Art of Listening

అటు ఉగాదుల్లోనో
ఇటు రోజువారీ
చర్మపు ముడతల్లోనో
ఎటు నుంచి పోసుకుంటోందో
పురుడు
ఈ మార్పనే పచ్చి పుండు.
మామూలుతనపు రోడ్డులెంబడి
నొప్పి సూది గుచ్చుతూ
అంబులెన్సు
కుట్లేసి పోయినట్టు
సాల్ గిరా తేదీల్లోనో మరి
ఎక్కడ నక్కిందో
ఎనెన్ని భూముల కింద పారుతుందో
నిన్ను నన్ను
క్షణానికి ఓసారి ఎగదోస్తూ
ఊపిరి దప్పికలందిస్తున్న
ఆ జీవ నది.

ప్రపంచపు పరిసరాల మీద
చూపు బరువు వాలితే
ఈ ఒళ్ళంతా నొప్పి.
గుండె జోకొడ్తూ
‘ఒల్లమ్మ’లాడిస్తుంటే
మనస్సు మెలిపెట్టుకుని మరి ఏడుస్తుంది
శిలువబడ్డ ప్రాణి
నీ ఆయుష్షు ఇంకెంతని.

‘శరీరం – శిలువ’ లాంటి
అనాది పోలికల
అంతిమ గమ్యం
నీ చివరి
శోకపు ములుగు అని చెప్పకనే చెబుతూ
ఓ ఆది అంతిమ శబ్దం.