కాల సంబంధానికి ఒకసారి తిరిగి వెళ్ళినట్టయితే, ప్రాచీన సాహిత్యంలో అప్పటి కవుల దృక్పధం ఎలా ఉండేదంటే (అంటే అటు సంస్కృత సాహిత్యంలో కాని లేదా ఇటు తెలుగు సాహిత్యంలో కాని) స్వయంభువుగా ఒక కొత్త ఊహ, ఒక కొత్త కథని స్వీకరించి లేదా సూత్రీకరించి, స్వతంత్రమైన రచనగా చెయ్యటం ఎప్పుడూ జరగలేదు. పురాణాలనుంచి, ఇతిహాసాలనుంచి, ఒక ఇతివృత్తాన్ని తీసుకోటం, దాన్ని రసోచితంగా మార్పులు చేసుకోటం, అలా ఒక పునాది ఏర్పడ్డాక, మహా భవనాలు కట్టటం జరిగింది. రామాయణ, భారత అనువాదాల్లోకూడా, అవసరమైన విషయాలు పెంచుకోటం, అనవసరమైన విషయాలు కుదించుకోటం, లేదా వ్యాఖ్యానాల్లో చెప్పిన విషయాలు కలుపుకోటం, ఒక అద్భుతమైన భవనాన్ని నిర్మించటం ఉంది కాని, ఆ మూలభావం ఏదైతే ఉందో అది మనది కాదు. అయినా దాన్ని మనం తీసుకొని, మన సొంతం అన్నంతగా మార్పు చేసుకుంటాం! ఇది మన సాహిత్య సంబంధమైన సంస్కృతిలో ఒక భాగం. అందుకనే, రామరాజభూషణుడు ఒక పద్యం రాసాడు. అంటే, ఈ పద్యానికి కర్త ఒక్క రామరాజభూషణుడు మాత్రమే కాదు! ఆ కాలంలో సాహిత్యం పట్ల, పద్య రచన పట్ల అందరికీ అప్పట్లో ఉన్న ఒక ప్రగాఢమైన విశ్వాసాన్ని ఆయన ఇలా చెప్పాడు.
కేవల కల్పనా కథలు కృత్రిమ రత్నము లార్య సత్కథల్
వావిరి పుట్టు రత్నము లవారిత సత్కవి కల్పనా విభూ
షావహ పూర్వ వృత్తములు సానలు తీరిన జాతి రత్నముల్
కావున నట్టి మిశ్ర కథగా నొనరింపుము నేర్పు పెంపునన్!
“నువ్వు స్వతంత్రమైన కథ తీసుకోనక్కరలేదు. ఏ భారతం నుంచో, రామాయణం నుంచో లేదా ఏ పురాణం నుంచో కథ తీసుకో! ఆ కథకి నీ రసోచితమైన దృష్టితో మార్పులు చెయ్యి. చేసిన మార్పులు చమత్కారంగా చెప్పు. చమత్కారం ఎక్కడ నుండి వస్తుంది? వాక్య నిర్మాణంలో వస్తుంది. నువ్వు ఉపయోగించే అలంకారం నుంచి వస్తుంది. నువ్వు చూపించే శ్లేష మొదలైన సామాగ్రి వల్ల వస్తుంది. ఇలా చెయ్యటం వల్ల, సాహిత్యంలో ఉత్తమ సాహిత్యం వస్తుంది” అని రామరాజభూషణుడు ఒక నిర్వచనం చేసాడు. అది ఆయన హఠాత్తుగా, భూమినుంచి పుట్టినట్టుగా నిర్వచించలేదు. అంతక్రితం నుంచి కూడా వస్తున్నటువంటి ఒక సాంప్రదాయాన్ని, ఆయన ప్రముఖంగా చెప్పాడు. కానీ, ఇందులో చిన్న మెలిక ఉంది.
పింగళి సూరన గారు ( ఈయన ఆధునికుడు) ఏ ప్రబంధం నుంచి లేదా ఇతిహాసం, పురాణం నుంచి కథ తీసుకోకుండా, స్వతంత్రమైన ఒక కథను సృష్టించి “కళాపూర్ణోదయం” అన్న కావ్యం రాసాడు. ఆ కావ్యం, ఆ నాటి వారికి మింగుడు పడలేదు. అందుకని ఎవ్వరూ దాన్ని ఆదరించలేదు. ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే, 16వ శతాబ్ది చివరలో పింగళి సూరనగారు రాసిన “కళాపూర్ణోదయం” కావ్యం, ఆంధ్రదేశంలో తెలియటానికి దాదాపు 400 సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే,” నేటి సాహిత్యవేత్తగా ఈవాళ నాకు తోచింది, సమాజంలో ఈనాడు చూస్తున్న ఒక దారుణమైన ఘటనో, లేదా ఒక మనోజ్ఞమైన ఘటనో తీసుకొని దాన్ని కథగా రాస్తాను. అది నా ఇష్టం. నేను రాస్తున్నాను. మీకు చూపిస్తున్నాను. మీకు నచ్చుతుంది నచ్చక పోతుంది. చదివిన వాళ్ళు నిర్ణయిస్తారు. రాయడమనేది నేను చేస్తాను.” సాహిత్యంలో ఇదీ ఈనాటి పరిస్థితి.
