1. స్వేచ్ఛాగానం
దివిలో ఊగే విహంగాన్ని
భువిలో పాకే పురుగు బంధిస్తుంది
గడియేని ఆగని సూర్యుణ్ణి
గడియారపు బాహువులు బంధిస్తాయి
పీతడెక్కల చంద్రుణ్ణి
చేతులెత్తే సముద్రం బంధిస్తుంది
గలగలలాడే తరంగాల్ని
జలకాలాడే అంగాలు బంధిస్తాయి
తన చుట్టూ తాను తిరిగే చక్రాన్ని
మలుపులు తిరిగే రోడ్డు బంధిస్తుంది
తెగవాగే జలపాతపు నాలికని
సెగలెగిసే గ్రీష్మం బంధిస్తుంది
ముడతలుపడ్డ ముసలి సాయంత్రాన్ని
మాటలురాని కాలవ బంధిస్తుంది
రాత్రి వచ్చిన రహస్యపు వానని
ధాత్రిని దాగిన వేళ్ళు బంధిస్తాయి
గురిమరచిన గాలిబాణాన్ని,
తెరయెత్తిన నౌకాధనుస్సు బంధిస్తుంది
ఈ మనిషి ఆ మనిషిని బంధిస్తాడు
ఇద్దర్నీ కలిపి బంధిస్తుంది మనీష.
(కాకినాడ, ఆగస్టు 1970.)
2. మనిషీ మనిషీ!
మనిషీ మనిషీ,
ఎత్తుగా ఆకాశంలో
ఎగిరే డేగని చూడు
సరిహద్దుల్లేవు దానికి
గిరిగీసుకుని కూచోదు
భూచక్రాన్ని గుండ్రంగా
చూచుకాగ్రంపై తిప్పుతుంది
స్ఫుటంగా తీక్షణంగా వీక్షించే
సూర్యనేత్రం దాని ఆదర్శం.
మనిషీ మనిషీ,
పిట్టలకు ఎగరటం నేర్పిన
చెట్టుని చూడు
ఏ భాషలో పుష్పిస్తుందది?
ఊడల నీడల్లో మాపటి వేళల్లో
ఊడల్లా కావలించుకునే
ప్రియుల హస్తాలు
ఏ భాషలో తడుముకుంటాయి?
మనిషీ మనిషీ,
వరిమళ్ళల్లో ఈదే
చిరు ఆకాశాల్నీ చిట్టి పరిగల్నీ చూడు
ఆనందపు రంగులు
చైనా వియత్నాం జపాన్ పొలాల్లో
ఎక్కడైనా
అవే కద,
మనిషీ మనిషీ,
ఉప్పు ఏ భాషలోనైనా
ఉప్పగానే ఉంటుంది.
(కాకినాడ, 11-1-71.)
3. చెట్టు నా ఆదర్శం
తరుచాపము వీడిపోయి
గురిమరచిన బాణంలా
తిరుగాడును పిట్ట.
ధరణి గుట్టు తెరవబోయి
బిరడాలో ఇస్క్రూలా
ఇరుక్కున్న పురుగు.
పురుగు సగం, సగం పిట్ట
ధరనుచొచ్చి, దివినివిచ్చి
విరులు తాల్చు తరువు
(కాకినాడ, 1963.)
4. వాన వచ్చిన మధ్యాహ్నం
బరువెక్కిన సూర్యుడు
బతకనీడు భూమిని
ఉదయమ్మొదలు
ఊపిరాడనీడు
సర్వాన్ని అదిమిపట్టి
వీర్యాన్ని విరజిమ్మాడు.
ఆకల్లాడదు.
ఏ కాకీ ఎరగని
ఏకాకి ఆకాశం.
ఇంతలో హటాత్తుగా
ఇలకు కలిగింది మబ్బుకడుపు.
వేవిళ్ళ గాలులు
వృక్షాగ్రాల్ని వూపాయి.
ధాత్రీచూచుకాలు నల్లపడ్డాయి.
తటాకాల చెంపలు తెల్లపడ్డాయి.
అవాళ మధ్యాహ్నం
అకస్మాత్తుగా దిగిన వానపొర
ఊరంతటినీ ఆవలుంచి
ఒంటరిగా నన్ను మూసింది.
ప్రపంచంతో తెగిపోయాయి
పంచతంత్రులూ,
ఆకులపై రంగులు
అంతరించాయి ముందుగా,
స్వరాలూ సువాసనలూ
విరమించాయి తరువాత.
ఆశలూ ఆశయాలూ
ద్వేషాలూ రాగాలూ
రెచ్చకొట్టే స్మృతులూ
రెక్కలు ముడిచాయి పిదప
విప్పుకున్న బతుకంతా వెనక్కి చుట్టుకుపోయి
ఇప్పుడు నేనేమీ కాను తతత
వర్షాగర్భంలో
వర్ధిల్లే శిశుపిండాన్ని.
(నవంబర్ 1970.)