ్ఛ పాలకుల, ఇంటి వాకిళ్ళలో పడిగాపులు కాస్తూ, వాళ్ళేదో ఒరగబెట్టక పోతారా అనే ఆశాపాశాలు యీడ్చి పెడుతూండగా నిరర్ధకంగా కొందరు గడుపుతున్నారు. అంతే గాని కోరిన కోరికలు తీర్చి, ధనధాన్యాలు సమకూర్చి, రక్షించగల ప్రసన్నమూర్తి మా మహిష ప్రభువును ఆశ్రయించరుకదా!
తుచ్ఛులు, మదమత్తులు, అయిన పాలకుల వెంట ఎందుకు పడి, అవమానపడతారయ్యా? మహిషాన్ని నమ్ముకొని వ్యవసాయం చేసుకుంటే ఎంత సుఖం!! అని మంత్రి గట్టిగా మందలిస్తున్నాడు.
మంత్రి – మహిషం – 17
దున్నపోతుకు ఏమి తక్కువ? మహారాజయోగమంటే ఏమిటి? మనం అనుకోవడంలోనే వుంది. ఆ మాటకు వస్తే, దున్నపోతుకు రాజభోగాలు తక్కువా? అని ప్రశ్నించి, అవేమిటో చెపుతున్నాడు మంత్రి.
గోష్ఠం తే నృప మందిరం శకృ దపి
ప్రాయేణ కస్తూరికా
పృధ్వీరేణు సముత్కర స్తు వపుషః
ప్రత్యగ్ర పిష్టాతకః
నిర్వ్యా జోపకృతి ప్రవీణ మనసో
మానేన ల బ్ధోన్నతే
స్సర్వం తే మహిషాధిరాజ త దిదం
భూషా విశేషాయతే.
మహిష రాజాధిరాజా! నీది మహారాజ యోగమే! మహారాజులకు భవనాలుంటే, నీకు నువ్వుండే పశుశాలే రాజభవనం. వాళ్ళకు ఒంటికి పూసుకొనడానికి కస్తూరి వుంటే, నీ పేడ నీకు కస్తూరి. వారి బట్టలకు, వాసన సమకూర్చే పరిమళ ద్రవ్యం “పట వాసకం” వుంటే, నీకు నీ నేల ధూళే “పట వాసకం”! కారణం లేకుండానే ఇతరులకు ఉపకారం చేయడంలో నిపుణుడివి. ఉన్నతమైన మనస్సు కలిగి ప్రతిష్ఠ సంపాదించుకున్న వాడివి అయిన నీకు అందుబాటులో ఉన్నవి గొప్ప అలంకారాలుగా పరిణమిస్తున్నాయి.
మహిషం, నానా కష్టాలు పడి, పాలకుడి ధనాగారాన్ని నింపుతూండగా, ఆ పాలకుడు మాత్రం దానికి ద్రోహం చేస్తున్నాడని మంత్రి యీసడిస్తున్నాడు.
హా! జానుద్వయసే దురుద్ధరపదే
పంకే వహన్` లాంగలం
పశ్చా చ్ఛూద్రకర ప్రతోద ఘటనా
సంజాత భూరి వ్రణః
క్లేశం యాసి హి కోశపూరణ కృతే
రాజ్ఞ స్స తు ద్రుహ్యతి
బ్రూమః కిం మహిషేంద్ర! తే శివ శివ
త్వ ద్భాగ సర్వస్వహృత్.
మహిషేంద్ర! మోకాలి లోతు బురదలో, కాలు కదపడానికి వీలులేని స్థితిలో, నాగలి మోస్తూ నీ వెనక వైపున నిలబడి ఆ నాగలి నడిపించే పెద్దకాపు ముల్లు గర్రతో పొడవడం వల్ల ఏర్పడిన పెద్దగాయంతో, బాధను సహిస్తూ పాలకుడిగారి బొక్కసం నింపడానికి కష్టపడుతున్నావు. ఇంత చేస్తున్న నీ పట్ల ఆయన గారికి కృతజ్ఞత ఏమైనా వుందా? శివ శివా! ఇంక చెప్పేదేముంది! నీ సర్వస్వం దోచుకుని నీకు ద్రోహమే చేస్తున్నాడయ్యా!