కానీ, పూర్వం అలా ఉండేది కాదు. ఒకర్ని ఎవర్నో ఆశ్రయించుకొని రచయిత అన్నవాడు ఉండేవాడు. పోషకుడి అభిరుచికి అనుగుణంగా, అంటే పోషకుడు శివభక్తుడు అయితే, ఆయనకు నచ్చిన శివకథను తీసుకొని ఒక కావ్యం రాయవయ్యా అంటే, అప్పుడు ఆ రచయిత తన ప్రతిభంతా చూపించి కావ్యం రాస్తే, “ఆహా! చాలా బాగుంద” ని వాడికి సత్కారాలన్నీ చేసి, ఒక అగ్రహారాన్ని ఇవ్వడమనేది ఒక పద్ధతి మనకి ఉంది. ఆనాడే కాకుండా, ఈనాడు కూడా కొన్ని కొన్ని సందర్భాలలో “నాకు ఫలానా విషయం చాలా ఇష్టమండి. దానికి సంబంధించి మీరేదైనా కావ్యం రాస్తే, నేను అంకితం పుచ్చుకుంటాను. ప్రతిఫలంగా మీకు ఏదో ఇస్తాను” అనే ధోరణి ఏదైతో ఉందో, అది ఇంకా కొనసాగుతోంది. అంటే, ఇతివృత్తం నీది కాదు. ఎదుటివాడి ఆనుకూల్యానికి అనుగుణంగా, నీ ప్రతిభకి తగ్గట్టు కావ్యం రాయటం, అంకితం ఇయ్యటం మామూలే! శ్రీనాధుడు, పెద్దన లాంటి గొప్పవాళ్ళంతా చేసింది అదే! ఈ పద్ధతి నుంచి మారి, స్వతంత్రమైన పద్ధతిలో పింగళి సూరన కావ్యం రాసినరోజున ఆయన్ను ఆదరించలేదు.
అప్పుడు పింగళి సూరన “ప్రభావతీ ప్రద్యుమ్నం” రాసాడు. అది “హరి వంశం” సందర్భంలోని ఒక కథ తీసుకొని, వజ్రనాభుడనేవాడి కూతురు ప్రభావతి శ్రీకృష్ణుడు మనవడు ప్రద్యుమ్నుడు, వాళ్ళిద్దరూ కలుసుకోటం అదీ ఒక కథగా చిత్రించాడు. ఆశ్చర్యం ఏమిటంటే “ప్రభావతీ ప్రద్యుమ్నం” కి పింగళి సూరనకి మంచి పేరు వచ్చింది. స్వతంత్రమైన ఇతివృత్తంతో రాసిన “కళాపూర్ణోదయం” కి మొన్న మొన్న కట్టమంచి రామలింగ రెడ్డిగారు ప్రచారంలోకి తెచ్చే దాకా పేరు రాలేదు. అంటే, స్వతంత్రమైన ఇతివృత్తంతోటి రచన చేస్తే, అది సమకాలంలో వారు ఆదరించకపోయే ప్రమాదముంది. “ఏ గతి రచించిరేని సమకాలము వారు మెచ్చరే కదా” అని చేమకూర వేంకట కవి, తన గురించి కాకుండా, ఏదో వర్ణన సందర్భంలో చెప్పాడు. నువ్వు ఎలాగైనా ఒక కొత్త విషయాన్ని చెపితే, మెచ్చుకొనే అవకాశం లేదు.
