1. స్వేచ్ఛాగానం
రుబ్బుఱాయిలో ఊగే కాచకాన్ని
నీటిలో నానిన పప్పు బంధిస్తుంది
గడియేని ఆగని పెనాన్ని
చితుకుపుల్లల బాహువులు బంధిస్తాయి
పీతడెక్కల గాడిపొయ్యిని
చేతులెత్తే జ్వలనం బంధిస్తుంది
గలగలలాడే నూనెబొట్టుల్ని
సలసలకాగే అంచులు బంధిస్తాయి
తన చుట్టూ తాను తిరిగే పిండిని
మలుపులు తిరిగే గరిటె బంధిస్తుంది
తెగవాగే జలపాతపు జిహ్వని
సెగలెగిసే మిరప బంధిస్తుంది
ముడతలుపడ్డ ముసలి అట్టుని
మాటలురాని నాలిక బంధిస్తుంది
తేలి వచ్చిన అప్పచ్చి వాసనని
ముక్కున దాగిన గ్రంథులు బంధిస్తాయి
గురిమరచిన నాల్కబాణాన్ని,
తిరగమోగిన అల్లపుచట్నీ బంధిస్తుంది
ఈ మనిషి ఆ మనిషిని బంధిస్తాడు
ఇద్దర్నీ కలిపి బంధిస్తుంది అట్టుదోశ.
(అట్టునాడ, డిసంబరు 2010.)
2. మనిషీ మనిషీ!
మనిషీ మనిషీ,
ఎత్తుగా ఆకాశంలో
ఎగిరే డేగని చూడు
సరిహద్దుల్లేవు దానికి
గిరిగీసుకుని కూచోదు
భూచక్రాన్ని గుండ్రంగా
చూచుకాగ్రంపై తిప్పుతుంది
స్ఫుటంగా తీక్షణంగా వీక్షించే
సూర్యనేత్రం దాని ఆదర్శం.మనిషీ మనిషీ,
పిట్టలకు ఎగరటం నేర్పిన
చెట్టుని చూడు
ఏ భాషలో పుష్పిస్తుందది?
ఊడల నీడల్లో మాపటి వేళల్లో
ఊడల్లా కావలించుకునే
ప్రియుల హస్తాలు
ఏ భాషలో తడుముకుంటాయి?మనిషీ మనిషీ,
వరిమళ్ళల్లో ఈదే
చిరు ఆకాశాల్నీ చిట్టి పరిగల్నీ చూడు
ఆనందపు రంగులు
చైనా వియత్నాం జపాన్ పొలాల్లో
ఎక్కడైనా
అవే కద,మనిషీ మనిషీ,
అట్టు ఏ పెనమ్మీదైనా
అట్టుగానే ఉంటుంది.
(అట్టునాడ, 12-12-10.)
3. అట్టు నా ఆదర్శం
జలచాపము వీడిపోయి
గురిమరచిన బాణంలా
తిరుగాడును పిండి.పెనం గుట్టు తెరవబోయి
బిరడాలో ఇస్క్రూలా
ఇరుక్కున్న అట్టు.పిండి సగం, సగం పప్పు
తిరగలిచొచ్చి, పెనమ్మీదవిచ్చి
విరులు తాల్చు అప్పచ్చి
(అట్టునాడ, 2010.)
4. అట్టు వేసిన మధ్యాహ్నం
బరువెక్కిన సూర్యుడు
బతకనీడు మంచాన్ని
ఉదయమ్మొదలు
ఊపిరాడనీడు
కంఠాన్ని అదిమిపట్టి
దోశలని కుక్కాడు.ఆకల్లాటలు.
ఏ కరువు ఎరగని
ఏకరువు జఠరం.ఇంతలో హటాత్తుగా
డొక్కకు కలిగింది క్షుత్తుకడుపు.
ఆకలి గాలులు
గాడిపొయ్యిని వూపాయి.
పెనపుచూచుకాలు నల్లపడ్డాయి.
నూనెబొట్ల చెంపలు తెల్లపడ్డాయి.అవాళ మధ్యాహ్నం
అకస్మాత్తుగా దిగిన అట్టుపొర
ఊరంతటినీ ఆవలుంచి
ఒంటరిగా నన్ను మూసింది.ప్రపంచంతో తెగిపోయాయి
పంచతంత్రులూ,
నాలుకపై రంగులు
విస్తరించాయి ముందుగా,స్వరాలూ సువాసనలూ
అతిశయించాయి తరువాత.
ఆశలూ ఆశయాలూ
ద్వేషాలూ రాగాలూ
రెచ్చకొట్టే స్మృతులూ
రెక్కలు ముడిచాయి పిదపవిప్పుకున్న బతుకంతా వెనక్కి చుట్టుకుపోయి
ఇప్పుడు నేనేమీ కాను తతత
రేపటి తిరగలిగర్భంలో
వర్ధిల్లే దోశపిండాన్ని.
(డిసెంబర్ 2010.)