ఊపిరి బొట్ల కానుక

నిత్యోత్సవం లాంటిది జీవితం!

కానీ దారులు కలవని కూడలిలో
తునాతునకలై కూలబడినప్పుడు
అది తలుపులు మూసుకునే చప్పుడు
గదులు సన్నబడిన గుండె సడి అవుతుంది.
చుట్టూ విషావరణం ముసురుకున్నపుడు
భయమే బతుకు పర్యాయపదమౌతుంది.


చీకటి వెలుగుల శోభాయాత్ర జీవితం!

కానీ తెరచాటుగా మృత్యువు దోబూచులాడినపుడు
ఉత్సవశోభ ఊడ్చుకుపోతుంది.
బూదిలోని ఊపిరి ఉనికి ప్రశ్నార్థకమవుతుంది.
త్రీడీలో మిణుగురులా నవ్వు ఖైదు చెయ్యబడుతుంది.
రేపటి వెదుకులాటలో చూపూ మందగిస్తుంది.


ఒడి నిండేసరికి తనువు ఖాళీ చేయాల్సిన
అనివార్య శూన్యత జీవితం!

కళ్ళనో గుండెనో మెత్తగా తాకే క్షణాలైనా
సరదా సరాగాల చెలిమి సమయాలైనా
బంధాలు బంధనాల వంతెనపై
బహిరాంతర్లోకాల నడుమ
నిరంతర వాత్సల్య చలనాలవుతాయి
గుట్టలుగా రాలిపోతున్న క్షణాల మధ్య
బుట్టలుగా పోగుపడే జ్ఞాపకాల రాశులవుతాయి.


ఎడతెగని కోరికల ఉత్సవం జీవితం!

వెలుతురు పత్రాలన్నిటినీ
చీకటి తెగులు మింగుతుందనే మీమాంస కంటే
ఆశల చిగుళ్ళన్నిటికీ
భయం చీడ పడుతుందనే దిగులు కంటే
క్షణక్షణ గండాలు దాటే క్రమంలో
నరాల్లోని ధైర్యాన్ని తెంచుకునేకంటే
సత్తువ కూడదీసుకునే సరికొత్త చూపు కోసం
అక్షరాన్ని ఆశ్రయించాలి.
వజ్రగళంలో పలికే తెగువ పాటను
తలలో బావుటాలా నిలుపుకోవాలి.


ఆశను బ్రతికించే ఉత్సాహం జీవితం!

చిక్కని చీకటి ముట్టడిని
మిణుకు ఖడ్గమైనా ఛేదిస్తుందని నమ్మాలి.
యుద్ధం ముగిసేవరకు
ఆశే ఆయుధమని నమ్మాలి.
సాటి మనిషి పట్ల ప్రేమ
కొలతల్లేని సహజాతమై
దోసిళ్ళలో ఒలికిపోవాలి.
ప్రాణానికీ ప్రాణానికి ప్రియమార మరికొన్ని
ఊపిరి బొట్లను కానుకివ్వాలి!