అదే ఇల్లు. అదే జీవితానికి అదే ఇల్లు కదా ఉండేదీ అనే మిడిల్ క్లాస్ నేర్పు ఆ అమ్మాయిలో. సిటీ బస్సుల్లో నుంచి మాత్రమే హైదరాబాదుని పరిచయం చేసుకున్న లైఫ్ స్టయిల్.
ఆ అమ్మాయితో సహా ఆ ఇంట్లో నిండుగా ముగ్గురు. అమ్మ, తాను, ఒక కుక్క!
కుక్క వయస్సు పన్నెండేళ్ళు.
అప్పటికే ఆ ఇంట్లో ఆవరించిన శూన్యాన్ని గ్రహించి వాలినంత అవలీలగా వచ్చింది ఈ మనుషుల జీవితాల్లోకి.
వచ్చినట్టే వెళ్ళిపోయింది, తన పన్నెండో ఏట, మొన్నటి ప్రేమికుల రోజున, ఎవరో పిలిచినట్టు, వచ్చిన కారణానికి పోయే ముహూర్తానికి లంకె ఏదో ఉందని తెలుపడానికి అన్నట్టు.
ఆ అమ్మాయి తన స్నేహితుడితో మాట్లాడుతూ అంది, “మనవాళ్ళు చచ్చిపోవడం నన్ను పెద్ద ఇబ్బంది పెట్టే విషయమేమి కాదు ఇపుడు. సమయం వస్తే వెళ్ళిపోతారు కదా. కానీ ఇదే ఎందుకో కొత్త లోతుతో గుచ్చుకుంటోంది” అని.
-ఫిబ్రవరి 18, 2021.
శనివారం రాతిరి కదా, వీకెండ్! అనే కారణంతో కార్లో డ్రైవ్. వెళ్తూ వెళ్తూ ఉంటే ఐస్‌క్రీమ్ తినాలనిపించి గూగుల్ మ్యాప్స్‌ని అడిగితే ‘ఆ కుడి పక్కన’ ఆపమంది. ఇటాలియన్ జెలాతో అట. స్టోర్‌లోకి వెళ్ళి లైన్‌లో నిల్చుంటే అసలు ఈ ఐస్‌క్రీమ్ జెలాతో కావడానికి కారణం ఆ స్టోర్‌వాళ్ళు ఇటలీవాళ్ళు అవ్వడం అని గోడ మీద వాళ్ళ కథ.
‘అవర్ స్టోరీ బిగిన్స్ ఆజ్ గుడ్ ఆజ్ యువర్స్’ అని మొదలు.
ఆ వాక్యాన్ని అదే తీరుగా తెలుగులోకి తర్జుమా చేద్దామని ప్రయత్నించాను లైన్‌లో నిలుచునే. నా వల్ల కాలేదు. మేము ఇటలీ నుంచి అని చెప్పుకుంటూ ‘అవర్ ఏన్సిస్టర్స్ డిసైడెడ్ టు లే దెయిర్ రూట్స్ ఇన్ దిస్ టౌన్…’ అని ఉంది.
హ్మ్! దట్స్ ఎ ప్రెట్టీ ఆంబిషస్ స్టోరీ ఫర్ ఎ శాటర్‌డే నైట్! అనుకున్నాను నాకు నేను.
-ఫిబ్రవరి 7, 2021.
20 ఏళ్ళుగా అమెరికాలో ఉంటున్న గుజరాతీ కుటుంబం నా స్నేహితుడిది. ఆరు ఏళ్ళ కవలలు. దియా అండ్ దర్ష్. వాళ్ళ అమ్మ పుట్టినరోజుకి కేక్ తీసుకుందామని వెళ్తున్నాము.
2020 మొదట్లో రెండు వారాలు అని ఇండియాకి వెళ్ళి ఆరునెలలు ఇరుక్కుపోయిన కష్టం. నిన్న జెలాతో షాపులో రూట్స్ గురించి చదివిన వాక్యం ఒకటి గుర్తొచ్చింది.
ఈ బుడ్డి పిల్లలు ఇంట్లో తినే తిండి, వాళ్ళ పేర్లు, టి.వి.లో నడిచే ఛానళ్ళు, క్రిస్మస్ దాటి వాళ్ళకి తెలిసిన పండుగలు… ఇలా వాళ్ళని చుట్టుముట్టే ప్రపంచం అంతా పుట్టింది అక్కడెక్కడో గుజరాత్ రాష్ట్రంలో సముద్రం ఒడ్డున అలల తాకిడికి ఎప్పుడు తడుస్తూ ఉండే ఒక గ్రామం.
“హౌ వజ్ యువర్ ఇండియా ట్రిప్? వాట్ యు డిడ్ ఫర్ సిక్స్ మంత్స్?” అడిగాను పిల్లలను పలకరిస్తూ.
“ఉయ్ వెంట్ టు బయ్ కిండర్ జాయ్ టాయ్స్ ఇన్ ఇండియా” అని అన్నాడు దర్ష్.
పెదాల మీదకి నవ్వొచ్చినా అంతకుమించి విస్మయంగా అనిపించింది వాడి చూపు.
నాకు తెలిసిన లోకాలకి హాయినిచ్చే రంగులతో వాళ్ళదైన అమాయకపు ప్రపంచాన్ని గీద్దాం అని, తర్కాల కొక్కాలకి ఊహల పోగులని జత చేస్తూ ఒక స్నిగ్ధమైన ప్రపంచాన్ని నిర్మించాలని చూశాను. కుదరలేదు.
