కవితావేశం

ఉన్నపళంగా కాయితం మీదికి
అక్షరమై జారకపోతే బరువు
గుండె మోయడం కష్టం.
ఆనకట్టకు వరద పోటెత్తినపుడు
కొన్ని క్యుసెక్కుల నీరైనా కిందికి
వొదలకపోతే గట్లు తెగిపోతాయి.

కొండ మొదలు వెదురు పొద నుండి
ఊట మొగలో వంశధార పుట్టినట్టు
పేరు తెలియని ఒక అల్లాటం
ఎప్పటినుంచో ఎదలో ఉబుకుతుంది.
చీమల బారు కాళ్ళ చప్పుడు సైతం
వినగలిగిన ఒక మనఃస్థితిలో
లోపల ఊరే ఏకాంతం
అలసట తీరే దారి వెదుకుతుంది.
ఉద్వేగ చలనాల ఉత్సాహాన్ని
పదాల పాయల్లోకి మలుపుతుంది
ఉధృతి పెరిగేకొద్దీ
ఒడ్లొరుసుకొని నది పారుతుంది
జలపాతంలా మది దూకుతుంది!

అడుగులో అడుగేసుకుంటూ
ఒక్కోసారి మెల్లగా నడుస్తుంది
పెద్ద పెద్ద అంగలతో
మరికొన్ని సార్లు పరుగు తీస్తుంది
దగ్గరి ప్రపంచాల రద్దీని మోసుకొస్తుంది.
కొన్ని ఉదయాలుగా కొన్ని సంధ్యలుగా
మలుపు తిరిగిన గాథల ఒంపుల్లో
దూర తీరాల ప్రతిఫలనాలను చూపిస్తుంది.
చెదిరిపోయిన కలల్లోకి
ఆగిపోయిన కథల్లోకి
కొన్ని అసంపూర్ణ వాక్యాలుగా
అనువాదమౌతుంది.

కాస్త మబ్బు పట్టినా చాలు
సిరా చుక్కలు చినుకులవుతాయి
నీరెండ మెరుపు తాకినా
వేళ్ళ కొసల్లో పూలు పూస్తాయి.
చీకటి ఊయలలో
రాతిరి బిడ్డ నిద్దరోతున్నపుడు కూడా
తూరుపు పొలంలో విత్తుకుని
పచ్చని జోలపాట పాడేందుకు
ఊహల మొలకలు పొద్దు వైపే చూస్తుంటాయి.

కవితావేశానికి కాలనియమం లేదు
తల్లోంచి తడి ఒలుకుతున్నపుడే
ఓ కవితో పాటో రాసేయాలి!