“ఒరేయ్ చంద్రా…”
“ఆఁ. ఆఁ. నేనే. చెప్పు. ఎన్నేళ్ళైనా అదే పిలుపురా నీది!” నవ్వాడు అటు వైపున్న స్నేహితుడు చంద్ర. ఇవతల పక్కన ఉన్న పెద్దాయనకి అంత దీర్ఘంగా పిలిచేందుకు మిగిలున్న ఒకే ఒక్క స్నేహం చంద్ర.
“ఏదన్నా పనిలో ఉన్నావా?”
“లేదు లేదు. మాట్లాడు.”
“మనవడు ఇంకో కథ అడిగాడ్రా మధ్యాహ్నం. ఏదో చెబుతూ మలక్‌పేట సంగతులు గుర్తొచ్చి చేస్తున్నా మాట్లాడదాం అని.”
‘పాత సంగతులు గుర్తొచ్చి ఫోను చేశావా! గుర్తున్నాయా అని చూసుకుందామనా?’ చంద్ర అనేలోపే ఒకరి మాటలొకరికి వినబడకుండా ఫోన్ అడ్డుపడింది.
“ఆఁ, హలో? ఉన్నావారా చంద్రా?…అది సరే కానీ చెప్పరా. చందు అని పిలిచేది కదా వాడిని, నీది వాడిది ఒకే పేరు. వాడు ఉన్నాడా?”
“వాడితో మాట్లాడక ఎన్ని రోజులయిందో.”
“ఎన్ని?” చటుక్కున అడిగాడు పెద్దాయన.
“ఇది మరీ బాగుందిరా, నీకు తెలుస్తుందా ఇది… నీకు కాదు, నాకు గుర్తుందా లేదా అని పరీక్ష పెట్టినట్టు ఉంది.” నవ్వాడు చంద్ర.
అలా ప్రశ్నలతో పరీక్ష పెడుతున్నట్టు పెద్దాయనకి కూడా తెలియదు. తెలియకపోవడానికి అసలైన కారణం డాక్టరు చెప్పకపోవడమే. ‘చేతులకి మంచిది, ఎలాగో ఎక్సర్‌సైజుల్లాంటివి చేయలేరు కదా’ అన్నంత వరకు చెప్పారు పెద్దాయనకి. అసలు కారణం మెదడులో ఉందని మాత్రం చెప్పలేదు. ఆ స్నేహితుడికి, డాక్టరుకి, ఈ పెద్దాయనతో సంభాషణ ఎటు వెళ్ళింది అనేది ఈ కథకి అనవసరం. వెళ్ళినా ఎటు వెళుతుంది?
ఆ ఇద్దరు స్నేహితుల మధ్య ఇలాంటి సంభాషణ జరగని ఒక మధ్యాహ్నం పెద్దాయనని ‘తాతా! తాతా! ఇంకో కథ చెప్పు” అని మనవడు మారాం చేశాడు.
“ఎన్ని కథలని చెప్పనురా?” నిట్టూర్చాడు తాతయ్య.
“చెప్పు తాతయ్యా, మలక్‌పేట్ కథ చెప్పు. ఇదిగో ఐపాడ్, నాకు పిన్ కోడ్ చెప్పు…” ఇంకా మారాం చేశాడు మనవడు.
ఇలాంటి మధ్యాహ్నాల్లో ఆ తాతామనవళ్ళను చూస్తే చిన్న మోతాదు పరిశోధన చేస్తున్నట్టే ఉంటారు. మనవడి చేతిలో ఐపాడ్, తాత చేతిలో ఫోన్‌బుక్. అక్కడక్కడా పేర్లు, వాటి పక్కన పెద్దాయన చేతిరాత కుదరకున్నా ఒత్తిపట్టి రాసిన రాతలు–మాట్లాడిన బంధువులు, స్నేహితుల వివరాలు. కొన్ని పేజీల వెనక వాళ్ళు ఉన్న వీధుల ఫోటో ప్రింట్లు, ఇదే ఆ తాత-మనవడు చేసే వ్యవహారం. ఇంత జరగడానికి కారణం తన గడిచిన జీవితంలో నుంచి పెద్దాయనకి కష్టపడకుండా గుర్తొచ్చేది కొన్ని పిన్‌కోడ్‌లు ఒక్కటే కావడం. అంతకు మించి మెదడులో చీకటి, మనస్సులో శూన్యం.