వెనక్కి తిరిగి చూశాను. నా చూపులు దర్ష్ చూపులతో కలిశాయి.
“హే దర్ష్, వాట్స్ అప్?”
“అంకుల్, డోంట్ ట్రాష్ సోడా హియర్. ఐ విల్ కాల్ పోలీస్!” అన్నాడు దర్ష్ కార్‌లో ఉండిపోయిన కోక్ కాన్స్ చూపిస్తూ.
“ఐ నో దర్ష్. ఐ ఆమ్ ఎ బాడ్ మాన్” అన్నాను.
“నో. యు ఆర్ ఏ బిగ్ మాన్” అన్నాడు దర్ష్.
వాళ్ళకే సొంతమైన ఆలోచనల తీరును గమనించడం చాలా గమ్మత్తుగా ఉంది.
“అండ్ యు?”
“ఐ ఆమ్ ఏ లిటిల్ బాయ్!”
“హౌ డు యు నో దట్, దర్ష్?”
“మిసెస్ ఫ్లాయిడ్ టోల్డ్ మీ!”
“మిసెస్ ఫ్లాయిడ్ ఈజ్ దర్షస్ టీచర్. మిసెస్ హోయా ఈజ్ మైన్.” దియా అందుకుంది.
పేర్లని ఒప్పుకున్నట్టుగా జీవితాన్ని ఒప్పుకోవడం–ఎదిగిన మెదడు ఎన్ని ప్రయత్నాలు చేసినా సాధించలేని ఫీట్.
కేక్ తీసుకున్నాము. కేక్ మీదకన్నా వాటి మీద ఉండే రంగురంగుల డిజైన్స్ గురించే పిల్లలిద్దరి ఎక్సైట్‌మెంట్. కేక్ ఇప్పుడే తినలేవని దియాకి దర్ష్ వార్నింగ్ ఇవ్వడంతో, ఆ ముద్దుతనానికి కేక్ షాప్ ఆవిడ ముచ్చటపడి ఇద్దరి చేతిలో చెరో కప్ కేక్ పెట్టింది.
వెనక్కి వస్తూ ఉంటే అడిగాను కార్ నడుపుతున్న వాళ్ళ నాన్నని.
“ఏమైంది? అల్లరి తగ్గింది?”
“యు వాచ్. దే విల్ స్లీప్ ఇన్ ఫైవ్ మినిట్స్!”
చడీ చప్పుడు లేకుండా పోతున్న కార్. స్టీరియో సౌండ్ మొత్తం పూర్తిగా తగ్గించాను.
“లుక్ బ్యాక్” అన్నాడు వాళ్ళ నాన్న, రెండు సిగ్నళ్ళు దాటగానే.
నిజంగానే నిద్రలోకి వెళ్ళిపోయారు. ఆశ్చర్యంగా అనిపించింది.
పది నిమిషాలకి ఇల్లు వస్తే దియాని వాళ్ళ నాన్న లేపుతుంటే నేను దర్ష్ దగ్గరికి వెళ్ళి సీట్ బెల్ట్ తీశాను. లేచి అడిగాడు.
“అంకుల్. వేర్ ఆర్ ఉయ్?”
“ఉయ్ ఆర్ హోమ్!” అని అన్నాను. ఎక్సైట్ అయ్యాడు. డోర్ ముందు వదిలిపెడుతుంటే అడిగాను దర్ష్‌ని.
“దర్ష్, వాట్ ఈజ్ హోమ్?”
“హోమ్ ఈజ్ వేర్ ఉయ్ ప్లే.”
“అండ్, వాట్ ఈజ్ స్లీప్?” అడిగాను చేయి విడిపించుకుంటుంటే.
“స్లీప్ ఈజ్ వేర్ ఉయ్ కాంట్ ప్లే!” చెప్పేసి వెళ్ళిపోయాడు.
మనిషి చేతనలో జరిగే ప్రతీ చర్యని మనమే కేంద్రబిందువుగా నిర్వచించుకునే మార్మిక రహస్యమేదో జోలపాట లాంటి ముచ్చటగా చెవిలో చేరుతుంటే, వింటూ వింటూ నిద్రలోకి జారిపోయిన దర్ష్ గుర్తొచ్చాడు.
-ఫిబ్రవరి 8, 2021.
స్థాణువంటే? అంతా నిండి కదిలే చోటు లేని తత్వం.
స్థాణువైన శూన్యంలో ఉన్న స్నేహితుడి నుంచి ఫోన్. నిన్నటి వరకు నీతోనే ఉండి, గాలి తెరలని దాటుకుంటూ తప్పని శూన్యపు బరువుని భుజానికెత్తుకోవడానికి వెళ్ళిన మనిషి.
ప్రాణం తరలిపోయి కమ్మేసిన దుఃఖం అతను చుట్టూ ఇప్పుడు. దాన్ని దాటించే మాటలేవో మాట్లాడించాలని చూస్తావ్.
అక్షరాలని దొర్లించే అలవాటు ఉన్నా మాటలని వెతుక్కుంటావ్ ఏమి మాట్లాడలేక.
మొహం మీద ఉదయపు ఎండ, సహాయం చేస్తూ మాటలందివ్వడానికి.
-జనవరి 1, 2021.