మూత్రానికి వస్తుందని బాత్రూమ్ లోకి వెళ్ళాను. నా నుంచి మూత్రం ఖాళీ అవుతుంటే నా కడుపు మెల్లగా వెనక్కి వెళ్ళడాన్ని గమనిస్తూ నిల్చున్నా. ఇక పావులో పావు వంతు మిగిలింది అనగా, ఓ క్షణం పాటు ఒళ్ళంతా ఒక్కసారి జలదరించింది, అప్రయత్నంగా. ఆ జలదరింపే కావాల్సిన కుదుపు అన్నట్టు మిగిలిన మూత్రం కూడా నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఫ్లష్ చేసే ఒక్క క్షణం ముందు ఎడమ చేయి చూపుడువేలి మీద మెరిసిన ఒక మూత్రపు బొట్టు. అలా ఆ బొట్టుని, దానికి ఆధారమైన వేలిని, చుట్టూ వ్యాపించిన నూరువాట్ల బల్బు వెలుతురుని, అంతటినీ చూస్తూ చూపిస్తున్న నా మనస్సుని ఊహిస్తే భాషకందని భావం. సబ్‌కాన్షియస్ స్థలాల్లో పురాతన వాసనలు గుప్పుమన్నట్టుగా ఒక మెలాంఖలీ.
లైట్ ఆఫ్ చేసి, ఎక్జాస్ట్ ఫ్యాన్ ఆన్ చేసి బాల్కనీలోకి వస్తే కాళ్ళకి చల్లటి చెక్క స్పర్శ. బాహ్యప్రపంచపు ఉనికిని మోస్తున్న నా చర్మాన్నంతటినీ తడిపిన డిసెంబర్ కాలపు మంచు గాడ్పు. లోపల చేతనావస్థ. అది మనిషి మోయక తప్పని శిలువ అన్నట్టు. గుంపులుగుంపులుగా ఒడిసిపట్టుకున్న కమ్యూనిటీ ఇళ్ళు దాటి నలుపు పూసుకున్న ఎడారి రోడ్డు. అనంతమైన మౌనపు గాఢతకి నిలువునా వాతలు పెడుతూ అపుడో ఇపుడో కొన్ని బండ్లు. ఎపుడూ ఎలాంటి అలజడి లేని హోటల్ మీద స్పష్టంగా వెలుగుతున్న నీలం రంగు ప్లాస్టిక్ తార.
నిర్మానుష్యమైన రోడ్డు హక్కుగా లాక్కుంది ఒంటరి గుండెని. చెవుల్లో చలి, గుండెలో మంచు, మొద్దుబారిపోయిన మొహం. గ్లోవ్స్ ఉన్న చేతిలో వెచ్చగా ఒదిగిన సిగరెట్ స్టబ్ చివరి వెలుతురులు చిమ్ముతుంది. అడుగుల కింది ఎండుటాకులు అన్నీ మంచు నీళ్ళల్లో ఒదిగిపోతున్నాయి. కొండలు, నిశ్చలంగా నిల్చున్న చెరువు. సాయంత్రమైందని ఈ రోజుకి ఇక చాలు అని సోలిపోతున్న సూర్యుడు. వీటన్నిటికీ సాక్షిగా నేను. నన్ను కూడా వీటిగాటిన కట్టేస్తూ తాము సాక్షులుగా పక్షుల గుంపులు. వాటి ఇళ్ళకు అవి వెళ్ళిపోతున్నట్టు…
చడీచప్పుడు లేకుండా
చిర్రుబుర్రులాడుతున్నట్టు కొన్ని
కీచు గొంతుతో నసుగుతూ కొన్ని.
కదల్లేని కార్పెట్ లాగా గడ్డకట్టిన చెరువు మీదగా పెద్ద పక్షులు రెండు. గాలి దారుల్లో ట్రాఫిక్ రద్దీని కసురుకుంటూ అరుపులు. పైనుంచి చూస్తే నల్లపూస లాంటి నా తలకాయని దాటుకుంటూ వెళ్ళిపోయాయి. చెరువుకి ఆవలిగట్టున ఒక్కటొక్కటిగా వెలుతురు మొలిపించుకుంటున్న ఇండ్లు. అందులో ఒకానొక ఇంటి నుంచి మంద్రంగా వినపడుతున్న సంగీతం. మధ్యలో ఎవరిదో నవ్వు. ఇంత అలజడి నుంచి నిశ్శబ్దం. అంత నిశ్శబ్దం నుంచి మౌనం. ఆ పక్షుల ప్రయాణానికి, ఆ ఇంటి సజీవమైన అలజడికీ నాకూ పూడ్చరాని అగాధమంత దూరం. ఇలాంటి ఒక్క క్షణంలో నేను కేవలం కొన్ని కోట్ల కణాల కూర్పును మాత్రమే. ఆ మీదట విస్తారంగా, అనంతంగా, శూన్యంగా, అదే మౌనం.