ఆయాస పడేది నువ్వు! అందలాలెక్కినవాడు దోపిడిగాడు! వాడికి కృతజ్ఞత ఎక్కడిది! ద్రోహమే చేస్తాడని గమనించమని మంత్రి నిప్పులు చెరుగుతున్నాడు.
మంత్రి – మహిషం – 18
మహిషం, సామాన్య జంతువు కాదు. మానసం కలది. ఎవరినైనా పోషించగలననే ధీమా కలది. అందుకే, దాని ప్రతిజ్ఞ ఏమిటో వివరిస్తున్నాడు మంత్రి.
మూఢాః కేచి దుపాశ్రయంతి ధనికాన్
క్లిశ్యంతు నశ్యంతు వా
యో మా మాశ్రయతే తమేవ బిభృయా
మాత్మప్రయాసై రితి
మృ ష్టాన్నైక వదాన్య సైరిభపతే
హుంభా రవ వ్యాజతో
ఘంటా ఘోష పురస్సరం వితను షే
శమ్య క్ప్రతిజ్ఞా మపి.
“కొందరు మూర్ఖులు, ధనవంతులను ఆశ్రయించుకు బతుకుతూంటారు. వాళ్ళు కష్టాల పాలుకానీ, చావనీ, మన కనవసరం. నన్ను ఆశ్రయించినవారికి నన్ను కష్టపెట్టుకునైనా సరే, పోషణ జరిపిస్తాను.” అంటూ నీ మెడలోని గంటమోత సాక్షిగా, “హుంభా” అని ధ్వనిచేసే నెపంతోనూ, ప్రతిజ్ఞ చేస్తున్నావయ్యా, సైరిభపతీ! మృష్టాన్నదాతా!!
ఆ ప్రతిజ్ఞ అర్ధం చేసుకున్న వాళ్ళు బాగుపడతారు. కానివాళ్ళు కష్టాలపాలవుతారని మంత్రి స్పష్టం చేస్తున్నాడు. నీ గుణగణాలను ఎంత పొగిడినా తనివి తీరదు. తలుచు కొనేకొద్దీ అవి ప్రశంసనీయాలే నంటున్నాడు మంత్రి.
ఖ్యాతా నాహరతు క్రతూ నపి శతం
క్రూరం విధత్తాం తపో
యోగాభ్యాస ముపైతు వా కలయతాం
తీర్థాటనం వా పునః
త్వ త్సందర్శన మంతరా న మహిష
ప్రాప్నోతి లోక శ్శుభాన్
హం హో ప శ్వథమోపి సైరిభ గుణై
శ్శ్లాఘ్యోసి లోకోత్తరైః.
ఎవరు కానీ సుప్రసిద్ధంగా జ్యోతిష్టోమం మొదలైన యజ్ఞాలు చెయ్యవచ్చు గాక, కఠిన నియమాలతో తపస్సు చేయవచ్చు గాక, అష్టాంగ యుక్త చిత్తవృత్తి నిరోధకమైన యోగాభ్యాసం చేయవచ్చు గాక! అలాగే, ధనుష్కోటి, ప్రయాగ మొదలైన తీర్థాలు తిరిగి స్నానాలు ఆచరించవచ్చుగాక, ఒకసారి కాదు మళ్ళీ మళ్ళీ చేయవచ్చుగాక! అయినప్పటికీ, నీ దర్శనం లేకుండా నీతో సహవాసం లేకుండా, ప్రజలు శుభాలు, యజ్ఞ దాన భోగాలు, పొందజాలరు. నువ్వు అందరూ లోకువగా చూసే పశువువే కావచ్చు. కొందరి దృష్టిలో నికృష్టుడవే కావచ్చు. ధాన్యాలు ఉత్పత్తి చేయడం ద్వారా, యజ్ఞ హవిస్సులు ఉత్పత్తి చేయడం ద్వారా, జనజీవనానికి ఉపకారం చేస్తూ ప్రశంసా యోగ్యత సంపాదించుకున్నావు. ఇది ఆశ్చర్యకరమే!!
