రచయిత వివరాలు

ధీరజ్ కశ్యప్ వేముగంటి

పూర్తిపేరు: ధీరజ్ కశ్యప్ వేముగంటి
ఇతరపేర్లు:
సొంత ఊరు: కరీంనగర్
ప్రస్తుత నివాసం: హైద్రాబాద్
వృత్తి:
ఇష్టమైన రచయితలు: ఇష్టమైన రచనలే ఉండాలేమో రచయతలకన్నా అని అభిప్రాయం మార్చుకుంటున్న. నామిని, తిలక్, శేషేంద్ర, మెహెర్ - చెప్పాల్సి వస్త.
హాబీలు: రాయడం - అప్పుడప్పుడు, చదవాలని ప్రయత్నించడం.
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి:

 

ఒళ్ళువిరుచుకుని లేచే కుక్కకి
వాసనలు చూడని
బతుకే లేదని అనిపిస్తుందా?

అస్తమానం హోరెత్తించే
సముద్రపు గాలుల్ని చూసి
వీధి బిచ్చగాడు విసుక్కుంటాడా?

ఘోషలు, ఉద్వేగాలు
కథలు, ప్రయాణాలు
ముగింపులన్నీ
తుది అంచులని దాటిన
గాలి తెరలుగా మారి
వీచి వీచి వెళ్ళిపోయాయి.

ఒళ్ళోని పిల్లాడి నిద్ర చూసి
వాడులేని లోకమంతా
గొంతులోకి పొంగుకొచ్చి…
పాట ఓ క్షణకాలం ఆగింది.
ఎక్కడి నుంచో చిరుగాలి వీచింది
పిల్లాడి ముంగురులును కదిలిస్తూ…

గడ్డకట్టిన జీవితాలు
మాటలు మర్చిపోయి
ప్రేమలు కరువై
అరచేతులు రుద్దుకుంటూ
గొంగళ్ళు కప్పుకున్న
మానవాళి ఆనవాళ్ళు.

సూర్యుడికి వెలుతురు తాపమని
చంద్రుడికి సాంబ్రాణి వేయమని
పురమాయిస్తున్నది ఎవరు?

నిద్రాలోకాల సంగీతంలో
ఎన్ని స్వరాలో
ఎవరికైనా తెలుసా ఇక్కడ?

లైట్స్!
బట్ లైట్స్ నెవర్ గైడ్ యు హోమ్.
చీకటితో కాదు ఇబ్బంది
వెలుగుని వీపునేసుకుని వీచేదే కనుక.
ఇబ్బందంతా
నీకు-నాకు మధ్యన.

నిర్మానుష్యమైన రోడ్డు హక్కుగా లాక్కుంది ఒంటరి గుండెని. చెవుల్లో చలి, గుండెలో మంచు, మొద్దుబారిపోయిన మొహం. గ్లోవ్స్ ఉన్న చేతిలో వెచ్చగా ఒదిగిన సిగరెట్ స్టబ్ చివరి వెలుతురులు చిమ్ముతుంది. అడుగుల కింది ఎండుటాకులు అన్నీ మంచు నీళ్ళల్లో ఒదిగిపోతున్నాయి. కొండలు, నిశ్చలంగా నిల్చున్న చెరువు. సాయంత్రమైందని ఈ రోజుకి ఇక చాలు అని సోలిపోతున్న సూర్యుడు. వీటన్నిటికీ సాక్షిగా నేను. నన్ను కూడా వీటిగాటిన కట్టేస్తూ తాము సాక్షులుగా పక్షుల గుంపులు.

మామూలుతనపు రోడ్డులెంబడి
నొప్పి సూది గుచ్చుతూ
అంబులెన్సు
కుట్లేసి పోయినట్టు
సాల్ గిరా తేదీల్లోనో మరి
ఎక్కడ నక్కిందో
ఎనెన్ని భూముల కింద పారుతుందో

ప్రతీవారం ఒక రోజు అపార్ట్‌మెంట్ మెట్లన్నీ కడిగే నియమం ఒకటి ఉంది. కొన్ని ఏళ్ళ వరకు ఇది ప్రతీ శుక్రవారం రాత్రి జరిగే తంతు. ఎదుగుతున్న వయస్సులో అలా మెట్లు కడిగే దృశ్యాన్ని చూస్తే అనాలోచితంగా ఆనందపు రవ్వలు ఎగిసేవి లోపలెక్కడో… వచ్చే వారాంతపు సెలవులని ఊహించుకుంటూ. ఇన్నేళ్ళ తరవాత అదే దృశ్యాన్ని చూస్తే ఇవాళ గురువారమే. ఏళ్ళు గడుస్తుంటే అక్కడక్కడే మార్పు చెందుతున్న జీవిత చిహ్నాలు.