ఉదయాల్లో ఉండే మెరుపుని సాయంత్రపు వెలుగులో కనపడనీదు ఈ భూమి. మనుషుల్లోని ఖాళీలని ముభావంతో నింపడానికి మధ్యాహ్నాల్ని పురమాయిస్తుంది. ఇక రాతిరి. నీడలున్నన్నాళ్ళు మనుషుల నిజస్వరూపాలు తేలవన్నట్టు, నిద్ర తెచ్చే చీకట్ల మీద అపరాధభావాల బరువులు తోస్తూ ఆడుకున్నట్టు, దినపు వెలుగుల ఆవల పరుచుకున్న నలుపులాగా , తలచుట్టూ వెంట్రుకల్లా ఈ చీకటి రాత్రులు. అక్కడెక్కడో కాదు. మనచుట్టే, మన పక్కనే, ఆ వీధి చివర్లోనే. వద్దంటున్నా వెంటపడి హక్కుగా ధ్యాసనంతా తినేస్తూ కనిపిస్తున్న బార్బర్ షాపులా.
నేలమీద సిమెంట్‌లో మొలిచిన ఆర్టిఫిషియాలిటీ. గ్లాసు అద్దం వెనక ఎపుడూ ఒక రంగురంగుల బల్బు వెలుగుతూ ఉంటుంది ఆ షాపులో. మూలనున్న టీవీలో కొన్ని తరాల తలరాతలు ప్లే అవుతూనే ఉంటాయి. తెల్లటి వార్తాపత్రికలు నల్లటి సోఫాలో. ఫ్లోరింగ్ అంతటా వెలిసిపోయిన బూడిద రంగు టైల్స్, గోడల నిండా కారిపోతున్న ముదిరిపోయిన గోధుమ రంగు, బార్బర్ రంగు తెలుపు, బట్టల రంగు నలుపు. అదంతా జీవంలేని ఆది పిండంలా ఉంటుంది. పార్కింగ్ లాట్‌లో ఆగివున్న ఒక కారు డోర్ తీసి ఐదారేళ్ళ అబ్బాయొకడు దిగి షాపు మెట్లెక్కుతాడు. అవి స్కూలు మెట్లు కావు. వాడి మొహంలో ఏడుపు లేదు. కానీ ఈ భూమ్మీద జీవం తాలూకు ఆనవాళ్ళలో ‘ఒంటరితనం’ అనేది మొదటి పుట్టుమచ్చలాగా, వేరై, ఒంటరై నిలబడ్డట్టుగా ఉంటుంది వాడి చూపు. కటింగ్ షాపులో ఉండే రంగురంగుల బల్బు వెలుతురు వాణ్ణేమీ పిలవదు. వెనకే వచ్చిన నాన్న వాడిని తీసుకెళ్ళి కుర్చీలో కూర్చోబెడతాడు. బార్బరు అరచేతిలో వాడి తల సగం కన్నా చిన్నబోయి చిక్కుకుంటుంది. టీవీలో డాక్యుమెంటరీ బడుగు జీవుల కష్టాల నేపథ్యసంగీతం. ‘ఎలా చేయించుకుంటావ్?’ అని వాళ్ళ నాన్న అడగడు. కానీ, స్కూల్లో స్నేహితుల ముందు చిన్నబోయిన మొహం వెనకన సిగ్గు గుర్తొచ్చి రోషం తన్నుకొస్తుంది వాడికి. కదులుతాడు. మెదులుతాడు. అటు చూస్తాడు. ఇటు చూస్తాడు. నాన్నెక్కడ అని చూస్తే అద్దంలో కనపడతాడు నిర్దయగా పేపర్ చదువుతూ నల్లటి సోఫాలో. “ఊఁ, కదలకు” అని వాడి తలను తన అరచేతిలో బంధించుకుంటాడు బార్బర్. చల్లటి నీళ్ళని పిచికారి చేస్తాడు. ఒణుకు పుడుతుంది. ఊపిరాడదు. కళ్ళు మూసుకుంటాడు. కత్తెర చప్పుడు నిర్విరామంగా వినిపిస్తూ ఉంటుంది. వొంచిన తలతో ఒళ్ళో పడుతున్న వెంట్రుకలను చూస్తూ అబ్బాయిననే నిజం గుర్తొచ్చి ఏడుపు ఆపుకుంటూ కూర్చుండిపోతాడు. మధ్యమధ్యలో నాన్న లేచి చూస్తుంటాడు. ఏంటని సైగ చేస్తాడు బార్బర్ ఏ భావమూ లేని ముఖంతో. పెద్ద మార్పులేమీ లేకుండానే కటింగ్ అయిపోవస్తుంది.
