#జర్నీ_బ్లూస్

ఇండియాలో…

నీ లోపల ఎలాంటి బరువు లేని రోజు.

జెట్‌లాగ్ దాటిపోయినా ఎందుకో త్వరగానే లేస్తావ్.

నాన్న లోనో, పార్కులోనో, ఉండే సమయం. ‘కాఫీ కావాలా?’ అన్న ఐదు నిమిషాలకి స్టీల్ గిలాసలో కాఫీ పొగలు.  

దేశాలు దాటిన ఉదయాలు ఇలా వుంటాయని గమనింపుకు వస్తుంది.

నువ్వు పెరిగిన ఇల్లే అకస్మాత్తుగా చిన్నగా తోస్తుంది. కళ్ళ ముందరే అమ్మ అటు ఇటు తిరుగుతుంటే తన నడకలో చిన్న తేడా, ఒకవైపుకు ఒరగడం అప్పుడే అర్థమవుతుంది.

కాఫీ చివరి బొట్టులో తీపి.

గుండె మాత్రమే చేదుగా తోస్తోంది.

#జస్ట్‌_సేయింగ్


వెలితి. నువ్వు మొత్తంగా ఒక ఇనుప రేకు మాత్రమే అయినట్టు. అందరూ ఉన్నారనే స్పృహ కేవలం రెండు గుండె చప్పుళ్ళ మధ్య చిన్న శూన్యం.

శరీరపు బరువుని మించివున్న లగేజిని లాగుతూ పోతూ ఉంటే అనిపిస్తుంది ‘జీవిత ప్రయాణం అలసట’ అని.

మనుషులని కదిలించేవి ప్రేమలైతే, విడదీసేవి దేశాలు.

కాలు ఆనించిన చోటు విమానాలు ఆగే చోటు. స్థలాలని కలుపుతూ, కాలాలని మారుస్తూ, నాగరికతలని కరెన్సీ నోట్లలా తర్జుమా చేయగలిగే పవిత్ర స్థలి. అక్కడే నిలబడి ఉన్నా ఈ ప్రపంచ వైశాల్యం, నీతోపాటు ఇదే కాలం ఇదే క్షణంలో జీవిస్తున్న ఈ కోట్లకోట్ల సంబంధం లేని జీవితాల ప్రవాహం… ఇవ్వేమీ నిన్ను తాకే స్థితిలో నువ్వు లేవు. లాంజ్‌లో కూర్చుంటే దూరాన కొండల్లో ఒక చిన్న కుటీరం లాంటి ఇల్లు  కనపడుతుంది, అందులో ఉండే మనుషులతో సహా.

చేరుకుంటావ్. జెట్ లాగ్ తీరిన కొన్ని రోజులకి నీ మానసిక అలసటని చూస్తూ ‘నువ్వే ఎక్కువ ఆలోచిస్తున్నావు’ అనే వాళ్ళే ఎక్కువ. స్నేహితులు. స్నేహాన్ని మించిన బంధాలు.

నాలో ఒక్క చిన్న ప్రశ్న, చుట్టూ ఉన్న హల్దీరామ్ ప్యాకెట్లని, చిరుతిండ్ల పొట్లాలని చూస్తూ. ‘దీన్ని నోట్లో వేసుకుంటే ఊరే లాలాజలం వెనక కోరికకు, నీ జీవితంలో ఉండే ప్రేమలకు ఏంటి తేడా?’

#సోషల్_డైలమా


ఆఫీసులో…

‘హౌ డు యూ ఫీల్ అబౌట్  2020?’ అని తను నన్ను అడుగుతుంది.

‘ఐ ఫీల్ ఓల్డ్!’ అని నేనంటాను.

‘ఓహ్! ష్ష-ట్ట-ప్! యు డోంట్ వాంట్ ‘మీ’ టు సే దట్!’  

‘నో, ఈవెన్ మై బియర్డ్ ఈజ్ గెటింగ్ గ్రే.’

‘ఆహ్! ఐ యామ్ సో సో సారీ అబౌట్ దట్.’

‘ఎ బిట్ ఆఫ్ టూమచ్ సర్కాజమ్ దేర్.’

కొన్ని క్షణాల మౌనం కొంత పని తర్వాత ‘ఎ బ్రేకప్ ఫీల్స్ జస్ట్ లైక్ ఎ డైవోర్స్ రైట్??’ అని నేనంటే

‘యా! ఇట్ ష్యూర్ డజ్!’ అని తను.

#జస్ట్_అబ్సర్వింగ్