తోలుబొమ్మలాట – 08వ భాగం

పెద్ద మనుషుల ఇళ్ళన్నీ మరోసారి తిరిగాడు గోవిందరావు.

ఆట ఒప్పుకొనేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు.

‘‘ఆట ఒప్పించుకొనే దాకా మా కాళ్ళో కడుపో పట్టుకొంటారు. తాంబూలమిచ్చినాంక పరదాగుడ్డలనీ, మెరుగు ఆముదమనీ, కాల్ల కింద చెక్కలనీ, దీపాలనీ, కోడిపిల్ల అనీ, సారాయి సీసాలనీ …. మా పానాల్దీస్తరు …. మీ సావాసమొద్దు నాయనా! ఊరున్నమ్ముకొని ఒచ్చినందుకు …. అంతో ఇంతో కూలిబాటు ఇస్తాం …. తీసుకొని మీ దావన మీరు బోండి ….’’ చెప్పారు కొందరు ముసలాళ్ళు.

వాళ్ళ అనుమానాల్ని నివృత్తి చేసేందుకు ఒక్కొక్కరి దగ్గర ఒక్కో విధంగా సుదీర్ఘమైన వివరణ ఇచ్చుకోవలసి వచ్చింది బొమ్మలాట కళాకారులకు.

పరదా తెరగుడ్డల శ్రమ గ్రామస్తులకు అఖక్కర్లేదనీ, తామే తెచ్చుకొన్నామనీ చెప్పారు.

గతంలో అయితే ఊరి చాకలి తను ఉతికిన గుడ్డల్లో సన్నపు నూలు పంచెల్ని చలువచేసుకు తెచ్చిస్తే, రెండు మూడు పంచెల్ని తుమ్మ ముల్లులతో అతికి పరదా తయారు చేసేవాళ్ళు.

‘‘కొన్ని ఇయ్యకున్నే ఇబ్బంది లేదు మహప్రభో! చారెడు మెరుగు ఆముదం మాత్రం పోయించండి.’’

‘‘సారాయి అంటారా …. ఏదో .. తమరి దయ …. ఖచ్చితమేమీలేదు. నిలేసేది లేదు. తెల్లవార్లూ గొంతు చించుకొని అరవాల. మీకు తెలవందేముంది మారాజా! కంటిమీందికి కునుకు రాకుండా …. ఒంటికి అలసట లేకుండా …. ఏదో .. మా వాల్లు రవ్వంత హుషారుగా ఉండేందుకు …. ఆ బిస మీకు ఆటలో చూపిస్తార్లే!’’

‘‘నూనె దీపాల అవసరం లేదు స్వాములూ! రెండు బారలు కరంటు తీగ …. బుడ్లు …. అంతే ….’’

‘‘కాలికింద పలకలంటారా! …. అవి లేకుంటే ఆటలో రంజేముంటది …. ఆంజనేయుడు అట్లా ఎగిరొచ్చి ఇట్లా దుమికినాడంటే భూమి దద్దరిల్లి పోవద్దూ! …. దద్దరిల్లినట్టు మీకనిపించొద్దూ! …. కాళ్ళకింద చెక్క పలకలు తొక్కితే గదూ ఆ భావన కలిగేది ….

ఎన్ని విధాల చెప్పబోయినా ఏదొక సాకుజెప్పి తప్పించుకొన్నారు గ్రామ పెద్దలు.

గోవిందరావుకు ఏం చేయాలో తోచలేదు.

ఆలోచిస్తూ ఉండి పోయాడు.

తనింతదాకా రాజకీయపు పదవులున్న -, మరో మాటలో చెప్పాలంటే అధికారపు పెద్దల్ని మాత్రమే కలిశాడు.

పూర్వం గ్రామ పెద్దలంటే కులానికొక పెద్ద ఉండేవాడు.

