అడవి పూల పరిమళాన్ని
కొండగాలి బిందెలకెత్తుకుంటుంది
కుంచెతడిని తలపై మోసే రివ్వాటు
చెట్టు కొమ్మల్ని ఊపుతూ
చలువ చిత్రాలను గీస్తుంది
చీకటి బొంత పరుచుకుని
నది నడుము వాల్చుతుంది
నీటి పాయల్లో ఊగుతూ
అలల సుడులలో కదిలే పడవ
జలశిల్పాలను చెక్కుతుంది
సముద్రం లాంటి ఆకాశంలో
అసహజమైన రూపాలెన్నో
సహజంగా మొలుస్తాయి
నింగినిండా అల్లుకుపోయే మబ్బులు
రంగు కాగితాల్లా ఎగిరే పక్షుల కోసం
వడ్లకుచ్చుల ముఖాలతో
పొదరింటికి తోరణాలు కడతాయి
నీలిరంగు ధూళిలో
పసిపాప తెల్లని కళ్ళలో
తేలియాడే చూపు లాంటి కల.
కొలిమిలో మరిగి ఎర్రగా మెరిసే
ఇనుప రజనులాంటి శ్వాస.
కరకు దంతాల మధ్య తచ్చాడే
ఆశ నిరాశల అల్పత్వానికి
విలోమ ప్రతీకలు!
వెలుగు చొరనీయని తెరలన్నీ
ఒక్కొక్కటిగా విప్పుకున్నాక
అనంత విశ్వం
కంటిగింజ నుండి తొంగి చూసే
ఓ చిన్న మొలకవుతుంది
ఒక్క కాంతిరేకంత
వెలుతురు మొలిచినా
ఆ దేహపు నేలలో ఆ తల తంపరలో
సుదీర్ఘ నిరీక్షణలకు సెలవు
సుదూర ప్రయాణాలకు విరామం
సమస్త కోరికలకు ముగింపు.
అప్పుడిక ఏ యుద్ధాలూ ఉండవు
నిత్యమూ ఆ నిశ్శబ్దంలో
పూలభాషలో మెత్తగా హాయిగా
వినిపించే భువన గానాన్ని
చెవొగ్గి వినడానికి సిద్ధం కావాలి
నేనూ
సీతాకోకచిలుకలూ
చిన్నారులూ…
ష్!