మనిషితో మనిషి మాట్లాడుతూనే ఉంటాడు. తనతో తాను ఇంకా ఎక్కువగా, అంతు లేకుండా, ఊపిరి తీయడంకన్నా మహత్తరమైన బాధ్యతగా మాట్లాడుతూనే ఉంటాడు.
నమ్మవూ?
రాజ్‌భవన్ రోడ్ మీదనుంచి ఖాళీగా ఉన్న రోడ్డుని వాడుకుంటూ డీప్ టర్న్ తిప్పుతున్నప్పుడు హెల్మెట్ అద్దాన్ని ఓపెన్ చేస్తావ్. అది మధ్యాహ్నం. అటు మీద పైనంతా ఒళ్ళంతా హైదరాబాద్ అంతా కాలిపోతున్న ఎండ. పక్కనే కె. ఎఫ్. సి. కానీ రోడ్డుకి ఆ వైపున ఉంటుంది. బండి దిగిన మరుక్షణం ‘దాహానికి’ సమాధానంగా ఆ కె. ఎఫ్. సి. గుర్తొస్తుంటుంది.
‘వెళ్ళినా బాగుండు’ అని అనుకుంటావు చూడు? అదీ నీతో నువ్వు మాట్లాడుకోవడం అంటే.
సహజమే. అవసరం కూడా. అవసరం అని తెలీనంత అలవాటైన అలవాటు. పక్కనే ఒక మొక్కజొన్న అమ్మే తోపుడుబండిలో ముసలవ్వని చూస్తావ్. జాలి, బాధ లాంటి గొప్ప భావాలు కాదు కానీ నీతో నువ్వు అనుకుంటావు ‘ఈ ఎండల్లో ఎవడు తింటాడని’.
పైకెళ్ళి ఎ. సి. లో కూర్చోగానే రెండు నిమిషాలు ఇంక నువ్వు ఈ లోకానికి చెందినవాడివి కాదు. ‘అబ్బా! లోపలికి పిలిస్తే బాగుండు’ అని అనుకుంటావు. నీతో నువ్వు మాట్లాడిన ఈ మాట ప్రతిచర్య, ప్రత్యుత్తరం, నీతో నువ్వు చేయని ఒక అర్జీకి. ఎండాకాలంలో ఎ. సి. ఉన్నా కూడా సింథటిక్ బట్ట సోఫాలో కూర్చోలేని నిస్సహాయత అది.
వీసా వ్యవహారాల్లో నీతో పాటు నడిచిన నీ వీసా మెంటర్ లోపలికి రమ్మంటుంది. తనది గుండ్రటి మొహము. నవ్వే మొహము. నవ్విన ప్రతిసారీ బుగ్గలో చిన్న సొట్టపడే మొహము. తను ఆ రోజు యెల్లో డ్రెస్ వేసుకుని ఉంటుంది. ఎ. సి. గాలినీ కలిపి ‘హాయికి మారుపేరు మీ నవ్వు’ అని చెప్పాలని ఉంటుంది. ధైర్యం సరిపోదు. మనుషులంటేనే మంచివాళ్ళు. మర్యాద తెలిసినవాళ్ళు. కానీ నీతో నీవరకు ఆ మాట చెప్పుకున్నావ్ చూడూ? ఎంత నిజాయితీ అది.
‘అంతా పర్ఫెక్ట్‌గా ఉంది. పార్ట్‌టైమ్ లాంటి వాటి గురించి అస్సలే మాట్లాడకు ఇంటర్‌వ్యూలో. అసలు నువ్వు వెళ్ళేది చదువు కోసం కదా. సరే ఇవన్నీ తరవాత…’ అని అంటుంది తను. ‘ఫస్ట్ నాకే చెప్పాలి వీసా రాగానే, నా దగ్గరకే రావాలి’ అని నవ్వుతుంది. సాయంత్రం 5:30 అని చూపిస్తుంది సమయం. ‘ఇక నేను కూడా వెళ్ళాలి (అని నీ పేరు కూడా జోడిస్తూ) పొద్దునే రావొచ్చు కదా, ప్రతిసారీ నేను వెళ్ళే టైమ్‌కే ఎందుకొస్తావోయ్? పాపని పిక్ చేసుకోవాలి ఈ టైమ్‌లో’ అంటుంది. నీకు అలాంటి సంభాషణలంటే కారణంలేని ఇష్టం. నీ పేరు శ్రద్ధగా పలికినందుకేనేమో. ఇదంతా నీతో నువ్వు మాట్లాడుకోవాల్సిన పని పెట్టదు. అందుకే కారణం లేని ఇష్టాలు హాయిగా ఉంటాయి.
