ఆంధ్రప్రదేశ్ సంగీత, రంగస్థల కళారంగం: ఒక పర్యావలోకనం

1. ప్రవేశిక

ఆంధ్రులు ప్రాచీన కాలంనుంచి నివసించిన ఏక భూఖండమే నేటి ఆంధ్రప్రదేశ్‌. దీని విస్తీర్ణం దాదాపు రెండు లక్షల డెబ్భై యేడు వేల చదరపు కిలోమీటర్లు. ఇందు నివసించే ఆంధ్రుల జనాభా నేడు సుమారు ఎనిమిది కోట్లు. మొదటిసారిగా ఆంధ్రపదం జాతిని సూచించేదిగా ఐతరేయ బ్రాహ్మణంలో కనిపిస్తుంది. ఇది క్రీస్తు పూర్వపు శతాబ్దాల్లో వెలసిన గ్రంథం కాబట్టి ఆంధ్రజాతి ఆనాటికే ఉన్నట్టుగా మనం నిర్ణయించడానికి వీలు కలుగుతుంది. క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దానికి చెందిన గ్రీకు రాయబారి మెగస్తనీస్‌ కథనం ప్రకారం ‘‘ఆంధ్రజాతి బలమైన జాతి. వాళ్ళకు చుట్టూ ప్రాకారాలు కలిగి బురుజులతో శోభించే పటిష్ఠమైన 30 పట్టణాలుండేవి. ఒక్కొక్క పట్టణంలో లక్ష కాల్బలం, 2000 అశ్విక బలం, 1000 గజ బలం ఉండేవి’’ అని రాశారు. ఇంకా అశోకుని ధర్మ శాసనాలలో వాయు పురాణంలో, రామాయణ భారతాది పురాణాలలో ఆంధ్రజాతి ప్రసక్తి ఉంది.

క్రీస్తు శకం 340కు చెందిన మల్లిదేవ నందివర్మ దాన శాసనంలో ‘ఆంధ్రమండలే ద్వాదశ సహస్రనామ సంపాదిత సప్తార్థ లక్ష విషయాథిపత్ణే’ అని ఉంది. అందులో ఆంధ్రమండలే అంటే ఆంధ్రదేశమనే మనం భావించడం సముచితం. ఇంతటి ప్రాచీన చరిత్ర కలిగిన ఆంధ్రరాష్ట్రం నేడు తెలంగాణ, కోస్తాంధ్రా, రాయలసీమ అను మూడు విభాగాలుగా ఇరువది మూడు జిల్లాలతో తెలుగు మాతృభాషగా విరాజిల్లుచున్నది. తెలంగాణలో మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి, మెదక్‌, నిజామాబాద్‌, అదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, నల్గండ, ఖమ్మం జిల్లాలు, కోస్తాంధ్రలో నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు, రాయలసీమలో కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలున్నాయి. మన భాషకు ఆంధ్రం, తెనుగు, తెలుగు, అను పర్యాయ పదాలున్నట్టు భాషా పరిశోధకులు నిర్ణయించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణతో ఆంధ్రప్రదేశ్‌ భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడింది. 1956 నవంబరు 1వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అవతరించింది. ఐతరేయ బ్రాహ్మణ కాలంనుంచి నేటివరకు ఆంధ్రుల చరిత్ర, సంస్కృతి, కళలు మొదలగు వానిని సమగ్రంగా పరిశోధిస్తే మన ఆంధ్రజాతి ఔన్నత్యం తేటతెల్లమౌతుంది. అదేవిధంగా బుగ్వేద కాలానికి పూర్వమే ‘సంగీత’ స్వరాల ఆవిర్భావం జరిగినట్టు తెలుస్తున్నది. సామవేద కాలానికి అవి పూర్ణ స్వరత్వాన్ని పొందాయి. ‘గరసనిద’ అనే పంచస్వరాలతో గ్రామం అని వ్యవహరించబడ్డాయి. కాలక్రమంలో ‘సరిగమపదని’ అనే సప్తస్వరాలు రూపుదిద్దుకన్నాయి. ఈ స్వరాలే సంగీతానికి జవము, జీవమై నాటికి నేటికి రేపటికి వైజయంతికలవుతున్నాయి. భరతుడు, నారదుడు, మతంగుడు, మమ్మటుడు, పార్శ్వదేవుడు, చాళుక్య సోమేశ్వరుడు, సోమనార్యుడు, జాయాప సేనాని, శారదేవుడు, సింహభూపాలుడు, గోపాల నాయకుడు, హరిపాలదేవుడు, విద్యారణ్యుడు, కుమారగిరి వసంతరాజు, పెదకోమటి వేమారెడ్డి, గోపేంద్ర తిప్ప భూపాలుడు, చతుర కల్లినాథుడు, అన్నమాచార్యుడు, పురందరదాసు, భండారు లక్ష్మీనారాయణ, రామామాత్యుడు, అహోబల పండితుడు, సోమనాధుడు, చతుర దామోదరుడు, పుండరీక విఠలుడు, మాధవభట్టు, భావభట్టు, గోవింద దీక్షితుడు, వేంకటమఖి, గోవిందామాత్యుడు, జయదేవుడు, లీలాకుశుడు, పురందరదాసు, పెద తిరుమలాచార్యులు, చిన తిరుమలాచార్యులు, పెదకెంపరాయడు, శివనారాయణ తీర్థులు, సిద్ధేంద్రయోగి, కంచెర్ల గోపన్న, క్షేత్రయ్య, మునిపల్లె సుబ్రహ్మణ్య కవి, రఘునాథ నాయకుడు, పసుపులేటి రంగాజమ్మ, మన్నారు దేవుడు, కంఠీరవరాజు, శ్రీధర వేంకటేశార్యుడు, రామస్వామి దీక్షితులు, త్యాగరాజు, ముద్దస్వామి దీక్షితులు, పోతులూరి వీరబ్రహ్మం, దూదేకుల సిద్ధప్ప, ఎడ్ల రామదాసు, ఆదిభట్ల నారాయణదాసు, తుమరాడ సంగమేశ్వర శ్రాస్తి, బాలమురళీకృష్ణ, ఎం.ఎస్‌.సుబ్బలక్ష్మి తదితరులు సంగీత సరస్వతిని అర్చించి తరించారు. ‘సంగీతమపి సాహిత్యం సరస్వతీ స్తనద్వయం’ అన్నారు. సంగీతాన్ని వదలి సాహిత్యం, సాహిత్యాన్ని వదలి సంగీతం మనుగడ సాగించలేవు. ఇవి రెండూ కూడా ప్రధానమైన కళలే. సంగీతానికి సాహిత్యం తోడై ప్రదర్శింపబడునదే రంగస్థల కళారంగం. ఆంధ్రజాతి ఎంత ప్రాచీనమైనదో కళలు కూడా అంతే ప్రాచీనమైనవి.