“ఇదిగో చూడు, మొన్న ఇక్కడే ఆపావు.” ఐపాడ్‌లో గూగుల్ మ్యాప్స్ చూపెట్టాడు మనవడు. చూపెట్టింది మలక్‌పేటలోని పెద్దాయన పెరిగిన ఇంటి వీధి ఫోటోని. ఇలాంటి చోట్లోనే ఆగి చంద్రకి ఫోను వెళ్ళేది.
సుధాగాడి ఇంటి పక్కన ‘కబడ్డీ ఆట’ ఆడినట్టు తెలుపుతూ చేతి రాత ఉంది.
వాడి ఇల్లు ఎక్కడ ఉందా అని ఫోటోలు పేరుస్తూ చూశాడు. గుర్తు పట్టలేకపోయాడు.
మళ్ళీ చూశాడు. ఈసారి ఏదో దొరికినట్టు, అందివచ్చినట్టు ఫోటోలు కదిపాడు.
రోడ్డుకి పూర్తిగా ఎడమ పక్కన సుధావాళ్ళ ఇల్లు మినహా ఏదీ గుర్తు పట్టలేకపోయాడు. గుర్తు తెచ్చుకుందాం అని ఎడమ పక్క ఫోటోని జరుపుతూ పోతే కాసేపటికి సుధావాళ్ళ ఇల్లు పూర్తిగా కుడిపక్కకి చేరిపోయినా కూడా ఏది గుర్తు రాలేదు. ఇక గుర్తు తెచ్చుకోవడం భారంగా తోస్తోంది పెద్దాయనకి. అలిసిపోయి కుర్చీలో వెనక్కి వాలాడు. కిర్…ర్…ర్…మని మెల్లగా చప్పుడు చేస్తూ అర్ధచంద్రాకారంలో కుర్చీ ఊగుతోంది. సుదీర్ఘమైన జీవితం గుర్తేలేని ప్రయాణంలాగా ఉంది ఆయనకి.
దాదాపు డెబ్భై ఏళ్ళ జీవితం చూశాక, అద్దంలో కుడి ఎడమై ఎడమ కుడిగా ఎందుకు కనపడతాయి అని ప్రశ్న మొదలయింది. రెండు చూపుడువేళ్ళు ఒకదానికి ఎదురుగా ఒకటి పెట్టి, అవి కలిసే చోట చూస్తూ ఉండిపోయాడు. ఇందులో ఏది ఎడమ ఏది కుడి అని మరో ప్రశ్న. ఒక చూపుడువేలి గోరు నల్లగా మారి కనపడింది. దాన్ని చూస్తే గడ్డి వాము, ఖాకీ నిక్కరు, రైఫిల్… ఇక అంతే. మెదడులో చీకటి, మనస్సులో శూన్యం.
కుర్చీలోనే కూర్చొని కునుకుపాట్లు పడ్డాడు. ఎన్నిసార్లు నిద్రలోంచి లేచాడో! ఎపుడో ఒకసారి లేచేసరికి మాత్రం నిద్రపట్టింది అనే అనుభవం. ఇంకా మధ్యాహ్నం అలాగే ఉంది. సాయంత్రం ఎప్పుడు వస్తుందో అని గడియారం వైపు చూస్తే సమయం రెండు గంటల ముప్ఫయ్యేడు నిమిషాలు. అదే కుర్చీలో, కదలకుండా వచ్చిన కునుకుపాట్లలో ఒక కల. అవే మలక్‌పేట సంగతులు. ఓనర్‌వాళ్ళ అమ్మ చనిపోతే, పోయిందో లేదో చూడడానికి తాను ఇష్టంగా దాచుకున్న స్టెతస్కోప్ అడగడం, అది తీసుకెళ్ళి చూస్తుంటే ఒళ్ళంతా గుండెదడ తెలియటం, ఇవ్వన్నీ గుర్తొచ్చాయి. ఎవరొచ్చి అడిగారో గుర్తు ముందుకు రాలేదు. మల్లెపూల చెట్టు పూర్తిగా విరబూసింది. నీళ్ళతో తడిగా అలికిన గచ్చు. పక్కనే శవం. మల్లెపూల చెట్టు–ఇవ్వన్నీ కలిపి ఒకే దృశ్యం.