బుడ్డోడి మెడను పూర్తిగా వంచి ఇక వంచడానికి లేని విధంగా ఒకానొక కోణంలో పెట్టుకుంటాడు బార్బర్. కసాయివాడి మల్లే. అలా వంచిన మెడని మొట్టమొదటిసారి అడ్డకత్తితో గీరగానే ఆ లేత శరీరంపై పూర్తిగా మొలవని నూగువెంట్రుకల తాలూకు మొదళ్ళన్నీ గగుర్పాటుతో గట్టిపడతాయి. ఇది ‘జలదరింపు’ అని వాడు తెలుసుకోలేడు. ఎలాంటి ఉద్వేగాలు లేని ఒట్టి ఫిజికల్ పరవశం వాడికి ఇదే తొలిసారి కావొచ్చు బహుశా. ‘మెలాంఖలీ నిండుకునే మానవ జీవితంలో ఎవరితో పంచుకోలేని సహజ స్పందనల మేజిక్ ఇది’ అనే గమనింపుకి నోరెళ్ళబెట్టి ఆశ్చర్యపడిపోడు. శరీరం ఇచ్చే కొన్ని క్షణాల అలౌకిక అనుభవసారం వాడి మస్తిష్కంలోకి ఇంకకుండా భౌతిక జగత్తు కుట్రపన్ని ఒక పరదాలాంటి నిద్రావస్థని అడ్డువేస్తుంది.
ఇది మొదలు వాడి జీవితంలో ఎన్నో అనుభవాల కథలు కంచికి చేరకముందరే నిష్క్రమిస్తాయి. మనస్సులాంటి వాడు కేవలం మనిషిలాగా రూపాంతరం చెందుతాడు. ఇక అతని మీద అంకెలు ప్రభావం చూపడం మొదలెడతాయి. జీవితం అడిగే బాకీలన్నీ కడుతుండగా ఒక కర్ర చేతికొస్తుంది ఒకానొక తారీకుకి. చలిచీకటి కమ్మిన ఆకాశంలో క్రిస్మస్ తార పొడిచిన సమయానికి ఆ ముసలి గుండె వసంతం కోరుకుంటుంది. ఎండిపోయిన కొమ్మల నిండా తెలుపు పూత. బయట అంతా మంచుదుప్పటి కప్పినట్టు ఉంటే లోపలంతా దిగులు దుప్పటి కప్పినట్టు ఉంటుంది. పేరు లేని పక్షి ఒకటి రాత్రంతా ఘోష పడుతుంది. తెలవారుతుంటే ఎండిన కొమ్మపై బుల్లి పావురమొకటి మొలుస్తుంది. ఉదయం ఎండ కాస్తుంటే అడుగులో అడుగేస్తూ కనిపిస్తాడు. తల్లి పక్షి శవం తడిసి ముద్దై ఉంటుంది మంచులో. కర్ర సాయంతో అపార్టుమెంటు మెట్లు ఎక్కుతూ ఒక్కసారిగా కదల్లేకపోతాడు. వేసుకున్న నైట్ ప్యాంటు జారిపోతుంది రెండు కాళ్ళని బందిస్తూ. ఎవరో వచ్చి సాయం చేసే వరకు నిలువెత్తు మానమై కుమిలిపోతాడు. కాసేపటి తర్వాత దట్టమైన మామూలుతనం అలుముకుంటుంది. వీధంతా ఎర్రరంగు ఆక్రమించుకుంటుంది. అంబులెన్స్ ఎర్రబల్బు వెలుతురు. డోర్ తెరుచుకుంటుంది ఆహ్వానిస్తున్నట్టు. స్ట్రెచర్ మీద పడుకోబెట్టుకొని తరలిస్తుంటే జీవం కోల్పోయి పక్కలకి పడిపోతాయి చేతులు. ఆ కుడిచేతికి ఉన్న వాచీనే చూస్తూ నిలబడిపోతాడు నాలాంటి వాడొకడు.