- మంగళకైశికి: ఈమాట పత్రిక పాతిక సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ప్రత్యేక సందర్భంలో రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు శాస్త్రీయ సంగీతంలోని రాగాలపై చేసిన మరొక రేడియో ప్రసంగం విందాం. గతంలో సైంధవి, ద్విజావంతి రాగాలపైన ఆయన ప్రసంగాలు నవంబరు 2018, ఫిబ్రవరి 2020 సంచికల్లో వినవచ్చు.
- లలిత సంగీతం అంటే ఏమిటి, లలిత గీతాన్ని ఎలా నిర్వచిస్తారు అన్న ప్రశ్నలపై గత డెబ్భయి, ఎనభయి ఏళ్ళలో తెలుగులో చాలా చర్చ జరిగింది. సి. నారాయణరెడ్డి, వడ్డేపల్లి కృష్ణ, పైడిపాల లాంటివారు తమ తమ (Ph.D) సిద్ధాంత గ్రంథాలలోను, పాలగుమ్మి విశ్వనాథం, మహాభాష్యం చిత్తరంజన్ లాంటివారు తాము రాసిన “లలిత సంగీతం” (పాఠ్య) పుస్తకాలలోను ఈ ప్రశ్నలపై కొంత వివరణ ఇవ్వడానికి ప్రయత్నించారు. ఈ చర్చాక్రమంలో సుమారు నలభయి ఏళ్ళ క్రితం విజయవాడ రేడియో కేంద్రం లలిత సంగీతంతో ప్రత్యక్ష పరిచయం వున్న నలుగురు ప్రముఖుల – బాలాంత్రపు రజనీకాంతరావు (రజని), మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఈమని శంకర శాస్త్రి, ఎం. ఎస్. శ్రీరాం – అభిప్రాయాలను రికార్డు చేసి ప్రసారం చేసింది. ఆ ప్రసారం ఇక్కడ మీ ముందు.
- మరికొన్ని అరుదైన పాత పాటలు
ఈ సంచిక కోసం పొందుపొరచిన 14 పాటల వెనుక యెలాంటి ప్రణాళిక లేదు. నాకు తెలిసినంతలో ఇంటర్నెట్ యుగంలో కూడా ఇవి అంత తేలికగా దొరకని పాటలు. ఎనిమిది ‘ప్రైవేటు పాటలు’ (Basic Songs), ఆరు సినిమా పాటలు. ఇవన్నీ మట్టి రికార్డుల (78 rpm disks) నుండి డిజిటైజ్ చేయబడ్డాయని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదనుకుంటాను. అందువల్ల audio quality అంత గొప్పగా వుండదు. అలాగే కొన్ని పాటలకు సంబంధించి నా దగ్గర యెలాంటి వివరాలు లేవు. 1984-89 కాలంలో విజయవాడ, తెనాలి లాంటి వూళ్ళలోని షాపుల్లో పాటలు రికార్డింగు చేయించుకున్నప్పుడు అన్ని వివరాలు రాసుకోవాలనే జ్ఞానం నాకు లేదు.
ఇక ఈ సంచికలోని పాటల వివరాలకొస్తే ముందుగా సినిమా పాటల గురించి. ‘నిజమాడుదాన, అతి భాగ్యశాలి నారి’ అన్న పాటలు పాడినది ప్రముఖ నటి ఋష్యేంద్రమణి. ఆవిడ మంచి గాయని కూడా. చెంచులక్ష్మి (1943) సినిమాలో సుబ్బురామన్ సంగీత నిర్వహణలో పాడిన ‘నిజమాడుదాన’ అన్న పాటను వింటే వాళ్ళిద్దరి ప్రతిభ అర్థమవుతుంది. ఆ పాటలోని ´వేగం´ చూస్తే 1960ల నాటి పాటనిపిస్తుంది. అదే రికార్డు పైన వచ్చిన మరొక పాట ‘అతి భాగ్యశాలి నారి’. ఈ సినిమాలోని ఇతర పాటల గురించి మరొకసారి.
భానుమతి తమ భరణి సంస్థ తరపున నిర్మించిన మొదటి సినిమా రత్నమాల (1947). దీనిలో ప్రతి పాట అపురూపమైనదే. ఇక్కడ అందిస్తున్న ‘నిలువ నీడలేని’ అన్న భానుమతి పాడిన పాట అంతకుముందు – 1944 ప్రాంతంలో – ఆర్. బాలసరస్వతి పాడిన ‘తలుపు తీయునంతలోన తత్తరమది ఏలనోయి’ వరసలో వుంటుంది. ‘ఆనందదాయని భావని’ అన్న పాట, పాటల పుస్తకంలోను సినిమా టైటిల్స్ లోను పేరు లేకపోయినా, మల్లాది రామకృష్ణశాస్త్రి రచన. ఈ మధ్య కాలంలో ఈ పాటను భరతనాట్య ప్రదర్శన-/కచేరీ-లలో కూడా అభినయిస్తున్నట్లు వి.ఎ.కె. రంగారావుగారు చెప్పారు.