డైరీ తెరిచి మళ్ళీ చూశాడు. సుధావాళ్ళ ఇంటి ముందు గచ్చు, దాని తర్వాత ఖాళీ స్థలం, ఇక దాని మీద నల్లటి చీకటి. మరో క్షణంలో ఆ చీకటే అడివి అని ఈసారి ఏదో దొరికినట్టు, అందివచ్చినట్టు ఫోటోలు కదిపాడు.
ఇదే ఎందుకు గుర్తుంది? అని ప్రశ్న తొలిచేయడం మొదలవుతుంది. కలలే బాగున్నాయ్, ప్రయత్నాన్ని అడగవు అనుకుని తనలో తానే నవ్వుకున్నాడు.
ఇదిలా ఉండగా నీళ్ళు లేక నోరంతా లోపల ఎండిపోయింది. పెదాలు అట్టే అంటుకొని విడిపోలేదు. ఎండిపోయి బిగుసుకుపోయిన పెదాలని తడుపుకోవడానికి ప్రయత్నిస్తుంటే నాలుక కదలిక ఏదో పాము మగతగా కదిలినట్టుగా అనిపించింది.
ఏ కదలికా లేని తాత మొహాన్ని పరీక్షగా గమనిస్తున్నాడు మనవడు, సగం వంగి, మోకాళ్ళ మీద అరచేతులని ఆనించి. పెద్దాయన అప్పుడే అది గమనించడం. పెద్ద కళ్ళు వాడికి. అవంటే తాతకి చాలా ఇష్టం. వాడితో గడపడం కూడా. వాడిని దగ్గరకు తీసుకొని ఒళ్ళో పడుకోబెట్టుకొని ఊగే కుర్చీలో వెనక్కి వాలాడు. కాసేపట్లో మనవడి బుల్లి బొజ్జ, తాత బొర్ర ఒకే లయ అందుకున్నాయి ఎప్పటిలానే.
అలా జరిగినప్పుడల్లా ఇక ఆ వేసవికాలపు మధ్యాహ్నం కొడుకు అల్లరి తగ్గింది అమ్మయ్య! అని కూతురు, అల్లుడూ సంతోషపడేవారు. తాత నవ్వి ఊరుకునేవాడు. అలాంటి మధ్యాహ్నాల్లోనుంచే మెల్లిమెల్లిగా జ్ఞాపకాలు తిరిగి తోడేయడం, బయటకి రాలేక అవి సలపడం తగ్గడంతో తాతయ్య అనంతమైన దూరానికి మరో అడుగు దగ్గరవుతుండేడు.
అదే పోర్టికో. అదే మధ్యాహ్నం ఒక రోజు ఆదివారమై వచ్చింది. కూతురు, అల్లుడూ ఇద్దరు ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు. వాళ్ళిద్దరూ వారంలో ఆరురోజులు జీవితపు పరుగుపందెంలో ఉంటారు. మనవడి మనవడి వేసవి కాలం సెలవలు దరిదాపుల్లో అయ్యేలా లేవు. దానితో ఇల్లంతా ఆనందంతో అలికినట్టు తోస్తుంది వాడికి.
ఫోన్ మోగింది. కూతురు ఎత్తింది. రెండు నిమిషాల మాటల తరవాత పోర్టికోలోకి తొంగి చూస్తూ, “నాన్నా, ఎల్లుండి అమ్మ సంవత్సరీకం. అన్నయ్య ఇవాళ రాత్రి బయలుదేరి వస్తున్నా అన్నాడు” అని అంది.
అప్పటికే తాతామనవళ్ళ ఊపిరులు ఒకే లయలో సాగుతున్నాయి. అప్పుడే పట్టిన నిద్రలోంచి అరక్షణంలో తేరుకుని “ఆఁ… ఆఁ… రమ్మను” అని ఊగే కుర్చీలో వెనక్కి వాలి నిద్రలోకి జారుకున్నాడు.
ఊగుతున్న కుర్చీ కిర్…ర్…ర్…మంటూ కదులుతూ ఉంటే ఖాళీ రీళ్ళు తిరుగుతున్న చప్పుడు. తాతామనవళ్ళ ఊపిరుల లయ ఏమాత్రం చెదరలేదు.