మంత్రి – మహిషం – 19
నిజమాలోచించి, నిష్పక్షపాతంగా చెప్పవలసి వస్తే ఈ ప్రపంచపు నిలకడతనానికి, దున్నపోతే ఆధారమని నిరూపిస్తున్నాడు మంత్రి.
త్వా మాదౌ గణయంతి మూఢగణనా
ప్రస్తావనా యాం జనా
స్తే మూఢా మహి మావిద స్తవ న తే
మృష్యామి తాం వాచ్యతాం
స స్యోత్పత్తి నిదాన మ స్యథ హవి
ర్మూలం సురాణా మసి
బ్రూమః కిం బహు కాసరేంద్ర జగతా
మాధారతాం గా హసే.
ఈ లోకంలో జనం చిత్రం చూశావా? మూర్ఖుల్ని లెక్కించే సందర్భాల్లో మొట్ట మొదట నిన్ను లెక్కిస్తూంటారు. వాళ్ళు వట్టి మూర్ఖులు. అంతే కాదు, నీ మహిమ బొత్తిగా ఎరగనివారు. అటువంటి వారి మాటల్ని సహించను. ధాన్యాల ఉత్పత్తికి నువ్వే ఆధారం. దేవతలకు యజ్ఞాలలో సమర్పించే హవిర్ద్రవ్యాలను ఉత్పత్తి చేయడానికి సైతం నువ్వే మూలాధారం. అసలిన్ని మాటలనుకోవడమెందుకు? ఈ ప్రపంచం మొత్తానికే నువ్వు మూలాధారం. నిన్ను ఇంత శక్తిమంతుడ్ని, మూర్ఖుల జాబితాలో జేర్చిన వారే మూర్ఖులు అంటూ ఈసడిస్తున్నాడు. రాజ గృహ ద్వారాలు పట్టుకొని వ్రేలాడే వారేపాటి వారు? ఆ పని చేసిన దోషం నశించడం కోసం, మంత్రి, మహిషానికి నమస్కరిస్తూ ఇలా అంటున్నాడు.
దుర్వాణీక సముద్య దుద్భట భట
శ్రేణీ కర వ్యాపృత
ద్రాఘీయ స్ఫుట ధూమవర్తి విగళ
ద్ధూమాంధకారా వృతే
తన్నిష్ఠీవన పూతిగంథ భరితే
భూపాల బాహ్యాంగణే
వాసక్లేశ హరాయ సైరిభపతే
మన్నాధ! తుభ్యం నమః.
మహిషరాజా! నీకు నా నమస్కారం. ఎందుకంటే, నువ్వే నా ప్రభువ్వి! చాలాకాలంగా, నిలబడడానికి దుర్భరంగా వుండే రాజగృహాల వాకిళ్ళలో నేను పడిగాపులు కాశాను. పొగరుతలకెక్కిన రాజభటులు మెరిసే కత్తులు ధరించి, ద్వారంలో నిలుచుండి, వచ్చిన వారి యోగ్యత విచారించకుండా కటువుగా మాట్లాడుతూ, పొడుగాటి పొగాకు చుట్టలు, చేత వహించి పొగ వదులుతూ, ఆ పొగ దట్టంగా చుట్టూ అలుముకొనేలాగ చేస్తూ, తుపుకు తుపుక్కున ఉమ్ముతూ, దుర్గంధం నింపుతూండే రాజద్వారాలవి! అటువంటి చోట నిలబడిన కష్టం హరించి పోవడానికి గాను నీకీ నమస్కారమయ్యా అని పాపపరిహారం చెప్పుకుంటున్నాడు మంత్రి.