అంటే, పద్య రచనలు, కవిత్వ రచనలు స్థిరపడిన విలువలతో, ఇతరుల ఆనుకుల్యానికి, ఇతరులను మెప్పించటానికి చేస్తున్నప్పుడు, కొంత సర్దుకు పోవటం అన్నది జీవితంలో తప్పవు. ఆ పరిమితుల్లోనూ అఖండమైన ప్రతిభ చూపించినప్పుడు, ఆ ప్రతిభను గౌరవించాలి, మన్నించాలి. ఇలాగే నన్నెచోడదేవుడు 12వ శతాబ్దిలో రాసిన “కుమార సంభవం”లో కూడా జరిగింది. 1910 సంవత్సరంలో మానవల్లి రామకృష్ణ కవి గారు దాన్ని ప్రచురించే వరకూ “కుమార సంభవం” గురించి ఎవరికీ తెలియలేదు. ఇలాగ తెలుగు సాహిత్యంలోనే 10 నుంచి 15 దాకా ఉదాహరణలు మనకి కనపడతాయి. అంతెందుకు. ఈనాడు ఇంటింటా మారుమ్రోగుతున్న అన్నమయ్య కీర్తనలు, 300 సంవత్సరాలకి పైగా నేల మాడిగళ్ళో ఉండి పోయాయి. ఆయన 1420 సంవత్సరం నుండి 1503 సంవత్సరం వరకు బతికి 32 వేల కీర్తనలు రాసాడంటే ఆంధ్రదేశం దురదృష్టం కొద్దీ, రాగిరేకుల్లో నిక్షిప్తమైన కీర్తనలు కరిగించుకొని, బిందెలు చేయించుకొన్న వాళ్ళు చేయించుకోగా, 12 వేల కీర్తనలు 32 సంపుటాల్లో ఈవాల్టికి పరిశోధకుల ధర్మమా అని మనకి దక్కాయి.ఇవి ఎన్నేళ్ళు పక్కన పడిపోయాయి? “పద కవిత్వం” ను ఆదరించడం అన్నది సమకాలంలో జరగ లేదు.అంటే, కొన్ని, కొన్ని భ్రమలు పోడానికి కొంత కాలం పడుతుంది. కృష్ణదేవరాయలు కాలం ముందునుంచే ప్రబంధాలను ఆదరించడం మొదలు పెట్టారు కనుక, అప్పటి వాళ్ళు ఈ పద కవిత్వాన్ని పట్టించుకోకుండా, “ఏదో పాడుకొంటున్నాడులే లొల్లాయి పదాలు!” అని పక్కన పెడితే, అవి మళ్ళీ ఇంటింటా మారుమ్రోగటానికి 300 సంవత్సరాలు పట్టింది. సమకాలీనంగా ఒక బలవత్తరమైన ప్రవాహం సాగుతుండగా, దాన్ని పట్టించుకోకపోటం మనం తరచు చూస్తూ ఉంటాం. కాని, విజ్ఞులైన వారు, ఇతివృత్తంలో బలం ఉంటే, దాన్ని ఆదరించటానికి మనసు తెరిచి పెట్టుకొని ఉంటారు!
పైన చెప్పిన విషయాలకు కొంచెం దూరంగా ఉంటుంది కాని, కొన్ని విషయాలు మనవి చేస్తాను. కూచిపూడి నృత్యం, భరత నాట్యం, అలాగే మన దేశంలో అనేక రకాలైన నృత్యాలున్నాయి. వీటినుంచి భిన్నంగా, పూనాలో బాలగంగాధర్ తిలక్ ఆడిటోరియంలో కథక్ స్టైల్లో ఒక అద్భుతమైన నృత్యం చూసాను. ఒక సంస్కృత శ్లోకాన్ని, ఒక అద్భుతమైన రాగంలో బాణీ కట్టి, శ్లోకంలోని భావానికి తగ్గట్టు అభినయం చెయ్యటమనేది జరిగింది. చాలా గొప్పగా చేసారు. చెప్పదల్చుకొన్న విషయాన్ని ఏ విధంగా వ్యక్తంచేస్తే రక్తి కడుతుందో, అటువంటి ప్రక్రియలను తీసుకొని ప్రదర్శించారు. అది రక్తి కట్టింది. కనుక ఒక్కొక్క విషయం చెప్పటానికి ఒక్కొక్క వాహకం కావాలి. ఒకటి పాటలో చెపితే బాగుంటుంది. ఒకటి పద్యంలో చెపితే బాగుంటుంది. మరొకటి కథగా చెపితే బాగుంటుంది. కథగా చెప్పవలసింది నవలగా చెప్పినా, నవలను కథగా చెప్పినా వికృతంగా ఉంటుంది. కనుక సమతూకంలో, సరైన ప్రక్రియలో రచన చేస్తే అది ప్రాచీనమా, ఆధునికమా అన్న తేడాలు లేకుండా, దాన్ని “ముందే నిర్ణయించుకొన్న భావాల” వల్ల తిరస్కరించేటువంటి అవసరం కాని, అపోహకాని, తొలగించుకోవాల్సి ఉంటుంది.
(ఇంకా ఉంది)