పాట లేని వసంతం

దృశ్యాలు తిరగబడ్డాయి
ముదురు బూడిదరంగులో
కొయ్యబారిన తోట
కుందేళ్ళ కళ్ళముందు
ముఖం ముడుచుకోవడం
శిథిల సంకేతం –

కొమ్మల మీంచి
చివుళ్ళు మాయమయ్యాయి సరే
చిగురాశలు కూడానా?

ఇప్పుడు వెలుగుతున్న
ఈ కొన్ని తెల్లని పూలనూ
ఆర్పేసిపోతావా?

తోలు ఒరలో సర్దిపెట్టిన
పురాతన ఆయుధంలా
నన్నూ కుదేసి ఉంచుతావా?

నేను పాడాలనుకున్నది
ఒక్కగానొక్క పాట!
నూతిలోకి జారి
కావులో కూరుకుపోయే నీటిపిల్లిలా*
గొంతు దాటనీయవు
ఒడ్డు చేరనీయవు

ఈ ఆగడాలను ఎంతని భరించేది?
పరిత్యక్త వసంతమా!
పద! పద! పక్క సర్దుకో.
నా ఆదిమ దృశ్యాలను
నాకు తిరిగి ఇచ్చేసి వెళ్ళు.
నా పాటను
నా దగ్గరే విడిచి వెళ్ళు.

(*నీటిపిల్లి = నూతిలోకి చేజారి మునిగిపోయిన బాల్చీని వెదికి తీసే ఇనుపకొక్కేల గుత్తి)