ఇప్పుడు అధికారం ఉన్నవాడు గ్రామ పెద్ద

అధికారమంటే …. పదవి …. పదవి ఉన్న వాళ్ళంతా ఒకే కులానికి సంబంధించిన వాళ్ళుగా కూడా ఉండొచ్చు. రాజకీయాలు అట్లా ఉన్నాయి మరి!

కుల పెద్దల్ని కలిస్తేనే ఒక సంపూర్ణ ఆకృతి వస్తుంది.

ఇప్పటికే కొందరు కుల పెద్దల్ని కలిసున్నాడు.

ఆటాడించే శక్తిలేకున్నా సహకారమందించేందుకు సిద్ధంగా ఉన్నారు బ్రహ్మణ, వైశ్య, కంసలి వగైరా కుల పెద్దలు.

వ్యతిరేకించేది రెడ్లే.

బలిజ, పట్రా, యాదవ కులస్థుల్ని కలవాలి.

రెడ్లను వ్యతిరేకించి వీళ్ళు ముందు కొస్తారని కాదు.

ఏదో ఆశ …. అంతే ….

నేరుగా బలిజ వీధికి వెళ్ళాడు తన వాళ్ళతో కలిసి గోవిందరావు.

ఇంట్లో ఆడాళ్ళు పిల్లలు టీవీల ముందుంటే – బైట కూచుని ఉన్నారు కొందరు మగాళ్ళు.

వాళ్ళ ముందు ఆగారు.

గుంపు పెద్ద సంజీవరాయున్ని పోల్చుకొని తనను పరిచయం చేసికన్నాడు గోవిందరావు.

‘‘అయ్యా రాయుడూ! పంతానికి పోతే మీయంత పట్టుదల పురుషులు ఎండలు కాసే ఈ భూమండలాన లేరు స్వామీ!

పంతమున చింతాకు గంతగట్టుదురు.

పంతమున చట్రాయి నారదీయుదురు.

పంతమున మీసముయ్యాల లూగెదరు.

పంతమీరిన వారు బహుబలిజ వారు.’’

బొమ్మలాట రాగంలో శ్రావ్యంగా పాడాడు.

మీసాలు జవురుకంటూ ‘‘నిజమే నిజమేబ్బీ గోయిందరావూ! ఆ మోటు సేస్టాలు మావోల్లకింకా ఉండాయి …. ఆ .. ఇంతకూ …. ఆట ఎప్పుడు?’’ అడిగాడు సంజీవ రాయుడు.

‘‘మహా ప్రభువులు గ్రామ పెద్దలకింకా మామీంద దయగలగలేదు సంజీవ రాయుడు గారూ!’’ చెప్పాడు గోవిందరావు. తాము గ్రామంలోకి వచ్చినప్పటి నుంచి జరిగిన విషయాలు క్లుప్తంగా వివరించాడు. ‘‘హనుమంతుల వారి పరాక్రమమూ, భీమసేనుల వారి తెంపూ ఉన్నవాళ్ళు. మీరే ఏదొకదారి చూపించాల’’ అన్నాడు చేతులు ముకుళించి.

సాలోచనగా తలూపాడు సంజీవ రాయుడు.

‘‘పెద్దమాసి ఎవురన్నా పూనుకుంటే మా సాయం మేం జేస్చాం …. దేవలంలో కూచుని తాంబూలమిస్చే సాలు …. తీరవాపట్టీ రాస్చేసాలు ….’’ చెప్పాడు. తను ఇన్నేళ్ళ అనుభవంలో నేర్చుకన్న లౌక్యాన్ని ప్రదర్శించాడు.

మరికొంతసేపు మాట్లాడి నేరుగా పట్రాకులస్థుల ఇళ్ళుకేసి నడిచారు కళాకారులు.

ఇంటిబైటే వీధరుగు మీద కూచుని ఉన్నాడు నరసప్ప.

ఆయన్ను చూడగానే గోవిందరావు గొంతెత్తాడు.

‘‘మదపుటేనుగునైన గదిమి రాగలరు.

కదమ సింహమునైన కట్టిరాగలరు.

గదిసి బెబ్బులినైన ఖండించగలరు.