వచ్చినట్టే వెళ్ళిపోయింది, తన పన్నెండో ఏట, మొన్నటి ప్రేమికుల రోజున, ఎవరో పిలిచినట్టు, వచ్చిన కారణానికి పోయే ముహూర్తానికి లంకె ఏదో ఉందని తెలుపడానికి అన్నట్టు. ఆ అమ్మాయి తన స్నేహితుడితో మాట్లాడుతూ అంది, “మనవాళ్ళు చచ్చిపోవడం నన్ను పెద్ద ఇబ్బంది పెట్టే విషయమేమి కాదు ఇపుడు. సమయం వస్తే వెళ్ళిపోతారు కదా. కానీ ఇదే ఎందుకో కొత్త లోతుతో గుచ్చుకుంటోంది” అని.

ఎందుకో తెలీదు, వర్షంలో తడవనంటే చాలు మనస్సు ఎండిపోతుంది. తేలికపాటి జల్లుల్లో, ఏటవాలు రోడ్ల పైన పారుతున్న నీటి మీద స్ట్రీట్ లైట్ల వెలుతురు. వెలిసిపోయిన తెరపై నిజజీవితపు సినిమాని చూస్తున్నట్టు ఉంటుంది నాకు. అది చూస్తూ నడవాలని ఉంటుంది, ఆడాలని ఉంటుంది. డాన్స్ తప్ప నన్ను నేను మర్చిపోయే పని ఏదో ఒకటి చేయాలని ఉంటుంది. ఇన్ని గుర్తొచ్చిన ప్రాణం ఊపిరిని కోరుకుంది.

ఇలాంటి మధ్యాహ్నాల్లో ఆ తాతామనవళ్ళను చూస్తే చిన్న మోతాదు పరిశోధన చేస్తున్నట్టే ఉంటారు. మనవడి చేతిలో ఐపాడ్, తాత చేతిలో ఫోన్‌బుక్. అక్కడక్కడా పేర్లు, వాటి పక్కన పెద్దాయన చేతిరాత కుదరకున్నా ఒత్తిపట్టి రాసిన రాతలు–మాట్లాడిన బంధువులు, స్నేహితుల వివరాలు. కొన్ని పేజీల వెనక వాళ్ళు ఉన్న వీధుల ఫోటో ప్రింట్లు, ఇదే ఆ తాత-మనవడు చేసే వ్యవహారం.

కాలు ఆనించిన చోటు విమానాలు ఆగే చోటు. స్థలాలని కలుపుతూ, కాలాలని మారుస్తూ, నాగరికతలని కరెన్సీ నోట్లలా తర్జుమా చేయగలిగే పవిత్ర స్థలి. నువ్వు అక్కడే నిలబడివున్నా నీతో పాటు ఇదే కాలంలో ఇదే క్షణంలో జీవించిన, జీవిస్తున్న ఈ కోట్లకోట్లమంది సంబంధం లేని జనాల ఆటుపోట్లు, ఒకరినొకరు తోసుకుంటూ తప్పుకుంటూ వస్తూ పోతూ… ఇవ్వేమీ నిన్ను తాకే స్థితిలో నువ్వు లేవు.

మనిషితో మనిషి మాట్లాడుతూనే ఉంటాడు. తనతో తాను ఇంకా ఎక్కువగా, అంతు లేకుండా… అది మధ్యాహ్నం. అటు మీద పైనంతా ఒళ్ళంతా హైదరాబాద్ అంతా కాలిపోతున్న ఎండ. పక్కనే కె. ఎఫ్. సి. కానీ రోడ్డుకి ఆ వైపున ఉంటుంది. బండి దిగిన మరుక్షణం ‘దాహానికి’ సమాధానంగా ఆ కె. ఎఫ్. సి. గుర్తొస్తుంటుంది. ‘వెళ్ళినా బాగుండు’ అని అనుకుంటావు చూడు? అదీ నీతో నువ్వు మాట్లాడుకోవడం అంటే.