9. సంజ నారింజ
తొలిసంజ నారింజ ఎవరు ఒలిచేరు
తెలియెండ తొనలను ఎవరు వంచేరు?
దినపు రేకలపై వాలెను
ఇనుని సీతాకోక చిలక.
పిట్టపాటలు నీడఊటలు
చెట్టులను చేరు కృశించి.
నీడ మహాప్రేమి, వీడ
లేడు గౌరాంగి గోడను,
చుట్టిన నిశ్శబ్దపు స్ప్రింగు
చూరుకింద చేరు కుక్క.
నీడ తొడిమ తొడుగుపువ్వు
వాడనడచు పిల్లనువ్వు.
అందమైన బుగ్గపైన
బ్రాంది చుక్క పిలిచింది,
డెందమందు చిందు రాగ
బిందువొకటి ఒలికింది.
గులకరాళ్ళ పిట్టలతో
కులుకు తరుశాఖ యేరు,
వొంగిన సాయంత్రపు
రంగుల ధనస్సు
విసిరే గాలిబాణం తతత
వీటికిమల్లే
శాంతిని చల్లే
ఎండచట్రంలో
వెండిపిల్ల.
నెత్తురంటిన రోడ్డుబాణం
ఎత్తుకపోతోంది ప్రాణం.
అయ్యయో జారుతోంది రోజనే అపరంజిపండు
నుయ్యేదీ చేదేదీ, అందుకో చేతైతే.
వెలుగునీడలల్లి ఇలచుట్టు వలపన్ని
విధిమీనమును పట్టు వీలైతే.
(కాకినాడ, ఫిబ్రవరి 1960.)
10. కాలవొడ్డున షికార్లు
(స్నేహితుడు బిట్ర మోక్ష లక్ష్మీ నరసింహస్వామికి రాసిన ఉత్తరం)
జ్ఞాపకముందా మోక్షం!
కనీస పక్షం
మన కాలవగట్టు షికార్లు
దినాల చివర్లు.
సంధ్యాద్వయాన్ని తూస్తో
ములుచూపు రస్తా తత
ఒకటి నభాన, యేటి
కరాన మరోటి,
గాజుల గలగలతో మొరసి
రంగులతో మెరసి,
ఎగిరే సంజగాలిపడగ
తూలిపడగ
కాలవలో మాత్రం
సంధ్యా సూత్రం
చీకట్లను చీలుస్తో
నిలుచు జ్వలిస్తో.
ఇవాళ మన దోస్తీ
ఒక్కణ్ణీ మోస్తి.
(కాకినాడ, ఏప్రిల్ 1964.)
11. గురుత్వం
గోడమీది నీడల్లా తత
గురుత్వాన్ని మరచి
ఎండపొడల బంతులతో
ఇటూఅటూ పరచి తత
ఊహలను అతీతముగ
ఉంచుగోరు మనము.
కాని గోడపైని నీరు
కారు తడివసనము
వలె దిగలాగు దిగులుగా
ఇల చీకటి కేంద్రానికి.
(ఏప్రిల్ 1967.)
12. ఔఆఒఊ ఓఖజఊ, కఖచ జఆఘ
మోహానికీ
మోహరానికీ
రవంతే తేడా.
ప్రేమికుడికీ
సైనికుడికీ
ఒకటే ఏకాగ్రత!
ప్రియుడి కంటికొసని
ప్రేయసి నిత్యం జ్వలిస్తే
జవాను తుపాకి తుదని
శత్రువు నిశ్చలంగా నిలుస్తాడు.
స్మరరంగంలో లేచే సుడిగాలే
సమరరంగంలో పిడికిలి బిగిస్తుంది.
కోరికల తుఫానుకి
కొంకర్లు తిరిగే నరాలచెట్టులా
సంకుల సమరంలో
వంకర్లుపోయిన ముళ్ళకంచెలూ మెషీన్‌గన్లూ.
మృత్యుభంగిమలకి
రత్యంతభంగిమలకి
వ్యత్యాసం ఉందంటారా?
ఉవ్వెత్తుగా లేచిపడి
ఉద్రేకపు చివర్ల
బిగుసుకునే దేహాలకి కారణం
భావప్రాప్తా, అభావమా?
ఐతే,
బుద్ధిగా ప్రేమించుకోక
యుద్ధాలెందుకు చేస్తారో
నాకర్థం కాదు.
(31-2-1971.)