విదితముగ కీర్తిచే విలసిల్ల గలరు.

పట్రా కులస్థులు …. పట్టా కత్తిలాంటి వాళ్ళు …. అనుకున్నది సాధించగలిగిన మహాపరాక్రమ వంతులు. మంచిని మాత్రమే అనుకోగలిగిన మహానుభావులు….’’

‘‘పట్టాకత్తులు ఇంకా యాడుండాయి. చిలుంబట్టి మట్టిలో కలిసి పోయె’’ అంటూ పకపక నవ్వాడు నరసప్ప.

బలిజ సంజీవరాయని వద్దనించి వచ్చిన సమాధానమే నరసప్ప నించి వచ్చింది.

ఎవ్వరూ ముగసాలకొచ్చి నిలబడటం లేదు.

ఊరి పెద్దరికానికీ, కట్టుబాట్లకూ తలొంచుతున్నారు.

దేవాలయంలో కూచుని గ్రామపెద్ద తీసికొనే నిర్ణయాలకు లొంగివున్నారు.

ఆటాడేందుకు అధికారికంగా అనుమతి రావటం కష్టంగానే ఉంది.

పట్రావాళ్ళ ఇళ్ళనించి దూరమవుతూ ఆలోచిస్తున్నాడు గోవిందరావు.

ఎటూ పాలుపోవటం లేదు అతనికి.

ఆటమీద ఆశచంపుకోవాలంటే ససేమిరా కుదరదంటోంది మనస్సు.

తనువు ఉన్నంతదాకా తనకీ ఆశ చచ్చేట్టులేదు.

ఏమైనాసరే బొమ్మలాట ప్రదర్శించి తీరాల్సిందే.

గ్రామ పెద్దలు అనుమతి ఇచ్చినా …. ఇవ్వకున్నా …. ఒప్పందంతో సంబంధం లేకుండా …. తాంబూళాలతో ముడిపెట్టకుండా …. తామే ఆడాలి …. ఆటయింతర్వాత తృణమో, ఫణమో యిస్తే కొంగు పట్టచ్చు. ఇవ్వకుంటే కడుపు పట్టుకని వెళ్ళిపోవచ్చు.

ఆ నిర్ణయం తర్వాత సవాలక్ష ఆలోచనల ముల్లులన్నీ రాలిపోతోన్నట్టుగా అన్పించింది గోవిందరావుకు.

తనవాళ్ళతో కలిసి దేవాలయం కేసి కదిలాడు.

ఎవ్వరూ మాట్లాడుకోవటం లేదు.

నిశ్శబ్దంగా నడుస్తున్నారు.

వీధిలైట్లు మినుకు మినుకుమంటున్నాయి.

ఇళ్ళల్లోని టివిల రొద వీధుల్లోకి పాకుతోంది.

ఆట ఒప్పందమనే పెనుసమస్యను వదిలించుకొన్నారు.

తమకై తాము ఆడేందుకయినా సహకరిస్తారో లేదో!

ఏ అమ్మకయినా దయపుట్టి చటాకు ఆముదం పోస్తే చాలు.

బొమ్మలకు మెరుగుపెట్టాలి.

వెలుతుర్లో పరదాగుడ్డ మీద జిగేల్మని మెరవాలి.

గజ్జెల కాళ్ళతో చెక్కపలకల మీద బీభత్సంగా తొక్కినప్పుడే యుద్ధ వాతావరణం సృష్టించబడేది.

చెక్క పలకలు దొరుకుతాయో లేదో!

ఆలోచిస్తూ వెళుతోన్న గోవిందరావుకు వీధి పక్కన్నించే మేకపిల్లల అరుపులు విన్పించి అటుకేసి చూశాడు.

రెండు దబ్బల గూళ్ళతో మేకల దడి.

గూళ్ళకింద నుంచి మేకపిల్లలు గోలజేస్తున్నాయి.

గొల్ల వీధికి వచ్చినట్టుంది తాము.

