బరిబత్తల తనం బయటపడకుండా,
ఆఖరికి గోసిగుడ్డ మిగిలింది
శెలకల సారం సత్తెనాస్ ఐనంక
శేరిత్తులుసుక దోసిళ్ళ పడ్తలేవు
పేగు తిత్తులు ఎన్నటికి సల్లపడుతలేవు
ఉన్న తాటనే మశిపేలుకైతివి
పారేశిన శిబ్బివైతివి
ఎనుగర్రలేని గుడిశ వైతివి
పెయిల గువ్వం లేకున్నా
నెత్తిన పాగ తియ్యకపోతివి
నిన్ను ఈ తిరంగ చేసినోడి పాగ రాలకుండా ఉంటుందా!
ఆనలుపడని భూముల్ని దున్నుకుంటూ ..
రంధిపడ్డ మనసుని ఎంతకాలం సమ్జాయిస్తాప్.
గాదెల్నిండలేవని కడుపు ఎండగొట్టుకుంటివి
కూరబువ్వ కుండలో పెట్టి ఉట్టి పగులగొడ్తిరి
నోటిబుక్క గుంజుకుని గాచారం అంటగడ్తిరి
బేమానిగాళ్ళ మధ్య నుప్ చీపురు పుల్లవైతివి
ఇపుడు నీ బతుకు పారేసిన సొప్పబెండు
ఎగపోతలో ఎగిరిపడ్డ తప్పగింజ
బతుకు బొడ్డులేని ఇసుర్రాయి
రాతం జరిగే లడాయిలో నీకు నువ్వే సహారా
నువ్వు నమ్ముకున్న ఊరునిండా
డేగకాళ్ళ యంత్రాల పహారా!
ఊరు పొమ్మంటున్నప్పుడు
గోసిగుడ్డ మలిపి మలిపి సుట్టుకో
ఎవడి పంచకు చేరినా,
పుట్టితెగిన బతుక్కు కుచ్చుకుంటున్న ముల్లపొద
ఎంగిలి బతుకును మిగిల్చిన ఖానును
రైతు శవాలమీద వాగ్దానాల కరపత్రాలు
కఫన్‌లా ఎదజల్లుతారు
అంతా సత్తేనాస్ సావుడుకట్టం ఐతుంటే
బీడు గుండెపగిలి ఎక్కి ఎక్కి ఏడవవట్టె
నుప్ చేను ఒడ్డునెక్కి ఒంటెద్దుల ఏం చేస్తాప్!
గోసిగుడ్డ సెంగుల్లో …
రాలిన పరిగె గింజల్ని ఏరుకో
తిరుగాడిన మట్టిలో పరాయితనపు వెక్కిరింపు
నేలలోకి పాతుకున్న దర్భగడ్డిలాంటి కాళ్ళు
గునపాలతో తొలగిస్తున్న ఆనవాళ్ళు
సతలేని బతుకుదోవ
సాలుదప్పిన శిరస్త!