భౌతిక శాస్త్ర వ్యాసాలు

ముందుమాట

ఇరవైయవ శతాబ్దం భౌతిక శాస్త్రానికి స్వర్ణయుగం అనవచ్చు. మేక్స్ ప్లాంక్ 1900 లో వేసిన విత్తు మహా వృక్షమై మన జీవితాలనే మార్చి వేసింది. అప్పటి నుండి ఇరవైయవ శతాబ్దం అంతం వరకు శరవేగంతో జరిగిన సంఘటనలని సాధ్యమైనంత తేలిక భాషలో, సాధ్యమైనంత తక్కువ గణిత సమీకరణాలు మాత్రం ఉపయోగించి, ఒక సింహావలోకనం చేసేను. ఈ పుస్తకం చదివి లబ్ది పొందాలంటే కనీసం ఉన్నత పాఠశాల వరకు తారసపడే గణితం, భౌతిక శాస్త్రం బాగా తెలిసి ఉండాలి, శాస్త్రం తెలుసుకోవాలనే కుతూహలం కుతకుతలాడుతూ ఉండాలి.

తెలుగులో శాస్త్రీయ పదజాలం తక్కువ. ఉన్న కొద్ది మాటలలో కూడా స్థాయికరణ లేదు. ఒకే ఇంగ్లీషు మాటని ఒకొక్కరు ఒకొక్క విధంగా అనువదిస్తూ ఉంటారు. అందుకని నేను వాడిన మాటలకి సమానార్థకాలైన ఇంగ్లీషు మాటలని వెనువెంటనే కుండలీకరణాలలో చూపించేను. పుస్తకం చివర ఈ మాటలన్నిటిని కూడగట్టి, చదువరుల సౌలభ్యం కొరకు, ఆకారాదిక్రమంలో అమర్చేను.

ఈ పుస్తకం లోని అధ్యాయాలని నేను అమర్చిన క్రమంలోనే చదవాలనే నిబంధన ఏదీ లేదు. కానీ ఆధునిక భౌతిక శాస్త్రంతో పరిచయం తక్కువ ఉన్న పాఠకులు నేను సూచించిన క్రమంలో చదివితే విషయం తేలికగా అర్థం అవడానికి అవకాశం ఎక్కువ అవుతుంది.

ఇది పాఠ్య పుస్తకం కాదు. పాఠ్య పుస్తకాలకి అనుబంధం అనుకోవచ్చు. భౌతిక శాస్త్రం లోని ఉన్నత భావాలని, జనరంజన శైలిలో, నలుగురికి అందుబాటుగా ఉండే భాషలో రాసిన ప్రయత్నం ఇది.

అట్ట మీద బొమ్మ వేసినది శ్రీ సాయి బ్రహ్మానందం గొర్తి.

వేమూరి వెంకటేశ్వరరావు.
ప్లెజన్టన్, కేలిఫోర్నియా, జూలై 2023

వేమూరి వేంకటేశ్వర రావు

రచయిత వేమూరి వేంకటేశ్వర రావు గురించి: వేమూరి వేంకటేశ్వరరావుగారు వృత్తిరీత్యా, యూనివర్సిటీ అఫ్ కేలిఫోర్నియాలో, కంప్యూటర్ సైన్సు విభాగంలో, ఆచార్య పదవిలో పనిచేసి పదవీవిరమణ చేసారు. తెలుగు విజ్ఞానశాస్త్ర రచయితగా, నిఘంటు నిర్మాతగా పేరొందారు. ఆధునిక విజ్ఞానశాస్త్రాన్ని జనరంజక శైలిలో రాయటంలో సిద్ధహస్తులు. వేమూరి తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు, వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు, పర్యాయపదకోశం వీరు నిర్మించిన నిఘంటువులు.  ...