కళ్ళ ముందు ‘ఎలమంద’ రూపం కదలాడింది గోవిందరావుకు.

బట్టెకట్టె, గొంగళి, చెవికమ్మలు, ముంతెడు కప్పు, ఆజానుబాహు విగ్రహం…

అతనిప్పుడు లేడని తెలిసింది.

అటు ఇటు పారజూసి ఎలమంద ఇంటి వద్దకెళ్ళాడు.

మంచమ్మీంచి లేచి నిలబడ్డాడు ఎలమంద కొడుకు పాములేటి.

ఇంటి ముందు పందిరి కూసాలకు మేకపోతులు కట్టేసి ఉన్నాయి.

ఉచ్చ పేడతో కూడిన వెగటు వాసన వీధిలోకి వస్తోంది.

‘‘కూకుందూ రాండయ్యా!’’ ఆహ్వానించాడు పాములేటి.

అంతలో ఇరుగుపొరుగు మగాళ్ళు కూడా అక్కడికి వచ్చారు.

‘‘నాయనా పాములేటీ! ఈ ఇంటిని సూస్తాంటే మీ నాయన ఎలమందరాజు గుర్తుకొస్తాండు తండ్రీ! …. మహానుభావుడు ….’’ గొంతు గద్గదమైంది గోవిందరావుకు.

‘‘బట్టెకట్టె గడ్డం కింద పూడుకొని తెల్లవార్లయినా బొమ్మలాట జూస్తారు యాదవరాజులు …. పాలేమి, పెరుగేమి, సద్దికూళ్ళేమీ …. మమ్మల్నూ మా బొమ్మల్నూ సాకి సంతరించిన తండ్రులు …. తోలు విగ్రహాలు రాయాలంటే మీరిచ్చిన మేకపోతు చర్మం కావాల …. మారాజులు.. ఎంత మంది యాదవ రాజులు రంగులిచ్చి, సంభావనలిచ్చి విగ్రహాలు రాయించారనీ! మన ఎలమంద మహరాజు.. గోపాల కృష్ణుని విగ్రహాన్ని గీయించిన ధర్మ ప్రభువు …. మా నాయన లాంటివాడు ఎలమంద. ఎక్కడున్నాడో?.. అయ్యా! ఎలమంద రాజా! నీ ఊర్లో ఈనాటికి మాకు ఆట ఆడేందుకు గతిలేని పరిస్థితి దాపురించెగద తండ్రీ! ముందుకొచ్చి తాంబూలమిచ్చే వారే కరువయ్యిరే …. నువ్వుంటే ఇట్లా జరిగేనా? బొమ్మలాట కళాకారులు ఊర్లోకొచ్చి ఉత్తచేతుల్తో వెనుదిరిగి పొయ్యేదుండునా! అట్లా జరిగితే నువ్వు బతికే వానివా? నీ యీధిన్నయినా ఆటాడించే వానివి గదా! తండ్రీ! యాడుండావు నాయనా! ఒక్కసారి ఇట్లా సూడు …. మా గోడు ఆలకించు ….’’ అంటూ ఆకాశానికి చేతులు చాచి రుద్దకంఠంతో అరిచాడు.

చూస్తోన్న వాళ్ళ గుండెలు కరిగాయి.

పాములేటికయితే కళ్ళ నీళ్ళూరాయి.

‘‘అయ్యా! గోయిందరావయ్యా! మెల్లగుండు …. సింతబడగాకు …. మా నాయన పేరు నిలబెట్టేందుకు నేనుండా! …. ఎలమంద కొడుకునయ్యా నేను ….’’ అంటూ అరచేత్తో రొమ్ము చరచుకున్నాడు.