నీతో నువ్వు ఏమి మాట్లాడుకోకుండానే ఈ సారి, ‘సారీ’ అని చెప్పకుండానే ‘సరే’ అని మాట ఇస్తావు. ఇద్దరు కలిసే దిగుతారు మెట్లు. సమయం చూస్తే 5:40 అని తెలుస్తుంది సాయంత్రంగా.
చల్లగాలి మెడని తాకుతుంది. చెమట, నూనె కలిసిన వేడిగాలి ఇంకా ఆవిరై అలానే పట్టుకుని ఉంటుంది హెల్మెట్‌లో. నిన్ను నువ్వు హింసించుకోకూడదు అని ఉంటుంది. ఇది నీతో నువ్వు మాట్లాడుకోకుండానే తీసుకునే నిర్ణయం. చల్లగాలి ఎక్కడ నుంచి వస్తుంది? అని అనకుండానే మెడని అన్ని వైపులా తిప్పి చూస్తావ్, ‘ఎక్కడ నుంచబ్బా!’ అని అనుకుంటూ అప్రయత్నంగా. రోడ్డుకి అవతల పక్కగా చూస్తే అటు వైపే కదా ట్యాంక్‌బండ్ అని గుర్తొస్తుంది. జ్ఞాపకాలు ఇంకా చాలా చురుకైనవి, లోతైనవి. అంతుచిక్కనంత వరకు నీ నుంచి ఎలాంటి ఎఫర్ట్ అడగవు.
సెల్ఫ్ స్టార్ట్ చేసి బండిని చాలా తక్కువ స్పీడ్‌లో హెల్మెట్ లేకుండా నడుపుతూ పోతావ్. పెద్ద పెద్ద బిల్డింగ్స్, స్టోర్స్, వాటి నీడలు అన్నీ పొడుగ్గా ఒక వైపుగా ఒరుగుతుంటాయి. నెక్లెస్ రోడ్ మీదకి వెళ్ళాలని ఇంకాస్త దూరం వెళ్తావ్. రోడ్డుకి ఈవైపు బండి పార్క్ చేసి దిగి హెల్మెట్ బండికే తగిలిస్తావ్. ‘ఎవడన్నా తీస్కపోతడా…’ అని మాట్లాడుకొని ‘ఆ తొక్కలే. ఇంక దీన్నె…’ అని అక్కడే హేండిల్ మీద వదిలేసి రోడ్డు దాటుతావ్. వందకి వెయ్యిసార్లు తెలుసు నీకు దాన్ని ఎవ్వడు పట్టుకపోడు అని. ఈ సారి కూడా అలాగే జరుగుతుంది.
ఇపుడు గాలి ఇంకా స్పష్టంగా తాకుతుంది. కళ్ళకి ఎక్కడలేని హాయిని ఇస్తూ నీ ముందంతా హుస్సేన్‌సాగర్ నీళ్ళు. అమ్మ ఫోన్ చేస్తుంది. ‘ఏమైందిరా… ఎప్పుడొస్తావ్?’ ఇప్పుడేనని చెప్పి ఫోన్ పెట్టేస్తావ్.
పైన ఏదో చప్పుడొస్తే చూస్తావ్. విమానం. తీక్షణంగా చూస్తావ్. ట్రైనింగ్ విమానం. బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ నుండి. అప్పటికి ట్రైనింగుకి మాత్రమే వాడుతున్నారు. నీకు నిజమైన విమానాన్ని చూడాలని ఉంటుంది. కనపడే వీల్లేదు. మెల్లిగా నీళ్ళ మీద తేలుతున్నట్టుగా రంగురంగుల లైట్లు, వాటి తాలూకు రిఫ్లెక్షన్స్ కనపడతాయి.
ఏదన్నా తినాలనిపిస్తుంది. ‘మొక్క జొన్న’ అని మెరిసిన కళ్ళతో అని చుట్టూ చూస్తావ్. ఎవ్వరూ కనపడరు.