నేనిప్పుడు ఇల్లు వాకిలి వదిలిపెట్టి
ఊరును మనుషుల్ను ఇడ్శిపెట్టి
దూరంగ బతుకుతెరువు ఎతుక్కుంట
ఈడ్సుకుంట ఈడ్సుకుంట ఒచ్చిన వలసపిట్టను
నావాండ్లను కల్వటానికి నాదాను
ఎందుకనిపిత్తాందో అర్థం కాదు
కన్నోల్ల కళ్ళలోకి సూత్తానికి నెనరు లేదు
కలల్లోనే సాలీడు గూడును అల్లుకుంట
ఎవలకు కనిపించకుంట వెళ్ళి ఒక్కపాలి అమ్మ నాయినను ముద్దాడి వత్త
ఏ నడి జాము రాతిర్లనో పీడకలకు
ఉలిక్కిపడి జడుసుకున్నప్పుడు
పక్క తడుముకుంట
ఎవలు కనిపించరు
నా కలల వాకిట్ల ముగ్గుబెట్టి
దినాం రంగులద్దిపోయే అమ్మ
పరిగేరటం ఆపి ఉరుక్కుంటావచ్చి
గుడ్లల్ల నీళ్ళు తీసుకున్నట్టే అనిపిత్తది
వీపు నిమిరి దగ్గరకు దీస్కుని ధైర్నం జెప్పే
నాయిన కళ్ళముందు మెదిలినట్టే ఉంటది
సోపతి గాళ్ళందరు మతిల కొచ్చి సొదబెట్టినట్టే ఉంటది
నెమలీక కందిలి పట్టుకొచ్చి మనసంతా కలెదిరిగి సోదాజేసినట్టే ఉంటది
గుంజాయితి పడుతున్న మనసుకు దెబ్బ తాకినట్టయి
నెత్తురు బొట్ట బొట్ట కారుతనే ఉంటది
పేగుపాశం ఒక పక్క పీకుతనే ఉంటది
తెగిన బొడ్డుపేగు కన్నోల్లని గుర్తు పట్టనీయదు
ఎవలకు ఎవలం ఏమీ కానీ ఒంటరి గువ్వలం
ఎంతటి మనాదికైనా దుక్కమొకటే గవాయి