‘‘ఊరన్నేంక కట్టుబాట్లుంటాయి. పెద్దా చిన్నా ఉంటారు. పెద్దోల్లు ఏలుబెట్టి చూపిన దారిన పోవాల. చిన్నోల్లు ఆలోసెనజేసి సెప్పిన మంచి మాటినాల …. ఆ ఆడించేందుకు మాకు బరువేమీగాదు. మా గొల్లోల్లమే ఆడించుతాం…. అది బాగుండదు. పెద్ద రెడ్డి ఒక్కమాట సెబుతే వాల్ల మీద ఏ బరువూ పెట్టకుండా అన్నీ మేమే నెత్తినేసుకొని తాంబూలమిస్చాం.. రెడ్డిగారికి కోపం రాకుంటే ఆటాడిస్చాం … వాళ్ళను పప్పించుకొని రాపోండయ్యా!’’ చెప్పాడు.

మిగిలిన గొల్లలంతా ‘ఔనౌ’నంటూ వంత పాడారు.

ఉక్కిరి బిక్కిరయ్యాడు గోవిందరావు.

ఊహించని స్పందన.

అనుకోని మలుపు.

ఈ ప్రతిపాదనకు గ్రామ పెద్దలు పప్పుకొంటారు. సందేహం లేదు. వెంటనే బైల్దేరారు.

ఆ రాత్రి పూటే సందులు గొందులు తిరిగి గ్రామ పెద్దల్ని కలిశారు. ఆయన ఊహించినట్టే జరిగింది.

బాధ్యత మరొకరు తీసుకొని ఆటాడించేందుకు తమ అభ్యతరం ఏముంటుందంటూ సమ్మతించారు.

రాత్రి బాగా పొద్దుబోయింతర్వాత పళ్ళెంలో ఆకు వక్కలు దక్షిణతో నాలుగు కులాల వాళ్ళను వెంటబెట్టుకొని దేవాలయం వద్ద కొచ్చాడు గొల్ల పాములేటి.

గరుడ గంబం వెలిగించి, ఆ వెలుగుల్లో బొమ్మలాట గాళ్ళు ఓ వైపూ, కులపెద్దలు మరోవైపూ కూచున్నారు.

పాములేటి రెండు చేతుల్తో తాంబూలపు పళ్ళెం చాచి ‘‘ఆటాడేందుకు మీరొచ్చినారు. మేంగూడా ఒకరేత్రి బొమ్మలాట సూసి కుశాలపడాలనుకొన్నెం … రేపు రాత్రికి బొమ్మలాట ఆడించమని మిమ్మల్ను అడుగుతుండాం. ఆటాడేందుకు కుందస్తు రాకుండా సూసుకుంటాం … ఆటాడగానే మీ సంభావన మీకిచ్చి పంపుతాం …’’ అంటూ పలికాడు.

గోవిందరావు చేతులు చాచి పళ్ళెం అందుకొంటూ ‘‘ఆటాడమన్నారు. గ్రామాన్ని నమ్ముకొని, గ్రామం తరఫున తాంబూలమిచ్చే పాములేటయ్యను నమ్ముకొని రేపు రాత్రికి ఆటాడతాం. ఆడిన తదుపరి ఒప్పందం చేసుకొన్నె సంభావన ఇస్తారనీ, ఆటకు కుందస్తు లేకుండా డేరా వేయిస్తారనీ, మెరుగు ఆముదం, కోడిపిల్ల, మాకు భోజనాలు … వేటికీ ఇబ్బంది లేకుండా చేస్తారనీ … మేము కూడా బాగా ఆడి మిమ్మల్ను ఆనంద పెడ్తామనీ తోలువిగ్రహాల మీద ఆనబెట్టి చెబుతున్నాం … నల్లనయ్య మీద ఆన … రామయ్య మీద ఆన .. జుట్టు పోలుగాడి పోకమాను మీద ఆన … మీరు మాకు సంభావన ఎగ్గొట్టినా, జరుగుబాట్లు సక్రమంగా లేకున్నా జుట్టు పోలుగాడి పోకమానే గతి … పోకమాను మీద ఆన …’’

పాములేటి కూడా పలికాడు.

‘‘పోకమాను ఎందుకులేయ్యా!’’ చిన్నగా గొణిగాడు.

