ఒక ఆకాశమే
వేల సంవత్సరాల వర్షమై చీలినట్లు
ఒక చంద్రుడే
వేల రాత్రుల వెన్నెలై విరిసినట్లు
ఒక మనసే
వేల దిగుళ్ళ ఆనందాల చెలమైనట్లు
ఒక్క వూపిరే
వేల లక్షల జీవరాశులైనట్టు
ఒక్క మనిషే
ఉదయాలై అస్తమయాలై
నిరంతరంగా పారే నదులై
నిలిచి ఘోషించే సముద్రాలై
ప్రతి అనుభవపు
కొమ్మ చివరా విరబూసేందుకు
చివుళ్ళై మొగ్గలై
ముళ్ళై పూలై
ఆశలై నిరాశలై
బాధ్యతలై బంధాలై
సంబరాలై సంభ్రమాలై
జీవితమై…