హియర్ అండ్ దేర్

ఉదయం అంటే మరీ ఉదయం ఏమీ కాదు.

హైదరాబాద్‌లో పెరిగినవాడివి కాబట్టి చాయ్ తాగుతావ్ ఏ సమయానికి లేచినా. నీ రూమ్‌మేట్ చేసింది. ఉద్యోగం లేదు కనుక మొహం కడుక్కుని మెరూన్ రంగు షర్టు వేసుకొని అరగంట ఉద్యోగం అడిగి చూస్తావ్. వారంలో చెప్తాము అంటారు. మరో రూమ్‌మేట్ వచ్చి ‘సెకండ్ రౌండ్?’ అంటాడు. తల ఊపుతావ్. నీకంటూ ఒక ఉద్యోగం ఏమి లేదు కాబట్టి, నీ సిటీ నీ రక్తంలో ఇంకా ఉంది అని రుజువు చూపిస్తున్నట్టు తడుముకోకుండా నీ మెరూన్ రంగు షర్టు పైకి మడిచి, చాయ్ గిన్నె కడుగుతూ, ఇంటికి కాల్ చేస్తావ్. నీ ప్రపంచం చిన్నది, అది అలవాటైనా అమరికైనా ఏ చిన్న తేడానీ ఓర్వలేనంత చిన్నది. ఉన్న కొద్దిమంది మనుషులనీ డిస్టర్బ్ చేయాలని ఉండదు నీకు, వాళ్ళే వచ్చి మాట్లాడాలని చూసినా. వాళ్ళు వీడియో కాల్ అడుగుతారు. చేతులు ఖాళీ లేవంటావ్. ఓ రెండు క్షణాల్లో తుడుచుకోలేకా ఆ సమాధానం?

ఈ మధ్యే నీతో ఉంటున్న గుజరాతీ వాళ్ళ ఇంటి నుంచి తెచ్చిన డోక్లా నీ ముందు పెడతాడు. అప్పటికే గొంతు గోడల మీదగా చాయ్ కారుతూ ఉంటుంది. ఆ రెండు కలిసి నీ ఇన్నేళ్ళ జీవితంలో ఎప్పుడు ఎరగని రుచి. అది ఎలా ఉంటుందంటే… చెప్పలేవు. గుజరాతీ వాడిని నీ ఇంట్లో అమ్మకే వచ్చిన, నీకు నచ్చిన వంటకమేదో తిని ఎలా ఉందో చెప్పమన్నట్టుగా ఉంటుంది అడిగితే. అడిగావు కనుక చెపుతాడు. చెప్పకపోవడమే బాగుంటుంది. అలా, హైదరాబాద్ దాటని యవ్వనం నీది. అదృష్టమనిపిస్తుంది ఈ అర్ధం లేని రుచి. గొంతుకి గుండెకి ఎంత దూరమని? అందుకు కూడా ఏమో. ఒకసారి డబ్బా తెరిచి చూస్తావ్ అసలిది ఎలా ఉంటుంది అని. నీకు తెలిసినా ఎప్పుడు చూడని ఇంటి రుచిని ఇచ్చిన డోక్లాని చూస్తే పెద్ద సైజు సోను పాపడ్ స్వీట్ లాగ ఉంటుంది. నవ్వుకుంటావ్. జీవితం ఇంత వరకు ఉంటే చాలు బాగుంటుంది అనిపిస్తుంది. ఇలాంటి క్షణాలని దాటి ఆ రోజు ఈ రోజయ్యింది. కానీ ఆ దినపు ఉనికి అంత అంతా కలిపి ఇంతే.


ప్రతీవారం ఒక రోజు అపార్ట్‌మెంట్ మెట్లన్నీ కడిగే నియమం ఒకటి ఉంది. కొన్ని ఏళ్ళ వరకు ఇది ప్రతీ శుక్రవారం రాత్రి జరిగే తంతు. ఎదుగుతున్న వయస్సులో అలా మెట్లు కడిగే దృశ్యాన్ని చూస్తే అనాలోచితంగా ఆనందపు రవ్వలు ఎగిసేవి లోపలెక్కడో… వచ్చే వారాంతపు సెలవులని ఊహించుకుంటూ.

ఇన్నేళ్ళ తరవాత అదే దృశ్యాన్ని చూస్తే ఇవాళ గురువారమే. ఏళ్ళు గడుస్తుంటే అక్కడక్కడే మార్పు చెందుతున్న జీవిత చిహ్నాలు.

చలికాలపు రాత్రుళ్ళు అంతటా ఒకేలా ఉండవు. ఈ సమయానికి అమెరికా రాత్రుల్లో మంచు రాలుతూ ఉన్న జ్ఞాపకాలు తిరుగుతూంటే, ఇప్పుడు ఇక్కడ కలకత్తా మీనాక్షి కిళ్ళీ వైపు మనసు లాగింది. వెళుతూ ఉంటె నాన్న ‘నాకూ ఒకటి’ అన్నాడు. అది విని అమ్మ ‘నాకు ఐస్ క్రీమ్’ అంది. కారిడార్ నిండా నీళ్ళ తడి. గురువారం తెచ్చే తడి. మెట్ల మీద వాచ్‌మన్ భార్య కొంగు సర్దుకుంది నన్ను చూసి. బండి తీసి గేట్ దాటి పాన్ షాప్‌లో అరవై రూపాయలు, ఐస్ క్రీమ్ షాప్‌లో డెబ్భై ఐదు రూపాయల ఖర్చు చేసి అపార్ట్‌మెంట్ కిందికొస్తే వాచ్‌మన్ బిడ్డ. గుండె కలుక్కుమంది. మెట్ల మీద వాచ్‌మన్ భార్య. ఊపిరి రెండు క్షణాలు ఆడలేదు. ఇంకోసారి చేతిలో ఏదన్నా పట్టుకురావడంలో ఇబ్బంది నా గొంతు కారిడార్లో ఇప్పుడే తచ్చాడుతుంది. ఇదంతా కేవలం కొన్ని క్షణాల నిస్సహాయపు అలజడే అని గుర్తు చేస్తూ నిన్నటి సందర్భం.

దృశ్యం: ఒక మనిషిని నిద్ర నుంచి కుదుపుతున్న పిలుపు కాని పిలుపు. హక్కుగా. హారన్. ఆ మనిషి ‘ఆఁ… ఆఁ… వస్తున్నా!’ అని లేచి తాళాలు తీయడం.

సందర్భం: వాచ్‌మన్ తన పని తాను చేయడం.

స్పష్టం: బ్రూటల్ అగ్లీనెస్.

భావం: ఎన్నెన్నో రకాలుగా అమర్చుకుంటున్న మానవుల అవసరాల్లో అంతకంతకు ఆరిపోతున్న గుండె తడి.