‘‘నువ్వే బయపడగాకు … అది ఆచారం … అంతే’’ సుబ్బారావు చెప్పాడు. ఆట పప్పందం తర్వాత కులపెద్దలు ఎవరి దారిన వారు వెళ్ళారు.

ఎట్టకేలకు ఒక అంకం పూర్తయినట్లనిపించింది గోవిందరావుకు.

ఎన్నెన్ని అగచాట్లు పడ్డారనీ!

ఎంతమంది కాళ్ళు పట్టుకొన్నారనీ!

గుడి పంచలో పడుకొన్నాడు గాని చాలాసేపటిదాకా నిద్ర బట్టలేదు ఆయనకు. తిక్కలోడి గురక ఓ వైపు సతాయిస్తూనే ఉంది.

తమ వాళ్ళంతా త్వరగానే నిద్రబోయినట్టుంది.

నిన్నటి నుంచి జరిగిన సంఘటనలన్నీ ఒకదాని వెంట పకటి మనోఫలకం మీద దృశ్యమానమవుతున్నాయి.

ఆ వెనకే పాతరోజులు గుర్తొస్తున్నాయి.

బొమ్మలాటగాళ్ళు ఊర్లోకి పచ్చినారంటే చాలు పండుగ వాతావరణమే!.. పొద్దుపోయేదాకా పురాణ పఠనాలు … గుడిలో భజనలూ … వీధులన్నీ కలకలలాడే సాయంత్రాలు …

ఇప్పుడు కూడా రాత్రిళ్ళు మేలుకొంటున్నారు జనం – టీవీల వద్ద.

తమ వృత్తికి ప్రధాన అడ్డంకి టీవీలే.

రేపయినా టీవీలు ఆడుతోంటే బొమ్మలాట వద్దకు ఎవ్వరూ రారు. పెద్ద మనుషులకు చెప్పి రేపొక్క రాత్రి డిష్‌ను ఆపేయించాలి.

మిద్దెల మీది ఆ గోళం విష్ణు చక్రమై తమ వృత్తిని వెంటాడి వేటాడుతోంది. దాని పళ్ళచక్రం దెబ్బకు తునాతునకలవుతోంది తమ కుల వృత్తి.

ఆలోచనల్లోనే మాగన్నుగా నిద్రబట్టింది ఆయనకు.

ఉన్నట్టుండి ఎవరో ఆడమనిషి అదలింపు.

ఉలిక్కిపడి కళ్ళు తెరిచి లేచేసరికి మరోసారి అదే గొంతు.

‘‘ఓమా! ఎవురో సూడు … దొంగ … దొంగ …’’ భయభ్రాంతురాలైన వనజ గొంతు.

‘‘ఎవురోడూ? … రోయ్‌! … సంపుతా నా బట్టా!’ కమలాబాయి కేక.

‘‘ఎవుర్రా నా కొడుకు వాడూ …’’ అంటూ రామారావూ. వెంకట్రావులు లేచారు. సుబ్బారావు కేకలేశాడు.

వీధి వెంట దబదబ పరుగెడుతోన్న అడుగుల సవ్వడి.

ఇరుగు పొరుగులు లేచారు.

ఎవడో దొంగ వనజ మెడలో చేయి పెట్టాడుట.

ఆమె మెడలోని సన్నని గొలుసుకోసం దొంగ ప్రయత్నించాడని తీర్మానించారు గ్రామస్తులు. అందరూ తిట్లకు తీసికొన్నారు. ఊరు చెడిపోయిందని బాధపడ్డారు. చాలాసేపు దొంగను శపిస్తూనే ఉండిపోయారు.

దేవాలయం వద్ద కేకలకు దూరపు వీధుల్లోని పాములేటి వగైరాలు కూడా వచ్చారు. దొంగమీద తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.

కళాకారులకైతే తర్వాత నిద్రబట్టలేదు.