చివరిగా రేలంగి, నల్లా రామమూర్తి స్వయంగా సంప్రదాయ/జానపద బాణీల్లో పేరంటాలు (1952) అన్న సినిమాలో పాడిన పాటలు. ప్రముఖ రచయిత గోపీచంద్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆర్ధికంగా విజయవంతం కాకపోవటంతో ఈ సినిమాలో పాటలు కూడా పెద్ద ప్రచారంలోకి రాలేదు. ఈ పాటలు నాకు ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహించిన బాలాంత్రపు రజనీకాంతరావు దగ్గర (అద్దేపల్లి రామారావుగారి పేరు కూడా కనపడుతుంది కాని ఆయన నేపథ్య సంగీతం వరకు చేశారు.) Music director recordsగా దొరికాయి. ఒక పాట పెద్ద ఎత్తులో రికార్డులపైన ముద్రించే ముందు సంగీత దర్శకుడి అనుమతి కోసం రికార్డుకు ఒక వైపే ఆ పాటను ముద్రించి పంపుతారు. వాటిని Music director records అంటారు.
తరువాత ప్రైవేటు పాటల వివరాలకు వస్తే ‘జగతి ప్రేమ సుధామయమెగ’, ‘మరువకె హరిపదసేవ’ అన్న పాటలు పాడినది ప్రముఖ సినీ సంగీతదర్శకుడు సుసర్ల దక్షిణామూర్తి. ఆయన కొన్ని సినిమా పాటలు కూడా పాడారు. పాతాళ భైరవి (1951) లోని ‘ప్రేమకోసమై వలలో పడెనే’ పాటతో అందరికీ పరిచయమైన వి.జె.వర్మ 1942-43 నాటినుండే (ఇంకా ముందు కూడా?) సినిమా, ప్రైవేటు పాటలు పాడారు. ఆయన పాటలు రెండు: రావో మనోహరా, నవ్వరా తమ్ముడా.
టి.ఎ. మోతి పేరు అందరికీ పరిచమయినది కాకపోవచ్చు. ఆయన పాడిన ‘అహ సుఖదాయి’ (భానుమతితో కలిసి, అపూర్వ సహోదరులు-1950), ‘అదిగదిగో గగనసీమ’ (ఎం.ఎల్.వసంతకుమారితో, నాయిల్లు-1953) కొందరికి తెలిసి వుంటాయి. ఇక్కడ ఇచ్చిన రెండు పాటల్లో ఒకటి ‘విశ్వప్రేమయె’ అన్నది సరోజినితో పాడిన యుగళగీతం. కె. (ఈలపాట) రఘురామయ్య పాడిన చివరి రెండు పాటలు ‘సక్కుబాయి’ నాటకంలో ప్రసిద్ధికెక్కినవి. ఇవి కచ్చితంగా ఎప్పుడు, ఎక్కడ రికార్డు అయ్యాయన్న వివరాలు నాకు తెలియదు. ఇవి మట్టి రికార్డులపైన వచ్చినవి కావు. మరి కొన్ని పాటలు ముందు ముందు సంచికల్లో.
- మరువకే హరిపాదసేవ – సుసర్ల దక్షిణామూర్తి.
- జగతి ప్రేమసుధామయమేగా – సుసర్ల దక్షిణామూర్తి.
- ప్రేమాలాపన వినవా సఖీ – టి. ఎ. మోతీ.
- విశ్వప్రేమయే శుభము – టి. ఎ. మోతీ, వి. సరోజిని.
- రావే మనోహరా – వె. జె. వర్మ.
- నవ్వరా తమ్ముడా – వి. జె. వర్మ.
- భక్తమణికి నిర్బంధము – రఘురామయ్య.
- ముదంబునొందుమా – రఘురామయ్య.
- అతి భాగ్యశాలి నారి – చెంచులక్ష్మి (1943) – ఋష్యేంద్రమణి, సి. ఆర్. సుబ్బురామన్.
- నిజమాడుదాన నీదాన – చెంచులక్ష్మి (1943) – ఋష్యేంద్రమణి, సి. ఆర్. సుబ్బురామన్.
- నిలువ నీడలేని బ్రతుకు – రత్నమాల (1947) – పి. భానుమతి.
- ఆనందదాయిని భావని – రత్నమాల (1947) – మల్లాది, పి. భానుమతి.
- నిమ్మచెట్టుకి నిచ్చెనేసి – పేరంటాలు (1951) – రేలంగి, నల్లా రామమూర్తి, రజని, అద్దేపల్లి రామారావు.
- అబ్బోరి గుండేలుగా – పేరంటాలు (1951) – రేలంగి, నల్లా రామమూర్తి, రజని, అద్దేపల్లి రామారావు.
- మరువకే హరిపాదసేవ – సుసర్ల దక్షిణామూర్తి.