మంత్రి – మహిషం – 20
కవులూ, ఆశ్రితులూ, తమ ప్రభువుల శృంగార చేష్టల్ని గొప్ప చేసి వర్ణిస్తూవుంటారు. ఆయా శృంగార చేష్టలు తప్ప, ఆ ప్రభువులు తమ జీవితాల్లో ఏమీ సాధించిన దాఖలాలు కనిపించవు! మరి, నాకు ప్రభువువైన, ఉదారుడవు, శ్రమజీవివి అయిన నీ శృంగార చేష్టలు నేను వర్ణిస్తే మాత్రం తప్పేముంది? అని సంజాయిషీ చెప్పుకుంటూ వర్ణనకు దిగుగున్నాడు మంత్రి.
కేదారే మహిషీ మనోజ గృహ మా
ఘ్రా యోన్నమ య్యావనం
దంతాన్ ఖురైః క్ష్మాం ఖనన్
ప్రత్యగ్రాయిత సూరణాంకుర నిభం
త త్కించి దుజ్జృంభయ
న్నానందం మహిషేంద్ర నిర్విశసి య
త్త ద్ద్రష్టృ నేత్రోత్సవః.
మహిష రసిక రాజేంద్రా! నువ్వు వరిపొలంలో, నీ ప్రేయసి గేదె “మనోజగృహాన్ని” మూజూసి, మోరపైకెత్తి, పళ్ళు బయట పెట్టి (పళ్ళికిలించి) వికృతంగా కూతకూసి, గిట్టలతో నేలను తవ్వి, కొత్త కందమొలక వంటి “ఒకానొకదాన్ని” (నీ అంగభాగాన్ని) రిక్కబెట్టి, ఎంత ఆనందం అనుభవిస్తున్నావో! చూసే వాళ్ళకు ఎంత కన్నుల పండువుగా వుంటుందో ఎంతని చెప్పేది? మంత్రి ఈ “నాటు వర్ణన”, తెలిసి తెలిసి చెయ్యడంలో వుద్దేశం, కవులు తమ ప్రభువుల మితిమీరిన శృంగార వర్ణనల పట్ల తనకు గల ఏవగింపు ప్రకటించడం. వాళ్ళది శృంగారమైతే, నీ శృంగారం వర్ణనీయం కాకుండా పోతుందా? అని మహిషాన్ని రెచ్చగొట్టడం!!
పోనీ అదెందుకు? వద్దులే నీలో ఋషీశ్వరుణ్ణి చూసే ప్రయత్నం చేస్తానంటూ పూర్తిగా వేరైన వర్ణనకు ఉపక్రమిస్తున్నాడు మంత్రి.
పర్ణానాం పయసాం చ నిత్యమశనైః
కాలం క్షిపన్ వర్తసేనిష్కంప స్తపసి స్థితో హి నిభృతం
త్వం పర్ణశాలాంతరే
శేషే స్థండిల ఏవ చాను దివసం
ద్వి స్త్రి ర్ని మజ్జ స్యపి
ప్రార్థ్యం కిం తవ? కాసరేంద్ర య దృషే
శ్చర్యాం సమాలంబ సే.
కాసరేంద్ర! నువ్వు ఋషి మాదిరిగానే ఆకులు తిని బతుకుతున్నావు. కేవలం జలభక్షణ చేస్తున్నావు. కుటీరంలో నివసిస్తూ, చలనం నిరోధించి కాలం గడుపుతున్నావు. ఋషి పర్ణశాలలో తపస్సు చేసుకుంటూనట్టే, నువ్వు కూడా (తపసి – మాఘమాసంలో) పర్ణశాలలో గడుపుతున్నావు. ఆయనగారి మాదిరిగా, కటిక నేలమీద పడుకుంటున్నావు. ఋషి రోజూ రెండుసార్లు స్నానం చేస్తే, నువ్వు రెండుమూడు మార్లు నీటిలో మునుగుతున్నావు (స్నానమాచరిస్తున్నావు). ఇదంతా చూడగా నువ్వు ఋషి చర్యను అనుసరించగోరితే, అంతకంటె కావలసిన దేముంది? అనిపిస్తోంది. *