వాడు చేయిబెట్టింది మెడలో కాదనీ, ఎదలమీదనీ వనజకు బాగా తెలిసి వస్తనే ఉంది. వాడు వచ్చింది దొంగతనానికి కాదని కూడా తెలుస్తోంది.

ఆ విషయం కమలాబాయి కూడా గ్రహించింది.

దొంగతనపు ప్రయత్నంగానే దాన్ని చిత్రించటం మంచి పనే అయ్యింది.

ఎంతలో ఎంత మార్పు!

గ్రామస్తుల దృష్టిలో ఎంత చులకన అయ్యారనీ తాము!

ఆడపిల్లల్ని వెంటేసుకని తిరగటం ఆ రోజుల్లో ఒక కళాత్మక ప్రక్రియలా ఉంటే – ఈ రోజు అదెంత చులకన స్థితికి దిగజార్చిందనీ!

ఊరు ఎంతగా చెడిపోయిందనీ!

మధుర భావాల్ని కూడగట్టుకోవలసిన యువ హృదయాలు సైతం ఎవరో తాగుబోతు మనుషుల ఎదల్లా ఎంతగా కల్మషమయ్యాయనీ!

వాళ్ళ దృష్టిలో తోలుబొమ్మలంటే ఆడపిల్లలు కాబోలు.

జరిగిన సంఘటన కలిగించిన జలదరింపు సర్దుకనేందుకు చాలా రాత్రి ఖర్చయింది కమలాబాయికి.

తన యవ్వనంలోని అనుభవానికీ, వనజకు ఎదురైన అనుభవానికీ పోల్చుకొని కూతురిపట్ల జాలిపడింది.

పోలికతోటే ఆనాటి యువకుడు గుర్తొచ్చాడు.

రైతుగా మారిన అతని పునర్దర్శనం శారీరకంగా కాకుండా కొన్ని శబ్దాలుగా తనకు పరిచయం కావటం .. కొడిగడుతూ ఉన్న రైతుదనాన్ని తను వినటం …. మిగిలిన రాత్రంతా అవే దృశ్యాలూ .. శబ్దాలూ ..

ఎంత వద్దనుకొంటోన్నా అతని దుస్థితే కళ్ళముందు కన్నీటి మడుగులై.

తనతని ఎదుట పడవలసింది.

ఓదార్చవలసింది.

యాక్సిడెంటుకు గురయి రక్తపు మడుగులో గిలగిల కొట్టుకొంటోన్న వ్యక్తిని చూసేందుకు ధైర్యం చాలనట్లే .. ఎదుట కన్పించే కఠోర వాస్తవాన్ని జీర్ణించుకనే శక్తిలేక అతని ఎదుటపడలేదు తను.

పిరికితనంగా తిరిగి వచ్చింది.

నిజంగానే అతను బలమైన యాక్సిడెంటుకు గురయివున్నాడు.

పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసికొంటాడేమో!

రైతు పరిస్థితి ఎంత దయనీయంగా ఉందనీ!

కొడుకు సూచన మేరకు పొలాలమ్మి టౌనుజేరి ఏదైనా వ్యాపారంలోకి దిగుంటే బాగుపడుండేవాడేమో!

జీవితంలో పెద్ద తప్పే చేశాడు.

పొలాల మీద వ్యామోహం చంపుకోలేక జీవితాన్ని చేజేతులా నాశనం చేసికొన్నాడు.

ఉన్నట్టుండి రైతు స్థానంలో తన తండ్రి కన్పించేసరికి ఉలిక్కిపడింది.

ఆయన కూడా తోలుబొమ్మల్ని నమ్ముకొని తప్పుజేస్తున్నాడేమో!

కిరీటి చెప్పినట్టు వాటిని అమ్ముకొని ఆ సొమ్ముతో మరోవిధంగా బతికేందుకు ప్రయత్నిస్తే బావుంటుందేమో!

చాలాసేపు ఆలోచనల్లోనే గడిపింది ఆమె.

ఎప్పుడో తొలికోడికూసే జామున మాగన్నుగా నిద్రబట్టింది.